ప్రాకృతపైంగలములో ఖందా లేక స్కంధకమునకు క్రింది విధముగా 29 (28+1) భేదములు చెప్పబడినవి. అందులోని ప్రతియొక్క భేదమును వివరించి శ్రీకృష్ణపరముగా ఒక లఘు స్తోత్రకావ్యమును వ్రాసినాను. దీనిని చదివి ఒక రెండు దోషములను సవరించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారికి నా కృతజ్ఞతలు.
ణందఉ భద్ధఉ సేస సారంగ సివ బంభ వారణ వరుణ
ణీల మఅణ తాలంక సేహరు సరు గఅణు సరహు విమఇ ఖీర
ణఅరు ణరు సిద్ధ ణేహలు
మఅగలు భోలఉ సుద్ధ సరి కుంభ కల ససి జాణ
సరహ సేస ససహర గుణహు అట్ఠాఇస ఖంధాణ – (ప్రాకృతపింగలసూత్రం, 1.64)
సంస్కృత ఛాయ –
నంద భద్ర శేష సారంగ శివ బ్రహ్మ వారణ వరుణాః
నీల మదన తాలంక శేఖర శర గగన శరభ విమతి క్షీరాణి
నగర నర స్నిగ్ధ స్నేహాః
మదకల భూపాల శుద్ధ సరిత్ కుంభ కలశ శశినో జానీహి
శరభ శేష శశధరాః జానీన అష్టావింశతిస్కంధకాః
లఘు-గురువుల సంఖ్య, కందభేదముల పేరులు క్రింది పట్టికలో చూపబడినవి.
4, 30 నంద
6, 29 భద్ర
8, 28 శేష
10, 27 సారంగ
12, 26 శివ
14, 25 బ్రహ్మా
16, 24 వారణ
18, 23 వరుణ
20, 22 నీల
22, 21 మదన
24, 20 తాడంక
26, 19 శేఖర
28, 18 శర
30, 17 గగన
32, 16 శరభ
34, 15 విమతి
36, 14 క్షీర
38, 13 నగర
40, 12 నర
42, 11 స్నిగ్ధ
44, 10 స్నేహాలు
46, 9 మదకల
48, 8 లోల (భూపాల)
50, 7 శుద్ధ
52, 6 సరిత్
54, 5 కుంభ
56, 4 కలశ
58, 3 శశీ
60, 2 యాన
(1) 4, 30 నంద
శ్రీరంగేశా దేవా
క్షీరాబ్ధిన్ జిందులాడు – చిద్రూపా సం
సారాబ్ధిన్ దాఁటంగన్
రారా మా నావ నీవె – రాధాస్వామీ.
నిత్యానందా దేవా
సత్యాత్మా చారుహాస – సాలంకారా
అత్యంతోదారా చి-
త్ప్రత్యూషశ్రీల నిమ్ము – ప్రాణాధారా.
(2) 6, 29 భద్ర
లీలాకృష్ణా నే నిన్
లాలింతున్ రమ్ము, నిండ – లాలిత్యమ్ముల్
డోలన్ దూఁగింతునురా
తేలన్ జేతున్ సుధాబ్ధిఁ – దృష్ణన్ దీర్తున్.
భద్రాదేవీ తల్లీ
భద్రాదేవీ ప్రియాంగి – భద్రా చెల్లీ
భద్రా యనుఁ గృష్ణుండా,
భద్రమ్మై కావు మమ్ము – భద్రాకారా.
(3) 8, 28 శేష
బృందారణ్యమ్మందున్
జిందుల్ వేసేను వెల్గు – చిందన్ శ్రీగో
విందుం డానందుండై
సుందర నారులను గూడి – సొంపుల్ మీఱన్.
శేషుండే భ్రాతాయెన్
వేషమ్ముల్ దాల్చి మీరు – వ్రేపల్లెన్ వి-
ద్వేషమ్ముల్ నిండఁగ బల్
దోషమ్ముల్ జేయువారిఁ – ద్రొక్కన్ జనిరా?
(4) 10, 27 సారంగ
విన్నావా కన్నయ్యా
యన్నయ్యయు జెప్పె నీదు – నాగడముల య-
న్నన్నా బిల్తున్ నే గు-
మ్మన్నన్ వేగమ్ము చూడు – మన్నించన్ నేన్.
సారంగమ్మున్ జూడం
గా, రమ్మో కృష్ణ యంచుఁ – గాంతలు జెప్పన్
సారంగ మ్మెందంచున్
శ్రీరంగం డడిగి విరిని – వ్రేలన్ జూపున్.