శివమయం

అది పాటలతో కీర్తింపబడ్డ శివక్షేత్రం. నిజానికి ‘నిందింపబడ్డ’ అని చెప్పాలి. శివభక్తులైన అరవై ముగ్గురు నాయనార్లలో ఒకరయిన జ్ఞానసంబంధులవారు తనను పట్టించుకోకుండా అక్కడి నటరాజు ఒంటికాలి మీద నిల్చుని నాట్య ప్రదర్శన చేసుకుంటున్నాడంటూ ఆయన్ని చివాట్లతో నిందాస్తుతి చేసిమరీ పోయాడు. ఆ తర్వాత పాలించిన కొందరు రాజులు ఈ శుకవనేశ్వరుడికి రాతితో దేవాలయం నిర్మించి అరవైముగ్గురు నాయనార్లనూ శిలారూపాలుగా ప్రతిష్టించి, పెద్ద నందీశ్వరుణ్ణి కూడా చెక్కించి, దేవాలయ ప్రాంగణం చుట్టూతా ఉన్న వీధులను అగ్రహారాలుగా మార్చి, ప్రతి ఏటా ఉత్సవాలు, రథారూఢాలు, ఊరేగింపులు వంటివి జరుపుకునేందుకు వీలు కల్పించి పుణ్యం మూటగట్టుకున్నారు.

అప్పట్నుంచీ ఓ పది తరాలపాటు సిరిసంపదలతో తులతూగాడు ఈ శుకవనేశ్వరుడు. ఈ మధ్య ఉన్నట్టుండి కోనేటిగట్టు మీదున్న విఘ్నేశ్వరుడికి ఏవో మహిమలు కలిసి వచ్చి భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ, సంతానప్రాప్తి కూడా కల్పించే శక్తి సంతరించుకున్నాక శుకవనేశ్వరుడి పరపతి క్రమేణా క్షీణించింది. అయినప్పటికీ శుకవనేశ్వరుడి భోగానికి మాత్రం ఎటువంటి కొరతా లేదు. మాన్యం భూములు కోకొల్లలుగా ఉన్నాయి మరి. కాపలావాళ్ళు కూడానూ. ఇదికాక తరచూ వచ్చే చిల్లర మల్లర మేరల సంగతి సరే సరి.

పొద్దుగూకి చీకటి పడేవేళకు గుడి ప్రాంగణమంతా బోసిపోయేది. ప్రాకారంలోని శిల్పాలతో కలిసిపోయి ఆడుకునే కోతులదండు తమ స్థావరానికి తిరిగి వెళ్ళిపోయాక మిగిలేది – అర్చకస్వామి శంభుశాస్త్రులు, నునుపుదేరి నల్లరాతి లింగాకారంలో ఉన్న శుకవనేశ్వరుడు, మినుకు మినుకుమంటూ వెలిగే దీపమూ మాత్రమే. కుడి వైపునున్న జ్ఞానసంబంధుడిని పట్టించుకోని పాపానికి ఫలితంగా ఒకప్పుడు ఆ గుడిలో ఒంటికాలి మీద కొలువుతీరిన నటరాజస్వామి విగ్రహం, లండన్‌లో ఒక కోటీశ్వరుడి ఇంటికి తరలింపబడి ఆయన ఇంటి ముందుగదిలో అలంకారంగా స్థిరపడిపోయి అప్పటికే పదేళ్ళయింది.

ఉన్నట్టుండి ఈ పరిస్థితంతా తలకిందులయింది. కారణం కొత్తగా వచ్చిన చిలకస్వాములు. ఒక రాత్రివేళ చేతిలో చిన్న చెక్కపెట్టె, భుజాన రెండు చిలకలు, నున్నగా గుండుగీసుకున్న తల, ఒంటికి కాషాయం, చేతికర్ర సమేతంగా వచ్చిన ఆ ఆసామి ఖచ్చితంగా చిలక జోస్యం చెప్పేవాడే అయ్యుంటాడు అని తక్కినవారిలానే అర్చకస్వామి కూడా పొరపాటు పడ్డాడు. ఇతని వల్ల దమ్మిడీ ఆదాయమైనా ఉండదు అన్న విరక్తితో ఆయన్ని లెక్కచెయ్యలేదు. ఆ వ్యక్తి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ, ఒక్కో సన్నిధినీ దర్శించుకుంటూ, దండాలు పెట్టుకుంటూ వచ్చి నందీశ్వరుడికి కుడివైపున్న రాతిగుంజకు వెన్ను ఆనించి కూర్చుని, కళ్ళు మూసుకుని ధ్యానంలో నిమగ్నమయిన ఎంతోసేపటికి కాని – ఆయన వైపుకు చూడలేదు అర్చకస్వామి.

నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా ఉన్న గుండు. దాని మీద భవిష్యత్తులో జుట్టు మొలిచే ఆస్కారమేలేదన్నదే కాదు, ‘గతంలోనైనా వెంట్రుకలు ఉండి ఉండే అవకాశం ఏదైనా ఉండిందా’ అనేంతలా మెరుస్తోన్న బట్టతల. రాతి స్థంభానికి ఉన్న గుడ్డిదీపపు తళుకు ఆ బట్టతల మీదపడి మెరుస్తూ మరింత కాంతిని వెదజల్లుతూ అందంగా కనబడింది. ఎర్రగా ఉన్నాడు. పెద్ద ముక్కు. నొక్కిపెట్టినట్టున్న పెదవులు. మెడలో రుద్రాక్ష. లోపలికి అంటుకుపోయిన పొట్ట. ‘పాపం స్వాములోరు’ అనుకున్నాడు అర్చకస్వామి, తోటి పనివాడి పట్ల సామాన్యంగా కలిగే సానుభూతితో. అంతే! అంతటితో ఆ విషయం పక్కన పెట్టి ‘చీకటి పడిందా లేదా’ అని బయటకు చూశాడు.

పడమటి ఆకాశంలో వెలుతురును చీకటి పూర్తిగా మింగేసింది. వాచ్‌మన్ కరుణాకరాన్ని కేకేసి పిలిచి లోపలికి వచ్చాడు అర్చకస్వామి. ఆ సమయంలో కూడా ఆ ఆసామి అక్కడే కూర్చుని ఉన్నాడు. ‘ఆకలివల్ల బడలికగా ఉందేమో’ అనుకున్నాడు అర్చకస్వామి. లోపలికి వెళ్ళి మిగిలిన కార్యక్రమాలను శ్రద్ధగా పూర్తిచేసుకుని, తాళం చెవులగుత్తిని అందుకుని గర్భగుడి తలుపులు మూశాడు. ధర్మకర్త ఇంట్లో ఆవుల్ని కొట్టంలో కట్టేసి, చేతులు కడుక్కుంటూ లోపలికి వచ్చిన కరుణాకరం, అర్చకస్వామితో “కట్టేమంటారా?” అని అడిగాడు. అర్చకస్వామి లోపలివైపుకు చేయి చూపించి సైగ చేస్తూ నైవేద్య భక్షణాలతో బయలుదేరాడు. కరుణాకరం చుట్టూ ఒకమారు కలియజూసి తలుపులు కట్టేశాడు.

మరుసటి రోజు తెల్లవారుజామున అర్చక స్వామి గుడి తలుపులు తీయగానే లోపలినుండి కీచుగొంతుతో “శివా” అన్న ఒక కేక వినిపించింది. అర్చకస్వామికి గుండె ఝల్లుమంది. కరుణాకరం కూడా ఒక క్షణం భయపడ్డాడు. దానికి తోడు మసక చీకటి. అర్చకస్వామి కొన్ని క్షణాలు ఆగి భయం భయంగా లోపలికి నడిచాడు. చేత పట్టుకున్న లాంతర్ ఊగినప్పుడు స్తంభాల నీడలు నాట్యం చేశాయి. దేవుళ్ళ శిల్పాల నీడలు విశ్వరూపం దాల్చిన దెయ్యాల్లా కదిలాయి.

గుండెను చేత పట్టుకుని అర్చకస్వామి ముందు నడుస్తుంటే కరుణాకరం అనుసరించాడు. సన్నిధి సమీపాన చీకట్లో ఒక గొంతు “శివా, శివా” అంటూ వినిపించింది. ఆడ గొంతు… ఊహూఁ… అసలు మనిషి గొంతులానే లేదు. “వెళ్ళిపోదాం సామీ!” అన్నాడు కరుణాకరం. అర్చకస్వామికి దైవభయం బొత్తిగా లేదు. ఉండు అన్నట్టు చేత్తో సైగ చేసి, ముందుకు నడిచాడు. ఆ శివనామ జపం చేస్తున్నది ఒకరు కాదు ఇద్దరు అని అర్థం అయింది. రెండు గొంతులు ఒకదాని తర్వాత మరోటి “శివా, శివా” అంటూ ఒకే శ్రుతిలో వినిపిస్తున్నాయి.

వేగంగా కొట్టుకుంటున్న గుండెతో గర్భగుడిని చేరుకోగానే ఆ గొంతులు ఆగిపోయాయి. తుర్రుమని ఏవో పక్షులు స్తంభాలను రాచుకుంటూ ఎగిరిపోతుండటం కనిపించింది. లాంతరు వెలుతురు నందిపై పడి, దాని బ్రహ్మాండమైన నీడ, కప్పు మీద పడి కిందకి జారింది. నందీశ్వరుడి చుట్టూతా లాంతరు తిప్పి చూసినప్పుడు నేలమీద, నిన్న ఎలా ఉన్నాడో అలాగే స్తంభానికి ఆనుకుని ఉన్న చిలకస్వామిని చూశాడు అర్చకస్వామి. ఏదో పెద్ద ముప్పు వచ్చిపడింది అని లోలోపల అనుమానం కలిగింది. ముసలోడు చచ్చూరుకున్నాడేమోనని! ముఖం చూడ్డానికి మైనపు ముద్దలా ఉంది. తెలివిగా నిందను కరుణాకరం మీద వేసేయాలన్న ఆలోచనతో “ఒరేయ్ మూర్ఖుడా… నిన్న వెళ్ళేప్పుడు చెప్పాను కదా! ముసలోడ్ని బయటపడేసి తలుపులు కట్టెయ్యమని! నా మాట విన్నావు కాదు!” అన్నాడు.

కరుణాకరం ‘ఏదైతే అదయింది’ అని ధైర్యం చేసి “దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నిన్న నేను ఈయన్ని బయటకు తీసుకెళ్ళి పడేశాకే తలుపులకు తాళం వేశాను. మా ఇలవేల్పు మరుదప్పస్వామి మీద ఒట్టు” అని దబాయించేశాడు.

“అబద్దాలు చెప్పకొరేయ్. విగ్రహాలు దొంగతనం జరిగిన తర్వాత గుడిలోకి కాకి కూడా దూరలేనంతగా ప్రభుత్వం గట్టిగా బందోబస్తు చేసి ఉంది” అన్నాడు అర్చకస్వామి.

కరుణాకరం గొంతుని తగ్గించి జాలిగా “ఒట్టు సామీ… నేను అబద్ధం చెప్పడంలేదు. నిన్న ఈయన్ని నేను అరుగు మీదకు తీసుకెళ్ళి వదిలిపెట్టాకే తలుపులు వేశాను. అప్పుడే ఒకలా నవ్వాడు. ఈ సామే ఏదో మాయ మంత్రాలు చేసి లోపలికి వచ్చేసినట్టు ఉన్నాడు.”

అర్చకస్వామి తలమీద కీచుగొంతుతో “శివా” అని వినిపించింది. అవతల ఇంకో గొంతు “శివా! శివా!” అని వంతపాడింది. ప్రతిధ్వనులు కూడా వినిపించాయి! సర్వం శివమయంగా తోచింది!

అర్చకస్వామి నమ్మలేకపోయాడు. నమ్మకుండా ఉండలేకపోయాడు. దేన్నయినా సరే మూర్ఖంగా నమ్మడమో, అసలేదీ నమ్మకుండా ఉండడమో చేసే మనిషి కాదు అర్చకస్వామి. తెల్లారాక కరుణాకరం చెప్పిన కథ విని ఊరు ఊరంతా గుడికి రావడంతో తన ఒడిలో పోగైన చిల్లర నాణేల శబ్దం అర్చకస్వామికి నమ్మకం కలిగించింది.

ఆ రకంగా చిలకస్వామి గుళ్ళో ఓ తప్పనిసరి భాగమయిపోయాడు.

చిలకస్వామి తన నోట “శివా” అన్న ఒక్క మాట తప్ప మరిచిపోయి కూడా మరో మాట ఉచ్ఛరించడు.

“స్వామీ, వీడు మా అబ్బాయి.”

“శివా.”

“స్వామీ, పిల్లాడికి మాటలు రావడంలేదు. పన్నెండేళ్ళయింది.”

“శివా.”

“స్వామి ఒక మారు ముట్టుకుంటే అంతా నయమైపోతుంది.”

“శివా.”

చిలకస్వామితో భక్తుల సంభాషణంతా ఇదే రీతి.

గుడి భక్తుల రాకతో కిక్కిరిసింది. ప్రతిరోజూ గంటసేపు చిలకస్వామి మెట్ల మీద కూర్చుని భక్తులకు దర్శనం, దీవెనలు ఇవ్వడం రివాజు అయిపోయింది. ఆ సమయంలో ఒక పూట ఆహారం కూడా పుచ్చుకునేవాడు. ఎక్కువగా పళ్ళు మాత్రమే. ఒక గ్లాసు పాలు. మిగిలిన సమయమంతా చిలకలతోనే ఉండేవాడు. చిలకలకు పేళ్ళు చూడటం, రెక్కలు సవరించడం, చిలకల నోళ్ళు తెరిచి శుభ్రం చెయ్యడం… ఇలా సాగింది.

క్రమేణా చిలకల రాక పెరిగింది. రోజుకు రెండు గంపల పళ్ళు అవసరమయ్యాయి. అన్ని చిలకలూ ముందుగా ‘ట్వీక్’ అనేవి. స్వామి చేయూపితే ఎగిరి దూరంగా వెళ్ళేవి. రాత్రింబవళ్ళు వాటిని ‘శివా’ అని పలకరించేవాడు. ‘శివా! శివా!’ అని ముదిగారం చేశాడు. ‘శివా!’ అని కేకేస్తూ, బతిమాలుతూ, ముద్దు చేస్తూ వాటి వెంటపడేవాడు. మెల్లగా అవి కూడా ‘శివా!’ అనడం మొదలుపెట్టాయి.

పిల్లలు విపరీతంగా ఈలలు వేస్తున్నట్టు శివనామాలు నిర్విరామంగా గందరగోళాన్ని సృష్టించాయి. గుడిలో శివనామం తప్ప మరేదీ వినిపించనంతగా ఆ శివనామమే అన్నిచోట్లా నిండిపోయింది. చిలకల కోసం భక్తులు పళ్ళు తీసుకొచ్చి కుమ్మరించేవారు. అవి కొరికి పడేసిన వాటినే ప్రసాదంగా స్వీకరించేవారు. వందలాది చిలక ముక్కులు పలికే శివనామం ఆకారంలేని ఒక పెద్ద హోరుగా మారి రాతి స్తంభాలను మోదుతూ ప్రతిధ్వనించసాగింది. ‘ఏకరీతి ఓంకారం’ అన్నారు పండితులు. వాటి మధ్యనే మనుగడ సాగిస్తూవచ్చాడు చిలకస్వామి.

ఆయన నిద్రపోయేటప్పుడు ఒంటిమీద చిలకలు మూగి ఉండేవి. ఆయన మీద ఎప్పుడూ కనీసం రెండు చిలకలైనా కూర్చుని ఉండేవి. ఆయన అలవాటుగా కూర్చునే రాతిమీద కూర్చుని దీవెనలు ఇచ్చేటప్పుడు చిలకలు చుట్టూ ఎగురుతూ ఉండేవి. చిలకస్వామి ఎవరికేసీ చూడడు. వచ్చేవారి చేతుల్లో ఏముందోనన్న అభేదం పాటించడు. అందరికీ ఒకే రకమైన ఆశీర్వాదం, ఒకే ప్రసాదం, ఒకే శివనామం. ఆయన ఒకసారి ‘శివా’ అంటే వందలాది ముక్కులు ‘శివా! శివా!’ అని కేకలు పెట్టేవి. వెంటనే భక్తుల్లో పంచాక్షరి ఘోష ఉప్పొంగేది.

భక్తుల రాకతో అర్చకస్వామి మేను నిగనిగిలాడసాగింది. అందమైన పొట్ట కూడా కరిగిపోయింది. ‘వేసుకున్న జంధ్యం తెల్లగా మారిపోయే’ అద్భుతం కూడా జరిగిపోయింది. మొదట్లో చిలకస్వాముల శివఘోష అర్చకస్వామికి చిరాగ్గానే ఉండేది. ‘ఆ ఘోష పెరుగుతున్నకొద్దీ హుండీ కూడా బరువెక్కుతోందిగా’ అనుకుని ఆనందించాడు. ఒక దశలో ‘శివుడే ప్రత్యక్షమై వచ్చి ఆపినా ఈ వసూళ్ళను ఆపలేడు’ అని గ్రహించాడు. మెల్లగా ఒక రకమైన మందకొడితనం, బడాయి ఆయన ప్రవర్తనలో చోటుచేసుకున్నాయి.

ఈ ముసలోడెందుకు ఇంతలా శివా! శివా! అని కేకేస్తూ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడో అని కూడా అనిపించసాగింది. సమయం దొరికినప్పుడల్లా చిలకస్వాముల పక్కన చేరి ఆయన్ని ఆటపట్టించడంలో ఆనందం పొందాడు. రోజులు గడిచిన కొద్దీ చిలకస్వాములతో ఒక మాటయినా మాట్లాడించాలని పంతం పట్టాడు అర్చకస్వామి. అయితే అది అంత సులువయిన పనిగా అనిపించలేదు. చాలావరకు చిలకస్వామి ఏ రకంగానూ ప్రతిఘటించేవాడు కాడు. దీంతో అర్చకస్వామి మాటలు మరింత ముదిరిపోతూ వచ్చాయి.

“సరస తెలుసా?” అడిగాడు అర్చకస్వామి ఒకరోజు.

“శివా” అన్నాడు చిలకస్వామి.

“సరుకంటే ఆమే! సరసమెరిగిన సరుకు. ఏం ఒళ్ళు! ఏం తళుకు, ఏం బెళుకు! అదంతా తరతరాలుగా పుణికిపుచ్చుకున్న వారసత్వం! ఆ వృత్తిలో వుండేవాళ్ళకి మాత్రమే సొంతం. మన ఇళ్ళల్లోని పప్పుసుద్ధలు తల్లకిందులుగా తపస్సు చేసినా వాళ్ళ స్థాయినందుకోలేరు.”

“శివా” అన్నాడు చిలకస్వామి. వెంటనే “శివా! శివా!” అంటూ వంతపాడాయి చిలకలు.

“నిన్న వెళ్ళొచ్చానోయ్, స్వామీ. డబ్బు, దర్పంలో ఏముంది. మనుషుల సాంగత్యమే ప్రధానం అంటోంది. నేనూ అదే గొప్ప సత్యం అంటాను. వాళ్ళ కులంలో ఒక కట్టుబాటు ఉంది తెలుసా? బ్రహ్మతేజస్సు దొరకందే పిల్లల్ని కనరట. ఒకటే ఉవ్విళ్ళూరిస్తూ ఆ మనిషి, ఏముంటుందంటావు! నేనున్నంతవరకు మీ వాడకు ఎన్నడూ కరవురాదు అని మాట ఇచ్చి వచ్చాను. అదీ మన గొప్పతనం… హాహాహాహా…”

“శివా!” అన్నాడు చిలకస్వామి. దేవాలయమంతా “శివా” అన్న శబ్దంతో మారుమోగింది.

అర్చకస్వామికి చిరాకొచ్చింది. “నేను తెలియక అడుగుతానోయ్! నువ్వు ఏం సాధించేద్దామని ఇలా ఉండాలనుకుంటున్నావ్? మనిషన్నాక సరసం, సంతోషం అన్నీ ఉండాలోయ్! ఆ మహాశివుడికే ఇద్దరు భార్యలు! నువ్వెంత! కైలాసంనుండి నేలకు దిగివచ్చిన భూతగణంలో ఒకడ్ననుకుంటున్నావా? అలా అయినట్టయితే నిన్ను అటు ఇటు కానివాడిగా పుట్టించి ఉండేవాడుగా! నోరు తెరవ్వోయ్, అలా రాయిలా కాకుండా…”

“శివా!”

స్తంభించి కాసేపు అలా కూర్చుని ఉండిపోయాడు అర్చకస్వామి. ముఖంలో అస్పష్టమైన ఉక్రోషం. ఆ తర్వాత ‘నువ్వు మనిషివే కాదు’ అని శాపనార్ధాలు పెట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు.

అర్చకస్వామికి రాత్రంతా నిద్ర పట్టలేదు. చెమటలు పట్టాయి. కళ్ళు మూస్తే లోపల రెప రెపమంటూ ఏదో చిలక రెక్కలార్చింది. చెవిలో నిర్విరామంగా కీచుగొంతుతో ‘శివా’ అని వినిపించింది. ముందుగా ‘ఏం మనిషి బాబోయ్’ అన్న చిరాకు కలిగింది. చిలకలతో మాట్లాడి మాట్లాడి తాను కూడా ఒక చిలకలా మారిపోయినట్టున్నాడు అనుకున్నాడు. తర్వాత అతనిలో ఒక చిన్న గిలి మొదలైంది. నిజంగా ఇలా మనసును, నాలుకనూ నియంత్రించి అదుపులో పెట్టుకోవడం సాధ్యమా? ఈ జన్మలో తనకు అది సాధ్యం కాదు. అయితే ఇతను ఎవరు? మూఢ మండూకమా? జ్ఞానా? సిద్ధ పురుషుడా?

నలభై ఏళ్ళుగా శివలింగ స్పర్శలో మునిగి పూజలు నిర్వహిస్తూ వచ్చిన అర్చకస్వామి మనసు లోలోపలే నవ్వుకుంది. సిద్ధ పురుషుడా? పుణ్యపురుషుడా! అంతా బూటకం. పొట్టకూటికోసం వేస్తున్న వేషాలు. సరే, ఒకవేళ అతను సిద్ధపురుషుడే అయుంటే…? అర్చకస్వామిని ఆ అనుమానం వెంటాడింది. తెల్లవారుజామున ఆలోచనల గొలుసులు ఆయన్ను అన్ని వైపుల నుండి లాగసాగాయి. ఒకవేళ దేవుడు ఉన్నట్టయితే పరిస్థితి ఏఁవిటి అన్న భయమే ఆయన చేత ఇన్నేళ్ళుగా అర్చకత్వాన్ని క్రమపద్ధతిలో చేయిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ భయం మరింత బలపడి తనని వెంటాడసాగింది. ఎందుకొచ్చిన గొడవలే, అనిపించింది.

తెలతెలవారుతుండగానే గబగబా లేచి వచ్చి చిలకస్వామి పాదాలమీద పడ్డాడు అర్చకస్వామి. “స్వామీ, తప్పు చేసేశాను. క్షమించండి. ఈ పాపిష్టివాడికి క్షమాభిక్ష పెట్టాలి” అని వేడుకున్నాడు. చిలకస్వామి చలించకుండా “శివా” అని అన్నాడు.

అంతే. అర్చకస్వామి మనసులోని చివరి అవరోధమూ తొలగిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చాడు. పొట్ట ఎగిసిపడుతూ ఉంటే మాటలు కూడా గొంతులోనుండి బయటకు రాలేదు. కరుణాకరం అర్చకస్వామిని ఓదార్చాడు. చిలకస్వామి మౌనంగా లేచి వెళ్ళిపోయాడు.

ఈ సంఘటన కరుణాకరం ప్రచారశక్తి వల్ల ఎంతో గొప్పగా ప్రజల్లో వ్యాపించి చిలకస్వామి ప్రశస్తి మరింతగా హెచ్చింది. చిలకస్వామి చిలకల్లోని ఒకదానికి అర్చకస్వామి ‘సరస’ పేరును నేర్పడానికి తీవ్రంగా ప్రయత్నించినట్టు, అయితే చిలక శివనామం తప్ప మరేది చెప్పడానికి నిరాకరించినట్టు పుకారు లేచింది. చిలకలు చిలకస్వామితో తప్ప మరెవరితోనూ స్నేహంగా ఉండకపోవడం కూడా దీనికి బలాన్ని చేకూర్చింది. తనకు, సరసకు మధ్యనున్న సంబంధం రట్టయిన ఈ పరిస్థితుల్లో ఊరివాళ్ళ నోళ్ళనుండి తప్పించుకోవడానికి కొంత, మనస్పూర్తిగా కొంతా సమాధానపడి అర్చకస్వామి కొత్తమార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆయన నాలుక సదా శివనామ స్మరణం చేయసాగింది.

అయితే రెండు రోజుల తర్వాత, చిలకస్వామి ద్రాక్షపళ్ళను తన చిలకలకు తినిపిస్తూ ఉన్నప్పుడు, ఆ చిలకల్లో ఒక చిలక తన భుజాన అలవాటు ప్రకారం వాలి, తన ఎర్రటి కళ్ళను తిప్పుతూ “సరసా” అని అంది. చిలకస్వామి కొరడా దెబ్బ తిన్నవాడిలా ఒక క్షణం కుంచించుకుపోయాడు. గబాలున ఆ పక్షిని పట్టుకున్నాడు. అతని గుప్పిట్లోనుండి దాని తలా, తోకా మాత్రం బయటకు కనిపించాయి. తల “సరసా… సరసా…” అని పలికింది.

చిలకస్వామి పాడైన పాకెట్ రేడియోని ఊపినట్టు దాన్ని ఊపాడు. ఊపిన కొద్దీ అది “సరసా, సరసా!” అంటూనే అంది. చిలకస్వామి నిశ్చేష్టుడై అలా ఉండిపోయాడు. తర్వాత దానికేసి చూస్తూ గట్టిగా “శివా!” అన్నాడు. వందలాది చిలకలు శివా అని వంతపాడాయి, అది మాత్రం అపస్వరంలా “సరసా” అంది.

చిలకస్వామి కాసేపు అలా గోడకు ఆనుకుని కూర్చుండిపోయాడు. ఆ చిలక రెక్కలు విప్పి పక్కకు ఒరిగినట్టు నిల్చుని ఉంది. స్వామి దాని ముఖంకేసి చూశాడు. పాలిపోయి తెల్లగా ఉంది. దాన్ని చూసిన కొద్దీ ఆయన మనసులో ఏదో ఉద్వేగం పొంగుకొచ్చింది.

ఆ ఒక్క చిలక మటుకు ఆ మాటను ఎలా నేర్చుకుంది! అది ఎవరితో స్నేహం చేస్తోందీ? అర్చకస్వామి దానికి నేర్పించాడా? ఇన్ని చిలకల్లో ఏ చిలకా ఎవరితోనూ మాట్లాడట్లేదు. దీనిదేం పాపిష్టి జన్మో?

ఆ చిలక గాల్లో ఒక మారు ఎగురుకుంటూ వెళ్ళి చిన్న కొబ్బరి ముక్కతో తిరిగి వచ్చింది. కాలితో దాన్ని పట్టుకుని ముక్కుతో ఒకసారి పొడుచుకు తిని “సరసా!” అంది. చిలకస్వామి ఆత్రంగా ముందుకు వంగి దాన్ని పట్టుకోబోయాడు. అది ఎంతో లాఘవంగా తప్పించుకొని తుర్రుమని ఎగిరి, ప్రాకారం మీదున్న శిల్పం భుజాన వాలింది. తలను పక్కకు వంచి “సరసా” అంది.

“శివా” అంటూ చిలకస్వామి కోపంగా, ఆత్రంగా అరిచాడు.

“సరసా! సరసా!” అంది ఆ చిలక మళ్ళీ.

చిలకస్వామి దానివైపుకు పరుగెట్టాడు. అది ఒక శిల్పం మీదనుండి మరో శిల్పంమీదకి అలా ఎగిరి తప్పించుకుంటూ ఆటపట్టించింది. స్వామి అరిచిన కొద్దీ అది ఏమాత్రం తన మాటను మార్చుకోలేదు. చివరిగా ప్రాకారపు చూరుమీద కూర్చుని వేగంగా “సరసా-సరసా-సరసా-సరసా-సరసా” అని అరిచింది.

“శివా! శివా!” అంటూ చిలకస్వామి ఏడ్చాడు.

“సరసా! సరసా!” అంది చిలక.

చిలకస్వామి తన ఎదురురొమ్ము మీద బలంగా కొట్టుకున్నాడు.

వెక్కి వెక్కి ఏడుస్తూ “శివా! శివా!” అన్నాడు.

“సరసా!” అంటూ తలను వాల్చి చూసింది చిలక.

కాసేపటికి చిలకస్వామి తేరుకున్నాడు. ఇతర చిలకలకేసి చూశాడు. వాటి మానాన అవి “శివా” అంటూ కేకలు పెట్టుకుంటున్నాయి.

“శివా” అని ఆప్యాయంగా పిలిచాడు.

“సరసా” అంటూ ఆ చిలక దగ్గరకు వచ్చి కూర్చుంది.

“శివా” అంటూ దాన్ని పట్టుకున్నాడు.

చేతి గుప్పిట్లోనుండి తలను పక్కకు వాల్చి చూస్తూ “సరసా” అని కళ్ళు తిప్పింది.

దాన్ని అలా తన పంచెతో కప్పేసి పక్కకు తీసుకెళ్ళాడు చిలకస్వామి. పంచెలోపలనుండి ‘సరసా సరసా’ అంటున్న గొంతు వినిపించింది.

ఎవరూ లేని ఒక మూలకు వెళ్ళి నాలుగు వైపులా తిరిగి చూసి క్షణంలో దాన్ని పిసికేశాడు. ‘సరసా’ చిలుక ప్రాణాలు విడిచిపెట్టేసింది.

పంచె తప్పించి చూశాడు. పచ్చని రంగులో, దాని పొట్టలోని వెచ్చదనం కోల్పోకుండా అలా పడుకుని ఉంది ఆ చిలక శవం. దాన్ని గోడకు అవతల విసిరి పడేశాడు. ఒళ్ళు వణకసాగింది. పరిగెట్టుకుంటూ తిరిగొచ్చాడు. చిలకలకేసి చూసి “శివా!” అని అరిచాడు. “శివా!” అని వందలాది గొంతుకలు జవాబిచ్చాయి. చిలకస్వామి చెవులను రిక్కించాడు. ఏమైనా అపస్వరం వినిపిస్తుందేమోనని! లేదని స్పష్టమయ్యింది. మళ్ళీ “శివా!” అని అరిచాడు. రాగయుక్తంగా శివనామమే జవాబుగా వచ్చింది. స్వామికి మనసులో భారం తగ్గింది. ఆ రోజు ఆయన ఏమీ తినలేదు. సమయం గడిచిన కొద్దీ ఆయనకు దుఃఖం పొంగుకొచ్చింది. అలా ముడుచుకుని ఏడుస్తూ పడుకున్నాడు. ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.

రెండు రోజుల తర్వాత మళ్ళీ చిలకస్వామిని బాధపెట్టే ఆ మాట చెవిన పడింది. ఒక శివభక్తురాలైన చిలక మరో శివభక్తురాలైన ఇంకో చిలకతో “సరసా” అంటూ ముద్దు చేయడం, దానికి ఆ చిలక తోకని విప్పి ఊపుతూ “సరసా” అని జవాబు ఇవ్వడం విన్నాడు. ఈసారి స్వామి ఎక్కువ సమయం వృధా చేయలేదు. ఆ ప్రేమికులకు అమరత్వం కల్పించి ఆలోచనల్లో పడ్డాడు.

దీన్ని ఇలానే వదిలేయకూడదు. గుళ్ళోవాళ్ళే ఎవరో కావాలని ఇది చేస్తున్నారు. ముందుగా ఆయన సందేహం అర్చకస్వామి మీద వచ్చింది. అయితే నిజానికి అర్చకస్వామి చాలా మారిపోయాడు. ఊరికే ఊసుపోక గుడ్డివాటంగా చెప్పడం మొదలుపెట్టిన శివనామం ఎలాగో అతని గుండెల్లోకి లోతుగా చొచ్చుకుపోయింది. నిత్యం శివనామం పఠిస్తూనే ఉన్నాడు. నిద్రపోయేటప్పుడూ శివా! త్రేన్చేటప్పుడు, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు కూడా శివ ఘోషే! మొదట అనుమానంతో చూసిన ఊరి జనం కూడా దాన్ని వ్యసనం అనుకుని అంగీకరించేశారు. అర్చకస్వామి ఒంటినుండి గాలి బయటకు వెళ్ళే ప్రతిసారీ “శివా” అంటేనే నిష్క్రమించేలా అతని ఒంటి కండరాలకు అలవాటయిపోయింది.

దేవస్థానం ధర్మకర్తకు ఆవులు తప్ప వేరే విషయం మీద ధ్యాసలేదు.

చిలకస్వామి కళ్ళల్లో ఒక రకమైన పిచ్చికళ వచ్చి చేరింది. చూసిన ప్రతిదాన్నీ సందేహిస్తూనే తిరుగాడుతున్నాడు. ప్రతి అడుగుల చప్పుడునూ తీక్షణంగా వింటున్నాడు. ప్రతి భక్తుణ్ణీ పరిశీలనగా చూస్తున్నాడు. అతనిలోని తేజస్సంతా పోయింది అని జనం మాట్లాడుకోసాగారు. అతను దీవెనలు ఇస్తే ఫలించడం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. దానికి తోడు ప్రతిరోజూ రెండు చిలకలు ప్రాకారపు గోడ బయట చచ్చిపడి ఉండటాన్ని ఊరి జనం చూస్తున్నారు.

చిలకస్వామి అర్చకస్వామిని పూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టాడు. అర్చకస్వామిని చూస్తేనే అతని ఒళ్ళు ఆవేశంతో ఊగిపోయేది. పెదవులు వణకసాగేవి. అయితే తను ఎదురుపడినప్పుడల్లా భక్తిపారవశ్యం తొణికిసలాడుతూ “శివా” అని పలకరించేవాడు అర్చకస్వామి.

చిలకస్వామికి అసలు నిద్ర పట్టడంలేదు. రాత్రింబవళ్ళూ నిద్ర పోకుండా తన చిలకల మనసును పాడుచేస్తున్న పాపిష్టివాడి అడుగుల చప్పుడు కోసం అతను చెవులను ప్రతినిముషమూ రిక్కించి ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే ఆ చిలకల మండపంలో ఎప్పుడూ ఎవరూ ప్రవేశించడం లేదు. చిలకస్వామి అలా మూడు రోజులు చూసిన తర్వాత ఒకరోజు బాగా నిద్రపోయాడు. ఏవో కలలు, ఆ కలలో కేకలు వినిపించినప్పుడు మధ్యలో ఎక్కడో లీలగా “సరసా” అన్న మాట వినిపించింది. గబుక్కున లేచి కూర్చున్నాడు. ఒళ్ళు వణుకుతూ ఉంది. గొంతు ఎండిపోయింది.

గుడి నిర్మానుష్యంగా ఉంది. చిలకల శివఘోష మాత్రమే వినిపిస్తోంది. చిలకస్వామి కొన్ని క్షణాలు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. తర్వాత తన పక్కన ఏదో ఏరుకుంటున్నట్టుగా తిరుగుతూ ఉన్న ఒక చిలకను పట్టుకున్నాడు. దాన్ని ముఖానికి దగ్గరగా తెచ్చి దీక్షగా చూసి “శివా” అని అన్నాడు. ‘వద్దు ఈ విష పరీక్ష’ అని మనసు హెచ్చరించింది. జంకాడు. అయితే ఆపుకోలేకపోయాడు. తర్వాత మనసు దిటవు చేసుకుని గొంతుని సవరించుకుని దాని ముఖానికి దగ్గరగా పట్టుకుని “శివా” అని అన్నాడు.

తన ఎర్రని ముక్కుని విప్పి “సరసా” అని అంది చిలక.

చిలకస్వామికి ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించింది. దాన్ని వదిలిపెట్టేసి, తన ముఖాన్ని చేతులతో కప్పుకుని ఏడవసాగాడు. ఆ చిలక కిందున్న దేన్నో పొడుచుకుని తిని ఉత్సాహంగా చిలకస్వామిని చూస్తూ “సరసా?” అని ప్రశ్నార్థకంగా పలికింది.

చిలకస్వామి వెక్కివెక్కి ఏడవసాగాడు. అలా రాత్రంతా ఏడ్చాడు. మరుసటి రోజంతా ఏడుస్తూ కూర్చుని ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి గుడిని విడిచిపెట్టి పరుగెట్టుకుంటూ వీధి చివరున్న మరో వీధిలోకి తిరిగి ఒక్కో ఇంటి తలుపూ కొట్టి “సరస ఇల్లేది?” అని విచారిస్తూ తిరిగాడు. మరుసటి రోజు ఆయన ఆ ఊరు విడిచివెళ్ళిపోయినట్టు తెలిసింది.

పది రోజుల్లో గుడి ప్రాంగణమంతా ‘సరస’ అనే నామం నిండిపోయింది. ప్రాకారాలు, మంటపాలు ‘సరసా’ అంటూ ప్రతిధ్వనిస్తున్నాయి. ‘అపచారం అపచారం’ అంటూ అరిచాడు ధర్మకర్త. ప్రజలు ఆక్రోశించారు. జనం గుంపులు గుంపులుగా కర్రలు పట్టుకుని చిలకస్వామిని వెతుకుంటూ తిరిగారు. అర్చకస్వామి ఉద్యోగం ఊడింది. చిలకలను బోయవాళ్ళచేత వేటాడించి నిర్మూలించడానికి ఏర్పాటు చేశారు. ఒక్కో బోయవాడికి గంపెడు చిలకలు.

అర్చకస్వామి భార్య, పిల్లలు మాత్రం నెత్తీ నోరూ కొట్టుకుని ఏడ్చారు. ఆయన మాత్రం నిశ్చింతగా ఉండిపోయాడు. శివనామాన్ని జపిస్తూ విఘ్నేశ్వరుడి గుడి అరుగుమీద కూర్చుండిపోయాడు.

(మూలం: శివమయం, 1992.)


జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.