అలసిన రెక్కలు కప్పుకుని
ఆకుపచ్చని కలలు ఎగిరెగిరి వచ్చాయి
సెల్లార్లో కొత్తగా వరికుచ్చులు వెలిశాయి
బులిబుల్లి ముక్కులతో పిచ్చుకల గుంపొకటి
రాతి భవంతి బుగ్గల్ని గిల్లుతోంది
సిగ్గుపడి నేల రాలిపోతున్న గింజల కోసం
బారులు బారులుగా చీమలొచ్చాయి
బరువెక్కిన వాటి మూపుల చుట్టూ
ఆశగా పురుగులు మూగాయి
తామరాకులపై రాసిన
కోనేటి ప్రేమలేఖను
తీసుకుని తూనీగలొచ్చాయి
తూనీగల తోకల చుట్టూ, జోరీగలు
ఆకతాయి బాణీలు కడుతున్నాయి
చారెడు పార్కింగ్‌లో పరిచిన నులక మంచం
ఉడుత పిల్లలకి నేరేడు చెట్టయిపోయింది
నాటు కోడి కాళ్ళు జారిపోతున్న చలువరాతి గచ్చు
పేడకల్లు వాసనేస్తోంది
అట్ట చిరిగిన రామకోటి పుస్తకం
చిన్న రేడియో–
ఎక్కడిదో ఆ మట్టి ముంత!
సర్దుకున్న ఒక్క గదిని పట్నం చంద్రుడు తొంగి చూస్తున్నాడు
పరాయి గాలి వాసన ఇట్టే తెలిసి పోతుంది
మనం వదిలి వచ్చిన ఊరు
వలస దారుల్ని గుర్తు పడుతుంది
అపార్టుమెంటు పునాదుల కింద
తల్లడిల్లిన ఆకుమళ్ళని
చినుకులు పెళ్ళగిస్తున్నాయి
ఈరోజు కురిసిన వాన నిన్న మొన్నటిది కాదు
లేగదూడ కన్నుల్లోని
నల్లని మూగతనం ముందు
తల్లి ఆవు పాలు పితుకుతున్నట్టు–
అతనేదో కూనిరాగం తీస్తున్నాడు
ఆమె చుక్కల ముగ్గు వేస్తోంది