ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద

కూడళ్ళూ, జంక్షన్లూ, చౌరస్తాలూ, రైల్వే స్టేషన్లూ… ఎంత ఆకర్షణ వీటిల్లో! రాత్రుళ్ళు టెరేస్ మీద నుంచి నిబ్బరంగా చూస్తాను – స్టేషనూ, హైవే, చెరువు గట్టు, బస్తీ ఈ నాలుగిటికీ దారితీసే ఒకేఒక్క చోటుని. పగలైతే చూడలేను, ఏ దారిలోకెళ్ళాలో నిర్ణయం ఐపోతుంది చూసేలోపే.

ప్రతి ఆదివారమూ ప్లాట్ఫామ్ టికెట్టు కొనుక్కుని చివరి రైలు వెళ్ళిపోయేదాకా ఇక్కడ బెంచీలో కూచుని ఎదురుచూస్తూ, ఎదురు చూస్తూ ఎదురుచూడ్డం తప్ప మరేం చెయ్యడానికి వీల్లేని రైల్వే స్టేషన్లో… ఎదురుచూడ్డం చేతకాని రోజున ఏడవటం మర్చిపోతానన్న భయంతో ప్రతీ ఆదివారమూ ఇక్కడే…

ఎవరో కనబడుతారు, అంతగా తెలీని వాళ్ళు, “ఆరోజు కూడా ఇలానే మనం రైల్వే స్టేషన్లో కలిసినప్పుడూ…” అని పలకరించబోతారు- “ఆరోజు కలవలేదు, తగిలాం!” అని సవరిస్తాను. సెల్లో, పర్సో చూసుకుంటూ చాకచక్యంగా తప్పేసుకుంటారు. ఒక్కోసారి బాగా కావలసిన వాళ్ళే, “ఏమిటిక్కడ, ఎవరొస్తున్నారూ?” అని. “ఇదిగో మీలా ఎవరైనా వస్తారనే,” అంటూ లోపల పేరుకుపోయిన ఖాళీనంతా భళ్ళున పెద్దనవ్వుగా వెళ్ళగక్కెయ్యాలి అలాంటప్పుడు.

ఎప్పుడో, ఏ దశాబ్దానికో పుష్కరానికో తగలడం కాకుండా నిజంగానే కలుస్తారెవరో, నాకు మాత్రమే కావలసినవాళ్ళు, నన్ను మాత్రం మర్చిపోవడం తరం కాని వాళ్ళు. కలవబోతున్నామని తెలీకుండానే – అకస్మాత్తుగా, తెలీదూ నిజంగా ఎప్పుడో ఒకరోజు తప్పదని? తగలడమో, కలవడమో కాక, దొరకడం కూడా జరగొచ్చని. జన్మల్ని, గుళ్ళనీ, రాళ్ళనీ నమ్మక, మైండ్ మాపింగ్, పాటర్న్స్, డిజావూలని అనుమానించి — ముందుగానే తెలీదని చెప్పుకుని మభ్యపెట్టుకుంటాను. మరోదారి లేదు, నామీద నాకొక తప్పుడు నమ్మకం, ఫాల్స్ ప్రైడ్ వచ్చి – చుట్టూ నిర్మించుకున్న లాజిక్, ఇన్నేళ్ళూ పేర్చిన థియరీలూ అన్నీ పగుళ్ళేస్తే నమ్మలేక.

ఆదివారాలు ప్రమీల ఉండదు ఇంట్లో. అదొక ఆటవిడుపు ఆమెకి, అదొక్కటే ఆశ కూడా! ఆశ్రమంలో పిల్లలకోసం ఏవో కొనుక్కుని, తలుపేసుకోమని నాతో చెప్పి తెల్లవారకముందే వెళ్తుంది. కొన్నాళ్ళు నేనూ వెళ్ళాను. తనలా నేను కబుర్లు చెప్పి ఆటలాడలేను పిల్లల్తో. గౌరవంగా, క్రమశిక్షణతో వాళ్ళు దగ్గరకొస్తారు. నాలాటి వాళ్ళిచ్చే డొనేషన్లతోనే అక్కడ వాళ్ళకి అన్నం దొరుకుతుందన్న కృతజ్ఞతతో, వచ్చినవాళ్ళతో మర్యాదగా ఉండాలని వార్డెన్లు ఇచ్చిన ట్రెయినింగ్ గుర్తుంచుకుని దగ్గరికొచ్చి నవ్వుతారు. పసితనంలో ఉండాల్సిన నిర్లక్ష్యం, బతిమాలించుకుని తప్ప తినకూడదన్న మంకుతనం, ఇంటికొచ్చిన చుట్టాలు నచ్చకపోతే వెళ్ళిపొమ్మని ఏడ్చే చాపల్యం — అన్నీ వదులుకున్న పిల్లలు. బాసింపట్లేసుకున్న కాళ్ళు మొద్దుబారిపోయాయని తెలీకుండా టీవీలో చూస్తున్న సినిమాని వదిలేసి, వెనక్కి లాగుతున్న మనసుని అదిమేసి — మేము రాగానే ఉన్నఫళాన డిసిప్లిండ్‌గా మాదగ్గరికి వచ్చేస్తారు. ప్రమీల ముచ్చటపడుతుంది. “మన ఇళ్ళల్లో పిల్లలు ఇలా ఉంటారా? చూడు, ఎంత క్రమశిక్షణో!” అని అభిమానంగా చూస్తుంది వాళ్ళని.

మరెవర్నయినా తీసికెళ్తే, పెంచుకుంటేనో? ఆ మాట పైకనను. అడక్కుండానే తెలుస్తాయి కొన్ని. తెచ్చిపెట్టుకునే బాధ్యత బరువౌతుంది కానీ బంధం కాదు కాబోలు. తన బంధాలు తనలోంచే, తన వృత్తంలోంచే కావాలి. బయటివన్నీ ఆటవిడుపు కోసం, ఆశని బతికించుకోవడం కోసం. అంతేనా? తనకేనా? నాకూ… నా సంగతి?

నేనెటు వెళ్తానో, గమ్యమేమిటో నాకు తెలీదు, కానీ గమ్యానికి తెలుసు నేనోరోజు వస్తానని. అది దారిని పరిచి ఎదురు చూస్తూనే ఉంటుంది, అన్ని అనుకోని మలుపులకీ అవతల నిశ్చింతగా ఏ సందేహమూ లేకుండా. మలుపుల్లో ఎవరెవరో ఎదురుపడతారు. చేతులు పట్టుకు వదలరు కొందరు. చివరిదాకా వస్తామని చెప్పేస్తారు అలవాటైన అలవోకదనంతో. ఇద్దరికీ తెలుసు ‘చివర’ అంటే ఎవరికో. అది ప్రతి ఒక్కరికీ మారుతుందనీ, ప్రత్యేకమనీ మరెవ్వరూ రాలేరనీ తెలిసీ, అబద్ధాలు చెప్పుకుంటూ రిహార్సిల్ లేని నాటకలాడుతూ కలుస్తూ, నమ్మిస్తూ, నటిస్తూ ఉంటారు అందరూ. లేక కొందరు బహుశా; దగ్గరివారు, దగ్గర అనుకున్నవారు, దగ్గరవ్వాలనుకున్నవారు.

కూర్చున్నాను. అలవాటైన అదే ప్లాట్ఫామ్ మీద. సినిమాల్లోలా ఏళ్ళ క్రితం విడిపోయిన వాళ్ళెవరో నాటకీయంగా ఆ వస్తున్న ట్రైన్లోంచి దిగి, నెరిసిన చెంపల పైనుంచి కళ్ళద్దాలు సరిచేసుకుని నన్ను చూసి దగ్గరకొచ్చి ఉద్వేగపడతారని పిచ్చి ఊహలేం లేవు. లేవంటే లేవని కాదు. ఉన్నాయని బయటికనుకుంటే ఆ ఉండటం లోని రహస్యం పోయి విసుగెత్తుతుంది. అందుకని లేవన్నమాట. అలా ఈ మనిషొస్తే ఎలా ఉంటుందో అని ఎవర్ని ఊహిస్తాను లోలోపల? నాన్నని?

పదిహేనేళ్ళప్పుడు — ఎందుకో తెలీకుండానే ఊరికూరికే ఎగురుతూ నడిచే వయసులో, నిద్రపై తప్ప అన్నిటిపై కుతూహలం. కుదురుగా ఉండనివ్వని ఎలర్ట్నెస్. బహుశా అందువల్లేనేమో, బయట పడుకున్న అమ్మకి వినబడని కిర్రుమన్న గేటు శబ్దం నన్ను లేపడం. ఎక్కువ బట్టలు కూడా లేని చేసంచితో నాన్న — ఇల్లొదిలి వెళ్ళిపోతూ కూడా తీసిన గేటుని బాధ్యతగా తిరిగి వేసే యజమానితనంతో. చీకట్లో నేను చూడటం చూశాడా? చూస్తే నా మీది బంధాన్ని తనపై తనకున్న జాలి అధిగమించి చూడనట్టే, అసలేం కనపడనట్టే నమ్మించుకుని తొందర తొందరగా వెళ్ళిపోయాడా? చూసి నేనెందుకు ఏమీ తెలీనట్టే వెనక్కొచ్చి దుప్పటి కప్పుకున్నాను? పోన్లే, వెళ్ళిపోతే. నాకూ జాలే అతనిమీద.

ఇన్నేళ్ళ తర్వాత — వెతుక్కుంటూనో, యాదృచ్ఛికంగానో నేనిక్కడ ఉంటానని తెలీక పొరపాటున వచ్చి కొద్దిగా ఎర్రబడిన జుట్టు తప్ప మరేం మారని నాలోని తన పోలికల్ని గుర్తుపట్టి, దగ్గరకొచ్చి నిల్చుని చెవిలో రహస్యంగా మొదటిమాట ఏమంటాడు? “అమ్మ… ఇంకా బతికే ఉందా?” అనేగా! అప్పుడు నేను అమంగళం విన్నవాడిలా మొహంపెట్టి, “అబ్బే! లేదు. పోయి పదేళ్ళయింది.” అని అదంతా పెద్దరికంగా చూసుకున్న వాణ్ణి నేనే అన్న గర్వంతో సూటిగా చూస్తూ చెబుతాను. మేము దగ్గరవ్వడానికున్న ఒకే ఒక్క అడ్డంకి ఇప్పుడు లేదన్న ఉత్సాహంతో అలా బెంచీలో కూర్చున్న నన్ను- కొమ్మలూ, పువ్వులూ లేని మొండిచెట్టుని లోపల్నుంచి వేర్లు హత్తుకున్నంత లోతుగా అతను తనలోకి నన్ను ఆత్రంగా అదుముకుంటాడు.

బుర్రమీద గట్టిగా ఇచ్చుకోవాలి, ఇలాటాలోచనలొచ్చినప్పుడు. అప్పుడు లోపలేవో కదులుతాయి వానపాములు — రెండు వైపులా పాకుతూ. బయటికొచ్చెయ్యకుండా చేతుల మధ్య తలని జాగ్రత్తగా పట్టుకుని కాసేపలా ఉండిపోతే నిద్రోతాయి శుభ్రంగా. ప్రమీలకిలా ఉండవేమో! తను స్కూల్లో లెక్కలు చెప్పే పిల్లల బుర్రల్లోనూ, ఆ లెక్కల పుస్తకాల్లోనూ ఎక్కడా ఉండవట. విసుగ్గా ఉందని ఉద్యోగం మానేశాక తను అస్తమానం చూసే టీవీలోనూ ఉండవట వానపాములు. “నీ బుర్రలోనూ, పొద్దెరక్కుండా నువ్వేసుకునే బొమ్మల్లోనూ ఉంటాయి పురుగులూ, జంతువులూ,” అని విదిలిస్తుంది. ఆశ్రమంలో షటిలో ఏదో ఆడుతూ ఉంటుందిప్పుడు. “నీకిదొక పిక్నిక్ కదా? ఎంటర్టెయిన్మెంట్ కోసమా ఆదివారాలు?” అని పైకే అడిగేస్తే ఏమంటుంది? ముందు నా బొమ్మల్ని తనివితీరా తిట్టేశాక కానీ…

మరైతే ఇంతకీ నాన్న- ఎందుకొస్తాడు నాన్న, అవసరం లేదు. మరెవర్రావాలి. రాఘవ, జాస్మిన్? మళ్ళీ ఏదో రైలాగింది. నా ఎదురుగా ఫస్ట్ క్లాస్ పెట్టె. దిగే వాళ్ళ కన్నా ఎక్కువ జనం ఎదురొచ్చే పెట్టె. జాస్మిన్‌ని బాగా గుర్తుకుతెచ్చే పెట్టె. నాకంటే తెలీదు, తిరిగి రాదని తెలిసీ ఎప్పటికన్నా మాములుగా చెయ్యూపి ఎలా వెళ్ళిపోయిందో? నీడనివ్వని యూకలిప్టస్ చెట్ల ఘాటు వాసనల్లో గుప్పుమన్న మోహపు పరిమళాలు, పసుపురంగు సీతాకోక చిలకలా భుజం మీద వాలిపోయిన చలికాలపు లేతఎండ మధ్యాహ్నాలు, చినుకులా తను అరచేతిలో రాలిపడబోయేలోపు మైదానంగా నేను మారిపోయిన ఏకాంతపు సాయంత్రాలు, వేళ్ళ బ్రష్షులకి వళ్ళంతా కాన్వాస్‌గా అప్పగించుకున్న రంగురంగుల నిముషాలు — ఇవేవీ తనని ఆపలేనందుకు, తనని ఆపగలిగేది, కట్టెయ్యగలిగేది ఏమిటో మరోవారానికి ఫోన్లో తన మాటల్లోనే విన్నప్పుడు కూడా. “ఉద్యోగం వదిలేసి పెయింటింగ్‌లంటూ ఉండిపోతే ఎలా నిన్ను…? ఎల్లుండు పెళ్ళి. రమ్మని బలవంతం చెయ్యను. నీకూ తెలియాలని చెప్తున్నా!” ఏం తెలియాలి నాకూ? ఏమో తెలియలేదిప్పటికీ. తనకి తెలిసుంటుందా?

ఎలా తెలుస్తుంది? రాఘవ రాసే ఉత్తరాలు చదివితేనా? మొట్టమొదటి ఉత్తరంలోనే ఎలా తెలుసుకుని రాశాడో!

“న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళాను మీ ఆర్ట్ షోకి. ఎన్ని పెయింటింగ్‌లో! అన్నీ రాళ్ళే… రకరకాల రాళ్ళు, ఏదోక పేరుతో పిలవదగ్గ ఏ వస్తువులానూ ఉండని, వాటిలా మరే వస్తువూ ఉండే వీల్లేని రూపాల్లో. రాళ్ళు రాళ్ళలానే కనిపిస్తాయి. రాళ్ళలానే ఉంటాయి. పూలలా మాయ చెయ్యవు కదా? కళ్ళకి అలవాటు పడ్డ ఏ ఆకారాన్ని గుర్తుకు తేవు. మీరు గీసే రాళ్ళు జలపాతాల్లోనో, బీచ్ ఒడ్డునో, జనం ఆహ్లాదంగా భావించే ఏ ప్రదేశాల్లోనో ఉండవు. మోస్ట్ అనెక్స్‌పెక్టెడ్ అండ్ వెరీ కామన్ ప్లేసెస్‌లో. మీ మొదటి పెయింటింగ్ లోనే తెలుస్తుందిగా ఆ తేడా! దాదాపు అర్ధరాత్రి, వీధి లైటు డిమ్‌గా అప్పుడే ఆరి వెలిగినట్టు ఆ రాయి మీద, ఒక ప్రత్యేకమైన ఆకారం, నునుపుదనం ఏమీ లేని అతి మాములు రాయి. సగం తెరిచి, కాదు కాదు! అప్పుడే తెరిచి మూస్తున్న గేటు గాలికి ఊగిపోకుండా అడ్డుగా ఉంది రాయి, ఆ గేటుకు గడి ఊడిపోయుంటుంది బహుశా. పెయింటింగ్‌లో కుడి వైపు చివర్న దాదాపు మసక చీకట్లో — బాగా గమనిస్తే తప్ప తెలీదు — నిద్రలోంచి లేచి మొరుగుతున్న కుక్క తోక కదూ అది? అప్పుడే ఎవరో వెళ్ళారటు? ఎవరు? కానీ ఇంతకీ రాయే ప్రధానం అక్కడ. పెయింటింగ్ లోని టెక్నిక్స్ తెలీవు నాకు. కానీ మీ బొమ్మల్లో కథలుంటాయి. ‘ఎగిరిపోయే మల్లెపువ్వు’ చిత్రంలో కూడా! మల్లె వెళ్ళిపోయాక రాయిమీద పగులు, కానీ అడుగున ఎక్కడో…”

రాస్తూ ఉంటాడలా. నన్నడిగి తెలుసుకోవాలని కాదు. అతను తెలుసుకుంది నిజమే అని నాతో చెప్పించాలనే కుర్రతనపు పట్టుదలతో. ఇలా స్టేషన్ బెంచ్ నుంచి అతనికి సమాధానం రాస్తే దాచలేనేమో ఏదీ. న్యూస్‌ని కూడా కవిత్వంలా రాయాలనుకునే ఆ లేత జర్నలిస్ట్‌కి. చెప్పేస్తానా అంతా?

“ఇదిగో మాస్టారూ! మీరే బండి కోసం?” ఎవరో నా ఎదురుగా నిలబడి అడుగుతున్నాడు.

“నేను రావడానికి అరగంట ముందు వెళ్ళిపోయిందొకటి. దానికోసం. ఇట్నుంచి వెళ్ళిందది, ఎవరూ దిగలేదు. అట్నుంచి వచ్చే దాన్లో ఎందుకు దిగకూడదు?”

తేరిపారా చూసి బెంచిలో పక్కనొచ్చి కూర్చున్నాడు. ఏమిటో ఈయన ధైర్యం. అవును, అసలు విషయం తెలీదుగా చెప్పేస్తే నయం. “అయ్యో! మీరిలా ఇటు కాదు, ఈ వైపొచ్చి కూర్చోండి.”

ఎందుకన్నట్టు మరి కాస్త అక్కడే కుదురుకుని మరో వైపు చూస్తున్నాడు. “చెబ్తే వినాలి. ఇటూ, అంటే నా తలలో ఎడమవైపున — పురుగులు, అంటే వానపాములు. దాచిపెట్టిన మాటలు, దొరకని రంగులూ ఒక్కోటీ అలా చేరుతుంటాయి. ఒకటే నొప్పి అవి కదిలినప్పుడు. గట్టిగా విదిలించానే అనుకోండి. మీదసలే తెల్లచొక్కా. ఊహించుకోండి వానపాములు మట్టిగా బురదగా…”

పూర్తిగా చెప్పనివ్వడే ఈ మనిషి, అవతలేదో పనున్నట్టు పైవంక చూసుకుంటూ వెళ్తాడూ? అయ్యో చూసుకోలేదేమో, పాపం. తోలుచెప్పులేసుకున్నాడు. అబ్బా! అని పాదం పైకెత్తి బొటనవేలు రుద్దుకుంటున్నాడు. ఎదురుదెబ్బ తగిలింది. కంకర్రాయి.