మిట్ట మధ్యాహ్నపుటెండ
ఈ మధ్యవయసు!
పోల్చుకోలేని తీరాలలో
స్వార్థపు ఇసుకగూళ్ళ నడుమ
ఎంత వెదికినా నా ఛాయే కనపడదు!
ప్రపంచపు ఇరుకు
ఇమడనివ్వక నవ్వుతూంటుంది
అలవడని ఊసరవెల్లితనం
తనని తానే ఏరిపారేసుకుంటుంది
బియ్యంలో నల్ల రాయిలా మనసు.
ఒక మనిషో… ఓ మనసో…
రక్తపు మడుగులో రోడ్డు మీద
కొట్టుమిట్టాడుతున్నా…
మూర్ఖత్వపు దుర్గంధంలో
మునుగుతున్నా…
బలవంతపుటాకాశంలోంచి
రెక్కలు తెగిన పక్షిలా నేలకొరుగుతున్నా…
నాలుగు గింజలు పండించే చేతులు
తమను తాము తెగనరుక్కున్నా…
చేసేదేమీలేని చేతగానితనం
బిగుసుకుపోయిన నోరవుతుంది.
కాలం పేర్చిన కపటపు పొరల లోతుల్లో
స్పందనల చిగురాకులు
మనసు మూలల్లో
కనుదెరుస్తూనే ఉంటాయి
ఒక సన్నని సుపరిచిత స్వరమేదో
నిత్యం మౌనరాగమాలపిస్తూ
గొంతుక సానపెడుతూనే ఉంటుంది.
రాను రానూ…
గట్టి మేళంగా
చావు డప్పుల మోతగా
చెవులు చిట్లిపోయి
గుండె బద్దలయ్యి
ఆవేదనల లావా
ముంచెత్తేస్తున్నపుడు
ఎండని సాంత్వనపరిచే
చల్లని అక్షరాల గొడుగు
భరోసా నీడలోకి నడిపిస్తుంది
నేను మరిచిపోయాననుకున్న
నా అసలు ముఖం
కాలానికి అవతల
నవ్వుతూ కనిపిస్తుంది!