మనమెరుగని మధ్య అమెరికా – 4

ఓందూరాస్

నేనెక్కిన షటిల్ బస్సు గ్వాతెమాల సిటీ ఖాళీ రోడ్ల మీద ఆ ప్రభాతసమయాన తూనీగలా పరుగులు తీసింది. అదో పన్నెండు సీట్ల మినీబస్సు. ఆ బస్సు గంటన్నర క్రితం ఆంతీగా పట్నంలో బయలుదేరి గ్వాతెమాల సిటీలో ఇప్పుడు నన్ను ఎక్కించుకుంది. డ్రైవరు పక్క సహాయకుడు, బస్సులోపల నిండుగా దుప్పట్లు కప్పుకున్న ఇద్దరు వ్యక్తులు, అంతే. అంతా కలసి బస్సులో ఐదుగురం. ఆ దుప్పట్ల మనుషుల మొహాలు సరిగ్గా కనిపించలేదు కానీ వారి చిన్నపాటి శరీర ఆకృతిని బట్టి మహిళలు అయుంటారని అనుకున్నాను.

నేనూ నిద్రలోకి జారిపోయాను. మళ్ళా ఉదయం ఏడింటికి విరామం కోసం బస్సు ఆగినప్పుడు మెలకువ వచ్చింది. అనుకొన్నట్టుగానే వాళ్ళిద్దరూ అరవైలలో ఉన్న తైవాన్ మహిళలు. ఒకామెకు ఇంగ్లిష్ వచ్చు. అక్కడి సర్వీస్ స్టేషన్ లోని కఫేలో తాజా తాజా బ్రేక్‌ఫాస్టు, పరిమళభరితమైన కాఫీ సేవిస్తూ కబుర్లలో పడ్డాం. వాళ్ళిద్దరూ వ్యాపారవేత్తలు. ఒకామె తైపేలో (Taipei) చిన్నపాటి బిజినెస్ నడుపుతూ ఉండేది. రెండో ఆమెకు స్కూలు, నర్సరీ ఉండేవి. వాళ్ళ పిల్లలంతా పెరిగి పెద్దవాళ్ళయి, తమ తమ జీవితాల్లోకి ఎగిరి వెళ్ళిపోయారట – అంచేత పెద్దగా బాధ్యతలంటూ లేవు. వాళ్ళకున్న వ్యాపారాలను అమ్మేసుకుని వీళ్ళిద్దరూ ప్రపంచమంతా తిరిగి చూసే పనిలో పడ్డారు! యథాప్రకారం పరస్పరం యాత్రావివరాలు, చిన్న చిన్న సూచనలూ సలహాలూ ఇచ్చిపుచ్చుకున్నాం. తైవాన్ వెళ్ళడానికి ఉపయోగపడే సమాచారం కాస్త వాళ్ళనుండి సేకరించాను.

బస్సు మరో అరగంటపాటు సుందరపర్వతసీమలో సాగిపోయింది. పచ్చని ప్రకృతి, అడపాదడపా చిన్నచిన్న పల్లెలు, వాటికి తోడు సారవంతమైన పంటపొలాలు – చక్కని ప్రయాణం.

కాసేపటికల్లా ఎల్ ఫ్లొరీదో (El Florido) సరిహద్దు ప్రాంతం చేరుకున్నాం; గ్వాతెమాల, ఓందూరాస్ దేశాల మధ్య సరిహద్దు రేఖ అది. ఆ రెండు దేశాలకు చెందిన ఇమిగ్రేషన్ కౌంటర్లు ఒకే భవనంలో ఉన్నాయి. అక్కడ దరఖాస్తులు నింపడం, ఆ పనిలో తైవాన్ మహిళలకు సాయం చెయ్యడం, కోవిడ్ సర్టిఫికేట్లు తనిఖీ చేయించుకోవడం, ఇవన్నీ ముగించుకొని ఇరుదేశాల ఇమిగ్రేషన్ కౌంటర్లనుంచి బయటపడటం – అంతా కలసి ఒక గంట పట్టింది. ఓందూరాస్‌లో ప్రవేశానికి మూడు యు.ఎస్. డాలర్ల రుసుము ఉంది. గ్వాతెమాల కౌంటర్లో ఎక్సిట్ స్టాంపు, ఓందూరాస్ కౌంటర్లో ఎంట్రీ వీసా స్టాంపూ వేయించుకోవడంతో దేశాల సరిహద్దులు దాటే ప్రక్రియ ముగిసింది.

మాలాంటి అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆ రెండు కౌంటర్ల దగ్గరా ప్రత్యేకమైన క్యూలు ఉన్నాయి. వాటి నిడివి తక్కువ. స్థానిక దేశాలకున్న క్యూ చాంతాడంత ఉంది. ఆ క్యూలో ఉన్నవాళ్ళందరూ ఓందూరాస్ నుంచి గ్వాతెమాల వెళుతోన్నవాళ్ళట. గ్వాతెమాల లోనూ ఇంకా ఉత్తరాన ఉన్న దేశాలలోనూ ఉద్యోగావకాశాలకోసం వారి ప్రయాణం. నిజానికి వారి ప్రయాణం అక్కడితో ఆగేది కాదు – యు.ఎస్.ఎ. చేరుకోవడం వారిలో అధికసంఖ్యాకుల చిట్టచివరి లక్ష్యం. దక్షిణ అమెరికా నుంచీ మధ్య అమెరికా నుంచీ యు.ఎస్.ఎ.లో అనుమతులు లేకుండా అడుగు పెట్టడానికి పరచుకొని ఉన్న వలసబాటలో నేను చూస్తోన్న గ్వాతెమాల-ఓందూరాస్ ప్రాంతం ఒకానొక మజిలీ. వలస అభిలాషులంతా ఈ భూతలపు మజిలీలను దాటుకొని చివరికి యు.ఎస్.ఎ. చేరతారన్నమాట. గ్వాతెమాల, ఓందూరాస్, ఎల్ సల్బదోర్ దేశాల మధ్య మనుషులు, వ్యాపారసామాగ్రి సులభంగా హద్దులు దాటగలిగేలా చేసే ఒడంబడికలు ఉన్నాయి. అంచేత అందరికీ అక్కడ దేశాల హద్దులు దాటటం నల్లేరు మీద బండి నడక. సరిహద్దులు దాటి స్నేహసౌరభాలు పరిమళించే దేశాల మధ్య ఇలాంటి ఒడంబడికలు ఉండటం మనం ఎన్నో చోట్ల గమనించవచ్చు. ఉదాహరణకు ఇండియా నుంచి నేపాల్‌కు, భూటాన్‌కూ భూమార్గాన చేరుకోవడం సులభం; కాని వైషమ్యాలలో అనుక్షణం గడిపే పాకిస్తాన్, చైనా దేశాలకు చేరుకోవడం సామాన్యులకు దుస్సాధ్యమే కాదు – దాదాపు అసాధ్యం.


తెల్లవారుఝామునే బస్సెక్కినప్పుడు డ్రైవర్ని గమనించినా అతనితో సరైన పరిచయం కలగలేదు, మా మధ్య మాటలు కలవలేదు. బస్సెక్కగానే నిద్రలో పడటం, అతని పక్కన ఒక సహాయకుడు ఉండటం, అందుకు కారణాలయి ఉండాలి. ఆ సహాయకుడు ఎల్ ఫ్లొరీదో చేరాక దిగిపోయినట్టు ఉన్నాడు. ఎల్ ఫ్లొరీదో బార్డర్ దగ్గర డ్రైవరు నెల్విన్‌తో మాట కలిసింది. బార్డర్ దగ్గర అక్కడి పనులు సులభంగా ముగించడంలో నెల్విన్ మాకు ఎంతగానో సహాయపడ్డాడు. మొత్తానికి నేను ఓందూరాస్‌లో అడుగు పెట్టనే పెట్టాను – మధ్య అమెరికాలో నాకది మూడవ దేశం.

మరో ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత కొపాన్ రుయినాస్ (Copán Ruinas) పట్నం చేరుకున్నాం. ముచ్చటైన పట్టణమది. చేరేసరికి ఉదయం ఎనిమిదిన్నర అయింది. అదింకా ఉదయమే అయినా సూర్యుడి వేడిమి ఒంటిని తాకనే తాకింది. మొదటి హెచ్చరిక అన్నమాట – పగలు ముదిరేకొద్దీ సూర్యప్రతాపం మీకు కనపడబోతోందోచ్ అన్న హెచ్చరిక అది. ఇమిగ్రేషన్ తనిఖీలు తీసుకున్న గంట సమయం కూడా కలుపుకొని గ్వాతెమాల సిటీనుంచి కొపాన్ రుయినాస్ చేరుకోవడానికి నాలుగు గంటలు పట్టిందన్నమాట. రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం.

ఊరు చేరాక అక్రాపొలిస్ మాయా అన్న హోటల్లో దిగాను. అప్పటికే ఫ్లోరిస్‌లో కలిసిన అమెరికన్-స్పానిష్ మిత్రుడు డేవిడ్ ‘ఓందూరాస్ వెళ్ళీవెళ్ళగానే ఎల్ సల్బదోర్ దేశానికి ప్రయాణపు ఏర్పాట్లు చేసేసుకో’ అని హెచ్చరించి ఉన్నాడు. అంచేత ఆ పనిమీద పడ్డాను. ఆ పని చేసుకోని పక్షంలో ఓందూరాస్ లోనే చిక్కడిపోయే ప్రమాదం ఉందట. మధ్య అమెరికాలోకెల్లా ఓందూరాస్ బాగా వెనకపడిన దేశం. రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని విన్నాను. మ్యాపులు పరిశీలించి కొపాన్ రుయినాస్ నుంచి ఎల్ సల్బదోర్ దేశపు సరిహద్దులో ఉన్న ఎల్ పోయ్ (El Poy) దాకా బస్సులు పట్టుకువెళదామని ప్లాన్ చేశాను. అంతా కలసి నూటపధ్నాలుగు కిలోమీటర్లు. ఒకరిద్దర్ని వాకబు చేశాక, ఒక ట్రావెల్ ఏజన్సీని సంప్రదించాక, ఎల్ పోయ్‌కు వెళ్ళే బస్సులంటూ లేవని బోధపడింది. రోడ్లు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయంటే టాక్సీలవాళ్ళు కూడా అక్కడికి రానే రారట. చివరికి తేలిందేమిటంటే మళ్ళా వెనక్కి ఎల్ ఫ్లొరీదో బోర్డరుకు వెళ్ళి, గ్వాతెమాలలో అడుగు పెట్టి, అక్కణ్ణుంచి గ్వాతెమాల – ఎల్ సల్బదోర్‌ల నడుమన ఉన్న ఆంగ్వియాతు (Anguiatú) సరిహద్దు చేరుకొని, ఆపైన ఎల్ సల్బదోర్‌లో అడుగు పెట్టడమే ఉత్తమం అని. అంతా కలసి నూట ఎనభై కిలోమీటర్లు. నీ ముక్కేదీ అంటే తిప్పి చూపించే వైనం ఇది…

ఈ సమాచారమంతా జీర్ణించుకునేసరికి బుర్ర వేడెక్కిపోయింది. ఆలోచించుకోడానికి వీలుగాను, గజిబిజి సమాచారం నుంచి ఆటవిడుపు కోసమూ పక్కనే ఉన్న బాంకులోకి వెళ్ళి డాలర్లను స్థానిక కరెన్సీకి మార్చుకున్నాను. బాంకు ఆవరణలో ఎ.సి. నుంచి వస్తోన్న చల్లనిగాలి బయట మండుతోన్న ఎండనుంచి ఉపశమనం కలిగించడం నాకు దక్కిన అదనపు లాభం.

ఓందూరాస్ కరెన్సీ పేరు ఓందూరన్ లెంపీరా (Lempira). ఒక యు.ఎస్. డాలరుకు ఇరవైనాలుగు లెంపీరాలు. ఈ లెంపీరా అన్నది అప్పట్లో స్పానిష్ ఆక్రమణదారుల్ని ఎదుర్కొని పోరాడిన నేటివ్ ఇండియన్ల నాయకుని పేరు. ఆయన బొమ్మ ఒక లెంపీరా నోటు మీద ఉంటుంది. ఆ నోటు మీద – అక్కడి ప్రధాన ఆకర్షణ – కొపాన్ శిథిలాల బొమ్మ కూడా కనిపిస్తుంది. ఈ కొపాన్ శిథిలాలు అన్నవి కొపాన్ రుయినా పట్నానికి పర్యాటకులని రప్పించి ఆదాయం సమకూర్చే మాయన్ నాగరికతా అవశేషాలు. ఓందూరాస్ దేశంలో కొపాన్ పట్టణాన్ని స్థావరంగా ఎన్నుకున్నది ఈ శిథిలాలు చూద్దామనే.

నోట్లు మార్చుకుని ఊరి కూడలి చేరాక మా బస్సు డ్రైవరు నెల్విన్ మళ్ళా తటస్థపడ్డాడు. అతనింకా గ్వాతెమాల దేశస్థుడనుకున్నాను – కాదు. ఈ కొపాన్ రుయినా నివాసి. దేశాలూ సరిహద్దుల విషయంలో నేను పడుతోన్న ఇబ్బంది అతనికి వివరించి ‘ఈ ఓందూరాస్‌లో నాకు తెలిసిన ఒకే ఒక్క మనిషివి నువ్వు. కాస్తంత ఎల్ సల్బదోర్ ఎలా వెళితే మంచిదో చెప్పి సాయం చెయ్యి ‘ అని అడిగాను. నెల్విన్ సానుకూలంగా స్పందించాడు. ‘ఏదో ఒక ఏర్పాటు చేస్తాను, దిగులు పడకు’ అని భరోసా ఇచ్చాడు. ‘మళ్ళా గ్వాతెమాల వెళ్ళి ఎల్ సల్బదోర్ చేరుకోవడం దూరాల దృష్ట్యా అంత మంచి ఆలోచన అనిపించకపోయినా, దానికి పట్టే సమయం తిన్నగా వెళ్ళడంకన్నా తక్కువ… రెండుసార్లు సరిహద్దులు దాటాలి అన్న విషయాన్ని పరిగణన లోకి తీసుకున్నా కూడా’ అన్నాడు.

మాటల్లో ఉండగానే నెల్విన్ గబగబా ఒకటి రెండు ఫోన్లు చేశాడు. చేసి తనకు తెలిసిన వాళ్ళద్వారా షేర్‌డ్ టాక్సీ ఏర్పాటు చేశాడు. రేపు ఉదయం అయిదున్నరకు మీ మాయా హోటల్‌కు వచ్చి నిన్ను పికప్ చేసుకుని అంగ్వియాతు బార్డర్ చేరుస్తుంది అని చెప్పాడు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. అతనికి టాక్సీ డబ్బులు అడ్వాన్స్‌గా ఇచ్చి క్లిష్టసమయంలో నన్ను గట్టెక్కించినందుకు ధన్యవాదాలు చెప్పాను. నేను తికమకలో మునిగి ఉన్న సమయానికి సరిగ్గా ఎవరో పంపినట్టు నెల్విన్ వచ్చి నన్ను గట్టెక్కించడం ఏమిటీ? ఎంత గొప్ప యాదృచ్ఛికమిదీ! నీకు సంకల్పబలముంటే సాయం చెయ్యడానికి ప్రపంచమే వ్యూహం పన్నుతుంది అంటారు కదా – ఇదేనేమో!


లంచ్ టైమయింది. దేశంలోకి వచ్చాక అసలుసిసలు ఓందూరాస్ భోజనం రుచి చూడాలన్నది నా కోరిక. అది విని నెల్విన్ ల యామా దెల్ బోస్కె (La Llama del Bosque) అన్న రెస్టరెంట్ సిఫార్సు చేశాడు. మెల్లగా ఆ రెస్టరెంట్ వైపు సాగాను. ఊహించినట్టే అది కస్టమర్లతో కళకళలాడుతోంది. లోపల మెయిన్ డైనింగ్ రూమ్ ఉంది. బయట కూడా సహజమైన తీగలు పాకించిన గొడుగుల నీడన భోజనాలు చేసే వసతి ఉంది. వాతావరణం వేడిగా ఉక్కగా ఉన్నా బయట భోంచెయ్యడానికే ఇష్టపడ్డాను. క్షణాల్లో అదెంత పెద్ద తప్పిదమో అర్థమయింది. ఎటుచూసినా దోమలే దోమలు. వాటికి మిగతా చోట్ల ఉన్నట్టు రాత్రీ పగలూ అన్న తేడా లేదు కాబోలు – మహా ఉత్సాహంగా నన్ను ఆహ్వానించి దాడికి పూనుకున్నాయి. కాసేపటికల్లా అది గెలవసాధ్యం కాని యుద్ధమని తెలిసిపోయింది. లతలూ పొదలూ పక్కన పెట్టి మెయిన్ హాల్లోకి మారాను. అయినా దోమలు నా వెంటబడి వచ్చాయి. ఉధృతం కాస్త తగ్గిందన్న మాటేగానీ ఇబ్బంది ఇబ్బందే. అది గమనించిన అక్కడి వెయిటర్లు దోమల స్ప్రే తెచ్చి పరిస్థితి చక్కదిద్దారు.

మీ దేశానికి చెందిన మంచి వంటకమేదయినా చెప్పు అని మా వెయిటర్ని గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా అడిగాను. ప్లాతో తిపీకో (platO tipico) తీసుకోమంది ఆవిడ. అది ఓందూరాస్ వంటకాలన్నిటినీ తనలో ఇముడ్చుకున్న పదార్థం అని వివరించింది. అన్నం, గ్రిల్‌డ్ చికెన్, బ్లాక్ బీన్ పేస్ట్, అర అవొకాదో, ఓ చీజ్ ముక్క, సాలడ్, వేయించిన అరటి ముక్కలు – ఇదీ ఆ వంటకం. సరళమైన, రుచికరమైన, ఆరోగ్యవంతమైన వంటకం… చూడగానే ఆరగించాలనిపించిన వంటకం.


మధ్యాహ్నం పన్నెండున్నర – కొపాన్ శిథిలాలు చూడటానికి వెళ్ళే టైమయింది. అక్కడికా ప్రాంగణం రెండు కిలోమీటర్లు – పెద్ద దూరమేం కాదు; నడిచెయ్యవచ్చు. కానీ ఎండ చూస్తే మండిపోతోంది. అంచేత బజాజ్ ఆటోరిక్షా పట్టుకున్నాను. ఆ ప్రాంతాల్లో దాన్ని టుక్-టుక్ అంటారు.

దియేగో గార్సియా దె పలాసియో (Diego García de Palacio) అన్న స్పానిష్ ఆక్రమణదారు 1566లో కొపాన్ శిథిలాలను కనిపెట్టాడు. ఇప్పుడు ఆ ప్రాంగణానికి యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపద అన్న గుర్తింపు లభించింది.

ఆ ప్రాంగణపు ప్రవేశద్వారం దగ్గర ఒక మధ్యవయసు పెద్దమనిషి కనిపించి పలకరించాడు. ఆసక్తికరమైన వేషధారణ. శిరస్సుకు దారు కిరీటం – అది మాయన్ సంస్కృతికి చెందినదై ఉండాలి. ఆ కిరీటంలో మెకో (Macaw) చిలుకల ఈకలు, వాటికి తోడు కిరీటపు నడిమధ్యన చిరుతపులి బొమ్మ… చేతిలో నిడుపాటి జేగురు రంగు దండం, ఆ దండానికి చివర మెకో ఈకలు… నడుమన అడ్డకర్ర మీద ఎర్రటి మెకో చిలుక బొమ్మ… రంగురంగుల దుస్తులు, మెడలో పూసలదండ, దాని చివర పుర్రె బొమ్మ లాకెట్ – ఆకట్టుకునే ఆహార్యమతనిది. అమెరికాన్ యాసతో కూడిన చక్కటి ఇంగ్లిష్ మాట్లాడాడు. తన పేరు మార్కో అని చెప్పాడు. మనుషులతో సులభంగా కలిసిపోయే మనిషి. క్షణాల్లో అతనితో మాటల్లో పడ్డాను. ఆ ప్రాంగణం చూడాలంటే గైడు అవసరం అన్నాడు. తాను అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ప్రాంగణంలోని అనేక విశేషాలతోపాటు అక్కడ ఉన్న మీ హిందూ దేవుడు హనుమంతుని ప్రతిమ కూడా చూపిస్తానన్నాడు. నా భారతీయ మూలాలు పసిగట్టడానికి అతనికి పెద్ద సమయం పట్టలేదు.

నాకూ గైడ్‌ను పెట్టుకుందామనే ఉంది గానీ అక్కడ గడిపే నాలుగు గంటలకు అతనడిగిన రుసుము చాలా ఎక్కువ. దానికి మార్కో ఓ పరిష్కారం చెప్పాడు – ప్రాంగణంలోని మ్యూజియమ్‌తో మొదలుపెట్టి అక్కడ నేను ఒక గంట గడిపితే ఈ లోపల మరికొంతమంది టూరిస్టులు తనకు దొరికే అవకాశముందని, అలా ఖర్చులు తగ్గుతాయనీ అతని సలహా. బావుందనిపించింది.

ఆ శిల్పాల మ్యూజియమ్ అక్కడికి నడకదూరంలో ఉంది. మాయన్ నాగరికతకు చెందిన అత్యుత్తమమైన శిల్పాలు ఆ మ్యూజియమ్ ప్రత్యేకత. మ్యూజియమ్ లోపలే కాకుండా ఆ ప్రాంగణమంతటా కూడా ఆ శిల్పాలు కనిపిస్తాయి. వెళ్ళీ వెళ్ళగానే సందర్శకులకు ఒక పురాణబాణీ మహాసర్పాకృతి స్వాగతం చెపుతుంది. ఆ పాము నోరే మ్యూజియమ్ లోకి ప్రవేశమార్గం. అందులోకి ప్రవేశించాక, ఓ పొడవాటి నడవాలో నడిచాక – అది ఆ సర్పాకృతి శరీరం అన్నమాట – ఒక దీర్ఘచతురస్రాకారపు ఖాళీస్థలం వస్తుంది. ఆ స్థలంలో ప్రసిద్ధి చెందిన రోసలీల (Rosalila) మందిరపు ప్రతికృతి ఉంది. దాని జేగురు రంగు గోడల మీద చక్కని శిల్పాలు అమరి ఉన్నాయి.

ఏ కారణం వల్లనో రోసలీల మూలమందిరాన్ని ఎంతో జాగ్రత్తగా స్టకో పలకలతో ఆరో శతాబ్దంలో పూడ్చిపెట్టారట. మళ్ళా 1989 తవ్వకాల్లో అది బయటపడింది. ఆ మందిరపు ప్రతికృతిని అదే పరిమాణంలో ఈ మ్యూజియమ్‌లో నిర్మించారు. ఏ సూక్ష్మవివరం కూడా వదిలిపెట్టకుండా ఆ పునర్నిర్మాణం జరిగింది. అది ఆ మ్యూజియమ్ కేంద్రబిందువు. మ్యూజియమ్ లోని రెండు అంతస్తుల్లో ఉన్న గాలరీలలో కొపాన్ ప్రాంగణం నుంచి సేకరించిన అతిసుందరమైన రాతి శిల్పాలు ఉన్నాయి. మ్యూజియమ్ చూసుకొని బయటకు వచ్చేసరికి మార్కో నాకోసం ఎదురు చూస్తూ కనిపించాడు. అనుకున్నట్టుగా అతనికి కొత్త టూరిస్టులు దొరకలేదు. సరే అనుకుని, ఇద్దరం మాట్లాడుకుని రుసుము విషయంలో ఒక అంగీకారానికి వచ్చాం.

విశాలమైన కాలిబాటలో ఇద్దరం అడవిగుండా నడిచాం. అక్కడంతా ఎర్ర మేకో చిలుకల సందడి. వాటిని ఆరుబయట అడవుల్లో చూడడం నాకదే మొదటిసారి. వాటి రూపవిలాసం నన్ను ముగ్ధుడిని చేసింది. అక్కడే కపీబారా (Capybara) అన్న రాక్షసాకృతి మూషికం కనిపించింది. మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలలో మాత్రమే కనిపించే ప్రాణి అది. అక్కడి చెట్లలో గడ్డి మేస్తూ కనిపించింది. ఆ పచ్చని అడవిలో ఎన్నో హైకింగ్ మార్గాలు కనిపించాయి.

నలభై యేళ్ళనుంచీ మార్కో అక్కడ గైడుగా పని చేస్తున్నాడట. మధ్యలో కొన్ని సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్‌లో గడిపినా అతని ప్రధాన స్థావరం మాత్రం కొపాన్ రుయినా పట్నమే. అతన్ని చూడగానే ఆ శిథిలాలలో, ఆ పరిసరాలలో అతనో అంతర్భాగమన్న భావన కలిగింది. కొపాన్ చరిత్రకు చెందిన మానవుడనిపించింది. అక్కడ శతాబ్దాల తరబడి నివసించి వికసించిన మాయన్ ప్రజల దివ్యభూత రూపమనిపించింది. వారందరి తరఫునా ఇతగాడు ఇంకా ఆ ప్రాంగణాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నాడని అనిపించింది. చూడగానే ఆకట్టుకునే రూపం, ప్రవర్తన – కొపాన్ పట్నంలో మార్కోను ఎరుగని మనిషి లేడు.

కొపాన్ శిథిలాల అంతరంగాలను పట్టుకోవాలంటే మనిషికి ఎంతో నిశితమైన చూపు ఉండాలి అన్నాడు మార్కో. నేను కొద్దిరోజుల క్రితమే తికాల్ శిథిలాలను చూశానని విని, తికాల్ బ్రహ్మాండమైన శిథిల కట్టడాలకు ప్రసిద్ధి. ఈ కొపాన్ ప్రత్యేకత తన శిల్పాలలోను, చిత్రాలలోను, అంతకన్నా ముఖ్యంగా చిత్రలిపితో కూడిన శిలాఫలకాల (heiroglyphic inscriptions) లోనూ ఉంది అన్నాడు. అని తికాల్ న్యూ యార్క్ నగరమైతే, కొపాన్ పారిస్ లాంటిది అని ముక్తాయించాడు.

ఉష్ణమండలపు అడవి కదా – ఆ అడవి నిండా చిక్కగా పరచుకున్న పచ్చదనం. నిడుపాటి వృక్షాలు… పురి విప్పి గొడుగు పడుతోన్న వాటి కొమ్మలూ రెమ్మలూ… కట్టడాల శిథిలాలు ఉన్న ప్రాంతాల్లో మాత్రం చెట్టూ చేమా లేకుండా చూశారు. వెయ్యేళ్ళ మనుగడ తర్వాత కొపాన్ పట్టణాన్ని క్రీ.శ. పదో శతాబ్దంలో అప్పటివారు త్యజించారు. తన వైభవం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు మాయన్ నాగరికతకు చెందిన నాలుగు ప్రధాన నగరాలలో ఒకటిగా కొపాన్ ఒక వెలుగు వెలిగింది. గ్వాతెమాల లోని తికాల్, ఈనాటి మెహికో దేశంలోని కలాక్‌ముల్ (Calakmul), పలెంకె (Palenque) అన్నవి మిగిలిన మూడు నగరాలు. ఈ నాలుగింటిలోనూ కొపాన్ బాగా దక్షిణాన ఉన్న నగరం.

అక్కడి పురావస్తు ప్రాంగణం 24 చ.కి.మీ.లలో విస్తరించి ఉంది. అందులో 4500 చెప్పుకోదగ్గ నిర్మాణాలు ఉన్నాయి: పౌరభవనాలు, కూడలి ప్రదేశాలు, మందిరాలు, రక్షణ భవనాలు, మెట్లు మెట్లుగా నిర్మించిన పిరమిడ్‌ల సమూహాలు, డిజైన్లూ అక్షరాలూ చెక్కిన పటాల లాంటి రాతిపలకలు (పురావస్తు పరిభాషలో స్టెలా, స్టెలే: Stelae) – అదో వివిధరకాల శిలాశిథిలాల ఉద్యానవనం! వాటిల్లో ముఖ్యమైనవి నేవెళ్ళిన కొపాన్ రుయినాస్ విజిటర్ సెంటర్ చుట్టూ పరచుకొని ఉన్నాయి.

అక్కడ ఉన్న అరవైరెండు మెట్ల చిత్రలిపి శిలాఫలకానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యం ఉందట. దానిమీద చిత్రలిపికి చెందిన 2200 ‘అక్షరాలు’ చెక్కి ఉన్నాయి. మాయన్ నాగరికతకు చెందిన అతివిపులమైన ‘అక్షర’ వివరాలు ఉన్న శిలాఫలకమది. దానిని ఇంకా పూర్తిగా చదివి అర్థం చేసుకోలేదని, ఇప్పటికీ పరిశీలిస్తూనే ఉన్నారనీ చెప్పాడు మార్కో. కాని, ఆనాటి రాజులు, రాజవంశాలు, వారి వారి పరిపాలనా కాలాలు, అప్పట్లో జరిగిన ముఖ్యమైన ఘటనల వివరాలు ఈ శిలాఫలకంలో ఉన్నాయి అన్న విషయంలో పురావస్తు శాస్త్రజ్ఞులకు స్థూలంగా అంగీకారం ఉంది.

మార్కో నాకు ఆ ప్రాంగణమంతా ఓపిగ్గా తిప్పి చూపించాడు. అక్కడి కట్టడాల చరిత్రా ప్రాముఖ్యతా చక్కగా వివరించాడు. ఈ పరిజ్ఞానమే కాకుండా మార్కోకు మరో నైపుణ్యం ఉంది. అతనో చక్కటి ఫొటాగ్రఫర్. పనొరామిక్ దృశ్యాల చిత్రీకరణ అంటే అతనికి మక్కువ. దాంతోపాటు కెమేరా మాజిక్కులూ చెయ్యగలడు – ఒకే ఫ్రేములో నావి నాలుగు ఫోటోలు చొప్పించి తీశాడు. నాలుగే కాదు, ఆరు ఫోటోల దాకా అలా తీయగలడట!

అక్కడి ఒక కూడలిలో ‘చూడు చూడు’ అంటూ ఒక శిల్పం చూపించాడు మార్కో. అతను ముందే చెప్పిన, హనుమంతుడి పోలికలు పుష్కలంగా ఉన్న ఆకృతి అది. దానికి మార్కో పెట్టిన పేరు ‘మాయన్ హనుమాన్’. ఆ మాట అంతకుముందు అక్కడికి వచ్చిన ఒక భారతీయ టూరిస్టు మార్కోతో అన్నాడట – దాన్ని మార్కో ఖరారు చేసి వాడేస్తున్నాడు. కానీ మార్కో ఆ టూరిస్టు దగ్గర హనుమంతుడన్న మాట విని ఊరుకోలేదు – హనుమంతుడి గురించి, భారతీయ పురాణ ఇతిహాసాల గురించీ తగినంత పరిశోధన చేసి మరీ తెలుసుకున్నాడు.

మాయన్లకే చెందిన బంతి ఆట ఒకటి అప్పట్లో ఉండేదట – ఆట మైదానాలు కూడా వారి నగరాల నడుమ ఉండే పౌరభవనాల్లో ఒక భాగమట. అలాంటి బంతి ఆట మైదానాల్లో అతి పెద్దది మెహికో లోని చిచెన్ ఇత్సాలో (Chichén Itzá) ఉంది. కొపాన్‌లో ఉన్న మైదానం ఆ వరుసలో రెండవది. మాయన్ల బంతి ఆటకు క్రతుపరమైన ప్రాముఖ్యం ఉంది. రబ్బరుమొక్క పాలతో మూడు నుంచి ఐదు కిలోల బరువుండే బంతిని చేసి ఆటకు వాడతారు. ఒక్కో జట్టులో ఇద్దరు కానీ నలుగురు కానీ ఆటగాళ్ళు ఉంటారు. బంతిని తలతోగాని, చేతులూ కాళ్ళతోగానీ ముట్టుకోకూడదు. మోకాళ్ళు, మోచేతులు, భుజాలు, తొడలు, పిరుదులు – వీటితో మాత్రమే తాకాలి. ఓడిపోయినవారికి గౌరవభంగమే కాదు, ప్రాణాలూ పోతాయి; శిరచ్ఛేదమో, గుండె పెకలించడమో వారికి శిక్ష అట!

అక్కడ ఉన్న స్టెలేల పార్కు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సగటు మనిషిని మించిన పరిమాణంలో అలనాటి రాజుల బొమ్మలు పలకకు ఒకవైపున, చిత్రలిపిలో రాసిన అక్షరాలు రెండోవైపునా ఉన్నాయి. నేను మెహికో లోను, గ్వాతెమాల లోనూ ఎన్నో మాయన్ ప్రాంగణాలు చూశాను కానీ ఈ కోపన్ ప్రాంగణం లోని శిల్పనైపుణ్యత, సౌందర్యం ఇంకెక్కడా కనిపించలేదు. వాటి సొగసూ సౌందర్యాలను మన పురాతన దక్షిణ భారత ఆలయాల శిల్పసౌందర్యంతో పోల్చవచ్చు.

అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలు నా దృష్టిని ఆకర్షించాయి. వాటి కుదురు విశాలంగా ఉంది. కొంచెం నిడుపాటివి. ఆపైన కొమ్మలూ రెమ్మలూ పరిసరాల మీద మహాఛత్రంలా విచ్చుకుని ఉన్నాయి. అది సెయ్‌బా (Ceiba) వృక్షమని చెప్పాడు మార్కో. దానికే కపోక్ చెట్టు అని, సిల్క్ కాటన్ చెట్టు అనీ పేర్లున్నాయి. గ్వాతెమాల దేశపు జాతీయ వృక్షమట. మాయన్లకు ఎంతో పవిత్రమైనదట. అక్కడే మరో బ్రహ్మాండమైన వృక్షం కనిపించింది. దాని పైభాగం కూడా పచ్చల మహాగోపురంలా ఉంది. దాని పేరు వనకాస్తె (Guanacaste) అని, అది కోస్తా రీక దేశపు జాతీయ వృక్షమనీ చెప్పాడు మార్కో. నిజానికి మనలో ఎవరికైనా అలాంటి ఆసక్తి ఉంటే ఈ కొపాన్ శిథిలాల పర్యటనను ఉష్ణమండలపు అడవుల శోధన గాను, పక్షులని పలకరించే ప్రక్రియ గాను, బొటానికల్ టూర్ గానూ కూడా మలచుకోవచ్చు. ఆ ప్రదేశానికున్న చారిత్రక పురావస్తు ప్రాధాన్యం సరేసరి – వాటికితోడు అక్కడి సహజ ప్రకృతి సౌందర్యం ఎవరినైనా కట్టిపడేస్తుంది. అక్కడి మేకో చిలుకల పలకరింపులు ప్రయాణాలంటే విముఖత ఉన్నవారినైనా ఇట్టే ఆకట్టుకొని తీరతాయి. తికాల్ లాగా ఈ ప్రాంగణం కూడా టూరిస్టులు తిరుగాడే మార్గాలకు పెడగా ఉంది. అంచేత ఏ గందరగోళమూ లేకుండా శాంతంగా, ప్రశాంతంగా అక్కడ సమయం గడపవచ్చు.

ఆ రాతిపలకల పార్కులో నేనూ మార్కో గడిపిన చివరి గంటలో ఓ గ్వాతెమాల యువకుల బృందం మా వెంట వెంట వచ్చింది. నాల్డో, ఫెర్నాండో, కార్మెన్, మార్తా అన్న ఆ నలుగురు యువకులూ ఎంతో స్నేహంగా వ్యవహరించారు. తికాల్, కొపాన్ శిథిలాల మధ్య పోలికలూ తేడాలూ చర్చించారు. ఆ రెండూ వేటికవే ముఖ్యమైనవని నిర్ధారించారు. మార్కో కూడా వాళ్ళతో చనువుగా కబుర్లు చెప్పాడు. తన ఫొటాగ్రఫీ నైపుణ్యాన్ని వాళ్ళ మీద ప్రయోగించి రకరకాల భంగిమల్లో వాళ్ళకు చక్కని ఫొటోలు తీసిపెట్టాడు. అందుకుగాను వాళ్ళకు ఉపకరణాలుగా తన చెక్క కిరీటమూ జేగురు రంగు దండమూ అందించాడు. ఆ గంటా సరదాగా గడిచిపోయింది. సాయంత్రం అయిదయింది. కొపాన్ ప్రాంగణాన్ని సంతృప్తికరంగా చూడటమూ ముగిసింది. ఆ రోజు నాకు చిరకాలం గుర్తుండిపోయే అనుభవాలను అందించినందుకు మార్కోకు ధన్యవాదాలు చెప్పి వీడ్కోలు తీసుకున్నాను.


ఎండ తగ్గింది. వాతావరణం కాస్త చల్లబడింది. తిరిగి కొపాన్ పట్టణం వెళ్ళే సమయం వచ్చింది. ఆ ప్రాంగణంలో పనిచేస్తోన్న ఉద్యోగులు, ఆర్కియాలజిస్టులూ కూడా తమ పనులు ముగించి ఇంటిదారి పట్టడం కనిపించింది. వారిలో చాలామందిది కాలినడకే. నేనూ కాలినడక ఆరంభించాను. మానుయేల్ అన్న ఒక జూనియర్ ఆర్కియాలజిస్టుతో కలసి నా నడక సాగింది. అక్కడ ఇంకా చాలా ముఖ్యమైన తవ్వకాలు కొనసాగుతున్నాయని వివరించాడు మానుయేల్. మేము నడుస్తున్న రోడ్డు పక్కన చిన్నపాటి షెల్టర్ల కింద నిలబెట్టి ఉంచిన రెండు అందమైన రాతిపలకలని చూపించాడు. నా ప్రయాణాల వివరాలు ఆసక్తితో అడిగి తెలుసుకున్నాడు. మెహికో, గ్వాతెమాల, బెలీజ్ దేశాలలోని నేను చూసిన మాయన్ శిథిలాల ప్రాంగణాలను గురించి వివరంగా అడిగాడు. ఖర్చులకు సరిపడా డబ్బులు సంపాదించాక ఆ ప్రాంగణాలకు వెళ్ళి చూస్తానన్నాడు. మా ఓందూరాస్ కరెన్సీ లెంపీరా గ్వాతెమాల దేశపు కెత్‌సల్‌తో పోలిస్తే బాగా బలహీనం అని వాపోయాడు. ‘మధ్య అమెరికా దేశాలన్నిటిలోనూ, నికరాగ్వా మినహాయించి, మాదే పేద దేశం. బీదరికంతో పాటు నేరాలూ మా దేశంలో ఎక్కువ. మాకన్నా ఈ విషయంలో నికరాగ్వా చాలా మెరుగు. నేరసామ్రాజ్యాలు, అవినీతి, అసమర్థ పరిపాలన మా దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను దిగలాగుతున్నాయి’ అని బాధపడ్డాడు.

నిజమే – ఓందూరాస్ ఎనభై లక్షల జనాభా ఉన్న చిన్న దేశం. ఎంత చిన్న దేశమైనా ఏదో ఒక విశిష్టత ఉంటుంది కదా. తనకంటూ ప్రత్యేకమైన విషయమో వస్తువో ఉంటుంది కదా. అదేదో ఓందూరాస్ విషయంలో కనిపెట్టి చెప్పి మానుయేల్‌ను కాస్తంత ఉత్సాహపరుద్దామని అనిపించింది. కాస్త ఆలోచిస్తే ఒక మాట గుర్తొచ్చింది: మీ దేశపు గాజురొయ్యలు మా యు.కె. సూపర్‌మార్కెట్లలో బాగా దొరుకుతాయి. మేమంతా ఇష్టంగా కొనుక్కుంటాం అని చెప్పాను. మానుయేల్ మొహం విప్పారింది. తమ దేశపు రొయ్యలకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలుసుకొని బాగా సంతోషించాడు.

మళ్ళా మా మాటలు ప్రయాణాల వేపు మళ్ళాయి. ఇక్కణ్ణుంచి ఏ దేశం వెళుతున్నావూ అని అడిగాడు మానుయేల్. మా కొపాన్ రుయినాస్ యాత్రీకులకు ఎంతో అనువైన ప్రాంతం, భద్రతాసమస్యలంటూ ఉండవు అన్నాడు. కాని, ఓందూరాస్ లోని సాన్ పెద్రో సూలా లాంటి నగరాలలోను, రాజధాని తెగుచిగల్పా (Tegucigalpa) లోను కాస్తంతా జాగ్రత్తగా ఉండటం అవసరమన్నాడు. నేను అక్కణ్ణుంచి ఎల్ సల్బదోర్ వెళుతున్నానని విని ఆ దేశం ఓందూరాస్ కన్నా కొంచెం మెరుగు. కాకపోతే రాజధాని నగరం సాన్ సల్బదోర్‌లో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. మాటల్లోనే మేము ఊళ్ళోకొచ్చేశాం. మానుయేల్‌కు శుభాకాంక్షలూ వీడుకోళ్ళూ చెప్పి శెలవు తీసుకున్నాను.

మానుయేల్ మాటలు విన్నాక సాన్ పెద్రో సూలా వివరాల కోసం ఇంటర్నెట్‌లో వెతికాను. అక్కడి వివరాల ప్రకారం ఆ ఊరు ఓందూరాస్ లోనే కాదు; ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం! బ్రోక్‌బాక్ ట్రావెలర్ అన్న వెబ్‌సైటయితే అసలా ఊరి జోలికే పోకండి అని సలహా చెప్తోంది. యు.కె.కు చెందిన గార్డియన్ వార్తాపత్రికలో 2013లో వచ్చిన ఆర్టికల్ ఒకటి నా కంటపడింది. ఇన్‌సైడ్ సాన్ పెద్రో సూలా అన్న ఆ వ్యాసంలో ఈ నగరం ప్రపంచంలోకెల్లా హింస నిండిన ప్రదేశం అని చెప్తూ, అందుకు ఆధారంగా గణాంకవివరాలు కూడా ఇచ్చారు. ఈ నగరంలో హత్యాఘటనల సంఖ్య లక్షకు 173 అట. ఓందూరాస్ దేశంలో అది 85.5 – అంటే దేశం మొత్తం మీది సంఖ్యతో పోలిస్తే ఈ నగరంలో రెట్టింపు హత్యాఘటనలన్నమాట. యు.ఎస్.లో ఆ సంఖ్య 4.78, యు.కె.లో 1.2. ఓందూరాస్‌లో ఈ మరణమృదంగధ్వని వెనక మాదకద్రవ్యాల వ్యాపారపు పాత్ర ఉంది. అమెరికాకు చేరే కొకైన్‌లో ఎనభైశాతం ఓందూరాస్ ద్వారానే వెళుతుంది.

కొపాన్ శిథిలాలనుంచి ఊళ్ళోకి తిరిగివచ్చాక తిన్నగా అక్కడి సెంట్రల్ పార్కుకు వెళ్ళాను. సాయంత్రం అయిదున్నర సమయం. ఆ పార్కూ అక్కడి కూడలీ స్థానికులతో నిండిపోయి కనిపించాయి. వాళ్ళంతా అక్కడ తీరిగ్గా పచార్లు చెయ్యడమూ పార్కు బెంచిల మీద చేరగిలబడి సాయంత్రాన్ని ఆస్వాదించటమూ కనిపించింది. నిప్పుల మీద కాలుతున్న మొక్కజొన్న పరిమళం నాకు పిలుపు అందించింది. వెళ్ళి ఒకటి అందిపుచ్చుకున్నాను. దానిని మునిపళ్ళతో కొరుకుతూ ఆ నిగూఢ దేశపు మారుమూల పట్నంలో నింపాదిగా సాగిపోతున్న జనజీవన స్రవంతిని గమనిస్తూ ఆ కూడలిలో తిరుగాడాను. కొద్ది వారాల క్రితం వరకూ ఆ దేశపు ఉనికిని అంతగా పట్టించుకోని నాకు ఇప్పుడు దాని అద్వితీయ, అసాధారణ లక్షణాలు కళ్ళముందు సజీవంగా కనిపించి గొప్ప సంతోషం కలిగించాయి.

అక్కడి చర్చి లోంచి వినిపిస్తోన్న గంటల శబ్దం నన్ను ఆకర్షించింది. మెల్లగా అటువేపు నడిచాను. ప్రశాంత వాతావారణం. ధ్యానపు పొలిమేరల్లోకి చేరి ఆలోచనల్లో మునిగిపోవడానికి అనుకూలమైన వాతావరణం. ఆనాటి సంఘటనలన్నిటినీ ఒకటొకటిగా గుర్తుకు తెచ్చుకున్నాను – బాగా పొద్దున్నే గ్వాతెమాల సిటీలో బయలుదేరడం, కొపాన్ రుయినాస్ చేరుకోవడం, అక్కడి శిథిలాల ప్రాంగణంలో గంటలు గంటలు గడపడం… మర్నాడు ఎల్ సల్బదోర్ దేశానికి ప్రయాణం.


రాత్రి భోజనానికి మార్కో యాష్ కూక్ మో (Yax K’uk’ Mo’) అన్న రెస్టరెంటు సిఫార్సు చేశాడు. ఆ పేరు కొపాన్‌లో మాయన్ నగరస్థాపకుడైన మొట్ట మొదటి ప్రభువు పేరట. రెస్టరెంట్ చక్కగా ఉంది కానీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి దోమలు నా రక్తం రుచి చూడాలని మహా ఆత్రపడ్డాయి. అది గమనించిన అక్కడి వెయిటర్ నన్నో పక్కకు తీసుకెళ్ళి కళ్ళు గట్టిగా మూసుకోమని చెప్పి ఒళ్ళంతా దోమల స్ప్రే కొట్టింది. ఆ మందు వాసన ఏమంత ఆహ్లాదకరంగా లేదు కానీ కనీసం నేను ప్రశాంతంగా భోజనం చెయ్యడానికి ఉపకరించింది. మళ్ళా మరో ప్లాతో తిపికో ఆర్డర్ చేసి దాన్ని స్థానికంగా దొరికే సల్వా వీదా అన్న బీరుతో మేళవించి భోజనసుఖం అనుభవించాను.

మర్నాటి ఉదయం మా డ్రైవరు ఫ్రాంక్లిన్ హోటలుకు వచ్చి నన్ను ఎల్ సల్బదోర్ దేశపు ఆంగ్వియాతు సరిహద్దు దగ్గర దింపడానికి తీసుకువెళ్ళాడు. కొపాన్ రుయినాస్ నుంచి అది 180 కిలోమీటర్లు. మధ్యలో ఎల్ ఫ్లొరీదో దగ్గర సరిహద్దు దాటి గ్వాతెమాల దేశపు భూభాగం లోకి వెళ్ళాలి. వెళ్ళి ఆంగ్వియాతు దగ్గర గ్వాతెమాల – ఎల్ సల్బదోర్ దేశాల మధ్యన ఉన్న సరిహద్దు దాటాలి.

ఊళ్ళోని రాతిపలకల రోడ్ల మీదగా బండిని నింపాదిగా నడిపాడు ఫ్రాంక్లిన్. సెంట్రల్ ప్లాజా చేరాం. ఒక్క పిట్ట జాడ లేదు. ఉదయసంధ్యాకాంతులలో ఆ ప్రదేశం ప్రశాంతంగా మనోహరంగా కనిపించింది. మాతోపాటు వచ్చి గ్వాతెమాలలో దిగిపోయే మరో ఇద్దరు స్థానిక పాసెంజర్లు మాతో చేరారు. వాళ్ళింకా నిద్రాదేవి ఒడిలోనే ఊగి తూగుతున్నారు. నేనూ ఫ్రాంక్లినూ మాటల్లో పడ్డాం. అతనికి ఇంగ్లిష్ బానే వచ్చు. ఎల్ సల్బదోర్ దేశం గురించి కొంత విలువైన సమాచారాం అందించాడు. సాంతా ఆనా (Santa Ana) నగరంలో తనకు తెలిసిన మనిషితో నాకు సంపర్కం ఏర్పరిచాడు.

కాసేపట్లోనే ఎల్ ఫ్లొరీదో సరిహద్దు దాటాం. ఓందూరాస్ దేశానికి ప్రేమపూర్వకమైన వీడ్కోలు చెప్పాను. ఉన్నది 24 గంటలే అయినా ఎంత చక్కని అనుభవాలు! మా మిగతా ప్రయాణమంతా గ్వాతెమాల భూభాగంలో సాగింది. ఆంగ్వియాతు సరిహద్దు చేరుకున్నాం. అక్కడ మళ్ళా గ్వాతెమాల దేశపు ఎక్సిట్ స్టాంప్ వేయించుకున్నాను. గత వారం రోజుల్లో నాకిది మూడో ఎక్సిట్ స్టాంపు. అంతా కలిసి నా పాస్‌పోర్ట్‌లో ఆ దేశానికి చెందిన ఆరు స్టాంపులు చేరాయి.

ఆంగ్వియాతు బార్డర్ దగ్గర ఉన్న ఎల్ సల్బదోర్ అధికారి నా పాస్‌పోర్ట్ తనిఖీ చేసి వెళ్ళడానికి అనుమతించాడు. అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారిని ఎంట్రీ స్టాంపు వెయ్యమని అడిగాను. గ్వాతెమాల, ఓందూరాస్ దేశాలనుంచి ప్రవేశించేవాళ్ళకి ఎంట్రీ స్టాంపు వెయ్యమని ఆమె ఖరాఖండిగా చెప్పింది. ఈ సంగతి తెలిసిన ఫ్రాంక్లిన్ అప్పటికే ‘ఆ బార్డర్ దగ్గర ఫొటో తీయించుకో. ఎల్ సల్బదోర్ దేశం వదిలి వెళ్ళేటపుడు ఆ ఆధారం నీకు ఉపయోగపడుతుంది’ అని సలహా ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారినే నాకో ఫొటో తీసిపెట్టమని అడిగాను. ఆ స్నేహశీలి సంతోషంగా ఒప్పుకుంది. ఇప్పుడు నేను ఎల్ సల్బదోర్ దేశం సరిహద్దులగుండానే లీగల్‌గా ప్రవేశించాను అని చెప్పడానికి ఆధారం దొరికిందన్నమాట!

నా కోరిక మేర ఆ ఆధికారి సాంతా ఆనా వెళ్ళే బస్సు ఎక్కడ ఆగుతుందో చూపించింది. అప్పుడే వచ్చి మెతపాన్ (Metapán) వెళుతున్న రంగులీనే బస్సు కనిపించింది. మెతపాన్ సాంతా ఆనా డిపార్ట్‌మెంటులో ఒక మునిసిపాలిటీ. ఇక్కడ యు.ఎస్. డాలరే వీరి కరెన్సీ. బస్సు టికెట్ 56 సెంట్లు. నా దగ్గర ఇరవై నోటుకన్నా చిన్నది లేదు… ఎలాగా అని ఆలోచిస్తోంటే ‘అదిగో ఆ షాపుకు వెళ్ళి ప్రయత్నించు. ఇప్పుడే కాకుండా నువ్వు సాంతా ఆనా బస్సు ఎక్కినప్పుడు కూడా చిల్లర అవసరం పడుతుంది అన్నాడు బస్సు డ్రైవరు. వెళ్ళి వేయించిన వేరుశెనగల పాకెట్ కొన్నాను. షాపతను చిల్లర ఇచ్చాడు. బస్సు బయలుదేరింది. అందులో నేనొక్కణ్ణే పాసింజర్ని!

తిరిగి చూసుకుంటే ఆ రోజు భలే ప్రత్యేకమైన రోజని స్ఫురించింది. మూడే మూడు గంటల్లో మూడు దేశాల్లో తిరుగాడానన్నమాట!

(సశేషం)