విశ్వమహిళానవల 23: తొలితరం నల్లజాతి రచయిత్రులు

విశ్వసాహిత్యంలో నల్లజాతి మహిళల నవలా రచన ఎప్పుడు ప్రారంభమైంది? అన్న విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూ, తొలి నవలను తేల్చలేకపోతున్నారు. ఆ ప్రయత్నాలు అలా కొనసాగుతూండగా (కనీసం నలుగురు మహిళలు 20వ శతాబ్దానికి పూర్వమే నవలలు రాసి వుంటారని ఇప్పుడు అనుకుంటున్నారు) ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన 19వ శతాబ్దిలోని ఇద్దరు నల్లజాతి మహిళల నవలలు వేర్వేరు కారణాలవల్ల ప్రాచుర్యం పొందలేదు. అవి పూర్తిగా కాలగర్భంలో కలిసిపోక ముందే, 20వ శతాబ్ది పరిశోధకులు కొందరు పూనుకుని ఉద్ధరించడం వల్ల ఇపుడు చర్చకు నోచుకుంటున్నాయి. అవి హేరియట్ విల్సన్ 1859 లో రాసిన అవర్ నిగ్, సారా ఫారో 1891లో ప్రచురించిన ట్రూ లవ్: ఎన్ ఇంగ్లీష్ డొమెస్టిక్ స్టోరీ. మొదటి నవలకు రచింపబడినప్పుడే ఆదరణ లభించలేదు. రెండో నవలకు అప్పుడు పాఠకాదరణ లభించినా, సాహిత్య చరిత్రలో స్థానం దక్కలేదు. దానికి కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక రచయిత తెల్లజాతివారి గురించి రాసినందుకు, మరో రచయిత్రి ఉత్తర అమెరికాలో కూడ నల్లజాతి వివక్ష ఉందని రాసినందుకూ ఒకరకంగా వెలివేతకు గురయ్యారు.

సేరా ఫారో

తెల్లవారి ప్రేమ కథ చెప్పిన నల్లజాతి రచయిత్రి సేరా ఫారో (Sarah E. Farro). ఇప్పటి రోజుల్లో దళితులు, దళితేతరుల గురించి రాసినా, తమ నవలల్లో, కథల్లో తమ జీవితాన్ని కాక, ఏ అగ్రవర్ణాల జీవితాలనో చిత్రించినా, మనం వింతగా చూస్తాం. అభ్యంతరాలు కూడ చెప్తాం. వాళ్ళు రాయాల్సిన పుస్తకం కాదంటాం. దళితేతరులు దళితులపై రాసినా అంగీకరించం. దాదాపు ఇదే సూత్రం అమెరికాలోని నల్లజాతీయులకూ వర్తిస్తుంది. ఎవరికి వారు వారి వారి జీవితాల గురించే రాసుకోవాలి; బాగా రాయగలరు; రాయడం వల్ల సాహిత్యానికి మేలు జరుగుతుంది అని ప్రపంచవ్యాప్తంగా అన్ని సాహిత్యసంస్కృతులూ నమ్ముతున్న అస్తిత్వ చింతన స్థిరపడిన రోజులివి. ఇది అమెరికా విమర్శాలోకంలో ఎప్పుడో మొదలైంది. అందుకే నల్లజాతీయురాలై, శ్వేతజాతి కుటుంబాల ప్రేమ కథను రాసిన ఒక 19వ శతాబ్ది రచయిత్రికి అమెరికన్ సాహిత్య విమర్శలో ఎక్కడా చోటు దొరకలేదు. ఆమెను పరిగణించదగ్గ రచయిత్రిగా ఎవరూ అనుకోలేదు. అటు నల్లజాతికి చెందిన రచయితలు, విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు ఆమె తమ గురించి రాయలేదు కనక ఆమెను పట్టించుకోలేదు; ఇటు శ్వేతజాతి రచయితలు, సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు ఆమె తమ జీవితాల గురించి కొత్తగా చెప్పింది ఏమీ లేదు కనక, ఆ పాటి ప్రేమకథలు తమ తెల్లజాతి రచయిత్రులే బోలెడుమంది రాసేశారు కనక, ఆమె నవలని చూడను కూడ చూడలేదు.

ఈ నేపథ్యంలో గ్రెచెన్ గెర్జీనా (Gretchen Gerzina) అనే ఒక ప్రొఫెసర్‌కు ఒక పరిశోధనా వ్యాసంగం జరుపుతున్న క్రమంలో సేరా ఇ. ఫారో అన్న పేరు కనిపించింది. మొట్టమొదటి నల్లజాతి నవలారచయిత్రి అని ఒక ప్రచురణకర్త ఆమెను పేర్కొన్నాడు. కానీ ఆమెకంటే ముందే మరో నల్లజాతి రచయిత్రి హేరియట్ విల్సన్ (Harriet Wilson) 1859లో అవర్ నిగ్ (Our Nig) అనే నవల రాసింది. అదే సంవత్సరం, హేరియట్ స్టో (Harriet Beecher Stowe) సుప్రసిద్ధమైన అంకుల్ టామ్స్ కేబిన్ రచించింది కూడా. అంటే తెల్లజాతి వారు కూడ నల్లజాతీయుల ఉద్యమంలో భాగస్వాములు కావడం, వారి గురించి రాయడం మొదలైంది. కానీ ఈమె స్వయంగా తన జాతిని గురించిన అనుభవాలు ఉన్నా, వాటిని గ్రంథస్తం చెయ్యక, ఒక సాధారణ ప్రేమగాథ రాసింది. అందుకే అమెరికన్ సాహిత్యచరిత్రలో కనుమరుగైపోయింది. సేరా చేసిన మరొక అపరాధం అమెరికాలో పుట్టి పెరిగి, తను ఎన్నడూ చూడని ఇంగ్లండ్ నేపథ్యంగా ప్రేమకథ రాయడం.

రచయితలు ఎలా రాయాలన్నది, ఏం రాయాలన్నది ఎవరూ శాసించే విషయం కాదు. కాకపోతే ఇలా రాస్తే బాగుండునని అనుకోవడంలో తప్పులేదు. కానీ సేరా ఫారో ఏ కారణం వల్లో తన జీవితం గురించి రాసుకోలేదు. దక్షిణ అమెరికాలో నల్లజాతీయుల బానిసత్వాన్ని గురించి, దానిపై జరుగుతున్న అంతర్యుద్ధం గురించి రాయలేదు. కేవలం ఒక నవల రాయాలన్న కోరికతో (బహుశా అమెరికా నేపథ్యంగా రాస్తే నల్లజాతీయుల బానిసత్వం గురించి రాయాల్సివస్తుందన్న భయంతోనేమో) ఇంగ్లండ్‌ను కథాస్థలి చేసుకుంది.

సేరా ఫారో జీవితం గురించి తెలుస్తున్నది చాలా తక్కువ. ఆమె 1859లో ఇల్లినాయి రాష్ట్రంలో జన్మించింది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు. ఆమె తల్లిదండ్రులు షికాగోలో స్థిరపడ్డారు. వారు బానిసత్వం, వివక్ష వంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్టు ఎక్కడా సమాచారమైతే లేదు. అలాగే ఆమెకు వివాహమైనదీ లేనిదీ ఎక్కడా వివరాలు లేవు. ఆమె రాసిన ఏకైక నవల True Love: A Story of English Domestic Life. 1891లో ఇది ప్రచురింపబడగానే పాఠకాదరణ పొందింది. ఆ తర్వాత ఆమె ఏమీ రాయలేదు. ఆమె బాగా చదువుకున్న మహిళ అని ప్రచురణ కర్తలు (Donohue & Henneberry) అన్నారే తప్ప ఆమె చదువు గురించి కూడ ఏమీ సమాచారం లేదు. ఇక మిగిలిందల్లా ఆమె రాసిన ఏకైక నవల గురించి.

ఇందులో కథ విలక్షణమైనదేమీ కాదు. ఒక తల్లి, కూతుళ్ళిద్దరిలో ఒకరి పట్ల పక్షపాతం చూపించి, రెండో కూతుర్ని తక్కువ చేసి చూడడంవల్ల కలిగే అనర్థాన్ని చక్కగా చిత్రించిన నవల ఇది. సాధారణంగా తల్లులకు అనారోగ్యంగా, బలహీనంగా ఉన్న పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందంటారు. ఈ నవలలో అర్భకంగా పుట్టిందని తల్లి అనుకునే మేరీ మీద ఎక్కువ దృష్టి పెట్టి చిన్న కూతురు జేనీని నిర్లక్ష్యం చేస్తుంది తల్లి. జేనీ మాత్రం తల్లిని, అక్కనూ సంతృప్తి పరచడమే జీవితపరమావధిగా భావిస్తుంది. జేనీని ధనికుడు, పెద్ద కుటుంబానికి చెందిన ఛాల్స్ టేలర్‌ ప్రేమిస్తూంటాడు. అయితే తల్లి, తన చిన్న కూతురికి అంత మంచి భర్త అయాచితంగా లభించడం నచ్చక, ఏవో అడ్డంకులు చెప్పి పెళ్ళి వాయిదా వేస్తూంటుంది. ఆ క్రమంలో మేరీకి తీవ్ర అనారోగ్యం కలుగుతుంది. వైద్యుడు అది అంటువ్యాధి అని, చిన్నకూతురిని ఆమె గదిలోకి పంపవద్దనీ చెప్పినా తల్లి వినక, జేనీ చేతే పెద్దమ్మాయికి సపర్యలు చేయిస్తుంది. ఛాల్స్ వ్యక్తిగతమైన పని మీద వేరే ఊరికెళ్ళినపుడు, ఒక టెలిగ్రామ్ వస్తుంది. ‘అమ్మాయి చనిపోయింది’ అని. అతను సహజంగానే మేరీ చనిపోయిందనుకుని ఊరికి రాగానే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అనారోగ్యంతో నెలరోజులుగా మంచం పట్టిన మేరీ బతికే ఉంది. ఆమెకు పరిచర్యలు చేసిన అతని ప్రియురాలు, జేనీ ఆ వ్యాధి సోకి రెండు రోజుల్లో చనిపోయింది. తల్లి మాత్రం నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయిన చిన్న కూతురి మరణం పట్ల దుఃఖించడానికి బదులు, తన ప్రియమైన కూతురు కోలుకున్నందుకు ఆనందిస్తూంటుంది. తన ప్రియురాలిది ఆమె తల్లి చేసిన హత్యగానే భావించిన ఛాల్స్ ఇక ఆ ఇంటికి వెళ్ళడు. క్రమంగా అతను ఆరోగ్యం కోల్పోయి మరణిస్తాడు. దీనికి సమాంతరంగా ఛాల్స్ చెల్లెలు మార్తా ప్రేమ కథ నడుస్తూంటుంది. అది కూడ ఎన్నో ఆటుపోట్లకు గురై చివరికి ఆమె, తన ప్రియుడిని వివాహం చేసుకోవడంతో సుఖాంతమవుతుంది. ఛాల్స్‌ది ట్రూలవ్ అని రచయిత భావించినట్టు కథలో ధ్వని. తన ప్రియురాలి మరణం నుంచి కోలుకోకపోవడం, అయినా తన వ్యాపారనిర్వహణ సక్రమంగా చేసి, చెల్లెళ్ళకు ఏ లోటూ లేకుండా అన్నీ సమకూర్చి, కేవలం మనోవ్యథతో మరణిస్తూ, దేవుడు తనను ఇంత త్వరగా కనికరించినందుకు ఆనందం వ్యక్తం చేయడం, మరణ సన్నివేశంలో ఎంతో ఊరటని ప్రకటించడం – ఛాల్స్ టేలర్‌ని ఒక విలక్షణ వ్యక్తిగా నిలబెట్టే అంశాలు.

ఈ నవలికలో (కేవలం 80 పుటల నవల) జేనీ, ఛాల్స్‌ల పాత్రలు ఆదర్శపాత్రలనే చెప్పాలి. తల్లికి చిన్నకూతురి మీద అంత అయిష్టత ఉండడానికి తగినంత కారణాన్ని చూపలేకపోయింది రచయిత్రి. కథనం, మాటలు చక్కగా అమరడం, పఠనీయత పుష్కలంగా ఉండడం, అనవసరమైన ఘట్టం గాని, వర్ణన గానీ ఎక్కడా లేకపోవడం రచనలోని మంచి లక్షణాలు. వస్తువులో నవ్యత లేదు. కానీ ‘మనిషి చేసిన తప్పును దిద్దుకోలేడన్న’ వాస్తవం అంతస్సూత్రంగా నడుస్తుంది. ఈ నవలను అప్పటి పాఠకులు ఇష్టంగా చదివారు. విమర్శకులు నవలలోని మంచిచెడ్డలను ఎత్తిచూపడానికి బదులు, అసలు ఆ నవలే లేనట్టు వ్యవహరించారు. ఈ నవలలోని లండన్ నగర చిత్రణ కూడా స్వయంగా రచయిత్రి చూసింది కాదు. ఆమె అభిమాన రచయితలైన ఛాల్స్ డికెన్స్, విలియమ్ థాకరేల రచనల నుంచి తీసుకున్నవే.

నవలలో ముఖ్యమైన అంశం – గతాన్ని మరచిపోలేకపోవడం మనిషికి శాపం అన్నది. ఛాల్స్ పాత్రలోని బలహీనత అదే. గతంలో మంచి చేయగలిగివుండీ చెయ్యలేకపోవడం – అక్కకు అంటువ్యాధి ఉందని తెలియగానే, ఆమెను పర్యవేక్షిస్తున్న డాక్టర్, జేనీని ఆ ఇంటి నుంచి తన ఇంటికి తీసుకెళ్ళమని ఛాల్స్‌కు చెప్తాడు. కానీ వివాహం కాకముందే ప్రియుడి ఇంట్లో ఆమె నివసించడానికి అతని అక్క ఒప్పుకోదు. కనక, జేనీ తన ఇంట్లోనే ఉండాల్సివస్తుంది. వ్యాధి సోకుతుందేమోనని తనకు భయంగా ఉన్నా, అమ్మను ఎదిరించలేక అక్క గదిలోనే కాపలా కూర్చుని, ఆమె చేసే మెలోడ్రామాని భరిస్తూ, ఆమె వ్యాధిని తను అంటించుకుంటుంది. ఛాల్స్ గనక ముందే అక్కతో కఠినంగా వ్యవహరించి, తన ప్రియురాలిని ఇంట్లో పెట్టుకునివుంటే జేనీ మరణించేది కాదు. ఆ అపరాధభావన ఛాల్స్‌ని క్రుంగదీస్తుంది. ఒక రకంగా జేనీ మృతికి తల్లి ఎంత కారణమో, తను కూడ పరోక్షంగా అంతే కారణం.

If we could foresee the end of a thing at its beginning, if we could buy a stock of experience at the outset of life, if we could, in fact, become endowed with the light of divine wisdom, what different men and women the world would see. But we cannot undo the past, it is ours with all its folly, its shortsightedness. Perhaps its guilt, though we stretch out our yearning and pitiful hands to Heaven in their movement of agony, though we wail out our bitter my Lord pardon me! heal me! help me! though we beat on our remorseful bosom and tear away its flesh piecemeal in bitter repentance. We cannot undo the past; we cannot undo it. (పేజీ 69).

అంటాడు జీవిత చరమాంకంలో. అంతే కాదు. ఇంత చిన్న వయసులో గుండెజబ్బు వచ్చినందుకు అక్క ఏడుస్తూంటే, ‘Death a misfortune! no, Mary, not for me’ అంటాడు అక్కతో. తన మరణం తనకు పెద్ద ఊరట అనుకుంటాడు.

ఈ నవలను గ్రెచెన్ తవ్వకాల్లోంచి వెలికి తీసిన తర్వాత మరి కొన్ని విషయాలు బయటపడ్డాయి. 1893లో షికాగోలో జరిగిన వరల్డ్ బుక్ ఫెయిర్‌లో ఇల్లినాయిలో జన్మించిన రచయితల పుస్తకాలను ప్రదర్శించినపుడు, ఈ నవలకు కూడ అందులో చోటు దొరికింది. సారా మరణించిన సంవత్సరం తెలియడం లేదు కానీ 1937లో తొలి తరం ఆఫ్రికన్ అమెరికన్ రచయితల సన్మానంలో ఆమెను కూడ సత్కరించినట్లు తెలుస్తోంది.

హేరియట్ విల్సన్

నల్లజాతి జీవితాన్నే రాసినా, విస్మరణకు గురయిన రచయిత్రి హేరియట్ విల్సన్.

అమెరికన్ విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు విస్మృతిలోకి నెట్టిన రెండో రచయిత్రి హేరియట్ విల్సన్ (Harriet E. Wilson) కూడ ఒకే నవల రాసింది దాని పేరు అవర్ నిగ్ (Our Nig: Sketches from the Life of a Free Black). 1859లో రచించిన ఈ నవలను అందరూ మరచిపోగా 1981లో ఆఫ్రికన్ అమెరికన్ విమర్శకుడు హెన్రీ లూయీ గేట్స్ జూనియర్ వెలికితీసి ప్రచురించాడు. ఈ నవల చేసుకున్న పాపం ఏమిటి? అన్నది చూడాలి. ఎందుకంటే సేరా ఫారోలా ఈమె తెల్లవారి ప్రేమకథ రాయలేదు. నల్లజాతి బానిసత్వం గురించే రాసింది. చాలావరకు ఇది ఆత్మకథాత్మక నవలే. నవలలో తన పేరును ఫ్రేడోగా మార్చింది. ఆ రోజుల్లో నల్లజాతీయులను సాధారణంగా ‘నిగ్’ అనేవారు (నీగ్రోలకు హ్రస్వరూపం). అదే నవలకు శీర్షికగా పెట్టుకుంది.

ఇక నవల కథలోకి వెళ్తే – ఫ్రేడో తల్లి మెగ్ స్మిత్ శ్వేతజాతీయురాలు. కానీ తండ్రి జిమ్ నల్లజాతీయుడు. వీళ్ళిద్దరిదీ ప్రేమవివాహమనడానికి లేదు. ఎందుకంటే మెగ్ తిండికి గతిలేక జిమ్ దయతో డబ్బు ఇస్తే బతికే స్థితిలో ఉంటుంది. ఆ దశలో ఒకరోజు జిమ్ ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా’ అని అడుగుతాడు. మెగ్ నిర్ఘాంతపోతుంది. అతను అప్పటిదాకా ఆమెతో తిరిగిన తెల్ల అబ్బాయిలను ప్రస్తావిస్తూ ‘నేను నిన్ను వాళ్ళ కంటే బాగా చూసుకుంటాను (Which you rather have, a black heart in a white skin, or a white heart in a black one?)’ అని అడుగుతాడు. అలా వాళ్ళ వివాహం జరుగుతుంది. వీళ్ళిద్దరి కాపురం బాగానే సాగుతుంది. వారికి పుట్టిన ఈ కథానాయిక ఫ్రేడో రెండు వర్ణాలూ కలగలిపిన వర్ణంలో (వీరిని మ్యూలటోలంటారు – Mulatto) అందంగా ఉంటుంది. క్షయవ్యాధితో జిమ్ మరణించే సమయానికి మెగ్‌తో మాట్లాడేవాళ్ళే లేరు. నల్లవాడిని వివాహం చేసుకున్నందుకు ఆమెను మిత్రులు వెలివేశారు. దానికితోడు సంతానం కూడ నల్లగానే పుట్టడం ఆమెకు పెద్ద శాపమైంది.

ఎందుకంటే మ్యూలటోలను ప్రధానంగా నల్ల జాతీయులుగానే పరిగణించేవారు. జిమ్ మరణం తర్వాత మెగ్, తనకు పరిచయం ఉన్న సెథ్ అనే శ్వేతజాతీయుడిని వివాహం చేసుకుంటుంది. అతని ప్రోద్బలంపై, ఫ్రేడోని ఆరేళ్ళ వయసులోనే, తన మిత్రులైన బెల్మంట్‌లనే శ్వేతజాతి దంపతులకు అప్పగించి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఫ్రేడోని బానిసకంటే హీనంగా చూస్తారు. ఇంటి యజమాని బెల్మంట్ దయాహృదయుడే. కానీ భార్యకు ఎదురు చెప్పే ధైర్యం లేదు ఆయనకు. అందుకే భార్య కంటపడకుండా పనిచేసుకో అని ఆ పసిపిల్లకు సలహా ఇస్తాడే తప్ప, ఆమె ఫ్రేడోని చావబాదుతూంటే అడ్డుకోడు. అయితే వాళ్ళ పిల్లల్లో జేమ్స్, జేన్, పిల్లల అత్త (బెల్మంట్ చెల్లెలు) ఆబీ మాత్రం ఆ అమ్మాయిపై జాలి చూపుతారు. పెద్దమ్మాయి మేరీ తల్లితో పాటు ఫ్రేడోను హింసిస్తూంటుంది. ఇంటెడు చాకిరీ చేయించడం, మాటిమాటికీ కొట్టడం, సరిగ్గా తిండి పెట్టకపోవడం – బానిసగానే ఫ్రేడో బాల్యం గడుస్తుంది.

జేమ్స్, జేన్ మాత్రం తమతో పాటు ఆ పిల్లను చర్చికి తీసుకువెళ్ళి, మనశ్శాంతి కలిగించాలని పూనుకుంటారు. మొత్తం మీద, వీళ్ళ ఆదరణ వల్ల ఎలాగో ఆ బానిసజీవితాన్ని నెట్టుకొస్తుంది. 18 ఏళ్ళు నిండాక, ఇక తను బెల్మంట్ కుటుంబంలో ఉండనవసరం లేదని తెలుసుకుని, బయటకు వెళ్ళిపోతుంది. జేమ్స్ పుణ్యమాని, ఒక విధమైన ఆధ్యాత్మిక జీవితానికి అలవాటుపడ్డంతో, ఫ్రేడో తన కష్టాలన్నిటినుంచి బయటపడుతుంది. జేమ్స్ చివరిఘడియల్లో, అతని పక్కన కూర్చుని, బైబిల్ చదివి వినిపిస్తుంది. అంటే మామూలుగా ఒక మతాధికారి మరణం ఆసన్నమైన వ్యక్తికి చేసే ప్రార్థన, ఇక్కడ ఫ్రేడో నిర్వహిస్తుంది. ఆ తర్వాత సామ్యూల్ అనే నల్లజాతీయుణ్ణి వివాహం చేసుకుంటుంది. వారికి ఒక కొడుకు పుడతాడు. కానీ అతను ఇంటి నుంచి వెళ్ళి, తిరిగిరాడు.

చిన్నప్పటినుంచి శరీరం అనేక రకాల చిత్ర హింసలకు గురైంది కనక, ఫ్రేడో ఆరోగ్యం కూడ అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ తనను, తన కుమారుడిని బతికించుకోవడం కోసం గడ్డితో చేసే టోపీల వ్యాపారం చేసి, ఆర్జన మొదలుపెడుతుంది. క్రమంగా వ్యాపారం వృద్ధి చేసుకుని నల్లజాతీయుల శిరోజాలను పరిరక్షించే సాధనాల పరిశ్రమ ప్రారంభిస్తుంది. సొంత కాళ్ళపై నిలబడి, ఎవరి అండను కోరకుండా, బతకడం నేర్చుకుంటుంది. ఈలోగా ఆమెను అనేక రకాల హింసలకూ గురిచేసిన బెల్మంట్ కుటుంబంలో దాదాపు అందరూ మరణించారని తెలుసుకుంటుంది. బతికివున్నవాళ్ళు కూడ ఆమెను పూర్తిగా మర్చిపోయారు. కానీ తను మాత్రం జీవితాంతం వాళ్ళను గుర్తుంచుకుంటుందని అనుకుంటుంది.

ఫ్రేడా వ్యక్తిత్వం : ఆరేళ్ళప్పుడే తండ్రి చనిపోయి, తల్లి చేత త్యజింపబడిన అమ్మాయి ఎటువంటి మానసిక స్థితిలో ఉంటుందో ఊహించగలం. దానికితోడు తన యజమానురాలు పెట్టే చిత్రహింసలు. ఆ ఇంట్లో చేయాల్సిన చాకిరీ. ఈ చీకటిలో ఒక కాంతిరేఖ ఏమిటంటే, యజమానురాలి పిల్లలు కొడుకు జేమ్స్, కూతరు జేన్ తన పట్ల స్నేహంగా ఉండడం. కానీ వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని విడిగా వెళ్ళిపోయాక పూర్తిగా మిసెస్ బెల్మంట్ దయాధర్మాలపై ఆధారపడాల్సివస్తుంది. యజమాని ఆ పిల్ల మీద దయతో ఒక కుక్కపిల్లని తెచ్చిస్తాడు. దాన్ని, తనకు చెప్పకుండా యజమానురాలు అమ్మేస్తుంది. అయితే భర్త మళ్ళీ ఆ కుక్కపిల్లను తీసుకువచ్చి, ఆ అమ్మాయికి ఆ తోడైనా ఉండనివ్వమని అంటాడు. ఇలా బాధలు పడుతున్నపుడు, చర్చికి వెళ్ళడం ఆమెకు ఒక ఉపశమనం. ఒకసారి అక్కడి పూజారిని అడుగుతుంది ‘నల్లవాళ్ళను స్వర్గంలో రానిస్తారా’ అని. వాళ్ళకు కూడ ప్రవేశం ఉంటుందని ఆయన చెప్పాక చాలా ఊరట చెందుతుంది. అప్పటినుంచి బైబిల్ చదవడం మొదలుపెడుతుంది.

అక్కడక్కడా ఆమెలోని తిరుగుబాటుతత్వం కూడ బయటపడుతూంటుంది. ఒకరోజు మిసెస్ బెల్మంట్, తను భోజనం పూర్తిచేసి, అదే ఎంగిలిపళ్ళాన్ని ఫ్రేడోకి ఇచ్చి ‘ఇందులోనే తిను. మళ్ళీ నీళ్ళు దండగ కడగడానికి’ అంటుంది. ఫ్రేడో అందరి ముందూ ఆ పళ్ళాన్ని తన కుక్కపిల్లకి ఇస్తుంది. కుక్కపిల్ల దాన్ని శుభ్రంగా నాకేస్తుంది. ఆ తర్వాత అదే పళ్ళెంలో అన్నం పెట్టుకుని తింటుంది ఫ్రేడా. డైనింగ్ టేబిల్ దగ్గర ఉన్నవాళ్ళంతా ఫకాల్న నవ్వుతారు. మిసెస్ బెల్మంట్‌కు విపరీతమైన కోపంవచ్చి, అతిథులు వెళ్ళాక, ఫ్రేడాను చావబాదుతుంది.

మరో సందర్భంలో కట్టెలు కొట్టి తెమ్మని ఫ్రేడాను అడవిలోకి పంపుతుంది మిసెస్ బెల్మంట్. తను కూడ పర్యవేక్షణకు ఆమె వెంటే బయల్దేరుతుంది. కట్టెలు కొట్టి మూట కట్టినపుడు ఒకటి కింద పడిపోతే, వెంటనే ఫ్రేడాను కొట్టడానికి కట్టెను పైకి ఎత్తుతుంది యజమానురాలు. ఫ్రేడా చెయ్యెత్తి ‘ఆగు. నా ఒంటి మీద దెబ్బ పడిందంటే నీ ఇంట్లో ఇక ఒక్క పనీ ముట్టుకోను’ అని అరుస్తుంది. యజమానురాలికి తొలిసారి ఆ పిల్లంటే కొంత బెదురు కలుగుతుంది. చెయ్యి దింపేస్తుంది. తను మొదట్నుంచీ ఇలా అనగలిగివుంటే ఎన్ని దెబ్బలు తప్పించుకోగలిగేది! అనుకుంటుంది ఫ్రేడా. కానీ ఇప్పుడు ధైర్యం రావడానికి కారణం, తనకు దాదాపు 18 ఏళ్ళు రావడం; యజమానురాలు ముసలిది కావడం. ఇక ఆ తర్వాతి నుంచి తిట్లు పడేవి కానీ, దెబ్బలు తగ్గిపోయాయి ఫ్రేడాకు. తను పడిన కష్టాలకు ఫ్రేడా ఎవర్నీ నిందించదు. ఎప్పటికప్పుడు మనసును సమాధానపరుచుకోవడం, తనకు ఎవరూ లేరు అన్న భావనతో ఒంటరిగా జీవించడానికి అవసరమైన ధైర్యాన్ని కూడగట్టుకోవడం, నిత్యం పనులు చేస్తూ, చర్చికి వెళ్తూ ఈ రెండిటిలో సాంత్వన పొందడం – ఇదే ఫ్రేడా ఎంచుకున్న జీవన శైలి. నవల చివరకి ఆమె కొడుకును పెంచుతూ ఎక్కడో ఉండే ఉంటుంది అని ముగిస్తుంది రచయిత్రి. ఆ పాత్ర తనేనని పాఠకులకు తెలిసిపోతున్నా, తను మాత్రం ఆ మాట చెప్పదు.

ఈ నవలలో నల్లజాతీయుల బానిసత్వాన్ని, వారు అన్ని రంగాల్లోనూ శ్వేతజాతీయుల నుంచి ఎదుర్కొన్న వివక్షను కఠోరంగానే వర్ణించింది హేరియట్. అయితే ఈ నవల ఎందుకు వివాదాస్పదమై, విస్మృతికి గురయింది? అంటే ఆమె ఎంచుకున్న కథాస్థలి. అప్పట్లో దక్షిణ అమెరికాలోనే నల్లజాతీయుల బానిసత్వం ఎక్కువగా ఉండేది. అక్కడి నుంచి వారు తప్పించుకుని, న్యూ యార్క్‌కూ, సమీప ప్రాంతాలకు చేరుకునేవారు. ఎందుకంటే అక్కడ నల్ల జాతీయులకు ‘స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు’ ఉంటాయని. ఫ్రేడా కూడ ఈ ‘స్వేచ్ఛా’ వాతావరణంలో పుట్టినదే. కానీ, బానిసత్వనిర్మూలన కోసం పోరాడుతున్నామని చెప్పుకునే ఉద్యమకారులు (Abolitionists) కూడా వ్యక్తిగత జీవితంలో నల్లవారిని వివక్షతోనే చూస్తారని ఈ నవల ప్రతిపాదిస్తుంది. న్యూ ఇంగ్లండ్ అంటేనే నల్లజాతి వారికి అనుకూలమైంది. ఎందుకంటే ఇక్కడే బానిసత్వ వ్యతిరేకపోరాటం ముమ్మరంగా సాగింది. అలాంటప్పుడు అక్కడకూడ అంతర్లీనంగా జాతి వివక్ష ఉందీ అంటే నమ్మడం పాఠకులకు, విమర్శకులకూ కూడ ఇష్టం లేదు. దక్షిణ అమెరికానుంచి అయితే తను ఉత్తర అమెరికాకి (న్యూ ఇంగ్లండ్‌కి) పారిపోగలదు. దానికి ఆమోదం ఉంది. కానీ న్యూ ఇంగ్లండ్ నుంచి పారిపోడానికి ఎవరూ సహకరించరు కూడా. హేరియట్ రచనలోని కీలకం ఇదే. సంస్కరణ ఉందీ అనుకున్న చోట కూడ లేదని చెప్పడమే ఆమె చేసిన అపరాధం. అందుకే ఈ నవల అప్పటివారికి నచ్చలేదు.

పై రెండు నవలలూ వందేళ్ళకు పైగానే మాయమైపోయాయి. ఇప్పుడు వాటి అధ్యయనాలూ, విశ్లేషణలూ జరుగుతున్నాయి. 19వ శతాబ్దిలో నవలారచన చేసిన మరి కొందరు మహిళల పేర్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పటికీ ‘తొలి నల్లజాతి నవలా రచయిత్రి ఎవరు?’ అనే చర్చ జరుగుతూనే ఉంది.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...