శరీరాల మధ్య
సంకోచ వ్యాకోచాలతో
గడిచిన తొలినాళ్ళ తర్వాత
మన్నూ మిన్నూ
ఏకమైన సుడిగాలి
పరవళ్ళు తొక్కే
చంచల జలధ్వానం
వేగానికి బీగం వేసి
రెక్కలు చాపుకుని
తేలే పక్షుల జంట
ఎవరి నీడ ఎవరిదో
కలస్వనంలో
పోల్చుకొలేని
జంటస్వరం
కాలం ఋతువుల షడ్జమం
కాలం నింగి చుక్కల గుంపు
కాలం వెలుగు పులుగుల మంద
కాలం చీకటి జీబూతం
కాలం ఏకాకి
మనో చాంచల్యాలు దాటి
విశీర్ణమై
దూరం విస్తీర్ణమై
చదరంగంలో చతికిలబడి
ఇప్పుడు
పక్క – రెండు దిక్కులు