రుబాయీలు

పరిచయము

అరబ్బీ, పారసీక కవిత్వములో ముఖ్యమైన ప్రక్రియలు నాలుగు: అవి గజల్, ఖసీదా, మస్నవీ, రుబాయి. చాలమందికి గజల్, రుబాయీలు పరిచయమే. వీటిలో ఒక పాదమును మిస్రా అంటారు; రెండు పాదములను శేర్ (సామాన్యముగా దీనిని షేర్ అని పలుకుతారు) అంటారు. రెండు శేర్‌లు ఒక రుబాయీ. అనగా రుబాయీ ఒక చతుష్పది. అరబ్ భాషలో అర్బా అంటే నాలుగు అని అర్థము. ఈ అర్బా అనే పదమునుండి రుబాయీ ఆవిర్భవించినది. రుబాయీని దోబైతి అని కూడ అంటారు. దోబైతి అంటే రెండు శేర్‌లు అని అర్థము.

రోదకీ (క్రీ.శ. 858-940) లేక రూదకీ అనే పారసీక కవి ఈ రుబాయీ ఛందమును కనుగొనెనని ఒక గాథ గలదు. ఇతడు ఒకప్పుడు విహారము చేస్తున్నప్పుడు పసి పిల్లలు గోలీలాడుకొనడము చూచినాడు. ఒక అబ్బాయి గోలిని గుంటలో వేసి తను వేశానని బడాయి చెప్పుకొంటూ ఈ వాక్యము పలికినాడట.

కల్తన్ కల్తన్ హమీరవద్ తా బొనె గోవ్ – దొర్లుతూ దొర్లుతూ అది గుంటవైపు వెళ్ళినది.

దీని గురులఘువుల అమరిక: UU UU IUIU U II U లేక UUU UIUI UUII U అని రోదకీ గుర్తుపట్టినాడు. ఆ లయతో రుబాయీ ఛందమును కనుగొన్నాడట. నిజమైన కవి అనే వాడు చిన్న పిల్లవాడైనను, పెద్దవారైనాను సరే వారి మాటలలోని నడకను గతిని గమనమును పరిశీలిస్తాడు. అదే అతని గొప్పదనము, అదే రోదకీ గొప్పదనము కూడ.

అరబ్బీ భాషలో కూడ ఇట్టిదొక వాక్యము గలదు, అది: లా హొవ్ల్ ఒ వ లా కొవ్వత్ ఒ ఎల్లా బె ల్లాహ్ – అల్లా లేక చలనము గాని శక్తి గాని ఉండదు.

దీని గురు లఘువుల అమరిక UUII UUII UUUU.

రుబాయీ ఛందములు

ఇప్పుడు చాలమంది లాక్షణికులు రుబాయీ ఛందమునకు మూలము హౙజ్ వర్గమునకు చెందినది అని భావిస్తారు. హౙజ్ వర్గము IUUU గణముపైన ఆధారపడినది. ఇందులోని మొదటి లఘువును తొలగించినప్పుడు మనకు UUU (మ-గణము) లభిస్తుంది. దీనిని పదేపదే ఉపయోగించి విభిన్న రుబాయీ ఛందములను కనుగొన్నారు.

  1. రుబాయీలు చతుష్పదులు. వీటికి ప్రతి పాదములో 20 లేక 21 మాత్రలు ఉంటాయి.
  2. మొట్ట మొదట పది గురువులను తీసికొందాము. త్రిక గణములుగా అవి: UUU UUU UUU U
  3. రుబాయీలో ప్రారంభములో రెండు గురువులు ఉండాలి. పాదాంతములో గురువు ఉండాలి.
  4. ప్రతి త్రిక గణములో మూడవ గురువుకు బదులు రెండు లఘువులను వాడవచ్చును. ఇందులో దేనినైనను వాడవచ్చును ఒక త్రిక గణపు స్థానములో. అప్పుడు మనకు లభించు అమరికలు.

    UUU UUU UUU U
    UUII UUII UUII U

  5. రెండవ గణపు స్థానములో మాత్రమే UIUI కూడ వాడవచ్చును. ముఖ్యముగా ఒక నియమమును గుర్తులో ఉంచుకోవాలి. రుబాయీలలో గాని, గజలులలో గాని రెండింటికన్న ఎక్కువ లఘువులు పక్కపక్కన ఉండవు. అనగా మనసు, వలపు వంటి నగణములైన పదములు నిషిద్ధములు. అప్పుడు మనకు దొఱికే అమరికలు:

    UUU UUU UUU U
    UUII UUII UUII U
    xxxx UIUI xxxx U

  6. మొదటి గణము, మూడవ గణము 2 విధములుగా, రెండవ గణము 3 విధములుగా సాధ్యము. కావున 2 x 3 x 2, అనగా 12 విధములుగా రుబాయీల ఛందములు సాధ్యము.
  7. ఈ పండ్రెండింటికి చివర ఒక లఘువును కూడ జత చేయవచ్చును. అప్పుడు మనకు 24 విధములైన రుబాయీ ఛందములు సాధ్యము. చివరి అక్షరములన్నియు దీర్ఘముతో కూడిన హలంతములైనప్పుడు, ఇట్టి అక్షరములలో హల్లును ఒక లఘువుగా పరిగణిస్తారు పారసీక ఉర్దూ భాషలలో; ఉదా. యాద్, బాద్, వాద్, ఇత్యాదులు. తెలుగులో పై అక్షరములను లేను, నేను అని వాడవచ్చును. అప్పుడు వీటికి ప్రతి పాదములో 21 మాత్రలు ఉంటాయి. వీటిని సామాన్యముగా గణవిభజనలో లఘువుగా పరిగణించరు.
  8. అంత్యప్రాసలు సామాన్యముగా aaba; aaaa కూడ అంగీకృతమే. aaaa అంత్యప్రాసను తరానా అంటారు. ఈ అంత్యప్రాస నియమము వలన అన్ని పాదములు గుర్వంతములు లేక లఘ్వంతములు. రెంటికి మిశ్రణము పొసగదు అని నా భావన.
  9. ఈ 12 విధములైన అమరికలు మొదటి పట్టికలో ఇవ్వబడినవి. ఇందులో మూడు వృత్తములు సంస్కృతములోని ఛందో గ్రంథములలో ఉన్నాయి. మిగిలిన తొమ్మిదింటిని నేను ఉదాహరణములతో కల్పించినాను.
  10. ఈ 12 విధములలో మూడు గురువులతో ప్రారంభమగునవి అఖ్రమ్ ఉపవర్గమునకు చెందినవి. రెండు గురువులతో ప్రార్రంభమగునవి అఖ్రబ్ ఉపవర్గమునకు చెందినవి.
  11. రుబాయీ ఒక జాతి లేక ఉపజాతి పద్యము. పైన చూపిన 12 అమరికలలో దేనినైనను లేక వాటి మిశ్రణమును పద్యములో వాడవచ్చును. పాదములు వేఱువేఱుగా ఉంటే, చివరి పాదము మాత్రము తక్కువ అక్షరములతో ఉండాలి. ఇలాటి నియమము తమిళ ఛందమైన వెణ్బాలో కూడ ఉన్నది.
  12. 12 విధములైన అమరికలు ఉన్నను, అందులో నాల్గింటిని మాత్రమే ఎక్కువగా వాడియున్నారు కవులు. అవి: 12 (బాష్ప), 6 (హేమాంగ), 11 (అభ్రభ్రమశీలా) మఱియు 7 (నిసర్గ). వీటి ఉపయోగము 95%.
  13. తెలుగులో రుబాయీలను నేను స్వతంత్రముగా వ్రాయునప్పుడు జాతి రూపములో (ప్రాస, యతి, అంత్యప్రాస) వ్రాస్తాను. అనువాదము చేయునప్పుడు వీలైనప్పుడు జాతి రూపములో లేనిచో ఉపజాతిగా (ప్రాస లేమి, యతి లేక ప్రాసయతి, అంత్యప్రాస) వ్రాస్తాను. ఒక్కొక్కప్పుడు యతిప్రాసలను పూర్తిగా వదలి అంత్యప్రాసను మాత్రమే గ్రహించినాను. ఇవి నేను పెట్టుకొన్న నియమములు మాత్రమే.
  14. పట్టికను సూక్ష్మముగా పరిశీలించినప్పుడు మనకు మఱియొక ఆశ్చర్యకరమైన విషయము గోచరిస్తుంది. అది 3, 6, 9, 12 అమరికలు కందపద్యపు సరి పాదములతో సరిపోతుంది. కంద పద్యపు సరిపాదమును 5x4x2x4x2 = 320 విధములుగా వ్రాయ వీలగును. వాటిలో నాలుగే పైన చెప్పిన 3, 6, 9, 12 అమరికలు.
  15. ముందే చెప్పినట్లు, ప్రతి పాదములో రుబాయీలలో 20 మాత్రలు ఉంటాయి. అవి 6-6-6-2 లేక 6-6-4-4 మాత్రలుగా విఱుగుతాయి. 20 మాత్రలు ఉన్నా కూడ అవి పంచమాత్రలుగా విఱుగవు. కాబట్టి వీటికి ఖండగతి లేదు. షణ్మాత్రల గతియే, అనగా రూపక తాళమునకు సరిపోతుంది, పాదాంత విరామముతో. ఆదితాళమును కూడ ఉంచవచ్చును.

రుబాయీ ఒక చతుష్పది. ఇందులో సామాన్యముగా 1, 2, 4 పాదములకు అంత్యప్రాస (రదీఫ్) ఉంటుంది. మూడవ పాదమునకు కూడ ఉంటే అది తరానా అవుతుంది. రుబాయిలో నాలుగవ పాదము ఒక ముగింపు (climax) వంటిది. మొదటి మూడు పాదములలో వివరించిన దానికి భిన్నముగా లేక అనుకూలముగా ఈ పాదము మకుటాయమానముగా ఉంటుంది. అందువల్లనే ఏమో మూడవ పాదమునకు అంత్యప్రాస ఐచ్ఛికము చేసినారు. అంతేకాక రుబాయీలు ముక్తకములు. ఒకదానితో మఱొకదానికి సంబంధము ఉండవలసిన అవసరము లేదు. పాదములలోని పదముల విఱుపులను గుఱించిన వివరణలు ఉన్నను, పాదములో విరామయతి (caesura) లేదనియే భావన. క్రింద పట్టికలో వివరించబడిన 12 ఛందములకు ఉదాహరణములను ఇచ్చినాను.

(1) పద్మావర్త:
ఆధారము: వాగ్వల్లభ
పద్మావర్త – మ/మ/మ/గ UU UU UU – UU UU 10 పంక్తి 1

సర్వంబై యుండంగా – సాధ్యంబౌనా
గర్వంబే తేరౌనా – గమ్యంబౌనా
యుర్విన్ నీచోచ్ఛంబుల్ – హోదాయేనా
మర్వంగా సర్వంబున్ – మద్యంబౌనా

పద్మాంబోధుల్ నిత్యం – బానందమ్మే
పద్మావర్తంబేగా – ప్రత్యూషమ్మే
పద్మాప్తుండే వచ్చెన్ – భాసాస్యుండై
పద్మమ్మీడెందమ్మే – భావాబ్జమ్మే

(2) మేఘధ్వనిపూర:
ఆధారము: వాగ్వల్లభ
మేఘధ్వనిపూర – త/య/మ/గగ UUII UUUU UUU 11 త్రిష్టుప్పు 13

త్రోవల్ కడు చీఁకట్లే – ప్రోవన్ రావే
దీవెల్ వెలిగించంగా – దేవీ రావే
రావా మృదు జీవాకా-రంబౌ పూవై
రావా నవ భావాకా-రంబై నీవే

మేఘాగమ మీనింగిన్ – మించెన్ మూడన్
మేఘధ్వనిపూరంబై – మించుల్ చూడన్
మేఘాంబువు లిచ్చెంగా – మేనిన్ బుల్కల్
మేఘమ్మగు నాదూతన్ – మీకై వేడన్

(3) మాధ్వి:
మాధ్వి – మ/ర/య/గగ UUU UIUI – UUUU 11 త్రిష్టుప్పు 81

అందమ్మే లోకమందు – నానందమ్మా
అందమ్మే డెందమందు – నావేశమ్మా
అందమ్మే భావమందు – నాందోళమ్మా
అందమ్మే దైవసృష్టి – నన్యాయమ్మా

ఓకాకీ నీలవర్ణ – మున్మేషమ్మే
కాకీ నారంగుకూడ – కల్మాషమ్మే
చీఁకట్లే లేని భూమి – చిత్రమ్మేగా
నాకో యీ మాధ్వి త్రాగు – నన్వేషమ్మే

(4) మాధురి:
మాధురి – మ/త/య/గగ UUU UUII – UUUU11 త్రిష్టుప్పు 97

ఆకాశంబందున్నది – యాతండేనా
నాకీలోకంబందున – నాలో నేనా
ప్రాకారంబందుండిన – ఱాతిన్ వాఁడా
నాకై యీపానమ్మున – నాకమ్మేనా

ఈనాఁడీ జీవమ్మున – నింపొందంగా
గానమ్మే నాడెందము – కంపిల్లంగా
ప్రాణమ్మే వాఁడిచ్చును – వర్ధిల్లంగా
పానమ్మే యీమాధురి – ప్రార్థించంగా

(5) మిత:
మిత – మ/మ/త/లగ UUU UUU – UUIIU 11 త్రిష్టుప్పు 769

ఉన్నావా వాసమ్మా – యూరేమిటియో
విన్నావా పిల్వన్ నీ – పేరేమిటియో
కన్నావా మమ్మిట్లీ – కష్టమ్ములతో
నెన్నాళ్ళీ జీవమ్మో – యింకేమిటియో

ఈరీతిన్ సాఁగంగా – నే యాచితమో
భారమ్మా యీభూమిన్ – బాధల్ మితమో
తీరమ్మే దూరమ్మా – దీవిం గనమో
సారమ్మే లేదా యా – సారా హితమో

(6) హేమాంగ:
హేమాంగ – త/జ/ర/మ UUII UIUI – UUUU 12 జగతి 173

ఇందుండు గులాబి పూవు – లెంతో యింపుల్
యిందుండు వసంత వాత – మెంతో యింపుల్
యిందుండు ప్రశాంతి చాల – హృద్యం బాహా
యిందుండు కళేబరాల – కేవా సొంపుల్

ఈపేటికలో యువాంగి-యే యందమ్మే
యీపేటికలోఁ గురూపి-యే మందమ్మే
యీపేటికలోని రాజు – హేమాంగుండే
యేపేటికలోన జూడ – నెమ్మే దుమ్మే

(7) నిసర్గ:
నిసర్గ – త/య/స/మ UUII UUII – UUUU 12 జగతి 205

గుండెల్ దిను పాషాలకు – గోరీలేనా
మండించెడు మారాజుల – మై యిందేనా
పండించిన కూలీలిట – బందీలేనా
నిండించుమ యీపాత్రను – నీతో నేనా

బంధించిరి నిన్నిచ్చట – వందించంగా
ముందుంచిరి పల్ కాన్కలఁ – బూజించంగా
నందాల నిసర్గమ్మున – నౌరా నీవే
ముందున్నది నాకేమిటొ – మోహించంగా

(8) పీయూష:
పీయూష – త/య/మ/స UUII UUU – UU IIU 12 జగతి 1549

దేవాలయమందే యో – దేవా గలవా
యీవిశ్వములో నీవే – యింపౌ కలవా
పూవుంగొని నాకీయన్ – ముండ్లే గలవా
నావైపునఁ జూడంగా – నవ్వంగలవా

పీయూషము నాకేలా – ప్రేమార్ద్రమూగా
నీయండను నుండంగా – స్నేహాంకముగా
నాయాశయు నీవేగా – నాలోన సదా
చేయూతగ రా, నీవా – చిద్రూపముగా

(9) సీత :
సీత – మ/ర/య/స UUU UIUI – UU IIU 12 జగతి 1617

రామయ్యా యిచ్చినాను-రా నాహృదిలో
యేమయ్యా మందు నీవె- యీనా వ్యధలో
ప్రేమమ్మే నాకు చాలు – ప్రీతిన్ వినుమా
నామమ్మే త్రాగుబోతు – నా యీకథలో

హిందోళమ్మయ్యె గుండె – హృష్టిన్ నయమై
సందేహమ్మేల నీకు – సాకీ ప్రియమై
చిందించంగాను రమ్ము – సీతన్ దయతో
నందమ్మీ డెందమందు – నాశామయమై
(సీత = మధువు)

(10) సూన:
సూన – మ/త/య/స UUU UUII – UU IIU 12 జగతి 1633

సూనమ్ముల్ వృక్షమ్ములఁ – జూడన్ వనిలో
గానమ్ముల్ రాగమ్ములఁ – గారెన్ జెవిలో
నానంద మ్మీయంగ న-యారే కవితల్
నేనుంటిన్ నిక్కమ్ముగ – నేఁడీ దివిలో

శ్రీరామా యంచున్ మనె – సీతమ్మ వనిన్
శ్రీరామా యం చానిలి – చేరంగ వనిన్
దూరమ్మం దా రాముఁడు – దుఃఖించెఁ గదా
వేఱేముండున్ నిండఁగఁ – బ్రేమ మ్మవనిన్

(11) అభ్రభ్రమశీలా:
ఆధారము: వాగ్వల్లభ
అభ్రభ్రమశీలా – త/య/స/భ/గ UUII UUII – UUIIU 13 అతిజగతి 3277

రాగమ్ముల నింపంగను – రాఁడేల కనన్
యోగమ్మున జేరంగను – నుంటిన్ దపనన్
భోగమ్మున కల్పద్రుమ – పుష్పమ్మగుదున్
నాగమ్ముల నే దాటెద – నావాని గనన్

ఆకాశములో – నందపు – రాకాశశిరా
నా కన్నుల నీ – నల్లని – యాకారమురా
నాకమ్మికపై – నా సఖ – నాకెందుకురా
రా కూరిమితో – హ్లాదము – నీకిచ్చెదరా
(ఈపద్యములో అక్షరసామ్య యతి, ప్రాసయతి రెండు ఉన్నాయి.)

(12) బాష్ప:
బాష్ప – త/జ/ర/భ/గ UUII UIUI – UUII U 13 అతిజగతి 3245

నీలమ్మగు నింగిలోన – నీకై వెదికా
నీలమ్మగు సంద్రమందు – నీకై వెదికా
నీలమ్మగు చుక్కఁ బిల్చి – నీకై యడిగా
నాలో ధ్వని యొండు చెప్ప – నన్నే వెదికా

పుష్పమ్ములు వందలాది – పూచెన్ వనిలో
పుష్పమ్ములు వందలాది – పూచెన్ మదిలో
పుష్పమ్ములు బాష్పమైనఁ – బుండుల్ విరులౌ
బాష్పమ్ముల పుష్పరాశి – వా(వాఁ)డున్ హృదిలో

ఆనందముగా – ననూహ్య – స్వానమ్ములతో
వేణూరవమై – వినూత్న – తానమ్ములతో
నీనాదములో – నెడంద – తానే మఱచున్
గానీ యతఁడే – కనండు – నేనీవెతతో
(ఈపద్యములో అక్షరసామ్య యతి, ప్రాసయతి రెండు ఉన్నాయి.)

రుబాయీ ఒక జాతి లేక ఉపజాతి ఛందమని ఇంతకు ముందే చెప్పియున్నాను. క్రింద ఒక ఉమర్ ఖయ్యామ్ రుబాయీ:

ఏదోస్త్ బియా తా ఘమ్మి ఫర్దా నఖురిమ్ (UUII UUII UUIIU)
విన్యక్ దమయి నక్ద్ రా ఘనీమత్ షుమురిమ్ (UUII UUII UUIIU)
ఫర్దా కి అజీన్ రూయి జమీన్ దర్ గుజరీమ్ (UUII UUII UUIIU)
బా హఫ్త్ హజార్ సాలగాన్ సర్ హసరీమ్ (UUII UUII UUIIU) – ఉమర్ ఖయ్యామ్, 21

ఉపజాతిగా నా స్వేచ్ఛానువాదము:
ఆనిన్న విచారమందు, – నానివ్వెఱతో
రేపేమగునో యెఱుంగఁ, – బ్రేమార్ద్రతతో
సాకీ మధుపాత్ర నింపు, – చారిత్రములో
భాగమ్మై యుందునేమొ – భావిన్ గతతో
(భావిన్ + కత)

దో దిల్ ఇక్ హోతో నఖ్లే జాన్ ఫల్తా హై (UUII UUU UUUU)
దిల్ గోద్ మేఁ హుస్న్-ఓ-ఇశ్క్ కీ పల్తా హై (UUII UUU UUUU)
సచ్ హై కే బర్కీ రోశ్నీ కీమానింద్ (UUU UUU UUUU)
దో తార్ సే జీస్త్ కా దియే జల్తా హై (UUII UUU UUUU) – అంజద్ హైదరాబాదీ

జాతిగా నా స్వేచ్ఛానువాదము:

రెండీ హృదయాలు చేరఁ – బ్రేమమ్ము గదా
మెండై చెలువమ్ము ప్రేమ – మేల్కాంచుఁ గదా
మండున్ దివె తంతి దాఁక – మావెల్గులతో
నిండై హృదయాలు తాఁక – స్నేహమ్ము సదా

తెలుగులో రుబాయీలు

తెలుగులో రుబాయీలు ఇటు పారసీక ఛందమునకు చెందినది కాదు, అటు మాత్రా ఛందస్సుకు చెందినది కూడ కాదు. నడక రీత్యా అది గేయ కవితకు వచన కవితకు నడుమ ఉన్నది. పారసీక, ఉర్దూ రూబాయీలకు తెలుగు రుబాయీలకు సామ్యము aaba రూపములో అంత్యప్రాస ఒక్కటే. దాశరథి దీనిని “కళిక” అని పిలిచినట్లున్నది. అదే విధముగా తెలుగు గౙలును కూడ వారు “మంజరి” లేక “వల్లరి” అని పిలిచినారు. కాని తఱువాతి కవులు ఈప్రక్రియలను రుబాయీ, గౙల్ అనియే పిలిచినారు. ఆమార్గములోనే సినారె, శేషేంద్ర మున్నగు కవులు కూడ సాగినారు. వీళ్ళందఱు సుప్రసిద్ధ కవులు కనుక ఈదారిలోనే నేడు గౙలులు, రుబాయీలు తెలుగులో వ్రాయబడుచున్నాయి.

వ్యక్తిగతముగా నా ఉద్దేశము ఇది: 60 సంవత్సరాలకుపైన ఈ ప్రక్రియలు తెలుగు భాషలో తప్పు దారిలో నడుస్తున్నాయి. ఇవి విదేశీ ఛందములు కావున తెలుగుకు సరిపోవు అని ఒక వాదము గలదు. గౙలు ఛందములైన మత్తకోకిల లయ, పంచచామరము, భుజంగప్రయాతము మున్నగునవి ఏవిధముగా విదేశీయములో నాకు బోధ పడలేదు. అదే విధముగా ఐదు చతుర్మాత్రలతో లేక మూడు షణ్మాత్రలు, ఒక గురువు ఏ విధముగా విదేశీయములో నాకు అర్థము కాలేదు. రుబాయీలలోని 12 ఛందములలో నాలుగు కందములోని సరిపాదములకు సరిపోతుందని ఇంతకు ముందే తెలిపియున్నాను. మఱి వేయి సంవత్సరాలుగా వాడబడే కందము ఎలా విదేశీయమో అన్నది కూడ విచారణీయమే. గౙలులు ఉర్దూ, హిందీ, గుజరాతి, మరాఠీ భాషలలో, రుబాయీలు ఉర్దూ హిందీ భాషలలో పైన వివరించబడిన ఛందోరూపములలోనే నేడు కూడ వ్రాయబడుచున్నవి. తెలుగులో ఉన్నవి నిజమైన గజలులు రుబాయీలు కావు, అవి నకిలీ ప్రక్రియలు. మచ్చునకు క్రింద కొన్ని తెలుగు రుబాయీలు:

మట్టి అంటిందని స్నానం చేస్తాం
పాపం అంటిందని దానం చేస్తాం
మనిషిని ఆఖరున తనలో దాచుకొనేది
మట్టి అనే మాటనే మరుస్తాం – దాశరథి

ఈదేశం నాబడి
హిమాలయం నాగుడి
కొండవాగునైపోతా
కోటి యేళ్ళ తరబడి – తిరుమల శ్రీనివాసాచార్య

గులాబి చెక్కిలిపై కురులాడుచున్నవి
పెదాలపై అరుణకాంతులు ఎగయుచున్నవి
నిషా కన్నులు తెరిచి నన్ను ఖుషీ చేయవే
సదా నీకు రుబాయీలు సలామన్నవి – దాశరథుల బాలయ్య

ఇక్కడ ఒక విషయమును మీకు చెప్పాలి. తెలుగు రుబాయీలలో కవిత్వము లేదని నేను చెప్పడము లేదు. వాటికి అసలు సిసలైన రుబాయీ లక్షణాలు లేవని మాత్రమే చెప్పుతున్నాను. వీటిని మఱొక పేరుతో పిలువవలయును అన్నది మాత్రమే నావాదన. అంత్యప్రాసలు aaba రీతిలో ఉన్నంత మాత్రాన అది రుబాయి కానేరదు. ఒక చతుష్పదికి 15 విధములైన అంత్యప్రాసలను కూర్చవచ్చునని నేను ఇంతకుముందే తెలిపినాను.

కొన్ని రుబాయీ అనువాదములు

ఆయీ హైఁ ఘటాయేఁ తూభీ ఆ యేసాకీ
మెహ్‌ఫిల్కో సే ఆహ్ మస్త్ బనా యేసాకీ
సాఘర్ కీ జరూరత్ అహీఁ హై మైఖ్వారోన్ కో
మస్తాన నిగాహోన్ సే పిలా ఏసాకీ – జోష్ మల్సి ఆనీ

ఈమేఘము లెల్లఁ గ్రమ్మె – నిందోసాకీ
రా, మమ్ముల మేలుగొల్ప – రమ్మోసాకీ
యామాధ్వికి నింక మాకు – నావశ్యమ్మా
నీమత్తుల దృష్టి వెల్గు – నింపున్ సాకీ

పర్రాన్ శాం సహర్ హుఏ జాతే హైఁ
అయ్యామ్ యహీఁ బసర్ హుఏ జాతే హైఁ
జబ్ సే హుఏ దూర్ హమ్ సే మర్‌నేవాలే
హమ్ ఉన్‌సే కరీబ్ తర్ హుఏ జాతే హైఁ – తిలోక్‌చంద్ మహ్రూమ్

సాయంత్రము లూషమ్ములు – సాగుం ద్వరగా
నాయుష్యము తగ్గున్ గద – యాహా కొఱగా
నీయుర్విని చావు కేమి – యెల్లల్ గలవా
పాయంగను మిత్రుల్ కరు-వౌ వైఖరిగా

యే హుకం ఖుదా కా కే ఖత్రా మైన్ కా న పీఊఁ
ఔర్ మర్జీ-ఏ-జానాన కే పైమాన పీఊఁ
తూ భీ హై అజీజ్-ఏ-ఖాతిర్ సాకీ భీ
హైరాన్ హూఁ కే ఫిర్ బాద పీఊఁ యా న పీఊఁ – మోమిన్ ఖాన్ మోమిన్

దైవమ్మనె నొక్క చుక్క – త్రాగన్ వలదోయ్
సాకీ యనెఁ ద్రాగుమంచు – సత్యమ్ముగనోయ్
సాకీ సఖి, దైవమ్మును – శ్లాఘింతును నేన్
పూరించుట కీసమస్య – ముందేమననోయ్

దునియా భీ అజబ్ సరై ఫానీ దేఖీ
హర్ చీజ్ యహాఁ కీ ఆనీ జానీ దేఖీ
జో ఆకే న జాఏ వహ్ బుర్హాపా దేఖా
జో జాకే న ఆఏ వహ్ జవానీ దేఖీ – మీర్ బాబర్ అలీ అనీస్

కానంగ సదా భూమియు – కల్లోలములో
నానంగను వచ్చి పోదు – రాక్షోభములో
నానందపు యౌవనమ్ము – కంతమ్ము గదా
యీనాముది కంతమ్మది – యేవిశ్వములో

క్యా ముఫ్త్ కా జాహిదోన్ నే ఇల్జామ్ లియా
తస్బీహ్ కే దానోన్ సే అబస్ కామ్ లియా
యే నామ్ తో వోహ్ హై జిసే భీ గినతీ లేఁ
క్యా లుతఫ్ గిన్ గిన్ కే తేరా నాం లియా – సయ్యద్ అలీ మొహమ్మద్

దామమ్ములతో జపమ్ము – దైవమ్మునకా
నామమ్ముల యంకె లెక్క – నైజమ్మునకా
ఈమానసమందు భక్తి – యింపారఁగ నా
స్వామిం దలువంగఁ జాలు – సార్థమ్ము సకా

దో దిల్ ఇక్ హోతో నఖ్లే జాన్ ఫల్తా హై
దిల్ గోద్ మేఁ హుస్న్-ఓ-ఇశ్క్ కీ పల్తా హై
సచ్ హై కే బర్కీ రోశ్నీ కీమానింద్
దో తార్ సే జీస్త్ కా దియే జల్తా హై – అంజద్ హైదరాబాదీ

రెండీ హృదయాలు చేరఁ – బ్రేమమ్ము గదా
మెండై చెలువమ్ము ప్రేమ – మేల్కాంచుఁ గదా
మండున్ దివె తంతి దాఁక – మావెల్గులతో
నిండై హృదయాలు తాఁక – స్నేహమ్ము సదా

ఆంఖే న ఖులీఁ వోహ్ కుం నిగాహీ న గయీ
వోహ్ కీన కషీ వోహ్ కీన ఖ్వాహీ న గయీ
పీరి నే తౌ బాహోన్ కో కియా ఆకే సఫేద్
అఫ్సోస్ మగర్ దిల్ కీ సాయా హీ న గయీ – షాద్ అజీమాబాదీ

హా సంకుచితమ్ము దృష్టి – యక్షిన్ గంతల్
ఈసుల్ మదముల్ డెందము – నెప్డున్ జింతల్
ఈశీర్షముపై వెంట్రుక – లెల్లన్ దెల్లల్
హా శ్యామల ముల్లంబున – నాశల్ వింతల్

అప్నా దేఖా హై ఔర్ పరాయా హం నే
సౌ బార్ హై సబ్కో ఆజ్మాయా హం నే
యే మేహర్బానీ కా హై జమనా సాథీ
బిగ్రీ కా కోయీ యార్ న పాయా హం నే – సూరజ్ నారాయణ్ మెహర్

వారల్ మనవారల్, పెఱ – వారల్ గనఁగా
నవ్వించుచు మాటాడుచు – నావారనఁగా
నందమ్మగు కాలమ్మున – నానందమెగా
కష్టమ్ములలోన రారు-గా రమ్మనఁగా

A Book of Verses underneath the Bough,
A Jug of Wine, A Loaf of Bread—and Thou
Beside me singing in the Wilderness—
Oh, Wilderness were Paradise enow! – Rubaiyat of Omar Khayyam, Tr. Edward Fitzgerald, 12.

పొత్తమ్మది చేతులందు – మోదమ్ము గదా
మత్తీనెడు మాధ్వి, పండ్ల – మైనిండెఁ గదా
నెత్తావుల నీవు నుండ – స్నేహార్ద్రముగా
నిత్తావొక యింద్రలోక – మీరోజు గదా

Yesterday This Day’s Madness did prepare;
Tomorrow’s Silence, Triumph, or Despair:
Drink! for you know not whence you came, nor why:
Drink! for you know not why you go, nor where. – Rubaiyat of Omar Khayyam, Tr. Edward Fitzgerald, 74.

ఆనిన్నయు నయ్యె నేఁడు – వ్యత్యస్తముతో
నీనేఁడగు రేపుగాను – నేరూపముతో
కానున్నది కాకుండునె – కడ్డాయముగా
నేనీమదిరన్ గ్రోలెద- నేస్తమ్ములతో

The wing of the bird of joyfulness beating I perceive;
Or is it the scent of the rosebud of longing I perceive?
Or is it the tale from Your lips the breeze is telling?
Anyway, it is truly a wonderful tale for telling, I perceive. – Love’s Perfect Gift, Hafiz, Tr., Paul Smith

మోదంపు పులుంగు ఱెక్క లాడించినదా
ఈకాంక్ష గులాబి తావి లాలించినదా
నీయా యధరాల గాథ గాలిన్ గలదా
యీగాథయు నద్భుతమ్మె యాలించఁ గదా
(యతి ప్రాసలు లేవు)

నేను వ్రాసిన కొన్ని రుబాయీలు

(1) ఈనన్నటఁ జేయుచుండ – నేమైనదియో
తానప్పుడు డస్సెనేమొ – తథ్యమ్మదియో
యానొప్పులఁ గైవడంకె – నాబమ్మకు, హా
నేనైతిఁ గురూపిగాను – నిప్పీమదియే

(2) ఆదూరపు బాటసారి – యర్థించంగా
బాధల్ పడు వానిఁ జూచి – పాన్పివ్వంగా
మోదమ్మున రాత్రి యుండి – పోయెన్గాదా
బాధల్ పడుచుంటి నేను – పాన్పివ్వంగా

(3) వేధించెడు నీవు గొప్ప – ప్రేమేశుఁడవై
నాదృష్టికిఁ గానరావు – నాకేశుఁడవై
మోదమ్ములులేక నీవు – భూమిన్ మనరా
ఓదేవా నారీతిగ – నున్మత్తుఁడవై

(4) అందమ్మగు నాసనమ్ము – లంతా నయమే
సందేహము లేదు యాత్ర – సాఁగున్ రయమే
సౌందర్యము లేదు బైట – సర్వం బభమే
వందే భారత్ ఎక్ష్ప్రెస్ – వహ్వా జయమే

(5) ప్రేమమ్మది యేమో యనఁ – బ్రేమించుటకే
నీమానసమందుఁ బ్రేమ – నిన్మించుటకే
కామమ్మది యొక్క లిప్త – కన్ముంచుటకే
ప్రేమమ్మొక దీపమ్మది – వెల్గించుటకే

(6) ప్రేమమ్మన జీవితమ్ము – ప్రేమించుటయే
ప్రేమమ్మన జీవితమ్ము – క్రీడించుటయే
ప్రేమమ్మొక రోజు కాదు – త్రేతాయుగమే
ప్రేమమ్మన నీవు నేను – రెండొక్కటియే

(7) ఓ పుష్పమ యేడ్వబోకె – యుత్తేజితమై
యేపుష్పమొ వాని జేరు – నేదో కతమై
యీపువ్వును మధ్యనుంచి – యేనల్లెదునే
నీపూవుల మాల నామె – కిత్తున్ హితమై

(8) ఆబమ్మయు సంచలించు – హస్తమ్ములతో
నీబొమ్మను జేసెనేమో – యీతప్పులతో
నోబమ్మయ నీదు వ్రాత – లొప్పై మనెనో
యీబొందికి నెన్ని యేఁడు – లీ మాధురితో

(9) శ్రీరాముని కారుణ్యము – చెల్వమ్మనఁగా
నారూఢిగ లోకులెల్ల – నౌరా యనఁగా
ధారాళముగా నీతులు – ధర్మమ్మునకై
నోరూరఁగఁ జెప్పుచుందు – నూరారనఁగా

కందముగా:
శ్రీరాముని కారుణ్యము
నారూఢిగ లోకులెల్ల – నౌరా యనఁగా
ధారాళముగా నీతులు
నోరూరఁగఁ జెప్పుచుందు – నూరారనఁగా

(10) సౌందర్యమె యామె సొమ్ము – చక్కందనమే
సౌందర్యము లేని యీమె – సాధారణమే
యందమ్ములు వారికింక – వ్యర్థమ్మేగా
ముందుండెను బూది యస్తి – ప్రోవై చిరమే

(11) ముక్కంటిది యావింటిని – మోయన్ లేరే
ఢిక్కంచును గుండె కొట్ట – ఢీలా కారే
చక్కంగను నారి వించ – శక్తుండేనా
స్రుక్కెన్ మది చొక్కెన్ హృది – సుద్దుల్ తేరే
(శివ ధనుర్భంగ సమయములో సీత తలఁపులు.)

(12) ఈవేళయు పండుగంచు – నృత్యమ్ములతో
దేవాలయమందుఁ జాల – దృశ్యమ్ములతో
నేవైపును జూడ భక్తు-లే స్తోత్రముతో
దేవుండును ద్రాగు నన్ను – దిట్టెన్ లలితో

(13) సూనమ్ముల వాఁడివ్వఁడు – సొంపై స్మరుఁడై
ప్రాణమ్మని ముద్దాడఁడు – ప్రాణేశ్వరుఁడై
గానమ్ములఁ దాఁబాడఁడు – కైగల్పి సదా
కానీ హృదినే దోచెను – కామేశ్వరుఁడై

(14) వస్తాడని నేదల్చితి – వాడెక్కడనో
ముస్తాబును జేసికొంటి – ముద్దివ్వడనో
సుస్తీయని కుస్తీయని – సోగ్గాడనెనే
నేస్తమ్మని చూడనింక – నేనెక్కడనో
(వ్యావహారిక శైలిలో)

(15) వాడెక్కడ పోయాడో – వార్తే లేదే
నేడిక్కడ నేనున్నా – నిద్రే రాదే
వాడెక్కడ తాగాడో – క్వార్టర్ బుడ్డీ
మూడయ్యెనె యీరేయీ – మోదం చేదే
(వ్యావహారిక శైలిలో)

ముగింపు

ఈవ్యాసములో నేను రుబాయీల ఛందోస్వరూపములను తెలిపినాను. చతుర్మాత్రలు లేక షణ్మాత్రలతో రుబాయి పద్యము సాగుతుంది. కేవలము అంత్యప్రాసలు ఉన్నంత మాత్రాన ఒక పద్యము రుబాయి కానేరదు. ఈ ఛందములలో కొన్ని సంస్కృత లక్షణ గ్రంథములలో కూడ ఉన్నాయి. రుబాయీ ఛందములలో మూడింటిలో ఒకటి కందపద్యముల సరి పాదములకు సరిపోతుంది. కావున ఈఛందములకు విదేశీయతను ఆపాదించుట సబబు కాదు. రుబాయీ ఛందములలో కొన్ని రుబాయీలకు స్వేచ్ఛానువాదము చేసినాను. స్వతంత్రముగా కొన్నిటిని రచించినాను. తెలుగు రుబాయీలు అని 60 సంవత్సరాలకుపైన ఈ ప్రక్రియ సరియైన మార్గములో సాగడము లేదు. ఈవ్యాసము బహుశా క్రొత్త బాటకు శంకుస్థాపన అవుతుందేమో అని ఆశిస్తున్నాను.


ఉపయుక్త గ్రంథసూచి

  1. Urdu Meter – Frances Pritchett and Khaliq Ahmad Khaliq
  2. The Metre of the Robaii – Masuud e Farzaad, Tehran, 1942.
  3. A Manual of Persian Prosody – Finn Thiesen, Otto Harrassowitz, Weisbaden, 1982.
  4. Masterpieces of Urdu Rubaiyat – K C Kanda, Sterling Paperback, 1995.
  5. తెలుగులో రుబాయి కవితా వైశిష్ట్యము – M ఫహ్మీద బేగం – శ్రీకృష్ణదేవరాయ స్నాతకోత్తర కేంద్రం – కర్నూలు, 2007.
  6. తెలుగు గజళ్ళు, రుబాయీలు – పెన్నా శివరామకృష్ణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2012.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...