ఈమాట పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గతసంచికతో ఈమాటకు పదిహేనేళ్ళు. ఇంతకాలం ఇలా ఈమాట మనుగడకి కారణమైన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు, సద్విమర్శా ప్రోత్సాహాల వల్లనే ఇది సాధ్యమయింది. ఇక ముందు కూడా మీ తోడ్పాటు, మీ ఆశీస్సులు ఈమాటకి ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాం. మారిపోతున్న సాహిత్య సామాజిక పరిస్థితులు, సాంకేతిక అవసరాల వల్ల, ఈమాటలో కూడా కొన్ని మార్పులు తప్పనిసరి అవుతున్నాయి. ఈమాట నిర్వహణలో మేము తరచూ తీసుకొనే నిర్ణయాలు కూడా ఇందులో భాగమే. ఈమాట రచయితలకు, పాఠకులకు వీలైనంత వరకూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఈ మార్పులని ప్రవేశపెట్టటానికి ప్రయత్నిస్తున్నాం. ఒక సామరస్య సాహిత్య వేదికగా ఈమాట కొనసాగడానికి మీ సహకారం కూడా ఎంతో అవసరం అని వేరేగా చెప్పనవసరం లేదు. ఇకనుంచీ ఈమాట పద్ధతులు, నియమాలలో కొన్ని మార్పులను మీ దృష్టికి తెస్తున్నాం. ముందుగా రెండు అభ్యర్థనలు:
- ఈమాటకు రచనలు పంపేవారు దయచేసి వీలైనంత వరకూ submissions@eemaata.com, లేదా editors@eemaata.com కు గానీ పంపమని కోరుతున్నాం. మీరు పంపే రచన సంపాదకులందరూ ఎలానూ పరిశీలించాలి కాబట్టీ అందరికీ ఒకేసారి అందిన రచనపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది.
- ఈమాటను కొత్త వర్డ్‌ప్రెస్ లోకి మార్చినప్పుడు తలెత్తిన సాంకేతికపరమైన ఇబ్బందులను తొలగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఫోన్స్, టాబ్లెట్స్ తదితర మొబైల్ పరికరాలలో ఈమాట చదవడానికి, అభిప్రాయాలు రాయడానికి వీలుగా చేయడానికి కూడా శ్రమ పడుతున్నాం. ఈ సమయంలో కొన్ని పాత రచనలు కనిపించకపోవడం, కొన్ని లింకులు పనిచేయకపోవడం లాంటివి మీకు ఎదురైనప్పుడు దయ చేసి మాకు వెంటనే తెలియజేయండి. ఈ అసౌకర్యానికి క్షంతవ్యులం.
1. రచనల సమీక్ష
ఈమాట సమీక్షాపద్ధతి గురించి మాకు తరచుగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. అందువల్ల మార్పులతో సహా మా సమీక్ష-ప్రచురణ పద్ధతి గురించి మరొక్కసారి వివరించడం అవసరం అవుతోంది.
ఈమాటకు వచ్చే రచనలను మొదట సంపాదకులు పరిశీలిస్తారు. ప్రచురణకు ప్రాథమికంగా ఒప్పుకోబడిన రచనలను సంపాదకులు సమీక్షించి రచనలో చేయవలసిన మార్పుచేర్పుల గురించి రచయితతో చర్చించి ఆ రచనను పరిష్కరించి ప్రచురణకు సిద్ధం చేస్తారు. ఒక రచన లక్షణాన్ని బట్టి అవసరం అనుకొన్నప్పుడు, లేదా తాము ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేనప్పుడు, సంపాదకులు ఆ రచనని ఇతర రచయితలు, కవులు, విమర్శకులకి పంపి వారి అభిప్రాయాల సహాయంతో ప్రచురణ, పరిష్కరణలపై తగిన నిర్ణయం తీసుకొని, వీలైనంత త్వరగా రచయితకు తెలియజేస్తారు.
చారిత్రిక, సైద్ధాంతిక, పరిశోధనాత్మక వ్యాసాలు ఆయా రంగాలలో అనుభవం ఉన్న వాళ్ళతో, వ్యాసంలో ఉటంకించిన ఆధారాల నిజ నిర్థారణ, తార్కిక గతివిధానాలపై ప్రత్యేక శ్రద్ధతో సమీక్షింపచేయటానికి ప్రయత్నిస్తాము. సమీక్షకుల ఇష్టానుసారం వారి పేరు గోప్యంగా ఉంచడమో లేదా అభ్యర్థించిన రచయితకు మాత్రమే తెలియజేయడమో, వారిద్దరూ ఒప్పుకుంటే ఆ సమీక్షకుల పేరును వ్యాసాంతంలో ప్రకటించడమో జరుగుతుంది. సమీక్షకుల అలభ్యం వల్లనో, ఇతరేతర కారణాల్ల వల్లనో ఆ రచనను సాధికారికమైన సమీక్షకు మేము పంపలేకపోతే ఆ విషయం రచయితకు ముందుగా తెలియపరుస్తాం. ఈ రకంగా సమీక్షకుడి పాత్రను పెంచడం, తద్వారా ప్రచురణానంతర చర్చలో వారు కూడా పాల్గొనడానికి ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం. అయితే ప్రచురణ నిర్ణయం అంతిమంగా సంపాదకులది కాబట్టి, సమీక్షకులపై ఆరోపణలకు ఆస్కారం ఉండదు. సాహిత్యవ్యాసాలను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దడానికి, ఆపైన మరింత చక్కటి చర్చ జరగడానికి ఈ పద్ధతి మరింత ఉపయోగపడగలదని మా అభిప్రాయం.
ప్రచురణకు తీసుకోబడిన రచనలను తగిన విధంగా మార్పులు చేసే అధికారం సంపాదకులకు ఉంటుంది. అయితే అలా మార్చబడిన రచన ప్రివ్యూ ముందుగా చూసి రచయిత ఒప్పుకున్న తరువాత మాత్రమే ఆ రచన ప్రచురించబడుతుంది. చేయవలసిన మార్పులు అని సంపాదకులు అనుకున్నవి రచయితలకి నచ్చకపోయినా, కొన్ని మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోయినా, ఒక రచన ప్రచురింపబడదు. అది రచయిత ఉపసంహరించుకోవడమో, మేము తిరస్కరించడమో జరుగుతుంది. ఏమార్పులు లేకుండా ప్రచురణకు తీసుకున్న రచనలకి సాధారణంగా ప్రివ్యూ పంపబడదు. ఒక రచన ప్రచురణకు ఒప్పుకోబడనప్పుడు సంపాదకులు ఆ నిర్ణయం క్లుప్తంగా రచయితకు తెలియజేస్తారు. అయితే తిరస్కరణకు కారణాలు వివరంగా తెలుసుకోగోరిన రచయితలు సంపాదకులను సంప్రదించవలసి ఉంటుంది.
2. అభిప్రాయ భేదాలు
సంపాదకుల నిర్ణయాలు అందరికీ అన్నివేళలా నచ్చకపోవచ్చును. అందరినీ, అన్నివేళలా సంతృప్తి పరచడం అసాధ్యం అని కదా వాడుక. అందువల్ల తమ రచనలు, అభిప్రాయాల ప్రచురణపై (లేదా తిరస్కరణపై) సంపాదకులుగా మేము తీసుకున్న నిర్ణయం మీకు ఆమోదం కానప్పుడు దయచేసి మమ్మల్ని నేరుగా సంప్రదించండి. ఏ సంకోచమూ లేకుండా మా కారణాలు వివరిస్తాం. మా వల్ల ఏదైనా తప్పు జరిగి మిమ్మల్ని మేము నొప్పించి ఉంటే ఆ తప్పు సరిదిద్దుకుంటాం, అవసరమైతే బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పుకుంటాం. ఐతే, అందుకు మాకు ఆస్కారం ఇవ్వాల్సింది మీరే, ముందు మాకు ఒక అవకాశం ఇవ్వడం ద్వారా.
ఇకనుంచీ ఈమాట ప్రస్తుత సంపాదకులు తాము తీసుకున్న నిర్ణయాల గురించి కేవలం అభియోక్తతో వ్యక్తిగతంగా చర్చిస్తారు తప్ప ఫేస్‌బుక్, జి+, బ్లాగులు, తదితర సోషల్ మీడియాలో ఏ రకంగానూ తమ నిర్ణయాల గురించి చర్చించరు, ఆ మీడియాలో తమపై మోపబడిన అభియోగాలకు సమాధానం ఇవ్వరు. ఈమాట స్నేహితులు, పూర్వ సంపాదకులు, శ్రేయోభిలాషులు ఆ చర్చలో పాల్గొన్నప్పటికీ, అది వారి వ్యక్తిగత స్థాయి లోనే కానీ ఈమాట ప్రతినిధులుగా అధికారిక హోదాలో కాదని గమనించమని మనవి.
3. పాఠకుల అభిప్రాయాలు
గత కొద్దికాలంగా మేము తరచుగా వింటున్న ఆరోపణలు ఈమాటలో రచనల పైన కాదు, పాఠకుల అభిప్రాయాల పైన! రచయితకు ఉపయోగపడేలా ఉండకపోగా పైపెచ్చు రచయిత పైనే గాక తన అభిప్రాయంతో విబేధించిన వారిపైన కూడా హేళన, వైయక్తిక నిందారోపణలతో నిండి ఉంటున్నాయని, ఆత్మాశ్రయ ధోరణి ప్రబలి, అభిప్రాయవేదిక కలుషితమై క్లుప్తత, ఔచిత్యం, సద్విమర్శ, సామరస్యత కొరవైనాయని, ఈ ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణలు ఏ ఒకరో ఇద్దరో చేసినవి కావు. వీటిలో నిజం లేకపోలేదు.
అందువల్ల, ఇకనుంచీ పాఠకుల అభిప్రాయాలు మరింత శ్రద్ధగా పరిశీలించబడతాయి. అభిప్రాయాలలో అభ్యంతరకరం అనిపించిన వాక్యాలు సంపాదకులు తీసివేస్తారు. ఆ సందర్భాలలో అభిప్రాయం పరిష్కరించబడిందని అందులోనే సూచిస్తారు. గత్యంతరం లేనప్పుడు అభిప్రాయం ప్రచురించబడదు కూడా. ఈ పర్యవేక్షణ వల్ల అభిప్రాయాలు ప్రచురించడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. అందుకు క్షంతవ్యులం. కానీ, ఈమాటలో అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఎవరికీ ఏ విధమైన సందేహం కానీ, జంకు కానీ ఉండకుండా చేయాల్సిన అవసరం వల్ల ఈ నిర్ణయం మాకు తప్పటం లేదు.
రచన మీద మీ మీ అభిప్రాయాలు దయచేసి క్లుప్తంగా, సూటిగా చెప్పండి. రచన ఎందుకో బాగుందో, ఎందుకు నచ్చలేదో చెప్పండి. కచ్చితమైన అభిప్రాయం దురుసుగా ఉండనక్కరలేదు. సున్నితంగా, మర్యాదగా చెప్పండి. బాగుంది, సూపర్, నచ్చింది, అదిరింది, కెవ్వు కేక, లాంటి ఒకటీ రెండు పదాల అభిప్రాయాలు లేదా వ్యాసపు నిడివితో సుదీర్ఘంగా రాసిన అభిప్రాయాలను కొంతవరకే ప్రచురిస్తాం. ఒక రచనమీద సుదీర్ఘమైన అభిప్రాయం వెలిబుచ్చదలచుకున్న పాఠకులు తమ స్పందనను వ్యాస రూపంలో తెలపమని మనవి.
ఈమాట ముఖ్య ఆశయం రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడం. ఆ ఆశయం నెరవేరాలంటే మీ అందరి సహకారం మాకెంతో అవసరం. దయచేసి మాకు ఈ ఆశయాన్ని సాఫల్యం చేయడంలో తోడ్పడమని మా సవినయమైన ప్రార్థన.
ఆఖరిగా మరొక్కసారి. ఏ పత్రిక మనుగడైనా ఆ పత్రికను ఆదరించే వారివల్లే ఉంటుంది. ఈమాట ఆశయాలు, ఆదర్శాలు, ఈమాట నియమావళి నచ్చి మాతో సహకరించి ఈమాటను ఇన్నేళ్ళుగా ప్రోత్సహించిన మీరు ఇలానే ఈమాటకు వెన్నుదన్నుగా నిలబడి ఈమాట ఇలా కొనసాగుతూ ఉండేలా ప్రోత్సహిస్తారని, మీ ఆదరాభిమానాలు ఈమాటకు ఎప్పుడూ ఉంటాయనీ, ఉండాలనీ ఆశిస్తున్నాం.
నమస్తే.