వలసరాజ్యములందు భారతీయ శిల్పకళ: 1. హైందవసామ్రాజ్యము

[తెలుగులో మొదటి కార్టూనిస్టుగా ప్రముఖులైన తలిశెట్టి రామారావుగారు భావ సంవత్సర వైశాఖమాసం (1934, ఏప్రిల్/మే) నుండి యువ సంవత్సర ఫాల్గునమాసం (1935, ఫిబ్రవరి/మార్చ్) వరకూ, వలసరాజ్యములందు భారతీయ శిల్పకళ పేరుతో రాసిన వ్యాసావళిని విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్ ఒక పుస్తకంగా పునర్ముద్రిస్తున్నారు. ఈ సందర్భంగా ఆవ్యాసాలలో మొదటి వ్యాసాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాము. ఈ వ్యాసంలో రచయిత కొన్ని వలస సామ్రాజ్యాలను గుర్తించి తరువాతి వ్యాసాలలో, ఒక్కొక్కదానిలో ఒక్కొక్క దేశపు శిల్పకళను గురించి సచిత్రసమేతంగా చర్చించారు. ఈ వ్యాసావళి పుస్తకం ప్రచురణ వివరాలు మాకు అందగానే ఇక్కడ తెలియజేస్తాము – సం.]

1. హైందవ సామ్రాజ్యము

క్రీ. శ. సుమా రెనిమిదవ శతాబ్దము వరకు భారతభూమి స్వతంత్రదేశముగ సకలైశ్వర్యముల కాలవాలమై యుండెను. తమ యసమానమైన నాగరికతను భారతపుత్రులు తురుష్కస్థానము, తిబెత్తు, చైనా, జపాను, చంపా (ఇప్పటి అన్నాము), కాంభోజము (కంబోడియా), శ్యామదేశము (సయ్యాము), బ్రహ్మదేశము (బర్మా=సువర్ణభూమి?), జావా (యవద్వీపము), సుమిత్ర, బలి, బార్నియొ, సింహళము మొదలగు దేశములకు గొనిపోయి, యాదేశజుల కాధ్యాత్మికజ్ఞానమును, మనోజ్ఞకళలను నేర్పి, వారియొక్క దైనిక జీవనమునందు వాంఛనీయములగు మార్పుల ననేకములను బ్రవేశబెట్టి, మన్ననలకు బాత్రులగుచుండిరి. హిందూ బౌద్ధమతములను బ్రచారము చేయుటకేకాక వాణిజ్యమునకు, రాజ్యస్థాపనకు గూడ నాకాలమున నిటుల మనవా రాదూరదేశములకు బోవుచుండిరి. మొదట హిందువులును, తరువాత నశోకుడు మొదలగు చక్రవర్తుల ప్రోత్సాహము వలన బౌద్ధులును బోవుటయు, వీరాదేశముల వార్తలను జెప్ప వినిన తరువాత రాజులును వెళ్ళుటయు సంభవించినటుల కానవచ్చును. మతప్రచారమునకై బౌద్ధులు వెళ్ళిరి కాని హిందువులు వెళ్ళుటకు వాణిజ్యము ముఖ్యమైన కారణమై యుండవలెను. ఆ ప్రాంతములతో పరిచయము కలిగిన పిమ్మట కొంద రచ్చటనే కాపుర మేర్పరుచుకొనుటయు కలిగినది.

ఆ కాలమున గాంధార (ఇప్పటి ఆఫ్ఘనిస్తాను నందలి యధికభాగము), కాశ్మీర, తురుష్కస్థాన (Asiatic Turkistan) ములు హైందవుల దేశములై యుండినవి. తిబెత్తు, చైనా, జపాను దేశము లప్పటి ప్రచారము వలన బౌద్ధ మతమును బూర్తిగా స్వీకరించినవి. చంపా, కాంభోజము, శ్యామదేశము, బ్రహ్మదేశము, యవద్వీపము, సుమిత్ర, బలి, బార్నియో మొదలగునవి హిందూ రాజుల పాలన క్రింద వెలయుచుండినవి. ఈ దేశములందు ప్రజలందరు కాకపోయినను అధికసంఖ్యాకులు హిందూమతమునో, బౌద్ధమతమునో స్వీకరించి యుండిరి.


హైందవసామ్రాజ్యము

చంపా, జావా మొదలగు దేశములను బాలించుచుండిన రాజులు హైందువులైనను, భారతదేశమును బాలించువారికి సామంతులై యుండలేదు. భారతీయ ప్రభువులు సైన్యములను గొనిపోయి యాదేశములను బలాత్కారముగ జయించినటుల నెచ్చటను నిదర్శనములు ప్రబలమైనవి కానరాలేదు. చైనా, జపానులందు వీరు రాజ్యాధికారము వహింపలేదు కనుకను, బౌద్ధమతవ్యాప్తికి మాత్రమచ్చటకు హిందూదేశపు చక్రవర్తులు ప్రచారకులను బంపుచు వచ్చుచుండిరి కనుకను నా దేశములందు రాజ్యములను స్థాపించుట కెట్టి యుద్ధములను మనవారు చేయలేదనుట నిశ్చయము. మతప్రచారమునకును, వాణిజ్యమునకును వలసపోయిన భారతీయులు పలుకుబడి కలిగించుకొనిన తరువాత చంపా మొదలగు ప్రాగ్దేశములను పూర్తిగ వశము చేసుకొనినటుల కానవచ్చును. ఇటుల సాధారణముగ జరుగుట చరిత్రప్రసిద్ధము.

ఆర్యులే యుత్తరధృవ ప్రాంతముల నుండియో, మధ్యఆసియా నుండియో, కాస్పియను సముద్రతీరము నుండియో భారతదేశమునకు వచ్చి, వింధ్యకుత్తరమున నుండు ప్రదేశములను ఆక్రమించిన పిమ్మట కొందరు దక్షిణాపథమునకును, మరికొందరు బర్మా, సయ్యాము, చంపా, జావా మొదలగు దేశములకు బోయిరనియు చెప్పుట కలదు. ఆర్యులు పరదేశముల నుండి రాలేదనియు, భారతదేశీయులే తూర్పుదేశమునకే గాక ఉత్తర, పశ్చిమదేశములకు బోయి తమ విజ్ఞానమును వెదజల్లిరనియు మరికొందరు చెప్పెదరు. ఈ సమస్య పరిష్కారమగుటకు కొంత కాలము పట్టును. నిజ మెటులున్నను, హిందూ దేశమునందు ప్రత్యేకముగ పెరిగిన విజ్ఞానచిహ్నములు ఆయాదేశములం దన్నిటియందును కనపడుచున్నవి. పండితులా దేశములను వెదకిచూచిన కొలది ఈ విషయమును గూర్చి యద్భుతమైన నిదర్శనములు కానవచ్చుచున్నవి. తత్కారణమున ముఖ్యముగ తూర్పుదేశములు హిందూ సామ్రాజ్యమునకు గౌరవమైన యంగములుగ నుండినవని చెప్పవచ్చును.

తొలుదొలుత భారతీయు లీతూర్పుదేశములకు నావల మీదను, భూమి మీదను ప్రయాణము చేసిరని చరిత్రకారుల పరిశోధనలు తెలుపుచున్నవి. అప్పటినుండియు భారతీయు లనేకు లెడతెగకుండ పోవుచుండిరి. సుమారు క్రీ.పూ. 500 (?) సంవత్సరముల కాలమునాడు చైనాప్రాంతముల నుండియు, తిబెత్తు నుండియు మంగోలుజాతివారు (?) వచ్చి కేంబోడియా, సయ్యాము మొదలగు దేశముల నాక్రమించి, నివాసము నేర్పరచుకొనిరి. వీరినిప్పుడు మాన్‌క్ష్మేరులు (Mon-khmers), మలయదేశీయులు (Malays) అని పిలుచుచున్నారు. ఆనాటికే హిందువు లచ్చట నుండిరో లేరో తెలియదు కాని కొలదికాలమునకే ఈనూతనముగ వచ్చినవారును హిందూవిజ్ఞానము యొక్క యాధిక్యమును స్వీకరించిరి.

ఆదియుగములందు వెడలిన భారతీయులు కాక మరల రాజ్యస్థాపనమునకును, విజ్ఞానప్రచారమునకును బోయిన, హిందువు లాదేశముల కెప్పుడు వెళ్ళుట ప్రారంభించిరో చెప్పుటకు చరిత్రాధారములు విశేషముగ లేవు. కాని యాదేశములందు ప్రజలిప్పటికిని చెప్పుకొను కథలు కొన్ని చాలకాలమునకు పూర్వమే భారతీయు లచ్చటికి వెళ్ళిరని సూచించుచున్నవి. గౌతమబుద్ధుడు జన్మింపక పూర్వము శాక్యవంశపురాజు కపిలవస్తు నుండి యొక సైన్యమును దెచ్చి బర్మా యందు రాజ్యమేర్పరచుకొని, ముప్పదియొక తరములవరకు పాలింపగలిగిన రాజ్యవంశమునకు మూలపురుషుడయ్యెననియు, ఆపిమ్మట గంగానదీ తీరప్రాంతముల నుండి క్షత్రియరాజొకడు వచ్చి, తొలి వంశపు శాక్యరాకుమార్తెను పెండ్లాడి క్రొత్త రాజ్యమును స్థాపించెననియు బర్మా దేశీయులు చెప్పుకొందురు. ఇంద్రప్రస్థపుర రాజైన ఆదిత్యవంశుడు కోక్‌త్లోక్ (Kok Thlok) అను దేశమునకు వచ్చి యాదేశపు రాజును చంపెననియు, ఒకనా డీత డిసుకతిన్నెలపై విహారము చేయుచుండ నాగకన్యకను జూచి మోహించెననియు, ఆమె తండ్రియగు నాగరాజు తనయల్లుని రాజ్యము నధికపరచుటకు జలము నంతను త్రాగవైచి యంతకుపూర్వము జలావృతమైయున్న ప్రదేశమును వాసయోగ్యముగ జేసెననియు, అదియే కాంభోజదేశమయ్యెననియు కాంభోజదేశీయులు చెప్పుకొందురు. ద్రోణుని కుమారుడగు అశ్వత్థామ వద్దనుండి యార్జించిన బల్లెమును కౌండిన్యుడను బ్రాహ్మణు డొకచోట బాతి యాదేశపు సోముడను నాగరాజుయొక్క కుమార్తెను బరిణయమాడి రాజ్యమును స్థాపించెనని మరి యొక కథ గలదు.

కై (Ki) అను దేశమున బుట్టిన హుయెన్‌టియెన్ (Houen-t’ien)న కొక దివ్యపురుషుడు బాణము నిచ్చి పడవమీద సముద్రయానము చేయుమని చెప్పినటుల కలవచ్చెననియు, మరుచటిదినమున నాతని కొక దేవాలయము చెంత విల్లు లభింపగా పడవ నెక్కి ఫూనాన్ (Fou-nan) అనుదేశమును జేరెననియు ఆ దేశపు రాణి యగు లియొయు-ఎ (Lieou-e) ఈతని నెదిరించి, పరాజితయై భార్య యయ్యెననియు చైనాగ్రంథములం దొకకథ కలదు. హుయెన్‌టియెన్ అనగా చైనా భాషయందు కౌండిన్యుడని యర్థము. కాంబోడియా రాజులు సోమకౌండిన్య వంశజులనియు, సోమవంశజులనియు, సూర్యవంశజులనియు చెప్పుకొనుట చరిత్రప్రసిద్ధము. కాన నీకథ లుత్త పుక్కిడిపురాణములు కావు. అనేకశతాబ్దముల క్రిందటనే భారతీయు లాదేశమున రాజు లైరనుట నిశ్చయము.

పైన పేర్కొనిన మాన్‌క్ష్మేరులు, మలయులు యున్నను (Yunnan) దేశమునుండి వచ్చిరట. అశోకుని మూడవ కుమారునకు తొమ్మండుగురు మనుమలుండిరనియు, వీరే నాంచో (Nan-chao) తిబెత్తు, చైన్, అన్నాము మొదలైన దేశీయుల యుద్భవమునకు కారకులనియు నొకకథ గలదు. యున్నను దేశపురాజులు మహారాజ బిరుదాంకితులై యుండిరి. తత్కారణమున నీతూర్పు దేశీయులందరు నాదినుండియు భారతీయులని చెప్పుట నిరాధారము కాదు.

టోలోమి (Ptolemy) రెండవ శతాబ్దమున నీదేశములను గూర్చి వ్రాయుచు సంస్కృతభవములైన యనేకపదములను వాడెను. వోకాన్హ (VO-Chanh) వద్ద దొరికిన క్రీ.త. రెండవశతాబ్దము నాటి శిలాశాసనము చక్కటి సంస్కృతభాషయందు కలదు. అప్పటికే యాదేశము హిందూరాజుల యేలుబడి క్రింద నుండెను. చంపా రాజ్యము క్రీ.త. 137వ సంవత్సరమున స్థాపింపబడెనని చైనా గ్రంథములవలన తెలియబడుచున్నది. శాక్యనృపు డొకడు క్రీ.త. 79వ సంవత్సరమున జావాకు వచ్చెనని చెప్పెదరు.

దొరికిన శాసనము లందుగల కాలమునుండియే యాదేశముయొక్క చరిత్ర ప్రారంభమైనటుల చెప్పుట మనవారి కొక వెర్రియలవాటైనది. రాజ్యమున సుస్థిరత యేర్పడిన తరువాత శాసనములు నిర్మితమగును. అంతకు పూర్వ మాదేశములకు బోవుట, యుద్ధములు చేయుట మొదలగునవి జరిగిన పిమ్మటనే రాజ్యము స్థాపితమగును. టోలోమి నాటికే సంస్కృతము చంపాయందు ప్రచారమున నుండెను. భారతీయులు మొదటనే చంపా జావాల వంటి దూరదేశములను జయింపగల యంతటి పెద్ద సైన్యములను పడవల మీద గొనిపోగల సౌకర్యము లానాడుండినవో లేవో తెలియదు. అటుల గానియెడల జీవనోపాధి కొరకో, వర్తకము కొరకో, మతప్రచారము కొరకో ప్రజలు క్రమేపి యాదేశములకు బోయి వాసమున కనువుగ నుండినందువలన యచ్చటనే కాపురము లేర్పరచుకొనిన పిమ్మట దేశముల కధిపతులు కాగలిగినంతటి బలము చేకూర్చుకొని యుండవలెను. ఇటుల జరుగుటకు కొన్ని వందల వేల సంవత్సరములు బట్టును. పైని వ్రాసిన కథలను బట్టి చూడ క్రీ.పూ. అనేక శతాబ్దముల నుండియు వలసపోవుట ప్రారంభమైనదని తోచుచున్నది. ఆదినుండియు నీ సంపర్కముండుట కడు సంభవము.

ఉత్తరహిందూదేశము నుండి, ముఖ్యముగా వంగదేశప్రాంతముల నుండి బర్మాలో కొన్ని భాగములకును, యున్ననునకును భారతీయులు భూమిపైని ప్రయాణము చేసి చేరుకొనినటుల గానవచ్చుచున్నది. కాని యా తూర్పుదేశములకు ముఖ్యముగ సముద్రయానము వలననే ప్రయాణము సాగుచుండెననుట కనేకములగు నిదర్శనములు కానవచ్చుచున్నవి.

గుజరాతుదేశపు రాకుమారుడొకడు జావా చేరుకొని యచ్చట రాజ్యమును స్థాపించెనని యొకకథ కలదు. అశోకుని వంశపు రాజు మగధనుండి పలాయనుడై దంతపురము వద్ద పడవనెక్కి మలయదేశమునకు చేరుకొనెనని యొకకథ కలదు. వోకాన్హ వద్ద దొరికిన శిలాశాసనములందలి యక్షరములు గిరినారు వద్ద దొరికిన రుద్రవర్ముని శిలాశాసనము యొక్క అక్షరములను బోలియున్నవి. ఈ కారణములవలన హిందూదేశపు పశ్చిమతీరమునుండి ప్రజ లాదేశములకు వలసపోయిరని యూహింపబడెను. కాని పరిశోధనా ఫలితము వలన నీ యూహ సరియైనది కాదని నిర్ణయమైనది.

మలయదేశపువారిని ఒరాంగుక్లింగులని పిలిచెదరు. ఈనామము వలన వీరు కళింగుల సంతతివారని తెలియుచున్నది. గూడూరు (కోడూరు) వద్ద నుండి ప్రజలు వలసపోవుచునుండిరని టోలోమి వ్రాసెను; బందరువద్దనుండిన మూడు(?) రేవుపట్టణముల వద్ద నావల నెక్కి పోవుచుండిరనుటకు నిదర్శనములు కలవు. ఆదేశపు చరిత్రలను బరిశీలించిన యెడల నృపుల యాచారము లీప్రాంతములవే యని తేలుచున్నది. అచ్చటి శాసనముల భాషవలనను, దొరికిన పురాతన వస్తువుల పోలిక వలనను, ఈ ప్రాంతముల సంపర్కము చాలాకాలము వరకునుండినటుల కానవచ్చుచున్నది. అచ్చటి శిల్పచిత్రములు, మధ్యహిందూదేశమున బెరిగిన గుప్తుల, దక్షిణమున బెరిగిన చాళుక్యుల రచనావిధనము ననుకరించియున్నవి. కనుక ఆంధ్ర, కళింగదేశములనుండి యధికసంఖ్యాకులిచ్చటికి బోవుచుండిరని చరిత్రకారులు నిర్ణయించిరి.