తరగతి గది కథలు

1. నేను నేనే అవుతా!

అది విజయనగరం జిల్లాలో చిన్న పిల్లల బడి. బళ్ళో పొద్దున్న పూట చేసే ప్రార్థన అయింది. నాలుగవ తరగతి పిల్లలు ఒక్క పరుగున తరగతి గదిలోకి వచ్చేశారు.

గురువుగారి తెలుగు తరగతి! అందుకే వాళ్ళకా ఆదుర్దా! సరదా!

అవును, ఆయనని వాళ్ళు గురువుగారనే అంటారు. టీచరుగారు, మాస్టరు గారూ అనరు. ఆయనే వాళ్ళకి అలా నేర్పించారు. రోజుకో గమ్మత్తు సంగతి గమ్మత్తు గమ్మత్తుగా చెపతారు. పాటలు కడతారు, వాళ్ళనీ పాటలు కట్టమంటారు. కథలు అల్లుతారు, వాళ్ళనీ కథలు అల్లమంటారు. కొత్త కొత్త మాటలు చెపతారు, మీరే అర్థం తెలుసుకోండి అంటారు.

ఆయనే అర్థాల పుస్తకం తరగతిలో పెట్టారు. వాళ్ళందరికీ అందులో మాటని ఎలా వెతుక్కోవాలో తెలిసిపోయింది. నిఘంటువు మాటలో ఘ సరిగా పలకడం అందరికీ వచ్చేసింది.

అసిరి “గురువుగారూ! అర్థాల పుస్తకం అనే అనొచ్చు కదా, గ, గ్గ అంటూ నేను పలకలేను” అన్నాడా, కాని వాడు ఆ మర్నాడు ఘ అని పలికేసి గురువుగారు కానుకగా ఇచ్చిన కలాన్ని ముద్దు పెట్టుకున్నాడు. అందరూ తప్పట్లు కొట్టారు. తప్పట్లూ అనొచ్చు! చప్పట్లూ అనొచ్చు!

పిల్లలు గురువుగారి కోసం ఎదురుచూస్తున్నారు; గురువుగారు తరగతి గదిలోకి రాగానే గభాలున లేచి నిల్చుని ‘నమస్తే’ అని అందరూ ఒకే గొంతుకతో చెప్పేరు.

“నేను పాట కట్టేను.” “నేనూ పాట కట్టేను.”

“నేను కొత్త కథ అల్లేను.” “నేనూ అల్లేను.”

“నేను రొండు బొమ్మలు గీసేను.” “నేనూ గీసేను.”

అందరికందరూ చెప్పడం మొదలుపెట్టేరు.

“సరే, సరే, చూస్తా, వింటా; వింటా; కాని తరువాత! ఇప్పుడు…”

“గురువుగారూ, పాఠంవొద్దూ, గమ్మత్తు కావాలి” అన్నారు పిల్లలు.

గమ్మత్తుల్తో తమాషాలు చెప్పేక వీళ్ళకి పాఠం చెప్పాలి. అవును, అలవాటైపోయింది వాళ్ళకి! అలవాటు చేసింది తనే! గురువుగారు లోలోపల నవ్వుకున్నారు. ఇవాళ ఆయన వేరే పనుల వల్ల ఏ తమాషానీ అనుకొని రాలేదు!

“ఇవాళ తమాషా, గమ్మత్తూ కాదు, పెద్దయాక మీరు ఎవరిలా అవాలనుకుంటున్నారో అది చెప్పాలి, సరేనా? నువ్వు మొదలు పెట్టు అప్పన్నా!” అన్నారు.

“నేనూ – నేనూ గురజాడ అప్పారావుగారిలా అవుతా! గేయాలు అల్లుతా.”

“నేను సంగీతం నేర్చుకుని ఫిడేలు నాయుడుగారిలా అవుతా!”

“నేనా, నేను చాసోని అవుతా; కథలు రాస్తా!”

“నేనేమో బొమ్మలు గీస్తా, అంట్యాకుల పైడిరాజుగారిలా అవుతా!”

ఇలా అందరూ నిల్చుని చెప్పుకుపోతున్నారు.

వాళ్ళకి వీళ్ళందరి గురించి గురువుగారు చెప్పేరు. వాళ్ళందరి చిత్రాలు తరగతి గది గోడలకి పెట్టేరు. పేరు గుర్తురాని కుర్రాడు గోడవేపు, చిత్రంవేపు చూసి పేరు చెప్పేడు.

అసిరి ఉలుకూ పలుకూ లేకుండా దిమ్మచెక్కలా కూచునే ఉన్నాడు!

“ఏరా! అసిరీ! నువ్వెవరిలా అవుతావు?” గురువుగారు అడిగేరు.

వాడు వెంటనే లేవలేదు; పిల్లలందరూ వాడివేపే చూస్తున్నారు.

“ఏరా?” గురువుగారు మళ్ళీ అడిగేరు!

అప్పుడు వాడు లేచి నిల్చున్నాడు. “నేను నేనే అవుతా, ఎవరిలాగా అవను”

“భేష్, బావుంది అసిరీ! నువ్వు నీలాగే అవాలి; అయితే ఎందులో అవుతావో చెప్పేవు కాదూ?”

“నాకు అన్నీ బాగున్నాయి; ఎందులో అవుతానో నాకూ తెలీదు.”

‘ఇంకొంచెం నువ్వు పెద్దవాలి; అప్పుడు తెలుస్తుందిలే!’ అని చెపుతూ గురువుగారు అందరికీ ఇలా బోధపరిచారు.

“అది సంగీతం అవనీ; పాటలు కట్టడం అవనీ; కథలు అల్లడం అవనీ; బొమ్మలు గియ్యడం అవనీ, మీరు ఆ పెద్దవాళ్ళ నేర్పరితనాలని అన్నిటినీ నేర్చేసుకొని, మీదే అయిన కొత్త నేర్పరితనాలని వాటికి జోడించి మీరు మీలాగే అవాలి! సరేనా?”

పిల్లలు “అలాగే గురువుగారూ!” ఒకే గొంతుతో అన్నారు.

గంట గణగణా మోగింది. పిల్లలు లెక్కల పుస్తకాలు తెరిచారు.

2. పేర్లు

ఆవేళ గురువుగారు తరగతి గదిలోకి వచ్చేసరికి నూకాలు ఏడుస్తోంది. పిల్లలందరూ దాని చుట్టూ గూడుకట్టి ఉన్నారు.

గురువుగారు రాగానే పిల్లలు తమతమ చోటుల్లోకి వెళ్ళి ‘నమస్తే గురువుగారూ’ అన్నారు. అయితే అందరికందరూ ఏడుపు మొహాలతోనే ఉన్నారు.

“ఏమర్రా, ఏమయిందీ; నూకాలూ ఏడుస్తున్నావెందుకూ!” అడిగేరు గురువుగారు.

వెక్కివెక్కి బెక్కులు బెక్కుతూ కన్నీళ్ళని మండలతో తుడుచుకుంటూ నిల్చుంది నూకాలు. ఎవరూ మాటాడలేదు. అసిరి మాత్రం నిల్చున్నాడు ఏదో చెప్పాలన్నట్టు!

గురువుగారు: అసిరీ చెప్పరా; నూకాలు ఎందుకేడుస్తోందీ!

అసిరి: గురువుగారూ, దానిపేరు బాగోలేదుట, నూకనూక, బియ్యం నూక, గోధుంనూక అని ఇంగ్లీషు బడి పిల్లలు వెక్కిరించారట, తన పేరు మార్చుకుంటుందట!

గురువుగారు గలగలా నవ్వేరు.

గురువుగారు: నూకాలూ నీ పేరుకేమీ! అమ్మవారి పేరని చెప్పలేకపోయావూ? ఇంగ్లీషు బడి పిల్లల పేర్లే ఎరువు తెచ్చుకున్న పేర్లు! నీ పేరు ఎంచక్కా మన తెలుగు పేరు. మీరెవరూ మీ పేర్లు మార్చుకోకండి!

బంగారి, పైడీ: వాళ్ళు వెక్కిరిస్తున్నారు కదండీ?

గురువుగారు: బంగారీ! పైడీ! నూకాల్ని చూసి మీరూ ఏడుపుమొహాలు పెట్టేరా! మీ పేర్లు గ్రామ దేవతల పేర్లు; గ్రామాన్ని కాపాడాలని వేపచెట్టు కింద ఒక్కో దేవతని ఒక్కో గ్రామంలో మన పూర్వీకులు పెట్టుకున్నారు. మీ పేర్లు మన సంస్కృతి నుండి వచ్చిన పేర్లర్రా!

అసిరి: మరి వాళ్ళు ఈ పేర్లు పెట్టుకోలేదేమండీ!

గురువుగారు: ఇప్పుడు మన గ్రామాలన్నీ పట్టణాల్లో కలిసిపోతున్నాయి. పట్టణ సంస్కృతి పరాయి సంస్కృతిని వొంట పట్టించుకుంది. అందుకే ఆ పిల్లలు నూకాల్ని వెక్కిరించారు.

పిల్లలు: అయితే మేమూ వాళ్ళని వెక్కిరిస్తాం.

గురువుగారు: మీరూ వాళ్ళని వెక్కిరించవచ్చు. అయితే అది మంచి సంస్కారం కాదు.

పిల్లలు: మరి మేం ఏం చెయ్యాలీ?

గురువుగారు: ఒక్క సంగతి మీరు గట్టిగా మనసులో పెట్టుకోవాలి. పేరులో ఏమీలేదు, ఇంగ్లీషులో రాసిన ప్రపంచ ప్రసిద్ధ కవి…

పిల్లలు: షేక్‍స్పియర్! షేక్‍స్పియర్!

గురువుగారు: గుర్తుంది కదా! పేరులో ఏముందీ, వాట్స్ ఇన్ ఎ నేమ్ అన్నాడు! గురజాడ పేరులోనేమి పెన్నిధి కలదు అన్నాడు. అవునా? మనం తెచ్చుకున్న పేరుతో మన పేరు గొప్పపేరు అవుతుంది! గొప్పవాళ్ళ పేర్లు పెట్టుకున్నా, షోకు షోకు పేరు పెట్టుకున్నా గొప్పవాళ్ళం అవం. గాంధీ, నెహ్రూ, గురజాడ, కలామ్ అని పేరు పెట్టుకుని ఏ మంచి పనీ చెయ్యకపోతే… పేర్లు పెట్టుకున్నవాళ్ళు నవ్వులపాలవుతారు! మనభాష అజంత భాష.

పిల్లలు: అవును అవును, అచ్చులు ప్రతిమాటకీ చివరని వస్తాయి. అందుకే తేనెలూరే తియ్యటి భాష అయింది.

గురువుగారు: అవును కదా, మనం మన తెలుగు పేర్లే పెట్టుకోవాలి. నాపేరు అప్పల కొండలరావు, నేను మార్చుకున్నానా, లేదు కదా!

పిల్లలు: లేదు లేదు.

గురువుగారు: ఏదీ నవ్వండి, అందరూ గట్టిగా!

పిల్లలందరూ తప్పట్లు కొడుతూ నవ్వేరు.

నూకాలు మొహం మతాబాలా వెలిగింది, గంట గణగణ మోగింది.

3. కూర్మి

గురువుగారు తరగతిగదిలోకి వచ్చేసరికి కూర్మి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.

గురువుగారు: ఏడుస్తున్నావెందుకురా?

కూర్మి: ఎక్కిరిస్తున్నాడండీ! (బెక్కుతూ వేలుతో చూపెడతాడు.)

గురువుగారు: ఎవరు? అసిరా? ఎందుకు వెక్కిరించాడూ?

కూర్మి: నాను ఊహూఁ నేను – ఏటీ – ఉహూఁ ఏమిటీ అన్లేదండీ, ఆడు – వాడు ఎక్కిరిస్తున్నాడు!

పిల్లలు గట్టిగా నవ్వడం మొదలు పెట్టేరు.

కూర్మి: సూడండి గురూగోరూ! ఎనా నవ్వుతున్నారో! తమరున్నా ఆళ్ళకి బయం పిసరంత నేదు!

గురువుగారు లోలోపల నవ్వుకున్నారు. పిల్లలకు ఆయనే అంత చనువు ఇచ్చారు. తనంటే వాళ్ళు భయపడకూడదు. గౌరవం ఉండాలి. వాళ్ళేమనుకున్నా, ఏం అడగాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా జడిసిపోగూడదు!

కూర్మి: నాను నాటువోణ్ణట! బళ్ళోకొచ్చినా నా బుర్రకేటీ ఎక్కనేదట!

పిల్లలు: నానూ, నానూ, ఆడూ, ఆడూ, ఏటీ, ఏటీ అంటూ గోల గోలగా నవ్వేరు.

గురువుగారికి విషయం అర్థం అయింది.

గురువుగారు: పిల్లలూ! నిశ్శబ్దం! నిశ్శబ్దం!

పిల్లలు ఠక్కని మూతిమీద చూపుడువేలు పెట్టుకొన్నారు.

గురువుగారు: నాటువోడు నాటువోడు అని వాణ్ణి వెక్కిరిస్తున్నారు కదా! నాటు అంటే అర్థం తెలుసా? మొదట్లో జనం గుంపులు, గుంపులుగా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి తిరుగుతూ బతికేవారు. తర్వాత తర్వాత వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్నారు. దాంతో ఒక్కొక్క గుంపు ఒక్కొక్కచోట స్థిరపడ్డారు. అంటే నాటుకుని స్థిరంగా ఎక్కడికీ వెళ్ళకుండా ఒక్క చోటే నిలిచి ఉన్నారు. ఊరు, నాడు, జనపదం, గ్రామం, నాటుపురం, పల్లి, పల్లెటూరు, ఇలా జనం నిలకడగా స్థిరపడ్డ చోట్లకి పేర్లు వచ్చాయి.

నాటుపురం అని తమిళ భాషలో అంటారు. మనం అందరమూ నాటునుండి వచ్చినవాళ్ళమే. నాటుబళ్ళమీద తిరుగుతూ పంటలు పండించుకుంటూ బతికినవాళ్ళమే. ఆ తర్వాత పల్లెలు బస్తీలుగా, పట్నాలుగా అయాయి. రానురాను నగరాలు అయ్యాయి. మహానగరాలు అయ్యాయి. నాటు భాష కూడా నాగరిక భాష అయింది.

పిల్లలు: మరి మాటలెలా మారిపోయాయీ?

గురువుగారు: భాష ఏరులాంటిది. పారుతూనే ఉంటుంది. మారుతూనే ఉంటుంది. ఏటీ కాస్తా ఏమిటి అయింది. ఆడు కాస్తావాడు అయింది. నాటు బళ్ళు వేరూ – పట్నం బళ్ళు వేరూ అయ్యాయి. ఒరే కూర్మీ, నువ్వే కాదు, వాళ్ళూ నాటు వోళ్ళే! నేనూ నాటు వోణ్ణే! (నవ్వేరు.)

పిల్లలు: మాకు మరీ – మంచి మాటలు చెప్పి అవే మాటాడమంటున్నారు కదాండీ!

గురువుగారు: అన్నీ మంచిమాటలే! మారిన మాటలని, మారుతున్న మాటల్నీ, కొత్త మాటలని అన్నిటినీ నేర్చుకుంటూ ఉండాలి. పాతమాటలూ వినసొంపైనవే, ఈమాటలూ వినసొంపైనవే!

అసిరి: గురువుగారూ! గూడెం అని కూడా అంటారు కదండీ?

గురువుగారు: అవును. మాబాగా గుర్తు చేసేవు. గూడెం అచ్చ తెలుగు మాట. కొండ పల్లంలో ఉన్న పల్లెని గూడెం అనేవారు.

బంగారి: మా పిన్నీవాళ్ళు విజయనగరంలో చిన్నిపల్లివీధిలో ఉన్నారు. ఆ వీధిలో వీధికి దిగువగా గూడెం ఉంది!

గురువుగారు: దిగువగా అంటే పల్లంలోనే కదా మరి! అంటే విజయనగరం ఇంకా పట్నం కానప్పుడు అదో చిన్నపల్లి అయి ఉంటుందమ్మా! వీధి పేరు చిన్నిపల్లి అయి గూడెం, గూడెంగానే ఉండిపోయిందన్నమాట! అన్నట్టు ఆ వీధిలో చాసోగారి ఇల్లు ఉండేది.

అసిరి: బొండుమల్లెలు కథ రాసినాయనేకదండీ?

పైడి: ఇప్పుడు ఆ ఇల్లు లేదా?

గురువుగారు: పాతదైపోయి పడిపోయింది.

పిల్లలు: అయ్యో! గురజాడగారి చారిత్రక గృహానికి వెళ్ళి చూసినట్టు చాసోగారి ఇల్లూ వెళ్ళి చూసే వాళ్ళమే!!

గురువుగారు: ఇప్పుడే చెప్పానుగా! కాలంతో పాటు అన్నీ పోతూ ఉంటాయి. మారిపోతూ ఉంటాయి!

పిల్లలు: చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రదేశాలు, గొప్ప రచయితల ఇళ్ళూ ఉంచుకోవాలి కదండీ!

గురువుగారు: ఉంచుకోవాలి. అటువంటి వాటిని అన్నిటినీ నిలుపుకోవాలని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు!

పైడి: గురువుగారూ! మరేం, కూర్మి మాటాడుతున్నప్పుడు ఆలకిస్తే మాకు కిసకిసా నవ్వొస్తాది.

పిల్లలు: అవునండీ! మా అందరికీ నవ్వొస్తోందండీ,

గురువుగారు: కూర్మి అన్నీ నాటుమాటలే మాటాడితే నవ్వురాదు. వాడు మీ అందరిలా మాటాడాలని అదోమాట, ఇదోమాట కలిపి మాటాడుతున్నాడు. అందుకని మీకు నవ్వొస్తోంది! నాటుమాటలు మాటాడితే అన్నీ – మొత్తం – ఆ మాటలే మాటాడాలి. మారిపోయిన మాటలు – నాగరికపు మాటలు మాటాడితే అన్నీ అవే మాటాడాలి. కలగాపులగంగా మాట్లాడకూడదు. అదోమాట, ఇదోమాట కలిపితే పంటికింద రాయి పడ్డట్టు వింటున్న చెవిగూబకి ఫట్‌మని తగుల్తుంది. అబ్బా అని చెవి మూసుకుంటారు. నవ్వూ ఒస్తుంది. రాసేటప్పుడు కూడా అంతా కొత్త మాటలు రాసి మధ్యలో ఆడూ ఈడూ అని రాయకూడదు. కథ రాసినా, కవిత రాసినా, ఏది రాసినా కలగాపులగంగా రాయకూడదు.

బంగారి: మా అయ్య అనాగే కుసింత దాన్నీ కుసింత దీన్నీ మాటాడతాడు కలిపేసేసి!

గురువుగారు: పల్లెటూరివాళ్ళు పట్నంవాళ్ళుగా పూర్తిగా అయిపోతే, చదువుకునేవాళ్ళు పెరిగితే నాటుభాష పోతుంది. అయితే దాన్నీ మనం మన సంపదగా నిలబెట్టుకోవాలి. చారిత్రక ప్రదేశాల్లాగానే!

కూర్మి: అనాసెప్పండి ఈళ్ళకి! నవ్వీడం ఏటీ?

గురువుగారు: సరేరా! ఇప్పుడు అందరికీ తెలిసిందిగా! అవునూ, నీ పేరు కూర్మికదా! అంటే అర్థం ఏమిట్రా?

కూర్మి: నాకు తెల్దు.

గురువుగారు: పిల్లలూ! మీకెవరికన్నా తెలుసా?

పిల్లలు: తెలీదండి తెలీదండి.

గురువుగారు: కూరిమి అంటే చెలిమి. అంటే నేస్తరికం, స్నేహం. వాడి పేరు ఎంత మంచిపేరో చూశారా? కూరిమి, కూరిమి అనగా అనగా అది కాస్తా కూర్మి అయిపోయింది.

పిల్లలు: కూరిమి, కూరిమి, కూర్మి, కూర్మి!

గురువుగారు: మీరందరూ ఒకరికొకరు నేస్తాలే! అంతా కూరిమితో ఉండాలి. స్నేహంగా ఉండాలి. వాడు మీ చెలిమికాడు! వెక్కిరించుకోకూడదు.

పిల్లలు: అలాగే గురువుగారూ!

కూర్మి: అనాగేనండీ! శానా ఎరికయినాది ఈ దినాము!

గంట గణగణ మోగింది.