ప్రపంచం గత యాభయ్యేళ్ళలోనే మనం ఎన్నడూ ఊహించనంతగా మారింది. ఆ మార్పులకు తగ్గట్టు ప్రపంచమంతా తనను తాను దిద్దుకుంటోంది కానీ తెలుగునాట పిల్లల పెంపకం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఒక కుటుంబంగానో సమాజంగానో ఇన్నేళ్ళుగా మనం ప్రతిపాదించుకున్న విలువలకీ సంప్రదాయాలకీ గండికొడుతూ కొత్త నీరు మన వైపు ఉధృతంగా దూకుతున్నప్పుడు, దానిని అడ్డుకోలేక, తమవని చెప్పబడుతున్న ఏ విలువలనూ బలంగా నిలుపుకోలేక ఈ కాలపు పిల్లలు నలిబిలి అవుతున్నారు. ప్రత్యేకించి బాల్యం నుండి కౌమారంలోకి ఎదిగే కాలం ఎంతో సంక్లిష్టమైనది. ఆ వయసులో వారి మనసుల్లో శరీరాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. కొత్త కొత్త ఆలోచనలూ ఇష్టాలూ కలుగుతాయి. మేధోపరమైన కొత్త ఊహలు, కుతూహలాలు ఏర్పడతాయి. మానసిక అవసరాలు, శారీరక ఆకర్షణలు అర్థమవుతాయి. ప్రపంచపు రంగులు ఒక్కొక్కటిగా గోచరమవుతాయి. ఈ మానసిక శారీరక ఆవరణలను, ఊహాప్రపంచాలను, సమాజపు పోకడలను ఏకకాలంలో అర్థం చేసుకోవడానికి వాళ్ళెంతో సంఘర్షణకు లోనవుతారు. ఆ సంఘర్షణను దాటే మార్గాలను వాళ్ళకు సూచించకుండా వాళ్ళ నుండి ఒక ఆదర్శవంతమైన ప్రవర్తననూ జీవితాన్నీ ఆశించడం సరికాదు. ఏదో ఒక ఊతాన్ని ఆధారంగా చేసుకుని, ఆ సంఘర్షణను దాటుకుని, తమవైన విలువలను, ఆదర్శాలను, ఆకాంక్షలనూ స్వేచ్చగా ఏర్పరచుకోవడానికి అనువైన వాతావరణం ఏర్పరచగలగాలి. అందుకు తోడ్పడగలిగినది ఒక్క సాహిత్యం మాత్రమే. పేరుకైనా బాలసాహిత్యం ఎంతో కొంత తెలుగులో ఉంది కాని, యంగ్ అడల్ట్ లిటరేచర్ అనబడే కౌమార సాహిత్యం అనేది పూర్తిగా మృగ్యం. ఎందుకంటే పిల్లలు-పెద్దలు అనే రెండే ప్రాయాలు మనకు. ఈ రెంటి మధ్య ఉండే కౌమార్యప్రాయపు ముఖ్యతను మనం ఎప్పుడూ గుర్తించలేదు. ఎందుకంటే తెలుగునాట అది అత్యంత విలువైన కాలం. ఎంట్రన్సులకి సన్నద్ధమయ్యే కాలం. మార్కులతో రాంకులని, రాంకులతో జీవితాన్ని మెలిపెట్టి ఉక్కిరిబిక్కిరి చేసే కాలం. ఈ చదువు, ఉద్యోగం అనే తిరగలిరాళ్ళ మధ్య పిల్లల కౌమార్యం నలిగి ఉనికి కోల్పోతుంది. తమ మనసులో భావాలు పంచుకోవడానికి, కనీసం తమ ఆలోచనలకు ఊహలకు స్పష్టత నిచ్చుకోడానికీ వారికి సమయమూ ఉండదు, ప్రోత్సాహం అంతకంటే ఉండదు. అందువల్లే కదా, ఆ వయసులో పిల్లలు తప్పులు చేసేది? సామాజికము, వైయక్తికము, నైతికమూ అయిన విలువలు వారికి ఎలా కట్టుబడతాయి? ప్రేమ, శృంగారం, నడత, బాధ్యత వంటి వాటి గురించి వారికి తెలుగు సినిమాలు, టి.వి.ల వెకిలితనం ద్వారా తప్ప తెలిసే మార్గం ఇంకేమిటి? సంస్కృతి, ధర్మం, మర్యాద అంటూ వారిని కట్టుబాటు చేయడం తప్ప మన పెంపకాల్లో ఇంకేం మిగిలింది? ఆ వయసులో వారికి ఆ వయసు సాహిత్యం కావాలి. వారి మనసుల్లో జరిగే సంఘర్షణలకు అక్షరరూపం కావాలి. వారికి వ్యక్తిత్వం పట్ల స్పష్టతనిచ్చే కథలు కావాలి. తప్పులు, దిద్దుబాట్లు విప్పి చెప్పి ఓదార్పునూ భరోసాను ఇచ్చి, వాళ్ళ జీవితాన్ని పట్టి చూపిస్తూ కూడా తీర్పులకు తెగబడే తెంపరితనం లేని సాహిత్యం కావాలి. దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజంలో పిల్లలు సోషల్ మీడియాలో పెరుగుతున్నారు. బాల్యం నుంచి నేరుగా యవ్వనంలోకి దూకుతున్నారు. వ్యక్తిత్వాలు రూపుదిద్దుకునే కౌమారాన్ని ఇంకాస్త మెలకువతో గమనించుకోవడానికి, ఆ జీవితాన్ని అక్షరబద్ధం చేయడమొక అవసరం. ఆ వయసు వాళ్ళని వాళ్ళ కథలు నిస్సంకోచంగా, నిర్భయంగా చెప్పుకోనివ్వాలి. కథలు, నవలల పోటీలు, ప్రోత్సాహాలు కావల్సింది జీవితం మీద అభిప్రాయాలు ఏర్పడిన రచయితలకంటే ముఖ్యంగా అవి ఏర్పడబోతున్న తరానికి.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
డిసెంబర్ 2022 సంచికలో ...
- Janaki’s Zen
- Physics and Sex: A Conversation
- Poems on M/other: మూడు కవితలు
- అక్షయం
- అదృశ్య సముద్రం మీద వేట
- అనామకం
- అవస్థ
- ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14
- ఇద్దరు కవయిత్రులు – రెండు అభివ్యక్తులు
- ఊహల ఊట 19
- ఊహలకందని మొరాకో -2
- గడినుడి – 74
- జనులా పుత్రుని కనుగొని
- డిసెంబర్ 2022
- నువు
- మ్యాజిక్
- యూట్యూబ్లో ఈమాట: గతనెలలో
- వంద కుర్చీలు 2
- వాడు
- విశ్వమహిళానవల 20: కేట్ షొపేన్
- సోల్జర్ చెప్పిన కథలు: జాకో రాఖే