వాడు-
తెల్లవారుజాము కలలా, నిశ్చలమైన నదిపై తేటనీటిలా
మండుటెండలో నిశ్శబ్దంగా కదిలే చెట్టు చిగురుటాకులా
ఆకాశంలో నిదానంగా తేలియాడుతున్న పక్షిలా
నా ముందు కదలాడేవాడు.
వాడు-
కొబ్బరికాయలోని తీయటి నీటిలా
తాటికాయలోని తెల్లని ముంజలా
మొగలి పొదలోని లేత మొవ్వులా
నన్ను మృదువుగా స్పృశించేవాడు.
వాడు-
నేను ముడ్డి కడిగితే పరిమళించినవాడు
మూతి తుడిస్తే మురిపెపంగా నవ్వినవాడు
నా అడుగుల్లో తపతప అడుగులేసి,
కిలకిలమని ఇంద్రధనస్సులను ఇంటి గుమ్మానికి కట్టినవాడు.
చిందిన స్వేదంలో నుండి నేను తీయని పండును కాయించి
అపురూపంగా వాడి నోటికి అందిస్తూనే వున్నా
రెపరెపలాడుతున్న వాడి కోర్కెల సుడిగాలికి
నా రెక్కలు అడ్డమేసి కాపుగాస్తూనే వున్నా
పగలూ రాత్రీ ఎగిరి ఎగిరి అలసి సొలసి
నేనేదో నోటకరుచుకొచ్చేసరికల్లా-
హఠాత్తుగా
నా భుజాలు దాటి ఎదిగిపోయి…
అలసిన నా రెక్కల్ని చిర్నవ్వుతో నిమురుతూ, వాడు.
నేను సంతోషంలో మునిగి తేలుతుండగానే-
నాకు తెలియని సంగీతాన్ని కొత్త రాగంలో వినిపించి
వాడి లోకపు పొలిమేరల్లో వదిలేసి మాయమయ్యాడు, అంతే.
పిల్లలు చేసే మ్యాజిక్‌లో టోపీలు, కుందేళ్ళే కాదు…
చివరికి పెద్దలూ మాయమైపోతారు.