అన్ని నక్షత్రాలనూ దాటుకుని
ఆ కల మళ్ళీ వస్తుంది.
ఎదురు చూడని ఏ రాత్రిలోనో
కాస్తంత వెన్నెలని
కొంగున కట్టి పోతుంది.ఊహలకు మల్లే
కుంచెలూ, రంగులూ
మేళవించే మెళకువలు
ఏవీ అనుమతించని కల
నిద్ర ముఖం మీద
చల్లటి చిలకరింపై
తనకు తానుగా
అలంకరించుకు వస్తుంది.హద్దులకో పద్దులకో భయపడి
ఏ మలుపుల్లోనో
నాటకుండానే వదిలేసిన ఆశల విత్తుల్ని
ఆ నిరభ్యంతరపు క్షణాల్లో
నిర్భయంగా చూపిస్తుందివాడిన దండ తీసేసినా
కురులను వీడని మల్లెల వాసనలా
రాత్రి వాడిపోయినా
ఆ కల
నన్ను చుట్టుకునే ఉంటుంది.నావి కాలేకపోతున్న క్షణాలతో
నేను పడుతున్న ప్రయాసలో
చెమటని తుడిచే
చిరుగాలై వస్తుంది.
బలవంతపు సంతకాలలో
బరువు దించే నిట్టూర్పై వస్తుంది.అవును. అన్ని నక్షత్రాలనూ దాటుకుని
నిద్ర సిగలో వికసించడానికి
ఆ కల మళ్ళీ వస్తుంది.