కొన్ని నూతనచ్ఛందోరీతులు

నా కావ్యరచనాప్రస్థానంలో అశ్రుమాల అనే నాతొలి (ఖండ)కావ్యరచన పూర్తిగా మాత్రాఛందస్సులో సాగింది. దాని తర్వాత వ్రాసిన హనుమప్పనాయకుడు అనే ఆఱాశ్వాల కావ్యంలో మొదటి ఐదున్నర ఆశ్వాసాలు ప్రధానంగా మాత్రాఛందస్సులలోను, జాత్యుపజాతులలోను సాగినవి. యుద్ధము, వీరరసప్రధానమైన ఘట్టములు గల తరువాతి భాగాలు ప్రధానముగా అక్షరగణబద్ధవృత్తములలో సాగినవి. పిదప వ్రాసిన ఋతుసంహారం, మహాశిల్పి జక్కన చరిత్రము, కవితాస్రవంతి, పుష్బబాణవిలాసము అనే కావ్యాలలో వృత్తాలు, జాత్యుపజాతి పద్యాలే ఉన్నవి. తరువాతి వాణి నారాణి, బిల్హణీయం అనే రెండు పద్యనాటికలు ప్రధానంగా వృత్తాలు, జాత్యుపజాతులు, యథావసరంగా మాత్రాఛందస్సులలో వ్రాయడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెంచి ఇటాలియను ఆపెరా ఇతివృత్తములను భారతసంస్కృతికి అన్వయించుకొనుచు అనుసృజించిన గేయరూపకములైన 8 ఆపెరాలలో, మాత్రాచ్ఛందస్సులు ప్రధానముగాను, వృత్తములు తక్కువగాను ఉన్నవి.

మొత్తానికి ఆదినుండి మాత్రా చ్ఛందస్సులయందు నాకున్న ప్రవేశము, మక్కువ మాటిమాటికి ప్రకటితమౌతూనే ఉన్నది. కాని నేను ఫలానా ఛందస్సులో వ్రాయాలని సంకల్పించను. భావం ఛందస్సులో నిముడాలనే బదులు ఛందస్సు భావంలో నిముడాలనే అభిప్రాయం గల వాణ్ణి నేను. అట్లని పద్యాలలో వ్యర్థ పదాలు చోటు చేసికొనరాదు. అందుచేత నొక అపూర్వమైన ఛందస్సు భావంలో స్ఫురించినప్పుడు కాదనక దానినట్లే స్వీకరించినాను. అందుచేత అనేకనూతనవృత్తాలను, ఖండ, చతురశ్ర, మిశ్ర, త్ర్యస్రగతులలో సాగే అనేకమాత్రాపద్యభేదాలను నారచనలలో చూడవచ్చును. ఈ ఛందోభేదాలను వివరించుటయే ఈ వ్యాసంయొక్క లక్ష్యం.

ప్రతిపాదమునకు నిర్ణీతమైన అక్షరగణములు, యతిప్రాసలు గలిగి పాదమున కొకటినుండి 26 అక్షరములవఱకు గల్గిన ఉక్తాద్యుత్కృతి చ్ఛందములలో జనించిన పద్యములకును, 26కంటె ఎక్కువ పాదాక్షరములు గల్గి క్వాచిత్కముగా అనుభవములో నున్న లయగ్రాహి, లయ విభాతివంటి పద్యములకును వృత్తము లని పేరు. నిర్ణీతమైన మాత్రాగణములు, యతిప్రాసలు గల్గిన కందము, ద్విపద, తరువోజలవంటి పద్యము లకు జాతు లనియు, నిర్ణీతములైన మాత్రాగణములు, అక్షరయతులు గాని, ప్రాసయతులు గాని గల్గి, ప్రాస నియమము లేని ఆటవెలది, తేటగీతి, సీసములవంటి పద్యములకు ఉపజాతులని పేరు. నేను సృజించిన నూతనపద్యము లీ మూడు తెరగులలోను ఉన్నవి. ఛందశ్శాస్త్రముల ప్రకారం 26 ఛందస్సులలో 13కోట్లకు పైగా వృత్తములు సృజించు అవకాశ మున్నదని ప్రయత్నపూర్వకముగా సృజించిన పద్యము లివి కావని, కేవలం భావప్రేరితములై సహజంగా తోచిన కొన్ని నూతనపద్యము లివి యని ముందుగా విన్నవించుకొనుచూ, అట్టి పద్యముల లక్షణముల నీక్రింద సోదాహరణముగా పేర్కొంటాను.

నూతనవృత్తములు

ఉచ్యమాన విషయముయొక్క సులభగ్రహణమునకై, సృజించిన వృత్తముల పట్టిక క్రింద నిస్తున్నాను.

వృత్తం పేరు గణములు ఛందస్సు వృత్తసంఖ్య
డయానా మ స జ త త గ 16వ అష్టిచ్ఛందస్సు 18777
నయాగరా మ స జ స ర ర 18వధృతిచ్ఛందస్సు 75609
సోఫియానా భ ర న మ గ గ 14వ శక్వరీఛందస్సు 471
ఓల్గా త ర ర ర ర 15వ అతిశక్వరీఛందస్సు 9365
పరభృతము న భ ర న స స లగ 20వ ధృతిచ్ఛందస్సు 374456
వనప్రియము ర స జ న జ జ గ 19వ అతిధృతిచ్ఛందస్సు 188147
వసంతకోకిల ర న స స జ జ గ 19వ అతిధృతిచ్ఛందస్సు 186107
మనోరమ త భ య న గ గ 14వ శక్వరీఛందస్సు 3701
విభావరి త త ర ర గ 13వ అతిజగతిచ్ఛందస్సు 1189
ప్రభావతి ర ర త త గ 13వ అతిజగతిచ్ఛందస్సు 2323
విలాసిని త ర ర ర 12వ జగతిచ్ఛందస్సు 1173
కైవల్యము త మ య య 12వ జగతిచ్ఛందస్సు 581
సుగతి మ భ ర న త త గ 19వ అతిధృతిచ్ఛందస్సు 151217
నవగీతి రెండు సూర్యగణాలు + రెండు ఖండగతి గణాలు ఉపజాతి

పైపట్టికలోని పద్యముల కుదాహరణల నీక్రిం ద నిస్తున్నాను. ఈ ఉదాహరణాలలో యతిస్థాన మొక చిన్న అడ్డగీతతో గుర్తించబడినది.

1. డయానావృత్తము -మ/స/జ/త/త/గ UUU IIU IUI -UUI UUI U. యతి:10వ అక్షరం; నడకలో నిది ఒక సగణం లోపించిన శార్దూలంవలె ఉంటుంది.

ఉదా:
వాచాతీతము నీ మనీష, -వంద్యంబు నీ జ్ఞానమున్,
నీచే నాయెద నింతదాఁక -నిద్రాణమైయున్న శౌ
ర్యాచారంబు ప్రబోధమొందె, -ఆస్కందనోత్సాహపున్
వైచిత్రిం దగు నాదుమేనఁ -బాటిల్లె రోమాంచముల్.

2. నయాగరావృత్తము – మ/స/జ/స/ర/ర UUU IIU IUI II-U UIU UIU యతి: 12వ అక్షరం; ఇది ఒక గురువు తక్కువైన శార్దూలం .

ఉదా:
ఖడ్గాఖడ్గిగ నీవిధం బధిక-కౌశల్య మేపారఁగన్
ద్విడ్గోత్రేశుడు వోర, నొక్కపరి -స్వీయాశ్వమున్ వెన్కకున్
త్విడ్గణ్యత్వరఁ దట్టి, తక్షణమె -వే ముందుకున్ నెట్టి, త
ద్ద్విడ్గాత్రంబును దర్గె రెండుగఁ బ్ర-ధృష్ణుండు సోముండొగిన్.

‘హనుమప్పనాయకుడు’ కావ్యంలో యుద్ధవర్ణనసందర్భంలో ఓజోగుణప్రధానంగా సాగిన ఈవృత్తం నా ‘జక్కనచరిత్ర’లో శృంగారపరంగా ఈక్రిందివిధంగా సాగింది:

ఉదా:
రాజీవాక్షిని, పల్లవాధరను, -రాకేందుబింబాననన్,
రాజప్రస్తరరమ్యగండతల-రాజన్మణీకర్ణికన్,
రాజీవాంబకశాంబరీతులిత-రమ్యాంగశోభాన్వితన్,
రాజీవాక్షుఁడు గాంచె లోలశఫ-రాలోకపర్వంబుగన్.

3. సోఫియానా వృత్తము – భ/ర/న/మ/గ/గ UII UIU I-II UUU UU యతి: 8వ అక్షరం

ఉదా:
ప్రత్యయమున్ ఘటించి -పరిపూతుం డల్లాపై
వ్యత్యయముల్దరించి -పరిపంథీశాశ్వంబున్
ప్రత్యుషమొందులోఁగ -వడిదేఁగా నొక్కండున్
ప్రత్యయితుండు లేడ? -పరికింపంగా మీలోన్?

4. ఓల్గావృత్తము -త/ర/ర/ర/ర UUI UIU UI-U UIU UIU యతి: 9వ అక్షరం; దీనిలోని గణాలన్నీ 5 మాత్రలు గలవగుటచే, దీనిని లయబద్ధంగా స్పష్టమైన ఖండగతిలో వ్రాయవచ్చును.

ఉదా:
దుర్దాంతవైరిశుద్ధాంత-దోషాకరాస్యద్యుతిన్
దోర్దండరాహుసంగ్రస్తి -దూరించు యోధాగ్రణుల్
వేర్దన్ని యిందు గొల్వుండఁ, -బ్రీతి న్ననీ యర్థమై
నిర్దిష్టు జేయుట ల్నాదు -నిశ్శ్రేయసార్థంబెకా!

పై నాల్గు వృత్తాలు నేను ప్రప్రథమంగా నా హనుమప్పనాయకుడు కావ్యంలో ప్రవేశపెట్టినవి.

5. పరభృతము; ఇది మూడు మిశ్రజాతి అక్షరగణములపై నొక రగణము గల వృత్తము. మూడవ మిశ్రజాతిగణారంభము దీని యతిస్థానము. ప్రప్రథమంగా నిది నా ఋతుసంహారకావ్యంలో ప్రవేశపెట్టబడినది.

ఉదా:
ప్రజలనాల్కలె వ్రాతపల్కలు, -ప్రణవనాదమె నాదమై,
అజుని యంకమె భద్రపీఠము, -యతులచిత్తమె గేహమై,
వృజినబుద్ధులె బద్ధశత్రులు, -విశదహంసమె తేజియై,
సుజనవృత్తులె వృత్తులై తగు -సుదతి భారతిఁ గొల్చెదన్.

6. వనప్రియము; ఇది మూడు మిశ్రజాతి అక్షరగణాలపై నొక రగణము గల వృత్తము. మూడవ మిశ్రజాతిగణారంభము దీని యతిస్థానము; ఈలక్షణములు గల రెండు పాదములు పొత్తపి వేంకట రమణకవిగారి లక్షణశిరోమణిలో బిరుదాంక మను అర్ధసమవృత్తములో నున్నవి. కాని సమవృత్తముగా నేను దీనిని మొదటిసారిగా నా ఋతుసంహారకావ్యంలో వ్రాసినప్పు డాగ్రంథమును నేను చూచియుండ లేదు.

ఉదా:
రంతు సేయుచు జాతవిభ్రమ-రయముచేతఁ గలంగుచున్,
ప్రాంతసంస్థితపాదపంబుల -వడిగఁ గూల్చుచు, దుష్టలౌ
కాంతలట్టు లశుద్ధజీవన-కలితలౌచు సముద్రమన్
కాంతుఁ గూడఁగ నేఁగు సంరయ-గతుల నిమ్నగ లిత్తరిన్.

7. వసంతకోకిల; ఇది మూడు మిశ్రజాతి అక్షరగణములపై నొక రగణము గల వృత్తము. మూడవ మిశ్రజాతిగణారంభము దీని యతిస్థానము.

ఉదా:
శ్రీకరంబుగఁ ద్రిభువనంబుల -శిల్పిచందము నిల్పుచున్,
లోకపాలనమనెడి నాట్యము-లోన నిచ్చలు దేలుచున్,
లోకకంటకు లయిన దుర్జన-లోకులం బరిమార్చుచున్,
లోక మేలెడి విజయకేశవు -లోఁదలంచుచు మ్రొక్కెదన్.

పై పరభృత,వనప్రియ,వసంతకోకిలములు మూడును తరల, మత్తకోకిలములవలె స్పష్టమైన మిశ్రగతిలో నడచు వృత్తములు. ఈమూడువృత్తములును మత్తకోకిలయందలి గల+భగణములను పైన ఉదాహృతమైనవిధిగా న+భగణములచే ప్రతిక్షేపించి కూర్చిన నూతనవృత్తములని గమనింపదగును.

8. మనోరమ – త/భ/య/న/గ/గ UUI UII II-U III UU యతి:9వ అక్షరం. దీని లయ ఖండగతిలో ఉంటుంది.

ఉదా:
ఈరీతిఁ బ్రాప్తతటలై -యిందుముఖులంతన్
ధారాధరాంచితసురేం-ద్రాస్త్రముల రీతిన్
శ్రీరంజితంబులగు చేఁ-జీరలను గొంచున్
నీరంబులం దుడిచి రు-న్నీలకచరాజిన్.

9. విభావరి- త/త/ర/ర/గ UUI UUI -UIU UIU U యతి:7వ అక్షరం. దీని లయ ఖండగతిలో ఉంటుంది.

ఉదా:
వేలాపురీవాస! -వేంకటేశస్వరూపా!
నీలాసతీనాథ! -నీరజాతాయతాక్షా!
కాలాంబుదాభాంగ! -కామిసంపూజితాంగా!
శైలోత్తమోద్ధార! -సర్వలోకాధినాథా!

10. ప్రభావతి – ర/ర/త/త/గ UIU UIU-UUI UUI U యతి:7వ అక్షరం. దీని లయ ఖండగతిలో ఉంటుంది.

ఉదా:
గోపికానాయకా! -గోవర్ధనోద్ధారకా!
పాపసంహారకా! -భక్తౌఘసంరక్షకా!
తాపసామోదకా! -దైతేయలోకాంతకా!
ఆపదున్మూలకా! -ఆనద్ధపింఛాలకా!

11. విలాసిని- త/ర/ర/ర; యతి:7వ అక్షరం. దీని లయ ఖండగతిలో ఉంటుంది.

ఉదా:
శ్రీకంఠవందితా! -శ్రీసతీనందకా!
వైకుంఠమందిరా! -భక్తమందారకా!
లోకాధినాయకా! -లోకసంస్థాపకా!
శ్రీకేశవా! హరీ! -చేతనోద్ధారకా!

12. కైవల్యము -త/మ/య/య UUI UU-U IUU IUU యతి:6వ అక్షరం. దీని లయ ఖండగతిలో ఉంటుంది.

ఉదా:
కైవల్యదాతా! -కామితార్థప్రదాతా!
సౌవర్ణచేలా! -సర్వసంసృష్టిమూలా!
శ్రీవత్సవక్షా! -శీతలోష్ణాయతాక్షా!
శ్రీవేంకటేశా! -శేషశైలేశవాసా!

13. సుగతి – మ/భ/ర/న/త/త/గ UUU UII UIU III -UUI UUI U యతి:14వ అక్షరం.

ఉదా:
ఏవల్లిం దాఁకిన మల్లికాంగముగ-నే సోఁకు నా శిల్పికిన్
ఏ వీచిం జూచిన మల్లికాభ్రువుగ-నే తోఁచు నా శిల్పికిన్,
ఏవాణిన్ విన్నను మల్లికాధ్వనిగ-నే మ్రోయు నా శిల్పికిన్,
ఏవంకం గన్నను మల్లికాకృతియె -యింపొందు నా శిల్పికిన్.

పై 7నుండి 13వఱకు గల వృత్తములు ప్రప్రథమంగా నా మహాశిల్పిజక్కన కావ్యములో ప్రవేశపెట్టబడినవి. వీనిలో 9,10,11,12 వృత్తములు ఆశ్వాసాంతపద్యములుగా ఉపయోగింపబడినవి.

14. నవగీతి; ఇది ప్రతిపాదమునకు రెండు త్ర్యస్రగతి గణములపై రెండు ఖండగతిగణములు గల్గిన ఉపజాతికి చెందిన పద్యము. మూడు మాత్రల గణమైనను లగ, ఐదుమాత్రల గణములైనను య,నలల,జల గణము లిందు నిషిద్ధములు. నాల్గవ గణారంభములో అక్షరయతి గాని, ప్రాసయతి గాని ఇందులో ఉంటుంది. ప్రాసనిర్బంధం లేనందువల్ల ఇది ఉపజాతిచ్ఛంద మైనది.. ఇది నా ప్రప్రథమకావ్యం అశ్రుమాలలో ప్రప్రథమ పద్యంగా రచియింపబడ్డది.

ఉదా:
మద్వ్యథిత హృదయభంగ-మాలికల్
పూర్వసౌఖ్యవాసనా-భూములన్
ఘట్టితంబులై యేల -కరుణపూ
ర్ణారవంబె నించు నే -డాశలన్?

ఇదిగాక ఆటవెలదిలోని మొదటిపాదలక్షణములే అన్నిపాదములలోను ఉండునట్లు, అట్లే ఆటవెలదిలోని రెండవపాద లక్షణములే అన్నిపాదములలోను ఉండునట్లు వ్రాసిన ఉపజాతిపద్యములు గూడ నా ఆపెరాలలో నున్నవి.

మాత్రాఛందస్సులు

పూర్వకాలంనుండియు త్రిమాత్రాత్మకము లైన గల,న గణములతోను, చతుర్మాత్రాత్మకములైన నల, గగ, భగణ, సగణ, జగణములతోను, పంచమాత్రాత్మకములైన భల,సల,నలల,నగ,తగణ,రగణములతోను, త్ర్యస్ర, చతురస్రగణముల జోడించి కూర్చబడిన 7మాత్రల మిశ్రజాతి మాత్రాగణములతోను జాత్యుపజాతిపద్యములు వ్రాయబడుచున్నవి. రగడలు, చౌపదులు, అక్కరలు, ఉత్సాహాదివృత్తములు, ద్విపదలు, కందములు ఇట్టి జాతిపద్యములకుదాహరణములు. సీసము, తేటగీతి, ఆటవెలది ఇత్యాదు లిట్టి ఉపజాతిపద్యముల కుదాహరణములు. ఈ ఛందస్సులే యక్షగానములలోను వాడబడినవి. కందసీసములలో శతకములు, ద్విపదలలో రంగనాథరామాయణ, బసవపురాణాది గ్రంథములును వ్రాయబడినవి. కాని ఈ నాల్గురకముల మాత్రాగణములతో ఆధునికకాలములో కావ్యములు గూడ వ్రాయబడినవి. విశ్వనాథ సత్యనారాయణగారి కిన్నెరసాని పాటలు, డా.సి. నారాయణరెడ్డిగారి నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, ఋతుచక్రం, విశ్వనాథ నాయడు మున్నగున విట్టి కావ్యముల కుదాహరణాలు. సీస,కందములు, ఆటవెలది, తేటగీతుల వంటి ఛందములను వాడకుండా, కేవలము త్ర్యస్ర, చతురస్ర, ఖండ, మిశ్రగతుల గణములను నిర్ణీతసంఖ్యలో పాదమున కిన్నియని కూర్చుకొని నాల్గుపాదముల పద్యము లిట్టి కావ్యములలో కూర్పబడినవి. ఇట్టి పద్యములలో యతి ప్రాసలలో నేదో యొకటి సామాన్యముగా పాటింపబడినది. మాత్రాగణములతో గూర్చిన యక్షగానములవంటి సంగీతప్రధానములైన దృశ్యకావ్యములవలె గాక, అదే గణములతో గూర్చిన శ్రవ్యకావ్యములుగా వీనిని భావింపవచ్చును.

150 పద్యములు గల అశ్రుమాల యను నాతొలికావ్యము పూర్తిగాను, 800 పద్యములు గల హనుమప్పనాయకుడను నా మలికావ్యంలోని అధికభాగమును ఇట్టి మాత్రాగణములలోనే సాగినది. ఐతే హనుమప్పనాయకకావ్యంలో నేను కందాన్ని, ఉపజాతులైన సీస,గీత, ఆటవెలదు లను గూడ తరచుగా వాడినాను. ఇంతవఱకు నేను వ్రాసిన 8 ఆపెరాలలోను ప్రధానముగా మాత్రాగణయుతములైన గేయములను, కంద, ఆట వెలది, తేటగీతులను, అటనట వృత్తములను వాడినాను. నాతొలికావ్యములందు వ్రాసిన మాత్రాగణబద్ధ పద్యములలో నేననేక నూతనపద్యశైలు లను ప్రవేశపెట్టినాను. ఇతరకవులవలె సామాన్యముగా పాదమునకు 4 మాత్రాగణములు గల పద్యములకు పరిమితము గాక, రసానుకూల ముగా పాదమునకు నాల్గింటికంటె అధికమైన గణసంఖ్యను గల్గిన పద్యముల ననేకములను నా కావ్యములలో నేను వ్రాసితిని. అందుచేత మాత్రా ఛందఃప్రయోగములో ననేకభేదములు నాకావ్యములలో చూడవచ్చును. వాటినిగుఱించి వివరించడమే ఈవ్యాసంలోని మిగిలిన విషయం.

అశ్రుమాలలోను, హనుమప్పనాయకుడు కావ్యంలోను ఖండగతికి చెందిన సీసతుల్యములు, చతురస్రగతికి చెందిన కందతుల్యములు, త్ర్యస్రగతికి చెందిన ఛందోవైవిధ్యము గల ఇతరపద్యము లున్నవి. ఇట్టి సీసతుల్యములు, కందతుల్యములు, ద్విపదతుల్యములు నా మహాశిల్పి జక్కనచరిత్రలోను వ్రాయబడినవి. క్రింద సోదాహరణముగా వీని లక్షణములను వివరిస్తాను.

సీసతుల్యములు

సీసతుల్యములన్నీ ఖండగతికి చెందిన ఛందములు. వీనికి సీసతుల్యములని పేరిడినను, పురాతనసీసపద్యములో నున్నట్లు వీటన్నిటిలో నాల్గుదీర్ఘపాదాలు, అంతమున ఒక తేటగీతియో, ఆటవెలదియో ఉండునని తలపరాదు. గీతరహితమై, కేవలం నాల్గు దీర్ఘపాదములు గల రూపము సైతము ఒక సీసభేదముగా పొత్తపు వేంకటరమణకవిగారి లక్షణశిరోమణిలో పేర్కొనబడినది. నాకావ్యములలో గల సీసతుల్యపద్యము లీక్రింది విధముగా నున్నవి.

అ) పూర్వసీసపద్యంలోని భ,నల గణాలను భల, నలల గణాలతో ప్రతిక్షేపిస్తే ఏర్పడే పద్యం. అంటే మొదటి ఆఱు గణాలు పరిపూర్ణంగా ఖండ గతికి చెందినవిగా ఉండునట్లు వ్రాసిన పద్యం. నా హనుమప్పనాయకుడుకావ్యంలోని ఈక్రింది ఉదాహరణంలో అధోరేఖలతో గుర్తించినట్లుగా 12 భలములు, ఒక నలలము వాడబడినవి. ఈదీర్ఘపాదాలకు పిదప నుండవలసిన ఎత్తుగీతికి బదులు, పాదమునకు నాల్గు ఖండగతి గణములు గల ఛందమును వాడి, ఖండగతిలయను పూర్ణముగా పాటించుట ఈ సీసతుల్యములో జరిగినది. (కన్నడంలో ఎత్తుగీతి లేని ఇటువంటి పూర్ణఖండగతి గల్గిన గణములతో గూడిన దీర్ఘపాదములు గల సీసములే వ్రాయుట పరిపాటి యని నాకు శ్రీ బెజ్జాల కృష్ణమోహనరావుగారు తెల్పినారు.)

ఉదా:
పసిఁడిలో రతనాలు -పొసగించినటు పదం
బుల నూతనార్థముల్ -పొందుపఱచి,
గందవొడికి న్విరుల-గందంబు గూర్చినటు
వాక్యముల వైచిత్రిఁ -బాదుకొల్పి,
నీరమ్ము, క్షీరమ్ము –తీరెఱుఁగు హంసలటు
కావ్యగుణదోషముల -క్రమము లెఱిఁగి,
వరవర్ణినికి నవ్య-తరభూషలను గూర్చి
నటు లలంకారమ్ము -లమరఁజేసి,

విరులతో మాలకరి -వివిధమౌ హారముల
విరచించు గతి సుధా-విమలమధురోక్తులను
విరచింతు రాశువుగ -వరకావ్యముల వారు,
కురిపింత్రు నవపద్య-కుసుమమ్ములను వారు.

ఆ) పెద్దపాదాలలోని పూర్వార్ధంలో 4 ఖండగతిగణాలు, ఉత్తరార్ధంలో 3 ఖండగతిగణాలపై నొక సూర్యగణమును చేరిస్తే ఏర్పడే పద్యం. అంటే పాదంలోని ఉత్తరార్ధం ద్విపద పాదంలాగా సాగుతుంది. క్రిందనిచ్చిన ఉదాహరణం నా హనుమప్పనాయకుడు కావ్యంలోనిది.

ఉదా:
తుంగభద్రానదీ-తోయభంగములట్టు
లుల్లముల విజిగీష -వెల్లువగుగాత!
శ్రీవిరూపాక్షఘం-టావిరావములట్లు
క్ష్వేడముల్ గడలందుఁ -బిక్కటిలుగాత!
విద్యాపురీవప్ర-విస్ఫురద్ధ్వజరీతి
ఘనరణోత్సాహంబు -వినుదాఁకుగాత!
విశ్వనాథుని స్వామి-విశ్వాసమును బోలి
డెందములఁ బ్రభుభక్తి -ద్విగుణమౌగాత!

భవ్యకృష్ణరాయాధిప-పాదకటక
కీలితయవనరాడ్ప్రతి-మాళి యగుత
అస్మదీయాహవోద్యుక్తి -కమరునట్టి
ఉత్తమోదర్కముం దెల్పు -పుత్తలాళి!

ఇ) దీర్ఘపాదాల పూర్వార్ధంలో 4 ఖండగతిగణాలు, ఉత్తరార్ధంలో 3 ఖండగతిగణాల పై రెండు సూర్యగణాలు గల పద్యం. ఉత్తరార్ధంలోని 3వ గణారంభంలో యతి ఉంటుందీ సీసతుల్యంలో. క్రిందనిచ్చిన ఉదాహరణం నా హనుమప్పనాయకుడు కావ్యంలోనిది.

ఉదా:
పాటలీపురి నాంధ్ర-పాలనమ్మును నిల్పు
శాతకర్ణులనాటి -సంగ్రామపాటవంబు,
దిగ్దంతిముఖములన్ -దిగ్జయోదంతముల్
విలిఖించు కాకతీ-యులనాటి విక్రమంబు,
పంచపాండవులట్లు -పరిపంథిమంథన
ప్రవణులౌ పల్నాటి-వడికాండ్ర ప్రాభవంబు,
కుండలీంద్రములట్లు -క్రూరయవనానీక
ముల మ్రింగు కృష్ణరా-యల చమూసాహసంబు,

పెంపు గావింప నిత్యాభి-వృద్ధి గాంచి
సర్వజగతికి నీర్ష్యాభి-జనకమైన
తెనుఁగువిభవంబు గాపాడు-కొనఁగలేని
అసువులేటికి యోచింపుఁ-డన్నలార!

ఈ) దీర్ఘపాద పూర్వార్ధంలో 3 ఖండగతి గణాలు, ఉత్తరార్ధంలో నాల్గు ఖండగతి గణాలుండే పద్యం. క్రింది ఉదాహరణం నా అశ్రుమాల కావ్యం లోనిది. దీనిలో ఎత్తుగీతి లేదు. ద్వితీయార్ధారంభంలో యతి, పాదాంతప్రాస పాటింపబడింది. సీసతుల్యముగా గాకున్న, దీనిని పాదమున కేడు ఖండజాతి గణములున్న పద్యముగా గూడ గ్రహింపవచ్చును.

ఉదా:
ముగ్ధావిచేష్టితంబున నీదు -ముఖనీరజాతమ్ము ముకుళించు నేవేళ
మధ్యావిచేష్టితంబున నీదు -మత్తాక్షికైరవము దులకించు నేవేళ
ప్రౌఢావిచేష్టితంబున నీదు -భావకౌముది నన్నుచుంబించు నేవేళ
నీగాఢసంశ్లేషమున నాదు -నేత్రమ్ము లఱమోడ్పు వడనెంచు నేవేళ
పూర్ణచాంద్రీరమ్యరాత్రియై -పొలుపారు మన్మనఃపథమందు నావేళ

ఉ) దీర్ఘపాదాలు 2+5 మాత్రాగణాలతో, రూపకతాళంలో వ్రాయబడిన పద్యం. ఇట్టివి నాల్గేసి గణములు గల దీర్ఘపాదాలు, ఎత్తుగీతికి బదులు నాల్గేసి ఖండగతి గణములు గల రెండుపంక్తులు గల పద్యం క్రింది ఉదాహరణంలో నున్నది. ఇది నా అశ్రుమాల కావ్యంనుండి గ్రహింపబడినది.

ఉదా:
విస్తారతరవిరహాతపా-భీలమ్ములౌ గ్రీష్మర్తులన్
దుర్వారతరనైస్పృహ్యఝర-దోహలములౌ వర్షర్తులన్
త్వదమలసంస్మితవిభాస్మరణ-ధవళంబులైన శరత్తులన్
ఘనకందర్పసాధ్వసశైత్య-కలితంబులౌ శిశిరర్తులన్
దృఢసంశ్లేషభవదుష్ణతా-స్మృతిపంచాగ్నిమధ్యంబునన్
ఘనతపశ్చర్య నిను -గాంచ గంటిని గాని
వనధిలో నిడ్డ మధు-కణ మయ్యె నదియెల్ల.

ఊ) దీర్ఘపాదాల పూర్వోత్తరార్ధాలలో నాల్గేసి ఖండగతిగణాలు గల పద్యం. ఈక్రింది ఉదాహరణం నా హనుమప్పనాయకుడు కావ్యం లోనిది.

ఉదా:
ఒక మహీధ్రమునుండి -ఉత్సృష్టమై మరుత్
స్పర్శచేఁ దూఁగాడు -ప్రస్రవణవిధమౌచు,
ఒక మహీజము చుట్టు -నూర్మికోపమమౌచు
వలమానమగు చైత్ర-వల్లరీవిధమౌచు,
ఒక మదవతీనూపు-రోదితస్వనభీత
మై గాలిలోఁ దేలు -హరిణమ్ము విధమౌచు,
ఒక కాంత కరతాళ-సుకుమారలయ కలరి
నటియించు మదబర్హి-ణగణమ్ము విధమౌచు,

అంగవిక్షేప, నానార-సానుకూల
రమ్యముద్రాభినయభావ-రమ్యమైన
గతుల నర్తించు నొక్కొక్క -గరిత యపుడు
నాట్యబహుమానసముపార్జ-నాభిలాష

ఈక్రింది పద్యము గూడ పైదానివంటిదే కాని, దీనికి ఎత్తుగీతి పాదమున కాఱు త్ర్యస్రగతి గణములు గల్గినదిగా సాగింది.

ప్రథమకవి నన్నయ్య-భట్టకృతభారతాం
తరసుప్రసాదగుణ-భరితాంతరముతోడ,
ఆంధ్రకవిసార్వభౌ-మాఽరచితబహుకావ్య
మాధుర్యగుణధుర్య-మధురాంబువులతోడ,
సహజపండితకావ్య-సరణిమండితపద
క్రేంకారసంకీర్ణ-కీలాలరుతితోడ,
అష్టదిగ్గజయూథ-పాప్సరోనాయికా
భ్రూనర్తనోపమాం-భోనర్తనముతోడ,

లలితవర్తులధవ-ళసైకతశ్రోణి,
పరమహంసమోక్ష-పద్ధతినిశ్శ్రేణి,
ప్రాక్పయోధిరాజు -పట్టపుదొరసాని,
నయనపర్వమయ్యె -నపుడు కృష్ణవేణి.

ఋ) పూర్వార్ధంలో 4 ఖండగతి గణాలపై ఒక సూర్యగణం, ఉత్తరార్ధంలో 4 ఖండజాతి గణాలుండే దీర్ఘపాదాలు గల పద్యం. ఈక్రింది ఉదాహరణం (సరోవర్ణనం) నా హనుమప్పనాయకుడు కావ్యంలోనిది.

ఉదా:
చలదూర్మికాసంఘ-సంఘట్టనోదితమృదంగ
లలితసంరావాను-లాస్యన్మయూరంబు
విచలవీచీలుఠ-ద్విస్తారతరపృషత్తార
నిచయభాసురరమ్య-నీరేజపర్ణంబు
అనుచలద్భంగనివ-హాందోళికావిహరమాణ
మానసౌకఃకదం-బానందనిలయంబు
ఉరుతరంగాకస్మి-కోడ్డీయమానశిశుమీన
చౌరికావహసవిధ-జలపక్షినివహంబు

కూలమాలూరగాలవ-క్రోడవాసి
బహువిధాండజసంగీత-పరిణతంబు
కమలినీవృద్ధికారక-ఘనరసంబు
నగుచు జెలువొందె వనియందు -నబ్జసరసి.

ౠ) హనుమప్పనాయకుడు కావ్యంలోని ఈక్రిందిపద్యంలో ప్రతిపాదంలోను 4 ఖండగతిగణాలపై ఒక సూర్యగణ మున్నది. ఎత్తుగీతికి బదులు ప్రతిపాదమునకు 5 త్ర్యస్రగతిగణాలు గల పద్యము కూర్పబడినది. సర్వత్ర మూడవ గణారంభంలో యతి కూర్పబడింది. దీర్ఘ పాదములు పూర్వసీసపద్యపాదములకంటె చిన్నవైనను, ఈదీర్ఘపాదముల వెంట కూర్పబడిన త్ర్యస్రజాతి పద్యమువల్ల పద్యార్థమునకు పూర్ణత కల్గుటచే, నిది సీసతుల్యముగా పేర్కొనబడినది.

ఉదా:
దాంపత్యవల్లరిం -దళుకొత్తు చిన్నారిపూవు
పున్నామనరకంపుఁ -బులివాతిఁ దప్పించు జోదు
దుస్తార్యవార్ధక్య-తోయధిం దాఁటించు నావ
ఇహపరంబులలోన -నిద్ధసౌఖ్యం బొసఁగు సురభి

పావనాన్వ-వాయపుణ్యభూమి
స్ఫూర్తి గొన్న -పూర్వపుణ్యమూర్తి
పుత్త్రుఁ, డట్టి -పుత్త్రుఁ డొదవకున్న
జీవితమ్ము -చేదుగాదె తాల్ప!

ఇతరఖండగతిచ్ఛందోవిశేషములు

పై ఉదాహరణాలలోని దీర్ఘపాదములలోని రెండుభాగములను ఏకపాదపూర్వోత్తరభాగములుగా గాక, రెండు ప్రత్యేక పాదములుగా గ్రహించి సామాన్యమైన చతుష్పాదిఛందాలను సృజింపవచ్చును. నారాయణరెడ్డిగారి కావ్యాలలోను, పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవములోను, ఇతరకవుల రచనలలోను, పాదమునకు నాల్గు ఖండగతి గణములో లేక నాల్గు చతురస్రజాతిగణములో లేక రెండు మిశ్రజాతిగణములో గల ఛందములే ప్రధానముగా గూర్పబడినవి. నాకావ్యములలోను ఇట్టివి తరచుగా నున్నను, ఇంతకంటె విశిష్టమైన ప్రయోగములు కొన్ని యున్నవి. వాని నీక్రింద పేర్కొంటున్నాను.
అ) ప్రతిపాదంలోను మూడు ఖండగతిగణాలు గల హనుమప్పనాయకుడులోని పద్యం. ఇందులో ప్రాసమాత్రమే పాటింపబడింది.

నాయకున కీవార్త సుమనోజ్ఞ
గేయమునకన్నఁ బ్రియమయ్యెను;
నాయకుని డెందమం దొకటియా
వేయి హరిచాపములు పూచెను.

ఆ) ద్విపదలోని భ,నల గణములకు బదులు పూర్ణఖండగతి కల్గునట్లుగా భల, నలల గణములను వాడి కూర్చిన ద్విపద తుల్యపద్యములు. మహాశిల్పి జక్కనలోని ఈక్రింది పద్యములో రెండు భలము లధో రేఖలతో గుర్తింపబడినవి.

ఉదా:
పేరడుగ నైతి, నే -నూరడుగ నైతి,
తోరంపువేడ్కతోఁ -దోయజాస్త్రుండు
నారసంబుల వ్రేయ -నతశీర్ష నగుచు
చోరదృష్టుల వానిఁ -జూచితిం గాని.

ఇ) ప్రతిపాదంలోను ఐదేసి ఖండగతిగణాలుండే పద్యం. అశ్రుమాలనుండి గ్రహించిన ఈక్రింది ఉదాహరణంలో మూడవగణారంభం యతిస్థానం. ఇటువంటి కొన్ని పద్యాలలో నాల్గవగణారంభం యతిస్థానంగా పాటించడంగూడ జరిగింది.

ఉదా:
ప్రవ్యథాకర్షక-ప్రాప్త మద్హృదయకేదారమున
నీ స్మరణబీజంబె -నిత్యమై నాటువడియెంగాని,
కందళితమౌ నెట్లు? -కాలకందంబు గర్జించునే
కాని, వర్షింప దిం-తేని అమృత మ్మొక్కపరియేని.

ఈ) బేసిపాదాలలో 4 ఖండగతిగణాలు, సరిపాదాలలో 4 ఖండగతి గణాలపై నొక సూర్యగణము (గలము) గల పద్యం. ఈ ఉదాహరణం హనుమప్ప నాయకుడు కావ్యంలోనిది. ఇందులో అన్నిపాదాలలోను మూడవగణారంభంలో యతి పాటింప బడింది. లఘువైన బేసిపాదాలు, దీర్ఘమైన సరిపాదాలుండుటవల్ల ఇటువంటి పద్యములు చతురస్రగతికి బదులు ఖండగతిలో కూర్చబడిన కందపద్యములను బోలుచున్నవి గదా!

అంతలో నతని వి-క్రాంతి కత్యంతవి
భ్రాంతులై చూచు స-భ్యాళి జయరావముల్ మ్రోఁగె,
అంతలో నావీరు -నౌపవాహ్యాంచితఖు
రాంతసంజనితరుతు -లలనల్ల ప్రాంతమున మ్రోఁగె.

ఉ) బేసిపాదాలలో 4 ఖండగతిగణాలు, సరిపాదాలలో 5 ఖండగతి గణాలుండే పద్యం. క్రింది ఉదాహరణం హనుమప్ప నాయకుడు కావ్యం లోనిది. ఇందులో అన్నిపాదాలలోను మూడవగణారంభంలో యతి పాటింపబడింది.

ఉదా: చివురుగొమ్మల డాగి -యెవరికిం గనరాక
భువినెల్ల మృదుగాన-వివశత్వమున ముంచెఁ బరభృతము
భువనైకగీతపరి-పూతమూర్తుల కేల
అవసరంబిల భౌతి-కాకారలీలాప్రదర్శనము?

ఊ)అశ్రుమాలలోని ఈక్రిందిపద్యంలో బేసిపాదాలలో 2+5 మాత్రలు గల 3 గణాలు, సరిపాదాలలో ఇట్టివే రెండు గణాలున్నవి. సర్వత్ర రెండవ గణారంభంలో యతి పాటించబడింది.

ఏ కాష్ఠముల -నీ పెంజిచ్చు రగిలించితో
నా హృదయమం-డపమందునన్?
కన్నీటివా-కలు గదలివచ్చిన గాని శమి
యింపంగబో-దింతేనియున్?

ఋ) బేసిసంఖ్యగల పాదాల్లో 3 ఖండగతి గణాలు, సరిసంఖ్య గల పాదాల్లో 4 ఖండగతి గణాలుండే పద్యం. అశ్రుమాలనుండి గ్రహింపబడిన ఈ పద్యంలో సరిపాదాల్లో మాత్రమే 3వ గణారంభంలో యతి పాటింపబడింది. ప్రాస పాటింపబడలేదు. ‘ముఖరాగేణ చంపకః’, ‘కరస్పర్శేన మాకందః’ అను దోహదక్రియలు ఈపద్యంలో గర్భితమై ఉండుట గమనింపవచ్చును.

ఉదా: నీ ముఖాలోకంబె కఱవయ్యె
నా మనోవని నెట్లు -ననలూను కాంచనము?
నీ కరస్పర్శయే కలయయ్యె
నా హృదయవని నెట్లు -ననలీను నామ్రమ్ము?

ఈక్రింది పద్యంగూడ పైపద్యం వంటిదే, కాని ఇందులోని బేసిపాదాలలో రెండుగణాలపైన ఒక గుర్వక్షరం మాత్రమే ఉంది.

మకరందమేఘంబవై
నా హృదయతాపంబు -నపనయింపగ రావె!
మధుపూర్ణపాత్రంబవై
నా మదిన్ సుంత శా-న్తమ్మొనర్పగ రావె!

ఈక్రింది పద్యంగూడ పైపద్యం వంటిదే, కాని ఇందులోని బేసిపాదాలలో రెండుగణాలు మాత్రమే ఉన్నవి.

రేయెండకుం గుమిలి
మే యుంచి పాన్పునన్ -మిక్కిలిం బొఱలు విర
హాయతల నిట్టూర్పు
వాయువులతో స్నేహ-భావంబు వహియించి.

హనుమప్పనాయకుడు కావ్యంలోని ఈక్రింది పద్యం పైదానివంటిదే కాని, దీని సరిపాదాలలో మూడుగణములపైన ఒక సూర్యగణమున్నది.

హరిసేవ కుదయాన
విరులఁ గోయఁగఁ జేరు -బిత్తరుల పైట
చెఱఁగులన్ ముడివెట్టి
తరులకుం గొంతతఱి -సరసమ్ములాడి

ఇట్లు కొన్ని నియమముల నేర్పరచుకొని, చిన్నపద్యములలో యతిప్రాసలలో నేదైన యొకటి అవశ్యముగా పాటించుచు (పెద్దపద్యములలో రెండూ పాటించుచూ) ఇట్టి పద్యముల నింకను సృజింపవచ్చును. అట్లు నేను సృజించిన పద్యములు మఱికొన్ని నాకావ్యములలో నున్నవి. వీనిని సృజించుటలో వ్యర్థపదములు పడకుండ చూచుకొనుట చాల ముఖ్యము.

చతురస్రజాతికందతుల్యములు

కుఱుచవైన బేసిపాదములు, దీర్ఘమైన సరిపాదములు గల్గి, చతుర్మాత్రాగణసంయుతమై యుండుట కందపద్యలక్షణము. ఇట్టి లక్షణమే కల్గి చతురస్రగతిలో సాగే ఇతరపద్యములను కందతుల్యములుగా గుర్తించి, నాహనుమప్పనాయకుడు కావ్యమునుండి అట్టి ఛందముల ఉదాహరణముల నిక్కడ నిచ్చుచున్నాను. వీనిలో నీక్రింది భేదము లున్నవి.

అ) ప్రాచీనకందాన్ని కేవలం మాత్రావృత్తంగా పరిలక్షించి గణస్థాన నిర్బంధాన్ని విస్మరించి, అక్షరయతితో బాటు ప్రాసయతిని కూడ కూర్చుచూ వ్రాసినవి.

ఉదా:
ఈ యేడొదవెడు సంతతి
ఆ యేడొదవెడు నని వా-రాశాయతి దశ
హాయనము ల్వేచిరి; కా
నీ యది నీఱున నిడు ప-న్నీరే యయ్యెన్.

రెండవ, నాల్గవపాదములలో మూడవగణము సగణమగుటచే, జగణనియమ మిట పాటింపబడలేదు. అట్లే రెండవపాదము లఘ్వంత మగుటచే సరిపాదములు గుర్వంతములు కావలెనను నియమము పాటింపబడలేదు. దీనికి కారణ మీ పద్యమును కేవలము చతురస్రజాతికి చెందినదానిగా భావించి, చతురస్రజాతిగణములను స్థాననియము లేకుండ కూర్చుట. గమనిక: ఆర్యాకందములో దీర్ఘపాదములు లఘ్వంతములుగా నుండు నని ‘కందము నిడుద పదమ్ముల యందుల తుద లఘువు నిడిన నది భువి నార్యాకందం బగు’నని పొత్తపి వేంకటరమణకవిగారి లక్షణ శిరోమణిలో లక్షణము చెప్పబడినది.

ఆ) బేసి పాదాల్లో 3, సరిపాదాల్లో 4 చతుర్మాత్రాగణాలు గల్గి, సరిపాదాల్లోని మూడవగణారంభం యతిస్థానంగా కల్గిన పద్యం.

ఉదా:
దేవా! నీదుకటాక్షమె
మావాంఛితద-మ్మగు కల్పద్రువు!
దేవా! నీ వాత్సల్యమె
మా వంధ్యత్వము -మాపు మహౌషధి!

ఈక్రిందిది పైపద్యమువంటిదే కాని ఇందులో 2,3 పాదాల్లో ఒక గురువెక్కువగా నున్నది. కాని ప్రాసనియమం పాటింపబడ లేదు. నాల్గవపాదంలో ప్రాసయతి పాటింపబడింది. అందుచేత దీనిని చతురస్రగతిలో సాగే ఉపజాతిపద్యంగా చెప్పుకొన వచ్చును.

రాణించును గాదా మణి
రాజము భర్మా-శ్రయమున రంజిలుటన్,
రాణించును గాదా ఫణి
రాజు మురారికి -జాజుల పాన్పగుటన్.

ఇ) బేసిసంఖ్య గల పాదాల్లో 3, సరిసంఖ్య గల పాదాల్లో 5 చతుర్మాత్రాగణాలపై నొక గురువు గల పద్యం. ఇది దీర్ఘపాదాల్లో ఒక గురువు అధికంగా నున్న ప్రాచీనకందపద్యంవంటిది. ఈ ఉదాహరణం నా హనుమప్పనాయకుడు కావ్యంలోనిది. మహాశిల్పి జక్కనలో గూడ నేనిట్టి పద్యముల నటనట వ్రాసినాను.

ఉదా:
అమలినకృష్ణాజలముల
కమలాపతికంత నృపతి -కరతోయం బొసగెన్,
సుమగంధిలతజ్జలముల
సుమసాయకజనకు నంత -సుస్నాతు నొనర్చెన్.

ఈ) బేసి పాదాలలో 4, సరిపాదాలలో 5 చతుర్మాత్రాగణాలుండే పద్యం. ఇందులో లఘుపాదములలో ప్రాసయతి, దీర్ఘపాదములలో అక్షరయతి పాటింపబడినది.

ఉదా:
కందుము కౌశల-మందిరులన్, ము
న్నెందఱినో యాశ్వికకుల-హిమమందిరులన్
కందుమె వారల-యం దీ చంద మ
మందాద్భుతమగు నిపుణత -మందునకైనన్.

ఉ) బేసి పాదాలలో 3 చతుర్మాత్రాగణాలపై రెండధికమాత్రలు, సరిపాదాలలో 6 చతుర్మాత్రాగణాలుండే పద్యం. ఇందులో లఘుపాదములలో మూడవగణారంభంలోను, దీర్ఘపాదములలో నాల్గవగణారంభంలోను యతి పాటింపబడినది.

పలుమాటలతోఁ -బని యేలా?
తలదాలిచి మీదునాజ్ఞఁ -ద్రచ్చెద వైర్యర్ణవమున్,
తెలవాఱకముం-దే తెచ్చెదఁ
గులహయమున్ నన్ననుపుఁడు -గూర్మిం దీవించి యిఁకన్.”

ఊ) బేసి పాదాలలో 4, సరి పాదాలలో 6 చతుర్మాత్రాగణాల పై నొక గరువుండే పద్యం. ఇందులో లఘుపాదములలో మూడవగణారంభంలోను, దీర్ఘపాదములలో నాల్గవగణారంభంలోను యతి పాటింపబడినది.

ఉదా:
వంచనచే నొక -వార్వము నపహా
రించిన జిక్కుదు మనుకొని-రే యతులితహేమాహార్యా
చంచలధీరులు -శాత్రవవీరు ల
వంచితధృతి నిక గూల్చుడు -వారల యాశాహర్మ్యములన్.

చతుర్మాత్రాగణయుతములైన ఇతరపద్యములు

అ) మూడు చతుర్మాత్రాగణములు గల పద్యం. ఇవి చిన్నపద్యము లగుటచే వీనిలో యతిగాని, ప్రాసగాని పాటింపబడింది. ఇటువంటి పద్యాలలో మాత్రాలోపవృద్ధులవల్ల కొంచెం వేరైన రూపాలు సిద్ధించవచ్చును. అట్టివి కూడ నా అశ్రుమాల, హనుమప్పనాయకుడు కావ్యాలలో ఉన్నవి.

ఏమో కావుగదా యివి
-యెల్లను నలలన్ వ్రాసిన
వ్రాలే? మృగతృష్ణం బ్రతి
-భాసించెడు నీరములే?

పైపద్యంలో మొదటిపాద ప్రథమాక్షరానికి రెండవపాదం ప్రథమాక్షరంతో, మూడవపాదం ప్రథమాక్షరానికి నాల్గవపాదం ప్రథమాక్షరంతో యతి చెల్లింపబడింది. ఇట్టి పద్యాలలోని పాదాల చివర రెండు మాత్రలు అదనంగా చేరడంవల్ల ఈక్రింద చూపినటువంటి పద్యా లేర్పడుతాయి..

ఉదా:
విజయేందిరతో -విచ్చేసెడు
విభుమార్గములో -వెలయించిన
శుభహారతులనఁ -బ్రభసూపెన్
కెందమ్ముల బహు-బృందమ్ములు.

ఇందులో ప్రాస పాటింపబడలేదు గాని, మొదటి రెండుపాదాలలో అక్షరయతి, చివరి రెండుపాదాలలో ప్రాసయతి పాటింపబడింది.
ఆ) ప్రతిపాదంలోను 4 చతుర్మాత్రాగణాలుండే పద్యం. మూడవగణారంభం యతిస్థానం. ఇట్లు నాల్గు చతురస్రగణములు గల ఛందములనే సి.నారాయణరెడ్డివంటి వారలు తమ కావ్యములలో వాడినారు.

ఉదా:
చండజవంబగు -ఝంఝకు లోఁబడి
ఖండములై చను -ఘనములరీతిన్,
బండలపై గడు-బలముగ బాదిన
కుండలరీతిన్, -గుంఠితధృతులై
దండల రాగన్ -ధ్వజినీపతులున్
మండలపతులున్ -చండజవద్రవ
పాండితి మీరం -బాఱె నిజామున్.

హనుమప్పనాయకుడులోని పై పద్యంలో యతి, ప్రాసలు రెండూ చెల్లింపబడినవి. అదే కావ్యములోని ఈక్రింది పద్యములో యతి మాత్రమే చెల్లింపబడినది.

సుపవిత్రుఁడు, స్మర-సుందరగాత్రుఁడు,
సజ్జనమిత్రుఁడు, -జ్ఞానకళత్రుఁడు,
విక్రమమిత్రుఁడు, -విమతిలవిత్రుఁడు,
కల్గును పుత్రుఁడు, -ఘనచారిత్రుఁడు

ఇటువంటి చిన్నపద్యములలో యతిప్రాసలలో ఏదో యొకటి చెల్లించిన చాలు ననునది నారాయణరెడ్డిప్రభృతులు పాటించిన నియమము. అక్షరగణవృత్తములలో తోటక,తోదకాది వృత్తములు పాదమునకు నాల్గు చతురస్రజాతి గణములు గల్గినవిగా నున్నవి.
ఇ) పాదమునకు 5,6,7 చతుర్మాత్రాగణములు గల పద్యములు. వీనిలో కొన్నియెడల మాత్రావృద్ధి, లోపము లుండవచ్చును. కొన్ని ఉదాహరణములు:

  1. అన్నిపాదాలలోను 5 చతుర్మాత్రాగణాలు గల్గి, మూడవగణారంభంలో యతి గల్గిన హనుమప్పనాయకుడులోని పద్యం.

    అల పరమాత్ముం-డగు రఘుకులతిలకునకుం
    జెలువుగఁ దోడై -చెలఁగిన పావని భవమటులన్
    జెలువారుత మీ -శ్రేయోలక్షితమగు నీ
    యలఘూత్తమకా-ర్యాసక్తి న్నాప్రభవంబున్.

  2. అన్నిపాదాలలోను 6 చతుర్మాత్రాగణాలను గల్గి, 4వగణారంభంలో యతి గల్గి, 2,4 పాదాలలో ఒక గరువధికంగా నున్న హనుమప్ప నాయకుడులోని పద్యం.
    భాళారే! ఘోటకమిది -బాల్యమునుండియు రేగడి
    నేలల నెండినదంటుల -నిరతము మెసవుచునుండుటచేఁ
    దాళక యీతనిఁ గని కడు -దత్తరమందుచు నున్నది
    యీలాగెందుం గందుమె -యిల నాజానేయములందున్!
  3. అన్ని పాదాలలో 7చతుర్మాత్రాగణాలను గల్గి 4వ గణారంభం యతిస్థానంగా గల్గిన హనుమప్పనాయకుడులోని పద్యం.
    ఆజ్ఞాపింపుఁడు దేవా! -అరుణోదయ మొదవెడులోఁగా స
    ర్వజ్ఞాద్భుతశౌర్యాప్తిన్ -బరిపంథిపురాబ్ధిని జొత్తున్, వి
    శ్వజ్ఞేయంబుగఁ దెత్తున్ -వార్వంబున్, నావిజ్ఞాపనమున్
    ప్రాజ్ఞు ల్మీరలు భావిం-పరుగాతన్ గర్వాలాపముగన్.

పైన పేర్కొన్న మూడును పెద్దపద్యము లగుటచే, వీనిలో యతి, ప్రాస రెండూ పాటింపబడినవి. పాదమునకు నాల్గేసి గణములకు పరిమితం గాకుండా, ఇటువంటి దీర్ఘపాదములు గల పద్యములతో హనుమప్పనాయకుడులో రసస్ఫూర్తి కల్గింపబడినది.

త్ర్యస్ర, మిశ్రగతిచ్ఛందములు

ఏవో కొన్ని నిర్ణీతసంఖ్య గల త్ర్యస్ర,మిశ్రగతి గణాలు గల ఛందాలివి. వీనిలో కూడ మాత్రావృద్ధి, లోపము లుండవచ్చును.
అ) పాదమునకు నాల్గు త్ర్యస్రజాతిగణములు గల్గిన ఈక్రింది చిన్నపద్యంలో ప్రాస యున్నది. యతి లేదు. పాదమున కారేసి గణములున్న తరువాతి పద్యములో యతి, ప్రాస రెండును చెల్లింపబడినవి.

ఉదా:
సాగి, సాగి ఇటుల కడకు
నాగిపోయె జనగణమ్ము;
సాగి,సాగి తటము నొరసి
ఆగిపోవు నల విధమ్ము.
తగదు తగదు, పాఱఁ-దగదు వీరులార!
మగలుగారె? మీదు -మొగములందు మీస
లింక మొలువలేదె? -జంకులేక యంత
కాంకపాళిభాగ్య -మరికిఁ గూర్పలేరె?

పైపద్యమునకు కించిద్భిన్నరూప మీక్రింది పద్యం. ఇందులో ప్రతిపాదంలో ఐదు త్ర్యస్రజాతిగణములపై నొక గురువున్నది. యతిప్రాసలు పాటింపబడినవి. యుద్ధములో భటులను యద్ధార్థం ప్రేరేచే సందర్భంలో పలుకబడిన ఈపద్యంలో పదములు పునరావృతమగుచు, పాదములు గుర్వంతము లగుట ఔచితీయుతముగా నుండి ఆదృశ్యమును కన్నులకు గట్టుచున్నది.

రండు రండు, పోర-రండు, రండికన్
చండవాత్యరీతి -సంత్వరన్ త్వరన్ త్వరన్
కుండలించి వైరి-మండలమ్ములన్
పిండిసేయ రండు, -రండు రండికన్

హ్రస్వపాదాలలో నాల్గుగణాలు, దీర్ఘపాదాలలో ఆఱుగణాలపై నొక గురువు, దీర్ఘపాదచతుర్థగణారంభంలో యతిని గల్గిన ఈ క్రిందిపద్యం త్ర్ర్యస్రగతిలో గూర్చిన కందపద్యభ్రమను కలిగించుచున్నది.

సద్దుమనిగి శాత్రవాళి
నిద్దురించుదాఁక -నిందె డాఁగియుండెదన్,
ఒద్దికం దెనుంగుఱేని
ముద్దుతేజి గొంచు -ముదముమీర నేఁగెదన్.

పై ఉదాహరణము లన్నియు హనుమప్పనాయకుడునుండి గ్రహింపబడినవి. ఈక్రింది పద్యము అశ్రుమాలనుండి ఉద్ధృతము. ఇందులో పాదమున కెన్మిది త్ర్ర్యస్రజాతిగణములున్నవి. 6వ గణారంభంలో యతి పాటింపబడినది.

నీదు సన్నిధానదివమునందు -నాదు భావరాజి
వేగవిజితవిహగరాజ మౌచు -వింటి నాక్రమించె,
నీ నితాంతవిప్రయోగతమము-లోన నేడు భీష
ణవ్యథాదివాంధము నను వెంట-నంటి వెక్కిరించె.

ఆ) పైవిధమైన త్ర్యస్రగతి పద్యములు, మిశ్రగతి పద్యములు నాకావ్యములలో తక్కువగా నున్నవి. సామాన్యముగా పాదమునకు రెండు మిశ్రజాతిగణము లుంచుచు, యతిని రెండవగణారంభమునందో, లేక ఉత్తరపాదారంభమునందో ఉంచుట ఇతరకవులు చేసిన ప్రయోగములు. నా హనుమప్పనాయకుడు కావ్యములోను అట్టి క్రమమే పాటింపబడినది. ఈక్రింది ఉదాహరణము లాకావ్యములో గద్వాలలోని మాఘమాసో త్సవమును వర్ణించు సందర్భములో నున్నవాటిలో కొన్ని. వీటిలో ద్వితీయగణారంభమున యతి పాటింపబడినది.

ఉదా:
నాఁడు మొదలుగ -నాల్గునాఁడులు
కొలువుదీర్చును -కువలయేశుఁడు
నేల నిల్చిన -నిర్జరేశుని
ఓలగంబును -బోలు దానిని.
నాఁడు మొదలుగ -నాల్గునాఁడులు
నగరియందున -నాట్యనాటక
సారకవితా -క్షాత్రవిద్యా
చతురిమంబే -సల్పు రాజ్యము.

నాఁడు మొదలుగ -నాల్గునాఁడులు
దేవదాసీ -దివ్యగీతా
లాపసంయుత-లాస్యరీతులె
దేవళమ్ములఁ -దేజరిల్లును.

అశ్రుమాలలోని ఈక్రింది పద్యములో పాదమునకు మూడేసి మిశ్రగతిగణము లున్నవి. మూడవగణారంభంలో యతి పాటింపబడింది.

ఓ గగనమా! నాదు క్రందన -మోపి వినుమా!
మత్ప్రణయినీ భర్మకాంచీ -మంజుఘంటిక
లలఘుశోభనరుతుల నొప్పెడు -నాక్షణంబున
నాదు గాథను జెప్ప దయతో -నటకు జనుమా!

ఉపసంహారము

నాకావ్యములలో నున్న ఛందోరీతులను వివరించు వ్యాసము నొకదానిని వ్రాయుమని కొంతకాలంగా కొందఱడుగుచుండిరి. సుప్రసిద్ధ విమర్శకులు, కీర్తిశేషులు డా.జి.వి. సుబ్రహ్మణ్యంగారికిగూడ నాఛందఃప్రయోగములు చాలా ఆసక్తిని రేకెత్తించినట్లుగా వారు నా కావ్యములకు వ్రాసిన మున్నుడులద్వారా, వివిధసందర్భములలో వారు వెలిబుచ్చిన అభిప్రాయముల ద్వారా విశదమౌతున్నది. దీనికి కారణ మితరాధునిక కావ్యములలో లేని రసానుభూతిప్రదమైన స్వతంత్రఛందః ప్రయోగములు నా కావ్యములలో నుండుటయే.

సి.నారాయణరెడ్డివంటి వారు మాత్రా ఛందములో కావ్యములు వ్రాసిరి గాని, వారి కావ్యములలో నిట్టి ప్రయోగములు లేవనియే చెప్పవచ్చును. మాత్రాఛందము గానయోగ్యములైన గీతములు వ్రాయుట కనువైనది. కాని కావ్యోచితమైన రసనిష్పాదకమైన భావములను వెలిబుచ్చుటకు భావోచితమైన ఛందస్సు కావలెను. పాదమునకు కేవలము నాల్గు చతురస్రగణములు గల చిఱుపద్యములలో వీరరసస్ఫూర్తి కలిగించుట పొసగదు. ఉద్ధతమైన భావములను చక్కగా ప్రకటింపగల్గిన ఛందస్సులోనే సరియైన రసస్ఫూర్తి కల్గును. భావములోనే అట్టి ఛందస్సులు స్ఫురించిన తగు రసనిష్పత్తి కల్గును. అట్లు వివిధ ఛందోభేదములు స్ఫురించినప్పుడు నేను వాని నట్లే గ్రహించినాను. అట్లు వీరరసప్రధాన మైన నాహనుమప్పనాయకకావ్యంలో రసానుగుణంగా, భావానుగుణంగా ఛందశ్శైలీపరివర్తన జరిగి రసపోషణకు దోహదం చేసిందని నా అభిప్రాయం. ఆకావ్యం చివరి ఒకటిన్నర ఆశ్వాసాలలో యుద్ధం ప్రధానవస్తువై యుండుటవల్ల, అట్టి ఉద్ధతవస్తువర్ణన కంతగా సరిపోని మాత్రాచ్ఛందాల ప్రాచుర్యం తగ్గి, శార్దూలమత్తేభోత్పలమాలాది వృత్తాల ప్రాచుర్యం పెరిగింది. ఇది నేను అనుకొని చేసిన మార్పు గాదు. ఆవస్తువే, తత్పోషకమైన భావములే అట్టి ఛందస్సుల నెన్నుకొన్నవి. అట్లే నా అశ్రుమాల అనే ఖండకావ్యములో విప్రలంభశృంగారకరుణారసముల పోషణ కవసరమైనట్లుగా నాభావములే వివిధ మాత్రాచ్ఛంద శ్శైలుల నెన్నుకొన్నవి.

ఈ అనుభవంవల్ల తేలిన విషయమిది: పాచకు డదే పదార్థాలతో పూర్వపరిచితములైన పాకములే కాక, యథావసరముగా రుచికరమైన నూతనపాకములనుగూడ సృజించినట్లు, భావమనే పాచకుడు సందర్భానుసారముగ అదే గణపరంపరనుండి రమ్యమైన నూతన పద్యములనే పాకములను తయారు చేసికొంటాడని, అట్టి నూతనపాకములు రసవంతము లైనచో నవి రసికజనానందకరము లగునని.

ఈవ్యాసముయొక్క ప్రచురణపూర్వప్రతిని చదివి తమ అభిప్రాయములను తెల్పిన శ్రీ బెజ్జాలకృష్ణమోహనరావు గారికి నా కృతజ్ఞతలు. ఈవ్యాసములో పేర్కొనబడిన నా అశ్రుమాల, హనుమప్పనాయకుడు, మహాశిల్పి జక్కన చరిత్ర, ఋతుసంహారము, కవితాస్రవంతి అను కావ్యములను పరిశీలింప దలచినవారు ఈకావ్యముల సమాహారముగా రెండు సంపుటాలుగా ప్రచురింపబడిన కావ్యనందనం అనే పుస్తకంయొక్క పి.డి.ఎఫ్ ప్రతులను కినిగెనుండి ఉచితంగా దిగుమతి(download) చేసికొనవచ్చును. ఈవ్యాసమును ప్రచురించుచున్న అకుంఠితభాషాసేవకులు ఈమాట సంపాదకులకు నా కృతజ్ఞతలు.