చీమ తల కన్నా చిన్నదేదీ అంటే, అది తినే ఆహారం అని సామెత. తెలుగులో వెలువడుతున్న పుస్తకాలలోని సాహితీనాణ్యత కన్నా కనాకష్టంగా ఉన్నదేదీ అంటే, జవాబు ఆ పుస్తకాల ముందుమాటలు అని. పుస్తకం నుంచి కాపీ పేస్టు ఉటంకింపులు, వాటి మీద కాసిని ప్రశంసలతో, ఈ రచయిత ఇలాంటి రచనలు మరెన్నో చెయ్యాలనే ఆశీర్వాదపు ఆకాంక్షతో ముగించడం – తెలుగునాట ముందుమాట కేవలం ఒక కాండెసెండింగ్ టెంప్లెట్. అడిగో అడిగించుకునో, కొండొకచో నవతరం పట్ల ఇది తమ గురుతరబాధ్యత అనుకునే స్మగ్వినయంతో తామే భరోసా ఇచ్చో, ముందుమాటలు రాసే సాహిత్యప్రముఖులందరికీ తెలియాల్సింది దాని వల్ల వారి కీర్తి ఏమీ పెరగదని, వారికి కొత్త గుర్తింపేమీ రాదని. సరికదా, ఆ ముందుమాట పేలవంగా ఉంటే ఉన్న కాస్త గౌరవమూ పోతుందని. ఉండే ప్రాంతాన్ని బట్టో, లేదూ తాము చదివిన ఏ ఒకటో రెండో కథలూ కవితలను బట్టో కవిరచయితలకు ప్రవాసం, భావుకత్వం, ఆవేశం, అర్బన్, స్త్రీవాదం వంటి ముద్రవేసి, సదరు ముద్రకు అనుగుణంగా కొన్ని పాదాలు, పేరాలు ముక్కలుగా ప్రస్తావించి పోల్చుతూ, తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం – రాసే ముందుమాట ఆ పుస్తకం గురించో లేక తమ గురించో అర్థంకాని స్థితికి వచ్చేశాం. పుస్తకం ప్రపంచానికి కిటికీ అయితే ముందుమాట పుస్తకానికి కిటికీ. ముందుమాట పుస్తకానికి ఒక దిక్సూచి. అది రచయితను, వారి సాహిత్యాన్ని, శకలాలుగా కాక సంపూర్ణంగా విశ్లేషించి విమర్శిస్తుంది. పాఠకుడు తనంతటతాను తెలుసుకోలేని విభిన్నపార్శ్వాలని చూపిస్తుంది. అవసరమైన చోట ఆ సాహిత్యానికి ఒక చారిత్రిక సందర్భాన్నీ ఇస్తుంది. అందుకని, ముందుమాట రాయాలంటే ముందు ఆ పుస్తకంతో కొంతకాలం బతకాలి. దాని వస్తువును కూలంకషంగా పదివైపుల నుంచి పరిశీలించాలి. మంచిచెడ్డలు, లోతుపాతులు బేరీజు వేయాలి. ముందుమాట రాయడంలో ఒక కొత్తవిషయాన్ని కనుక్కున్న శాస్త్రజ్ఞుడి శ్రమ, ఆనందం, గర్వం ఉండాలి. అయితే, ఇంత అర్థవంతమైన ముందుమాటలు మనకు తెలుగులో కనపడవు. అలాంటి అవకాశం అన్నిసార్లూ రచయితలు కల్పిస్తున్నారా అన్నది ప్రశ్న అయినప్పుడు ముందుమాట రాయలేనని తప్పుకొనే ఆదినిష్ఠూరం అందరికీ మంచిది. వెరసి, ఈ టెంప్లెట్ ముందుమాటలను రచయితలు ఆశించడంలో సదరు ముందుమాటకులు-రచయితలు తాము ఒకే సాహిత్యపరమైన రాజీకి చెందినవారిమని సూచించడం, తద్వారా తమ సాంగత్యాన్ని ప్రదర్శించడం మినహా వేరే ఉద్దేశ్యం కనిపించదు. సమస్య ఏమిటంటే, ఈ తప్పనిసరి ముందుమాటల వల్ల పుస్తకం తనంతట తానుగా నిలబడగల అవకాశాన్ని కోల్పోతుంది. ముందుమాటకులు ఎంత ఇరుకు చూపుతో కథలను లేదా కవిత్వాన్ని పరిచయం చేస్తారో, అదే ఇరుకు దారి పాఠకులకూ ఎదురుగా కనపడి, రచన వైశాల్యాన్ని గుర్తించడం కష్టమయేలా చేస్తుంది. పుస్తకంలోని కొత్త ధోరణులకు, పరిచయాత్మకంగా పాఠకులకు అడ్డం పడకుండా ఉండే ముందుమాటల వల్ల లాభం లేకపోయినా నష్టం లేదు. కాని, తమ రచనల పట్ల గౌరవమూ నమ్మకమూ ఉన్న రచయితలే ఆలోచించుకోవాలి, ఇట్లాంటి ముందుమాటలు ఎవరి కోసం, ఎందుకోసం అన్నది. అయినా ముందుమాటకులు ప్రాచీనకవిత్వం చదువుకున్నారో లేదో కానీ, శతకాలు బానే చదువుకున్నారు. కొండ అద్దమందు కొంచమై ఉంటుందిరా అంటే, కొంచముండుటెల్ల కొదువ కాదని అరువు మాటలతోనే బైఠాయిస్తారు.