ప్రోగ్రెషన్

మ్యూజిక్ స్కూల్ కారిడార్లో; తనను చూస్తూనే, ధేంక్ గాడ్! అంటూ తనను ఊపేస్తూ, ఇంకా ఏవో మాటలు అస్పష్టంగా అంటూ తన కళ్ళలోకి చూసిన నిసి ముఖం సెకన్లలో పాలిపోతున్నట్టూ, అంతలోనే ఆమె నిస్సత్తువుగా, వేలాడబడుతున్నట్టు తోచి, ఆమెను పొదివి పట్టుకున్నాడు నిసి మ్యూజిక్ టీచర్, ఏలెక్స్ రూబెన్.

మరుక్షణంలోనే, ఓ, హాయ్, ఏలెక్స్! అంటూ, తన చిక్కటి జులపాలు ఎగరేస్తూ, అతని చుట్టూ చేతులు చుట్టి, అతని చెంపకు చెంప ఆనించింది నిసి. (అతడు లోలోనే, థేంక్ గాడ్! షి ఈజ్ ఓ.కే. అనుకున్నాడు.) పైకి ఇలా అన్నాడు.

“అయ్యాయా, యూరప్ విలాస యాత్రలు? ఏమిటిలా నా చేతుల్లో సొమ్మగిలిపోటానికి కారణం? ప్రయాణపు బడలికలు ఇంకా తీరినట్టు లేవు.”

ఆమె అతని కౌగిలిలో ఉండగానే, సోనియా తన గది లోంచి బైటకు వచ్చింది. వారిద్దరినీ చూసి, “నిసి! ఏమన్నా న్యాయం ఉందా? నేను ఏలెక్స్ కొలీగ్‌నే కదా? ఈ పక్క గదిలోనే పడి ఉంటానా? నేను ఉన్నానో, ఊడానో కూడా పట్టించుకోడు. సెలవు నించి ఇవ్వాళే వచ్చాను, అని ఒక హగ్ ఇవ్వబోతే నువ్వసలు సెలవలో ఉన్నట్టే తెలియదు. అసలెప్పుడు వెళ్ళావంటాడు?”

“ఏలెక్స్! యు మస్ట్ బి మిస్సింగ్ నిసి! వాట్ ఏ వార్మ్ ఎంబ్రేస్! నీకు పెటిట్ విమెన్ అంటే పక్షపాతం సుమా.” అంది సోనియా.

“ఇంపాసిబుల్ విమెన్. కౌగిలిస్తే తప్పు. ఇవ్వకపోతే తప్పు. అతి మామూలు ఈ-మెయిల్ పంపితే సెక్స్టింగ్ చేశావంటారు. పంపకపోతే, అసలు ఏదీ కమ్యూనికేట్ చెయ్యనంటారు. గో ఎవే, సోనియా!” అన్నాడు ఏలెక్స్.

“ఇట్స్ ఆల్రైట్. ఐ ఫర్గివ్ హిమ్. హేవ్ ఎ నైస్ లెసన్ నిసీ!” అనేసి వెళ్ళిపోయింది సోనియా.

ఏలెక్స్, సోనియా, వారిద్దరూ మంచి స్నేహితులు. సోనియాది ఐరిష్ జర్మన్ ఏన్సెస్టరీ. పెద్ద విగ్రహం. భారీ మనిషి. గొంతు సోప్రానో. ఆ చుట్టుపక్కల నివసించే ప్రజల కోసం సంగీత కళాశాల ప్రతి సంవత్సరం ఇచ్చే కాన్సర్ట్‌లలో, వారు ఇద్దరూ కలిసి పాల్గొనేవి, తప్పక రెండో మూడో ఉంటాయి. చక్కని అంశాలు ఎన్నుకుని, క్లాసికల్ మ్యుజీషియన్స్‌ని పరిచయం చేస్తుంటారు.

నిసి, ఏలెక్స్, అతని స్టూడియో బరువైన తలుపు జమిలిగా తోసి, లోనికి వెళ్ళారు. లోన అతడి బల్ల, అతని కుర్చీ, అతిధికో కుర్చీ, వాటికి ఒక అడుగు దూరంలో రెండు స్టయిన్‌వే పియానోలు పక్క పక్కనే ఉన్నాయి. ఎడమ పక్కది ఏలెక్స్‌ది, కుడి పక్క పియానో వరసగా, వచ్చే పోయే విద్యార్ధులకు. ఆ పక్కనే చిన్న బల్ల, విద్యార్ధుల పుస్తకాల బేగ్‌లు పడేసేందుకు. సరిగ్గా ఆ బెంచ్ పైన ఫ్రాంజ్ లిజ్స్ట్ నిలువెత్తు పోస్టర్ ఉంది. నిసి, తన బేగ్ దించి, ఆ పోస్టర్ కేసి చూస్తూ, బూడపెస్ట్‌లోలో చూసిన ఆయిల్ పెయింటింగ్‌కీ, ఈ ప్రింట్‌కీ ఎంత తేడా. అందులో ఉన్న జీవశక్తి ఇందులో ఏదీ, అనుకుంది.

సంగీత పాఠశాల వారు ఫ్రాంజ్ లిజ్స్ట్ 200 పుట్టిన రోజు ఉత్సవం జరపబోతున్నారు. నిసికి అంతకు ముందే ప్రోగ్రామ్ గైడ్ చూసి ఉంది. లిజ్స్ట్ సంగీతం తన టీచర్ ఏలెక్స్ రూబెన్ వాయిస్తుండగా ఎప్పుడెప్పుడు విందామా అని ఉవ్విళ్ళూరుతోంది.

ఏలెక్స్, వెనక నుంచి, “ఆర్ యూ ఆల్రైట్? నిసీ,” అన్నాడు.

“యా షూర్, వై నాట్?” అంది నిసి, సంగీతం పుస్తకం పియానో మీద తెరిచి పెట్టుతూ.

“ఏమో, ఇందాక కారిడార్లో ఒక్క క్షణం, నువ్వు స్పృహలో లేవేమో అని నాకు భయం కలిగింది.”

“బిగ్ డీల్! నేల మీదకు జారవిడిచావంటే, స్పృహ అదే వస్తుంది. నా మీద సి. పి. ఆర్. మాత్రం చెయ్యకండీ, నాది మరీ పిచ్చిక పిట్ట లాటి రిబ్ కేజ్,” అంది, వెనక్కు తిరిగి అతని పెద్ద చేతుల వంక చూసి, నవ్వుతూ. (మనసులో రాఖ్మానినోవ్ చేతులు స్వామీ మీవి, అవే సైజ్, అదే శక్తి, వేగం అనుకుంటూ.)

“స్పారో! మీరు భరతి పిట్ట అనుకున్నా. గ్లాడ్ యూ ఆర్ ఓ.కే. ఈ పూట ఏమి వినిపించి మమ్మలని అలరించదలిచారో,” అని ఒక్కసారిగా పియానో మీటలు అతి వేగంగా మోగించాడు.

నిసి, గబుక్కున బిక్కముఖం వేసి, “డాక్టర్ రూబెన్! నే వచ్చీ రాగానే, మీ విద్యా ప్రదర్శన, మీ మెరుపు వేగం చూపి భయపెట్టకపోతేనేం? నే చాలా ప్రాధమిక విద్యార్ధినని మీకు గుర్తుండదా,” అంది. అతడు పియానో మీద ఉన్న బీథొవెన్ చిన్న బొమ్మతోటి ఆడుతూ;

“గుర్తు లేకపోతేంనే, ఇప్పుడు తమరు రెండు నొక్కులు నొక్కగానే, తెలిసిపోతుందిగా. ఎవరైనా కళాకారులు, టీచర్లు, బాగా వాయించేది, భయపెట్టటానికి కాదు. ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం. నీకు నేను వాయిస్తే భయం? విక్టర్ బెర్నెట్టీ వాయిస్తే ఆహ్లాదం! విక్టర్ బెర్నెట్టీతో, బూడపెస్ట్‌లో పబ్లిక్ బాత్‌లలో ఈతలు, పబ్లిక్ స్క్వేర్‌లలో బీర్ తాగుతూ డాన్స్‌లు చేస్తే పియానో వస్తుందా? ఫొటోలు పంపాడులే, మీ స్నేహితుడు. ఆ చేసే విలాస యాత్రలేవో, నేను వేరే దేశాలకు, టీచింగ్ సెమినార్లకు వెళ్ళినప్పుడే పెట్టుకోవచ్చుగా. నేనిక్కడ ఊళ్ళో స్కూల్లో ఉన్నప్పుడు, తమరెక్కడో విదేశాలు తిరుగుతుంటే పాఠాలు ఎలా సాగుతాయి? Shouldn’t we synchronize our travels? Student!” అన్నాడు రూబెన్.

నిసి గడియారం వంక చూసింది, సాభిప్రాయంగా.

“ఓ.కే.! పాఠం ప్రారంభిద్దాం. ఆ మొదటి గ్రూప్‌లో ఉన్న ఐదు మేజర్ స్కేల్స్, ముందు రావాలి. తప్పు పోకుండా, సి స్కేల్ రెండు ఆక్టేవ్‌లు, ముందు కుడి చేత్తో, తర్వాత ఎడమ చేత్తో, ఆ తర్వాత రెండు చేతులు కలిపి వాయించు.”

నిసి కుడి చేత్తో ‘సి మేజర్’ మొదలెట్టింది.

“కౌంట్. పైకి, నాకు వినబడేట్టు. 12312341231234543213214321321. కీప్ రిధమ్!”

చప్పట్లు కొడుతూ, లెక్కిస్తూ, నిసి కూడా తనతో పాటు పైకి లెక్కించే దాకా, వదలకుండా, వరసగా పైకీ, కిందకూ సాధకం చేయించాడు. తర్వాత, సి మేజర్ కార్డ్స్, సి యి జి; సి ఫ్ ఏ; సి యి జి; బి ఫ్ జి; సి యి జి; – పుస్తకంలో మ్యూజిక్ చదువుతూనే, ఏ చేతితో ఏ వేళ్ళు వాడుతూ, మూడు మూడు మీటలు ఒకేసారి అదమాలో, అసలు ఆ అమరికలు అలా ఉండటానికి కారణం ఏమిటో వివరించాడు. మేజర్ స్కేల్ లక్షణాలు ఏమిటో, మేజర్ కార్డ్స్ లక్షణాలు ఏమిటో, ప్రిన్సిపల్స్ తెలిస్తే, మెల్లిగా ఒక్కొక్క స్కేల్‌కికి ప్రధానమైన కార్డ్స్, వాటిని తిరగమార్చి ఇంకో అమరిక లోనూ, మరింకో అమరిక లోనూ వాయించటం తెలుస్తుందనీ, వరసగా ఒక్కొక్క స్కేల్ లోనూ వాయించి చూపాడు.

“నువ్వు సరిగ్గా వేళ్ళు వంచటం, సరైన ఎత్తుకు లేపి మీటలను సరిగా అదమటం, నోట్ సమయం పూర్తయ్యే దాకా ధ్వని నిలపటం — మంచి అలవాట్లన్నీ మొదటి లోనే అలవరచుకోవాలి. చెడు పద్ధతుల్లో పడితే, తర్వాత మార్చుకోవటం కష్టం. నువ్వు తప్పు చేసిన చోటల్లా నేను చెపుతూనే ఉంటా. అది తప్పని సరి. ఈ ఆర్ట్‌లో పబ్లిక్ పర్ఫార్మెన్స్ అప్పుడు తప్పులకు చోటు లేదు.”

“నిజమే గదా డాక్టర్ రూబెన్! కేన్వాస్ మీద బొమ్మలు వేస్తున్నప్పుడు, ఆర్టిస్ట్ ఎన్ని సార్లెనా చెరిపి వెయ్యొచ్చు. రంగులు మారుస్తూనూ ఉండొచ్చు. ఇక్కడ అలా కాదు. స్టేజ్ మీద ఎక్కి ఒక నిర్ణీతమైన కాలంలో శ్రావ్యమైన సంగీతం పలికించి ముగించాలి. డాన్స్ కూడా అంతే కదా. ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కష్టమండీ, ఎలా సాధిస్తారో గానీ.”

“పియానో మొదట్లో చాలా నిదానంగానే వాయించాలి. సరైన మీట సకాలంలో నొక్కాలి. చేతుల కదిలింపులు, వేళ్ళు ఎక్కడ ఉంచుతున్నదీ, ఏ మీటలు ఎలా నొక్కుతున్నదీ, బ్రెయిన్ గుర్తు పెట్టుకుంటుంది. వరసగా ఒక పీస్‌లో తప్పులు ప్రాక్టిస్ చేస్తే, నువ్వు మార్చాలనుకున్నా, బ్రెయిన్ అది నేర్చుకున్న సీక్వెన్స్, నీ చేతులకు అందిస్తుంది. అందుకని, పాఠం నేర్చుకొనేటప్పుడు కూడా, ఎంత తక్కువ తప్పులు చేస్తే అంత మంచిది, నిసీ! మ్యూజిక్ ప్రతిసారీ, మ్యూజిక్ స్కోర్ చదువుతూ, అక్కడ కంపోజర్ ఇచ్చిన ప్రతి ఆదేశం పాలిస్తూ, ప్లే చేస్తూ పోవాలి. చక్కని గుర్తులు, సంకేతాలు ఇస్తారు. మనం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు, రోడ్ సైన్లు ఎంత క్లియర్‌గా ఉంటాయి. చదువుతూ, వేగం తగ్గిస్తూ, పెంచుతూ, లేన్లు మారుతూ, మనం సేఫ్‌గా రోజూ వెళుతున్నట్టే. నిజంగా మ్యూజిక్ స్కోర్స్‌లో కూడా అంత చక్కని స్పష్టమైన ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు.”

“జిపియెస్ లాగా డెస్టినేషన్ ఎరైవ్డ్! అని కూడా, తెలుపుతారా? అంది నిసి నవ్వుతూ.

“షూర్! ఈ మ్యూజిక్ చదవటం నువ్వు ఒక కొత్త భాష నేర్చుకోటం వంటిది. ఒక్కో మ్యూజికల్ పీస్ కంఠతా పడితే, వినేసి, మెమొరీలో పెడితే, కుదరదు. నువ్వు ఈ లిపి చదవగలగాలి. కొందరి వినికిడి శక్తి గొప్పదే. చాలా పెద్ద పెద్ద, పాసేజస్ మెమొరైజ్ చెయ్యగలరు. నా కొందరు ఇతర ఆసియా దేశ విద్యార్ధులు కూడా ఇంతే. కాని మెమొరీ, అన్ని వేళలా సహాయకారి కాదు. సరిగా అవసర సమయాల్లో మోసగిస్తుంది. నువ్వు తప్పక, మ్యూజిక్ స్కోర్ చదవటం, నేర్చుకోవాలి. లేకుంటే ఛేంబర్ మ్యూజిక్, ఆర్కెస్ట్రాలలో ఇతరులతో కలిసి వాయించలేవు. గాట్ ఇట్!” అన్నాడు చివర్లో నవ్వుతూ.

“ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్.” అంది నిసి.

పియానో వద్ద కూర్చోటం దగ్గర్నుంచి, ఆ పోశ్చర్‌లో, ఆ చేతులు కదలించటంలో ఎంత గ్రేస్ ఉంది. ఎంత పధ్దతి, ఎంత సైన్స్, ఎంత ఆర్ట్. ఆమెకు పాఠం గంట నిమిషంలాగా గడిచి పోయింది. మొదట్లోనే ఇన్ని నేర్చుకోవాల్సినవి ఉంటే, పోను పోనూ, ఇంకా ఎంత కాంప్లెక్సిటీ పెరుగుతుందో. నా మెదడుకూ నా చేతులకూ కావాల్సినంత పని, అనుకుంటూ, నిసి ప్రతి వారమూ పాఠం కోసం ఎదురు చూడసాగింది. ఆమెకు, తనకు అంతకు ముందు తెలియని విషయాలు, విద్యలు నేర్చుకోటం ఇష్టం. విషయం కఠినమైన కొద్దీ, ఆమెకు దానిపై ఇష్టం ఎక్కువ అవుతుంది.