కవాఫి(Constantine P. Cavafy)ఒక గ్రీకు కవి.కుటుంబ వ్యాపార రీత్యా ఈజిప్ట్ లోని అలెక్సాండ్రియాలో నివాసం. మన గురజాడకు సమకాలికుడు.అప్పుడు మన తెలుగులాగే గ్రీకులో కూడా గ్రాంధిక వ్యావహారిక( Demotic )భాషావాదాలు మంచి ఊపులో వున్నాయి.తన ఆధునిక కవిత్వానికి కావలసిన భాషను కొత్త పాతల మేలు కలయిక తో సమకూర్చుకొన్నాడు. గురజాడ,కవాఫి ఇద్దరిలో గొప్ప చారిత్రక అభినివేశాన్ని గమనించవచ్చు.ఇద్దరూ వాతావరణ కల్పన లో సిద్ధహస్తులు.ఇతని పరిధి కవిత్వానికి పరిమితం.ప్రేమ, కళలూ,రాజకీయం ఇతని కవితా వస్తువులు.గ్రీకు,రోమన్ కాలం నాటి మత పరిస్థితులు,రాజకీయాల మీద కవాఫి రాసిన కవిత్వం విశిష్టమైనది.బలమైన సెక్యులర్ రాచరిక వ్యవస్థను రూపొందించిన రోమన్ ల పాగన్ మతం స్థానే క్రైస్తవం వ్యాపించి,సహనంలేని మతవ్యవస్థలకు ఎలా అంకురార్పణ జరిగిందో అద్భుతంగా చిత్రీకరిస్తాడు.తన జీవితకాలం లో కీర్తి కండూతిని ఆశించలేదు. నిబ్బరంగా రాస్తూ పోయాడు.గాఢ ప్రతిభుడైన కవాఫి కవితా శిల్పం అనుపమానం.ఇరవై శతాబ్దిలో ఎన్నదగిన కవుల్లో నిస్సందేహంగా ఇతనొకడు.
కోరికలు
వృద్ధులు కాకుండా చనిపోయినవారి అందమైన శరీరాల్లా
అశ్రువులతో,వాటిని మూస్తారు అద్భుతసమాధి మందిరాల్లో
గులాబీలు తలదగ్గర,మల్లెలు పాదాల చెంత
అలాగే కనిపిస్తాయి,తీరకుండా గతించిన కోరికలు
ఇంద్రియానందపు రాత్రి,చంద్రజ్యోత్స్నాప్రభాతం
కనీసం వాటిలో ఒక్కటీ నెరవేరకుండా
సూర్యుడిగుడిలో పూజారి
కన్న తండ్రి కడు ముసలి
నన్నెంతగా ప్రేమించాడు;
నాన్న కోసం పొగిలి ఏడుస్తాను
మొన్న పోయాడు,తెల్లారేముందు.
ఓ యేసుప్రభువా నా నిత్యకృత్యం
నీ పవిత్ర చర్చి నియమాలను
ప్రతి పనిలో,ప్రతి పదంలో,
ప్రతి ఆలోచనలో పాటించడం.
అసలు వీటిని పట్టించుకోనివారిని
విసర్జిస్తానుకానీ రోదిస్తానిప్పుడు;
దుఃఖిస్తాను,ఓ ప్రభూ,మా నాన్న కోసం
ఏది ఏమైనాచెప్పలేక పోతున్నా తను
పాడు సూర్యుడిగుడిలో పూజారి
notes
పాగన్ మతం నుండి క్రైస్తవం పుచ్చుకొన్న పూజారి కొడుకు అంతరంగ మధనం. రోమన్లు పలు దేవతలను ఆరాధించేవారు.పరమత సహనంతో మెలిగే వారు,పరిపాలనలోకి మతాన్ని తీసుకు రాలేదు.రోమన్లమతాన్ని Paganism అని పిలుస్తారు. గొప్ప వ్యవస్థకు ఊపిరులూదారు.శాతవాహనులతో వర్తక సంబంధాలు వుండేవి.
స్వరాలు
పరిపూర్ణం ,మరణించినవారివి
మరి అలాగే మాయమైన వారివి
మనమెంతగానో ప్రేమించిన స్వరాలు.
కొన్ని సార్లు అవి కలలో మాట్లాడుతాయి.
కొన్ని సార్లు అలోచనల్లో మనసు వినగలదు.
ఒక్క క్షణం వాటి ప్రతిధ్వనిలో ఇతర ప్రతిధ్వనులు
మన జీవితాల తొలికవిత్వంనుంచి వెనుదిరుగుతాయి
దూరాన రాత్రిని ఆర్పివేసే సంగీతంలా
ఉదయసంద్రం
నన్నిక్కడ నిలబడనివ్వండి.కొన్ని క్షణాలు ప్రకృతిని చూడనివ్వండి.
ఉదయ సముద్రతీరం ,మేఘాల్లేని ఆకాశం
నీలం..పసుపు.. అద్భుతం
వెలికాంతిలో అన్నీ ఘనం,సుందరం
నన్నిక్కడ నిలబడనివ్వండి,వీటిని చూస్తున్నట్టు భ్రమించనివ్వండి
(నిలిచాక నేను నిమేషమాత్రం నిజంగా చూస్తాను)
అలాగని ఇక్కడా నా కల్పనలూ ,జ్ఞాపకాలు
ఇంద్రియానందాల స్వప్నాలనే చూస్తానని కాదు.