హృదయాల ఊసులు

ఆ శిథిల ఉద్యానవనంలో, ఘనీభవించిన ఆ శీతల నిశ్శబ్దంలో,
రెండు ఆకృతులు ఇప్పుడే సాగిపోయాయి.

వడలిన పెదవులు, కళ్ళు కళావిహీనం;
మంద్రస్వరంలో మాటలు వారివి.

ఆ శిథిల ఉద్యానవనంలో, ఘనీభవించిన ఆ శీతల నిశ్శబ్దంలో,
రెండు ఆత్మలు గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి.

– మన పురాపారవశ్యాలు నీకు గుర్తుకు వస్తున్నాయా?
– నేనేమి గుర్తు ఉంచుకోవాలని నువ్వు ఆశించావు?

నా పేరు వినగానే నీ హృదయం ఇంకా స్పందిస్తుందా?
ఇప్పటికీ కలలో నీకు నా మనసు ఊసు వినిపిస్తుందా? – లేదు!

ఆహా! వర్ణించలేని ఆనందం నిండిన ఆ రోజులు
విడదీయరాని మన పెదవులు. – అలా అయుండవచ్చు.

ఎంత నీలంగా ఉండింది ఆకాశం, ఎంత గొప్పది మన ఆశ!
– ఆశ ఓడి ఎగిరిపోయింది, బూడిదరంగు ఆకాశం వైపు.

అలా సాగిపోయారు ఆ శిథిల నిశ్శబ్దంలో వారు
రాత్రి మాత్రమే వారి మాటలకు శ్రోత.

(మూలం: Colloque Sentimental)