అదృశ్య దుఃఖాన్నై…

జీవితం పొడవునా
ఎన్నెన్నో బతుకులతో
కలిసి పయనించిన తర్వాత
ఎన్నెన్నో ఘటనల్లోకి
ఎన్నెన్నో సందర్భాల్లోకి
ప్రవహించిన తర్వాత
ఓ జ్ఞానపుట తెరుచుకుంది
ఒక దుఃఖంలోంచి
మరో దుఃఖంలోకి సాగించే
నిరంతర ప్రయాణమే జీవితమని!
జీవితమనే గ్రంథంలో
ఆరంభవాక్యమూ ఆఖరివాక్యమూ
దుఃఖలిఖితమేనని!
ప్రతి మనిషీ
రెండు దుఃఖసంద్రాలమధ్య
ఒక నావికుడిగానో
ఒక యాత్రికుడిగానో
ఒక అన్వేషకుడిగానో సాగిపోవడం చూశాక
తేల్చుకున్నాను
దుఃఖమే పరమ సత్యమని.
నేనిక
కావ్యాలు కావ్యాలుగా
పుటలు పుటలుగా
దుఃఖాన్నే రాసుకుంటాను
వేల వేల దుఃఖానుభవాలతో పండీ పండీ
మీలోని మనిషితనం ఇగిరిపోకుండా
ఏదో ఒకరోజు ఓ అదృశ్య దుఃఖాన్నై ప్రవేశిస్తాను.

సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...