నేనెలా రాస్తాను?

…లేదా, నా రాయడానికి సంబంధించిన కొన్ని విషయాలు.

నిజానికి ఇది ఎప్పుడో బాగా ముసలివాళ్ళం అయ్యాక చేయాల్సిన పని. కానీ ‘మన’ కాలపువాళ్ళం వృద్ధాప్యం అనేదాన్ని చూస్తామా? నాకైతే ఊహకు అందడం లేదు. కాబట్టి కూడా కొన్ని పనుల్ని ముందుకు జరుపుకోవాలేమో. ప్రతి పుస్తకంలోనూ నేనెలా రాస్తున్నాననేది లీలగా చెప్తూనే ఉన్నప్పటికీ, వాటిల్లో చెప్పని కొంత ఇక్కడ చెబుతాను.

నేను కొన్ని ఉద్యోగజీవితంలో భాగంగా రాశాను. మధుపంలో భాగంగా వచ్చినవీ, రియాలిటీ చెక్ కోసం రాసినవీ. పలక–పెన్సిల్‌లో వచ్చిన కొన్ని కూడా. వీటిని నేను ఉద్యోగంలో లేకపోయినా రాసేవాడినా? ఉదాహరణకు ఒక నటుడు ఉన్నాడనుకుందాం. ఫలానా సినిమాలో అతని పెర్ఫార్మెన్స్‌కు పేరొస్తుంది. ఒకవేళ ఆ సినిమాలో అవకాశమే రాకపోయివుంటే? అంటే అతడిలో ప్రతిభ ఉండీ దాన్ని చాటుకునే అవకాశం ఉండకపోయేది. నేను ఉద్యోగజీవితంలో భాగంగా రాసినవాటికి ఈ విధమైన సమాధానం దొరుకుతోంది. ఆ సమయంలో నేను అందుబాటులో ఉండటం అనేది నేనే వాటిని రాయడానికి కారణం. బహుశా, భూమ్మీద చాలా పనులు ఇలాగే జరుగుతాయి. నేను గనక అక్కడ లేకపోయివుంటే?

ఒకవేళ నేను జర్నలిస్టునే కాకపోయి, నాకు ఏ పత్రికలతోనూ యాక్సెస్ లేకపోయివుంటే నేను ఏం రాసేవాణ్ని? ఆజన్మం, పదాలు పెదాలు, కొన్ని కథలు రాసేవాణ్ని కావొచ్చు. ఇది కూడా హైపోథీటికల్. ఒకవేళ ఉద్యోగంలో లేకపోయివుంటే నాకున్న శక్తుల్ని మరోరూపంలోకి మార్చేవాణ్నేమో. ‘మై ఆటోబయోగ్రఫీ ఇన్ బిట్స్ అండ్ పీసెస్’ కోవలోకి వచ్చే ప్రతిదీ నేను ఉద్యోగంలో లేకపోయినా రాసేవాణ్ని కావొచ్చు. కావొచ్చు మాత్రమే.

ఎలా రాసేవాడినో, ఏం రాసేవాడినో తెలియకపోయినా కచ్చితంగా రాసేవాణ్నని మాత్రం తెలుసు. ఎందుకంటే నేను జర్నలిస్టును కాకముందే రాయడం ఏమిటో నాకు తెలుసు కాబట్టి. రాయడం అంటే తెలుసూ అంటే నేను రచయితనే(రాతగాడినే) అవుతానని కాదు చెప్పడం, కేవలం నా డైరీల్లో రాసుకునేవాణ్ని కావొచ్చు. అంటే నా రాతకు సంబంధించిన యాక్టివిటీ నా వరకైనా ఏదోరూపంలో కొనసాగేదని చెప్పడం.

నిజానికి నేను అనుక్షణం రాస్తూనేవుంటాను. అంటే నా ఆలోచనలన్నీ ఎక్కడో మరుగుతూ కొన్ని వాక్యాలుగా పైకితేలుతూ ఉంటాయి. ఈ పని నేను నిద్దట్లో కూడా చేస్తూవుంటాను. ఇది రూఢిగా చెప్పడం కష్టం కదా. అంటే, నేను నిద్రలేచేసమయానికి నా వెంట్రుకలకు కొన్ని వాక్యాలు తగులుకుని ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, ఆ వాక్యాలు ఒరుసుకుపోవడం వల్లే నేను నిద్రలేస్తాను. అసలు నేను నిద్రపోతానా!

ఆలోచిస్తున్నాను అన్న ప్రతిసారీ అవి కొన్ని వాక్యాలుగా నురగ తేలతాయన్నానా. అయితే అవన్నీ ‘యాక్షన్’లోకి వస్తాయా రావా అనేది మళ్ళీ వేరే విషయం. యాక్షన్ అంటే నేను దాన్నో ఆర్టికల్‌గా మలచడం గురించి చెప్పడంలేదు; అట్లా తేలిన వాక్యాన్ని ఎక్కడో ఒక దగ్గర నోట్ చేసిపెట్టడమే నాకు సంబంధించిన ప్రాథమిక యాక్షన్. నా జేబులో ఎప్పుడూ ఒక పిన్ను చేసుకున్న నోట్‌బుక్కు పెట్టుకుంటాను; పెన్ను కచ్చితంగా ఉంటుంది; కాబట్టి చాలాసార్లు రాసిపెడతాను; కానీ అన్నిసార్లూ రాసిపెట్టను. ఎందుకంటే ఒక్కోసారి రాసిపెట్టాలనిపించదు. సోమరితనం. ఇంకోసారి ఆ మూడ్‌తో పాటుగా ఎంత క్యారీ అయిపోతానంటే, దాన్లోంచి లౌకికమైన చీకాకుపరిచే రాతలోకి దిగాలనిపించదు.

మధ్యలో ఇమడని పాయింటు ఒకటి: ఒక్కోసారి నా చేతిరాతలో రాసుకున్న వాక్యం ఏంటో ఎంత పోల్చుకున్నా అర్థమవ్వదు. ఇంకొన్నిసార్లు, తీరా ఆలోచన ఉందని కూర్చున్నాక, ఏ ఆలోచనతో కూర్చున్నానో మరిచిపోతాను. పిట్టలాగా బుడుంగున ఆలోచన లోపలికి మునిగిపోతుంది.

సోమరితనాన్నీ, కాగితం అందుబాటులో లేకపోవడాన్నీ, నిద్రలో ఉన్నప్పటి సమయాల్నీ, అర్థం కాకపోవడాన్నీ ఇలా అన్నింటినీ అధిగమించి, పిన్ను చేసుకున్న నా తెల్ల స్లిప్‌నోటుబుక్కులోకి వాక్యాలన్నీ పడిపోయాయనుకుందాం. వీటన్నింటినీ అంటే ఏ ఆలోచనది ఏదో, అది దేన్లోకి పనికొస్తుందో ఎక్కడిదక్కడ సర్దడం… ఒక దశ. ఈ నాలుగు వాక్యాలు దీన్లోకి వాడుకోవచ్చు, ఇవి ఇక్కడ వాడుకోవచ్చు… ఇట్లాగన్నమాట. సర్దుకోవడానికి సంబంధించిన పని కొంత డైరీలో జరగొచ్చు, లేదూ సిస్టమ్‌లోనే నేరుగా జరగొచ్చు.

సర్దుకున్నాక కూడా వాక్యాలన్నీ అలాగే ఉంటాయి. కాకపోతే నా దగ్గర ఎన్ని ఐటెమ్స్‌కు సరిపడా మెటీరియల్ ఉందో ఈ దశలో నాకు కొంత అర్థం అవుతుంది. అయితే, దేన్ని పూర్తిచేయడానికి సంబంధించిన ‘ఊపు’ ఎప్పుడు వస్తుందో భవిష్యత్ నిర్ణయిస్తుంది. చిన్న చిన్న పటువలు, కూజల్లో ఉన్నవి అంతే సంగతులు. అందుకే ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, వీటిని ఎందులోనైనా కలిపేసి కుండను బోర్లించేద్దాం అనిపిస్తుంది, వదిలించుకోవడానికి.

ప్రతిసారీ నేను కొన్ని వాక్యాల గుంపుతోనే కాగితంలోకి దూకుతానని కాదు. ఏకవాక్యంతో కూడా రాయడానికి ఉపక్రమించవచ్చు. ఇదెలా జరుగుతుందంటే–ముందే చిట్టచివరి వాక్యం వచ్చేసివుంటుంది; ఇక దాన్ని అందుకోవడానికి మొదట్నుంచీ మొదలెడతాను. ఇంకోసారి మొదటి వాక్యం వచ్చివుంటుంది; చివరివాక్యం అందాజాగా ఇదైవుంటుందన్న ఐడియా ఉంటుంది. ఇక్కడ వాక్యంకన్నా కూడా, ఇలా ముగిస్తానేమో, లేదా ఇలా ముగుస్తుందేమోనన్న భావమే ఎక్కువ ప్రధానం.

కొన్నిసార్లు వాక్యాలు ధారగా వచ్చేస్తుంటాయి. వాటిని వరుసగా పేర్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో, అక్కడక్కడా కొన్ని వాక్యాలుంటాయి. వాటిని కలుపుకుంటూ అల్లుకుపోతాను, ‘చుక్కలు కలపండి’లాగా.

మరికొన్నిసార్లు ఏం జరుగుతుందంటే… ఒక వాక్యం ఉంటుంది… దానికోసమే రాయడం మొదలెడతానా… తీరా ఐటెమ్ పూర్తయ్యేసరికి ఆ వాక్యాన్ని ఇమడ్చడానికి జాగా ఎక్కడా దొరకదు. వాక్యాలు అని చెప్పిన ప్రతిసారీ అవి వాక్యాలే కానక్కర్లేదు. కొంత హింట్ అని కూడా అనుకోవచ్చు. అందుకే చాలాసార్లు ఏ ప్రణాళికలోకీ లోబడకుండా కూడా రాస్తూవుంటాను. అదెలా ఉంటుందంటే–మధ్యలోంచి మొదలై కొంత ముందుకి వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. దీన్నే అంకెల్లో చెప్పాలంటే, ఆ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది: ‘10’ అంకెను మధ్య వాక్యం అనుకుంటే…

10, 9, 8, 7, 11, 12, 13, 6, 5, 4, 14, 15, 16, 3, 2, 17, 18, 1, 19, 20.

ఇంత అస్తవ్యస్త నిర్మాణం ఉంటుంది కాబట్టే, నేను రాసే ఐటెమ్స్ మళ్ళీమళ్ళీ చదువుకుంటూ ఉంటాను, గొలుసులోని కొక్కేలు సరిగ్గా పట్టుకున్నాయో లేదో చూసుకోవడం కోసం. దానికి అనుగుణంగా మళ్ళీ వాక్యాల్ని మార్చుకుంటూ వెళ్తాను. లేదా పంక్చువేషన్ సరిచేస్తాను. ఒకవేళ నేను రాయడంలోకి వచ్చేనాటికి కంప్యూటర్ అందుబాటులో లేకపోయివుంటే నా రాసే పద్ధతి ఎలా ఉండేదో నా ఊహకు అందదు. ఎందుకంటే, నేను కొన్ని పదులసార్లు ఐటెమ్‌ను కిందికీ మీదికీ జరుపుతూ వెళ్తాను.

ఇంకోసారి ఉత్తినే కొన్ని వాక్యాలుంటాయి. అయినా రాయాలని అప్పటిదాకా అనుకుని ఉండను, కానీ ఎప్పుడో ఒకసారి ఇది రాయొచ్చుకదా అనిపిస్తుంది. అంటే ఆ బ్రేకింగ్ పాయింటేదో ఠప్పున వచ్చేస్తుందన్నమాట. దీనికి సంబంధించే కొంత పొడిగింపు: కొన్ని వాక్యాలు నా కాగితంలో పోగైవుండటమో, లేదా బుర్రలో తిరుగుతూ ఉండటమో జరుగుతాయన్నానా! నిజంగా తిరుగుతాయా? ఇది అబద్ధపు పోలిక కావొచ్చు. బహుశా మెదడులో వాక్యాలన్నీ ఒకదానిమీద ఒకటి అల్లుకుని సోమరిగా పడుకుని ఉంటాయి, ఆ కదలిక మనక్కూడా తెలియనంతగా. ఏదైనా ఒకటి అందులోంచి కొంచెం ఉత్సాహంగా ఒళ్ళు విరుచుకుంటే… ‘ఓహో ఈ ఆలోచన మన దగ్గర ఉందికదా’ అని గుర్తొస్తుంది.

అసలు ఆలోచనలు లేదా వాక్యాలు మనలోకి ఎప్పుడు దూరతాయి? ఎందుకు దూరతాయి? ఎలా దూరతాయి? దూరి మరి ఏం చేస్తూవుంటాయి? ఏది కదిలించడం ద్వారా అవి కదులుతాయి? ఉత్తినే పడుకున్నవి పడుకోక మమ్మల్ని లోకం ముందు ప్రవేశపెట్టమని ఎందుకు అభ్యర్థిస్తుంటాయి? ఒక ముక్కను దేన్నో కదిలిస్తే ఇంకేదో ముక్క వచ్చి ఎందుకు తగులుకుంటుంది? అసలు అలాంటిదొకటి ఉన్నట్టుగానే తెలియకుండా గుట్టుచప్పుడుతనాన్ని ఎందుకు పాటిస్తుంటాయి? నాలోంచే నాలోకి దూకుతాయి వాక్యాలు.

వాక్యాలు అనగానే అవేవో చాలా బరువైనవనే ఇంప్రెషన్ ఏమైనా కలిగిస్తున్నానేమో, మామూలువే కావొచ్చు. నాకు ఆ మధ్యాహ్నం తినాలనిపించలేదు; ఇది కూడా వాక్యమే. అది రాయాలని ఆలోచన రావడం కూడా నాకు కష్టం మీదే వస్తుంది.

భాషాపరమైన వ్యాసాలు చదివినప్పుడు నాకు న్యూనత కలుగుతుంది. ఇది తెలుగు పదం కాదంటారూ, ప్రాకృతం ఇందులోకి వచ్చిందంటారూ, ఇది సంస్కృతం అని చెబుతారూ… అయ్యో, నేను భాష మీద పట్టు సాధించకుండానే రాస్తున్నానేమోనని దిగులు కలుగుతుంటుంది.

ఇక, పదాల ఎంపిక గురించి. భాషాజ్ఞానం ఎటూ పాత్ర పోషిస్తుంది. మన జీవితం తాలూకు ప్రభావం కూడా పదాల ఎంపికలో ఉంటుంది. ఉదాహరణకు మా ‘బాపు’ గురించి వేరేవాళ్ళతో అడ్రస్ చేసినప్పుడు, విధిగా బాపు అనేమాటనే వాడేవాణ్ని. నాన్న అనేమాట దానికి సమానంగా నాకు అనిపించకపోయేది. బాపు అంటేనే బాపు. మరోమాటలో ఆయన మొత్తం నాకు బొమ్మకట్టకపోయేది. కానీ నా పిల్లలు నన్ను నాన్న అని పిలవడం మొదలయ్యాక నాన్నలోని ‘బరువు’ తెలిసొచ్చి, బాపుకు నాన్నను ఈక్వేట్ చేయగలిగాను. నేను బాపు అన్నప్పుడు నా పిల్లలు నాన్నా అని ఎందుకు అంటున్నారంటే– దానిక్కారణం వాళ్ళమ్మ వాళ్ళనాన్నను నాన్నా అని పిలవడం.

వాక్యాలు, పేరాగ్రాఫులకు సంబంధించి కొంత చెప్పాలి. పేరాల విభజన లేకపోతే ఏదైనా చదవడం కష్టం. ఒకవేళ వాళ్ళమీద చాలా అభిమానం ఉంటే తప్ప. ఆ అభిమానం అంతకుముందు ఏర్పడటానికి ఏవి కారణాలైవుంటాయో చెప్పలేం. ఒక దృశ్యంలోంచి ఇంకో దృశ్యంలోకి మారినప్పుడు ఎటూ పేరాలు విభజిస్తాం. కానీ వాక్యాల్ని ఒకదానికింద ఒకటి రాయాల్సిన అవసరం కొన్నిసార్లు వస్తూంటుంది.

బస్సులో వెళ్ళాను.

బస్టాపులో దిగాను.

రంగమ్మను అనుసరించాను.

ఇక్కడ ‘పేరాడు’ నిడివి లేకపోయినా దృశ్యం మారింది కాబట్టి, నాకు ఇలా వాక్యాల్ని విభజించాలనిపిస్తుంది. ఇది మొత్తం నేను అనుసరించానని కాదు; ఇలా కరెక్టు అన్నప్పటినుంచీ పాటిస్తున్నాను.

నేనేమీ ఎక్కువ ఫిక్షన్ రాయకపోయినా, ఫిక్షన్‌కు సంబంధించి ఒక ఆలోచనను పంచుకుంటున్నాను.

రచన కాల్కులేషన్ కాదనడం అబద్ధం. నిర్మాణంగా మన ఆలోచన సాగడంలోనే ఒక లెక్క ఇమిడిలేదా! కథే ఎందుకు రాయాలి? నవలే ఎందుకు రాయాలి? స్వేచ్ఛగా రాయడం అంటే ఎందరు రాశారో అన్ని రకాల ప్రక్రియలు పుట్టాలికదా. ఆ మేరకు అది కాల్కులేటెడ్. ఆలోచనను ఆ మూసలోకి మళ్ళించడం. అయితే, ఒక పిల్లాడు పుట్టాలంటే ఏం చేయాలో ప్రకృతి లెక్క ఒకటుంది. అంతమాత్రాన పుట్టిన పిల్లాడు మనం చెప్పినట్టే పోతపోసినట్టుగా పెరగడు. అల్లరి చేస్తాడు, ఎదిరిస్తాడు, మనం చెప్పింది విన్నట్టు కనబడుతూనే తనదైనది కొంత కలుపుకొని పెరుగుతాడు. ఆ మేరకు ఆ పాత్రకు ఉన్న స్వేచ్ఛ అది. అలాగే ప్రతి రచనా.

రాయడం మీద నాకు పెద్ద గౌరవం ఏమీలేదు. ఇప్పుడిప్పుడే మరీ తీసివేయదగిన కార్యమేమీ కాదన్న భావన కలుగుతోంది. ఇక నేను ఎందులోనూ కుదురుకోలేను, అని నిశ్చయమైపోయింతర్వాతే ఇది జరగడంలో అసహజమేమైనా ఉందా.

చాలావరకు నేను వాక్యాల్ని పాఠకుడు ఇలా చదవాలి, అని ఊహించుకుంటాను.

చదవడానికీ, రాయడానికీ మధ్య లింకు ఇంకా నేను కనుక్కోవలసే ఉంది. చదివితే ఆలోచన వస్తుంది. కానీ చదివినదాన్లోంచి రాదు. ఈ తేడా చాలా ముఖ్యం. ఎక్కడో ఒక కొనను పట్టుకుని పాక్కువెళ్ళడం లాంటిది. లేదా అది మనలోని నిద్రాణంగా ఉన్నదాన్ని దేన్నో తట్టిలేపుతుంది కావొచ్చు. ఆ మెరుపు మన మీద సోకుతుంది కావొచ్చు. అసలు ఏం జరిగి ఆలోచన వస్తుందో చెప్పలేం.

ధాన్యాన్ని కుప్పనూకడం అంటే అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చడం మాత్రమే కాదు. చేటతో ఎగెయ్యాలి ధాన్యాన్ని. ఎగేసింది శిఖరం మీంచి జారుతుంటేనే ఒక సిమ్మెట్రీ ఫామ్ అవుతూవుంటుంది. రాతకూ ఇదే వర్తిస్తుంది.

ఇదంతా చాలా కాంక్రీటుగా చెప్పానా! కానీ నేను మాట్లాడిన ప్రతిదానికీ ఒక పశ్చాత్తాపం ఉంటుంది. అంటే అలా మాట్లాడవలసింది కాదూ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేను రాసిందానికి కూడా ఉంటుంది. స్పష్టంగా చెప్పలేనుగానీ, ఇంకా స్పష్టంగా చెప్పాల్సిందేదో చెప్పలేకపోయాననిపించడం దీనిక్కారణం కావొచ్చు.

దేన్ని ఎప్పుడు రాశామో పేర్కొంటాం. ఇది కొంత అర్థంలేని పనే అనిపిస్తుంది. లేదూ దీనికి సంబంధించిన కొంత క్లారిటీ తెచ్చుకోవాలి. దేనికైనా తుదిఫలితం గురించే చెప్పగలంగానీ ప్రారంభం ఎక్కడో చెప్పలేం. ఉదాహరణకు ఒక ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారికంగా గృహప్రవేశం చేసినరోజే సాధారణంగా ఇంటి నిర్మాణం పూర్తయిందిగా భావిస్తాం. కానీ దాని నిర్మాణం ఎక్కడ ప్రారంభమైందీ? తుది తాపడాలు చేసినప్పుడా? కప్పు పడినప్పుడా? పునాదులు తవ్వినప్పుడా? ఇంటినిర్మాణం గురించి తర్జన భర్జన పడినప్పుడా? దానికయ్యే రూపాయలు సమకూర్చుకున్నప్పుడా? ఆలోచన బీజం పడినప్పుడా? కానీ ఇవేవీ లెక్కలోకి రావు. రాతకు సంబంధించి కూడా అది దశలు దశలుగా ఇలా ఉంటూనేవుంటుంది. కీలకమైనదంతా ఎప్పుడో అందులోకి వచ్చిచేరినా, ఆ చిట్టచివరి మెరుగు దిద్దినప్పుడే మనం పూర్తయినట్టుగా అంగీకరిస్తాం. పిల్లల పుట్టుకకీ ఇదంతా వర్తిస్తుంది.

ఇదంతా చదివాక, పుస్తకంలోకి వెళ్ళి ఇందులో నేను ఎన్ని పాటించాను అని గనక మీరు చూసి డిజప్పాయింట్ అయితే నేనేమీ చేయలేను. ఎందుకంటే, నేను ఎలా రాస్తున్నానో కంటే కూడా నేను ఎలా రాస్తున్నానని అనుకుంటున్నానో అది రాశాను. అసలు ఎలా రాస్తామో నిజంగా చెప్పడం సాధ్యమా?

పాయింట్సుగానే రాసినప్పటికీ, దీన్ని కూడా ఒక ఆర్టికల్‌గా గనక భావిస్తే, ఇక ఇదే దీనికి చివరివాక్యం కాగలదు. ‘ఇదంతా చెప్పడానికి ఈయనెవరు?’ అన్న అర్హతానర్హతల ప్రశ్నేదో చదువరిలో మొలకెత్తడం సహజమేననుకుంటాను. దానికి ఒకటే జవాబు: నేను ఏనుగును కాకపోయినా కనీసం కుందేలును!

(2014 అక్టోబర్)


పుస్తకం: ఆజన్మం
రచన: పూడూరి రాజిరెడ్డి.
ప్రచురణ: కృష్ణకాంత్ ప్రచురణలు, తెనాలి. 2021. ఫోన్: 97055 53567.
వెల: రూ. 280/-

దొరికేచోటు: అనల్ప బుక్ కంపెనీ (ఫోన్: 7093800303); అమెజాన్.ఇన్; నవోదయ బుక్ హౌస్ (ఫోన్: 91-9000413413, 040-24652387); కినిగె.