అప్పుడిక

హృదయం మెలిపడ్డ ప్రతిసారీ
పునరపి మరణపు
వేలపుటల్లో ఏముందో
ఎవరు మాత్రం చదవగలరు?

కన్నుల బావులలోంచి
వేదన మొత్తం తోడిపోశాక
ఆ చూపుల లోతుల్లోకి
ఎంత శ్రద్ధగా తొంగి చూసినా
ఏమీ పట్టుబడదు

పేర్చే కొద్దీ ఆలోచనలగుట్టలు
నింగిని తాకుతుంటాయి
అనుభవాలను తలచుకునే కొద్దీ
నీలినీడలు మాత్రమే
పడగ విప్పుతాయి

అందమైన జ్ఞాపకాల పేజీలన్నీ
చెదలు పట్టి
పొడిపొడిగా రాలిపోతుంటే
మరపు మలుపులలో
అనుభూతుల స్మృతులన్నీ వెలసి
దిగులు పెంకులను విసిరేస్తోంటే
మనసు కొలను అల్లకల్లోలమవుతుంది

అయినా
తడిసిన ఏ గుండెను తడిమినా
అదే పాట వినబడుతుంది
దారిలో తారసపడిన
ప్రతీ మరణాన్నీ
విత్తుగా నాటి
జీవితాన్ని పచ్చగా
మొలకెత్తించుకోమనే గీతమే
జీవితసారాన్ని స్ఫురణకు తెస్తుంది.