ఎన్నిమార్లు తట్టినా
తెరుచుకోని తలుపుల వద్ద
చేతులు జోడించి
ప్రాథేయపడతాను
తలుపుల వెనుక దాగిన
తలపుల మడతలు విప్పుదామని
శతవిధాల ప్రయత్నిస్తాను.
ఆ ఏకాంతసౌధంలో మూలమూలన
వేళ్ళాడే చీకటిబూజులను దులుపుదామని
మౌనపు పొరలను తొలగిద్దామని
అల్లకల్లోలమవుతాను.
నాలుగు గోడల నడుమ
పోగుపడిన దుఃఖాన్ని
చెదరగొడదామని
ఒంటరితనపు కిటికీలు తెరచి
ఒక్క వెలుగుకిరణాన్నైనా
బహూకరిద్దామని
దిగులుపొగను ఊదేసి
నులివెచ్చని ఓదార్పవుదామని
సున్నితంగానే మునివేళ్ళను తాకిస్తాను.
లోపల ఎన్ని యుగాల
కల్లోలసముద్రమో మరి
తన కెరటాల హోరును వినిపించదు
రహస్యతుఫానుల జాడ విప్పదు
పెదవులు విడివడి
ఒక్క పలుకైనా రాలదు
చూపులు సాగదీసి
అగాధంలోకి ఎంతగా తొంగిచూసినా
ఏమీ పట్టుబడదు
దబదబా బాదినా
తలుపులలోనూ
వెనుక గడ్డకట్టిన నిశ్శబ్దంలోనూ
కదలిక రాదు.
కొన్ని తలపులూ తలుపులూ అంతే
ఎప్పటికీ తెరుచుకోవు
చమురంతా ఆవిరైపోయి
వేసారిన ప్రాణదీపం ఆరిపోయినా సరే!