(ఈ వ్యాసపు మొదటిభాగంఇక్కడ; రెండవభాగం ఇక్కడ; మూడవభాగం ఇక్కడ చదవండి.)
వాహబీల జిహాద్ యుద్ధములు
వాహబీలనువారు ఇస్లాము మతములోని నైష్ఠికులు. వీరు మహమ్మదు ప్రవక్త విధించిన మహమ్మదీయ మతధర్మములను యథావిధిగానాచరించవలెనను పట్టుదల కలిగి అభివృద్ధి పద్ధతులనుగాని మార్పులను గాని సహింపక మతావేశపరులుగానుందురు. ఇందులకు భిన్నముగా ప్రవర్తించువారందరిని ‘కాఫిరు’లుగా పరిగణింతురు. మహమ్మదుగారి నిజమైన మతధర్మములకు విరోధులైనవారందఱు తమశత్రువులుగానెంచుదురు. వారు తలపెట్టిన కార్యములెల్ల మతధర్మములను సంరక్షించుటకు చేయు ‘జిహాద్’ అను ధర్మయుద్ధములుగానెంచి ఆ కృషియందు ప్రాణములనుబాసినచో స్వర్గము లభించునని ఎంచుదురు. అందువలన వారేయుద్యమమునారంభించినను దానినావేశముతో ప్రచారం చేయుదురు.
మహమ్మదీయులందరును సోదరులవలే నుండవలెననియు అందులో నొక తెగకు నింకొక తెగకు వైరములుండరాదనియు వీరియభిప్రాయము. అందువలన భారతదేశ పశ్చిమోత్తర సరిహద్దులో నున్న వివిధ పఠానులను తెగలవారొండొరులపైన పగసాధించుటకై చేయు దండయాత్రలను నరవధలను వీరు సహింపక అందఱినేకము చేయుటకు ప్రయత్నించిరి. వాహబీలు ఖురానులోని విధినిషేధములు తప్ప సాధారణముగా మహమ్మదీయులవలంబించు ఇతర ఆచారములను అంగీకరింపరు.
వాహబీశాఖ పశ్చిమోత్తర పరగణాలలోని స్వాటు సిత్తాన ప్రాంతములందు మొదట అభివృద్ధి చెంది అక్కడి సరిహద్దులోనుండు పఠాను జాతులతో సంబంధము కలిగియుండెను. వాహబీలు మొదట సిత్తాన పట్టణములోను మల్కా (మల్క) జిల్లాలోని ఒక కొండప్రాంతమునను స్థిరనివాసమేర్పరచుకొనిరి. ఇది సిందు నదికిని కాబూలు నదికిని సరిహద్దులోనుండెను. స్వాట్ తెగవారును ఆఫ్‌గనులును వాహబీశాఖ యభివృద్ధికి తోడ్పడిరి. తరువాత వీరు ఉత్తర భారతదేశములో వ్యాపించి పట్నా నగరమును తమకు ముఖ్యకార్యస్థానముగా చేసికొనిరి. అటుపిమ్మట వీరు దేశములోని అన్నిప్రాంతములకును తమ ఫకీరులను పంపి ప్రతిగ్రామమునందును ప్రచారమునారంభించిరి.
వాహబీ ఫకీరులు ప్రతి గ్రామమున పట్టణమున ఇస్లాము మత ప్రాశస్త్యమును బోధించుచు అందుకు భిన్నముగా ప్రవర్తించువారిపైన మతయుద్ధము చేయవలయునను తీవ్రప్రచారము చేయసాగిరి. ఆంగ్లేయులు మహమ్మదీయులకు హేయమైన పందిమాంసమును తిని అనాచారముగా నుండు పరంగీల జాతికి చెందిన కాఫిరులనియు వారీ దేశములోని మహమ్మదీయులకు ప్రభువులై ఏలుట అన్యాయమనియు వీరిని దేశమునుండి వెళ్ళగొట్టవలెననియు వీరు ప్రచారము చేయుచుండిరి.
మద్రాసులోని సిపాయిలందరు దొరటోపీలవంటి శిరస్త్రాణములను ధరించవలెననియు హిందూసిపాయిలు బొట్టు చెవులపోగులు తీసివేసి గడ్డములు గొరిగించుకొనవలెననియు 1806లో కొత్త సైనిక నిబంధనలను చేసినప్పుడు ఇంగ్లీషువారు సిపాయిలకు దొర టోపీలు పెట్టించి వారికి పరంగీల వేషము వేసి మతభ్రష్టులను చేయదలచిరనియు తరువాత కిరస్తానీ మతముల కలుపుకొందురనియు నీకాఫిరులైన ఇంగ్లీషువాని ప్రభుత్వమునకు వినాశకాలమాసన్నమైనదనియు నిదిత్వరలోనే కూలిపోవుననియు రాయివేలూరులోనొక వాహబీఫకీరు ప్రచారము చేయసాగెను.
మైసూరునేలిన టిప్పుసుల్తాను మహమ్మదీయ మతావేశపరుడైయుండెను. ఆంగ్లేయులు ఆయనపైన యుద్ధముచేసి రాజ్యమును వశముచేసికొని టిప్పుసుల్తానును వాని 19మంది కొమాళ్ళను వారి కుటుంబములను రాయవేలూరు కోటలో ఖైదుచేసిరి. వారికి కావలిగా 1500 మంది సిపాయిలను కొన్ని వందలమంది ఇంగ్లీషు సైనికులను అక్కడనుంచిరి. ఈ రాజకుటుంబమువారి పరిజనమునతో వాహబీ ఫకీరులు సంబంధముకలిగి సిపాయిలలో అసంతృప్తి వ్యాపింపజేసిరని అందువలననే 1806లో దేశీయ సిపాయిలు తిరగబడి కొందరు ఇంగ్లీషు సైనికోద్యోగులను సైనికులను తుపాకులతో కాల్చిచంపిరని ఆ కాలమున అందఱు అనుకొనిరి. ఏదియెట్లున్నను వాహబీఫకీరు రాయవేలూరులో మతప్రచారము పేరున ఇంగ్లీషువారికి వ్యతిరేకముగా కుట్రలు చేయుచుండిన మాట నిజము. ఈ ఫకీరులెక్కడున్నను కాఫిరులైన ఆంగ్లేయులపైన కత్తికట్టవలెనని ప్రచారము చేయుచుందురు.
1824
అస్సామురాష్ట్రమాకాలమున బర్మావారిక్రిందనుండెను. నాఫ్‌నదిలోని ఒక లంక తమదని బర్మా గవర్నరు దానినాక్రమింపజూచెను. ఇంగ్లీషువారు 1824 ఫిబ్రవరి 24వ తేదీన బర్మాపైన దండయాత్ర చేయుటకు బయలుదేరిరి. వంగదేశమునుండి బర్మాకు పోవు మార్గము ఘోరారణ్యములతోను నదులతోను నిండియుండెను. ఒక ఇంగ్లీషు సైనికదళమును బర్మావారు మే 15వ తేదీన ఓడించిరి. తరువాత ఇంగ్లీషువారు బర్మాలో కొంత జయమును పొంది తుదకు సంధి జరిగినను ఈ అపజయపు వార్త భారతదేశములో అగ్నివలే వ్యాపించెను. దేశములో ఇంగ్లీషువారి ప్రభుత్వము పట్ల అసంతృప్తిగలవారికి వాహబీల తీవ్రప్రచారము తోడయ్యెను. అంతట 1824లో ఉత్తర హిందుస్థానములోని ఎగువ ప్రాంతములందలి అన్ని పరగణాలలోను అన్ని జిల్లాలలోను కల్లోలములు తిరుగుబాటులు చెలరేగెను. దీనినిగూర్చి ఆ కాలమున జడ్జిగానుండిన ఫ్రెడరిక్ జాన్‌షోర్‌గారు 1833లో వ్రాసిరి (చూడు: 1824 నాటి తిరుగుబాటు అను ప్రకరణము) ఆ సమయమున దేశములోని గొప్ప హిందూ మహమ్మదీయ రాజవంశీయులైన ప్రభువులు జాగీరుదార్లు మొదలైనవారందరును ఇంగ్లీషువారికి వ్యతిరేకులైరి. ఇంగ్లీషురాజ్యమంతరించినది ‘ఆంగ్రీజ్ ముర్దాబాద్’ ఇంగ్లీషువారు నశింతురుగాక అను కేకలతో ఆయుధపాణులైన అల్లరి జనము వందలకొలది తిరుగుబాటు చేసిరి.
1838
కాఫిరులైన ఆంగ్లేయులు హిందూదేశములోని మహమ్మదీయసామ్రాజ్యమును నాశనము చేసి తాము ప్రభువులగుటయెగాక ప్రక్కనున్న ఆఫ్‌గన్ రాజ్యమునందలి వ్యవహారములలో కలుగజేసుకొని దోస్తు మహమ్మదుకు బదులుగా షా షుజాను సింహాసనమెక్కించుటకు కుట్రచేసిరి. దీనినిగూర్చి వారు 1838 అక్టోబరు 1వ తేదీన సిమ్లాలోనొక ప్రకటనకూడా చేసిరి. ఆఫ్‌గనిస్థానముననింగ్లీషువారు చేసిన యుద్ధములందు దేశీయ సైనికులు చాలమంది ప్రాణములనుబాసిరి. కాఫిరులైన ఆంగ్లేయుల యొక్క సహాయమును షా షుజా పొందినందులకు వాహబీలాశ్చర్యపడిరి. ఆఫ్‌గనిస్థానములోని యుద్ధము తీవ్రముగానుండెను. ఆ సమయమున వాహబీలు భారతదేశములో నింగ్లీషువారిని దేశమునుండి వెళ్ళగొట్టవలెనని గొప్ప కుట్రను సాగించుచుండిరి.
వాహబీలు తమ పకీరులను దక్షిణహిందూదేశమున హైదరాబాదుకును కర్నూలుకును మద్రాసుకు దక్షిణమునగల దూరప్రాంతములకు కూడా పంపి ఇంగ్లీషువారిపైన జిహాద్ మతయుద్ధముచేయుటకై కుట్రలు చేసిరి. ఆ యుద్ధముకొరకు సర్వసన్నాహములును జరిగెను. కర్నూలు నవాబైన గులాం రసూలుఖాను వాహబీల కుట్రకులోనై తన కోటలో నేలకొట్లు నిర్మించి అందులోనొక గొప్ప ఆయుధాగారమునుంచి ఫిరంగుల బండ్లు గొట్టములు గుండ్లు తయారుచేయించెను. హైదరాబాదు నిజాముగారి సోదరుడైన ముబారిజ్ ఉద్దౌలా తన ఆంతరంగికులతో హైదరాబాదులో నీకుట్రకు నాయకుడయ్యెను. హైదరాబాదులోని ఇంగ్లీషు సైన్యములోని సిపాయిలను తిరుగుబాటు చేయుటకై వారిలో కొందరి మనస్సులు విరిచిరి. అప్పుడు చిత్రవిచిత్రములైన రహస్యపద్ధతులతో రహస్యప్రచారము జరుగుచుండెను. 1839లో నాకస్మికముగా నీకుట్రలసంగతి బయటపడెను. అంతట ఇంగ్లీషువారు విచారించగా నిదిచాలాతీవ్రముగా వ్రేళ్ళుపారినట్లు తెలిసెను. ముబారిజ్ ఉద్దౌలా టోంకు నవాబుతోను రాంపూరు ఉదయగిరి అయోధ్య నవాబులతోను ఉత్తరప్రత్యుత్తరములు జరిపినట్లు బయల్పడెను. అంతట ముచారిజ్ ఉద్దౌలాను ఆయన అనుచరులను 40మందిని పట్టుకొని ఆయనను గోలకొండ కోటలో ఖైదుచేసిరి. అతడక్కడనే 1854లో మరణించెను. గులాం రసూలుఖాను కోటను శోధించగా రహస్య ఆయుధాగారము బయల్పడెను. అంతటనతనిని పదచ్యుతునిగాచేసి తిరుచునాపల్లిలో ఖైదుచేసిరి. అక్కడనతడింగ్లీషువారిని మెప్పించుటకై చర్చికివెళ్ళుట ప్రారంభించగా నొకవాహబీ ఫకీరతనిని వధించెను. ఈ సంగతులను గూర్చి ‘కందనూరు నవాబు రాజరికము’ అను శీర్షిక క్రింద కథలు గాథలు అను గ్రంథమునందు నేను వ్రాసియున్నాను.
సాత్విక నిరోధ ప్రకరణము
ధరణా కూర్చుని సాత్విక నిరోధము చేయుట భారతదేశములో అనాదిసిద్ధమైన సత్యాగ్రహ పద్ధతి. ఒకడింకొకనికన్యాయము చేసినయెడల అన్యాయమును పొందినవాడాయన్యాయము చేసినవాని వాకిట తిండి తినక, ఎండయనక వానయనక నిశ్చలముగా కూర్చుండి యుండును. దీనికే ధరణాకూర్పొనుటయందురు. ఇట్లు కూర్చుండి ప్రాయోపవేశము చేసి ప్రాణములను బాసినవాని యుసురాయింటివానికి గొట్టుననియు, చనిపోయినవాడు దయ్యమై పీకికొని తినుననియు ప్రజలనమ్మకము. ఇట్లొకడుపవాసముతో పడియుండగా నింటివారు భుజించుట గాని, తమ యింటిపనులు చక్కబెట్టుకొనుటగాని శ్రేయస్కరము కాదనియు జనుల నమ్మకము. అందువలన ఎవనికే బాధ కలిగినను వాడు తన్ను బాధించువానిని కొట్టక తిట్టక, వాని వాకిటనిట్లు ధరణా కూర్చొని వానిని సాధించుచుండును. ఋణబాధపడు ఋణగ్రస్తుడు ఋణదాత యింటి గుమ్మములో ప్రాయోపవేశము చేయుటయు, పెంకెవాడగు ఋణదాత ఋణగ్రస్తుని వాకిట ధరణా పండుకొనటయు సామాన్యముగ జరుగుచుండెను. చీటికి మాటికి నిట్లు ప్రజలు ధరణాకూర్చొని ప్రాయోపవేశము చేసి యొండొరులను పీడించుకొనుటయు దీనిని రాజకీయములందు ప్రయోగించి ప్రభుత్వమువారికిగూడ నేమి చేయుటకు తోచకుండునట్లు చేయుటయు జూచి, బ్రిటిష్ ప్రభుత్వమువారు శిక్షాస్మృతిలో దీనినొక నేరముగా జేసిరి. (Sec. 508 I.P.C.)
రాజకీయాలలో సాత్విక నిరోధం
“ఈ భారతదేశ ప్రజలకును వీరిని పరిపాలించు ప్రభువులకును మధ్య మొదటి నుండియు దాటశక్యము గాని అగాధమైన అంతరముండెను. ఈ ఆంగ్లేయ ప్రభుత్వమునకు పూర్వమీ ప్రజలనేలిన మొగలాయి ప్రభువులును దేశీయ రాజులునుగూడ నిరంకుశులుగ నుండిరి. వీరు ప్రజలకు బాధ్యతవహించి పరిపాలించువారు కానందున, ప్రజల విశ్వాసమునకు పాత్రులుగాలేదు. ప్రభుత్వోద్దేశ్యములను ప్రజలు గ్రహింపలేకుండిరి. ప్రజల కోర్కెలను మన్నించునట్లు చేయుటకుగాని ప్రజల యభిమతానుసారముగా పరిపాలన జరుగునట్లు చేయుటకుగాని ప్రజలకెట్టి యధికారములు గాని పలుకుబడిగాని లేకపోవుటవలన, ప్రభుత్వమువారి చర్యలు ప్రజల కిష్టములేనప్పుడు ప్రజలాయుధములు పూని తిరుగుబాటు చేయుటయో, లేదా అందరు నేకమై కట్టుగట్టి సాత్విక నిరోధము చేయుటయో తప్ప ప్రభుత్వమువారి నిర్ణయములను మార్చుటకు వేరు మార్గములు లేకుండెను. ఈ సాత్విక నిరోధ విధానము ఈ దేశప్రజలలో అనాది సిద్ధమైన ఆయుధముగానున్నది. ఆంగ్లేయులీ దేశమునకు ప్రభువులైన పిమ్మటగూడ ప్రజల యభిమతానుసారముగ పరిపాలించు పద్దతి నవలంబింపలేదు. పైగా నీ విదేశీయ పాలకులకు పాలితులకును రంగులోను భాషలోను మతములోను ఇది యది యననేల ఒక మానవున కింకొకనికి పరస్పరముగనుండు అన్ని సంబంధములందునుగూడ విపరీతమైన తారతమ్యమున్నందువలన, సహజమైన సానుభూతి మృగ్యమైపోయినది. కేవలము ఆంగ్లేయుల బలమును జూచి భయపడియె లొంగియున్నారు. పూర్వపు ప్రభుత్వములపైన నున్నంతపాటి పలుకుబడియైనను ప్రజలకు కుంపిణీ పరిపాలనమున లేకుండెను. ఈ సందర్భమున సాత్విక నిరోధమే వారికి శరణ్యమైనది. కుంపిణీవారి పాలనమున భారతీయ ప్రజలు సాత్విక నిరోధము చేసిన యుదాహరణములనేకములు గలవు.”
అని చెన్న పట్టణ గవర్నరుగనుండిన సర్ ఛార్లెస్ ట్రెవిలియన్‌గారు 1859లో వ్రాసియున్నారు. సిపాయీల విప్లవానంతరము భారత దేశమును పాలించు ఆంగ్లేయ గవర్నరు జనరల్ కార్యాలోచన సభలో ఫైనాన్సు ద్రవ్య వ్యవహారముల సభ్యుడగు జేమ్సు విల్సన్‌గారు భారతదేశ ప్రజలపైన క్రొత్త పన్నులు విధించుటకొక ప్రణాళికను జారీచేసిరి. దానివలన ఉప్పు పన్ను హెచ్చించుటయే గాక క్రొత్తగా ఆదాయములపైన పన్ను పొగాకుపైన పన్ను వృత్తులు వ్యాపారములకు లైసెన్సుపన్ను విధింపదలచెను. ఆంగ్ల పరిపాలనలో ప్రజలు పొందు లాభములు లేకపోగా పన్నులిచ్చుకోలేక బాధలుపడుచున్నారనియు ప్రభుత్వమువారి సైనిక వ్యయము ద్రవ్యపద్ధతి లోపభూయిష్ఠముగా నున్నదనియు ఈ కొత్త పన్నులు విధించుట యన్యాయమనియు చెప్పుచు ఆనాడు చెన్నపట్టణమున గవర్నరుగానుండిన సర్ ఛార్లెస్ ట్రెవిలియన్‌గారు దీనికి తన అసమ్మతిని సూచించుచు 10–6–1859 తేదీనను, దరిమిలానుగూడ మినిట్సు వ్రాసి గవర్నరు జనరలుకంపిరి. కేంద్ర ప్రభుత్వమువారి కోరికపైన భారతదేశ ప్రజల స్థితిగతులను గూర్చియు ఈ క్రొత్త పన్నులు విధించుటను గూర్చియు అనుభవజ్ఞులగు జిల్లాకలెక్టరుల యభిప్రాయములను గూడ సేకరించి పైకి పంపిరి. వీరందరును ట్రెవిలియన్‌గారి అభిప్రాయములతో నేకీభవించిరి. అయినను కేంద్ర ప్రభుత్వమువారు తమ పట్టు విడువలేదు. ట్రెవిలియన్‌గారు వ్రాసిన మినిట్సు ప్రకటింపగా ప్రజలీ యన్యాయమును గూర్చి అసమ్మతి సభలుచేసి ఆందోళన చేసిరి. దీనికంతకును ట్రెవిలియనుగారే కారకులని కేంద్ర ప్రభుత్వమువారి ఫిర్యాదుపైన సీమ ప్రభుత్వమువారు ట్రెవిలియన్‌గారిని పనివదిలి వెనుకకు రమ్మనిరి. ఈ వ్యవహార సందర్భములను గూర్చి ట్రెవిలియన్‌గారొక స్టేటుమెంటును జారీచేయగా దానితో వారి మినిట్సు చేర్చబడి 1861లో లాంగ్మెన్సుగ్రీను అండ్ కంపెనీవారు దీనిని ప్రకటించిరి. పైన వ్రాసిన వాక్యములా పుస్తకములోనివే (Statement of Sir Charles Trevelyan on the circumstances connected with his recall from the Government of Madras. Longmans Green &Co., 1860). ఈ సర్ చార్లెస్ ట్రెవిలియనుగారిని తరువాత కేంద్ర ప్రభుత్వ సభ్యునిగా నియమించగా ప్రజలెంతో సంతోషించి గొప్ప సభలు చేసి ఆయనకు స్వాగతమిచ్చి వారియెడల తమకుగల భక్తి విశ్వాసములను వెల్లడించిరి.
ఆంగ్లేయ కుంపినీ పరిపాలనమున భారతదేశ ప్రజలు తమకుగల బాధలను మాన్పుకొనుటకు చేసిన సాత్విక నిరోధములలో కుంపినీవారు వివిధ ప్రాంతములందు వివిధ కాలములలో ఇండ్ల పన్ను విధించినప్పుడు ప్రజలు చేసిన సత్యాగ్రహముల చరిత్ర చాలా చిత్రమైనది.
ఇండ్ల పన్నుపై సత్యాగ్రహము
మునిసిపాలిటీలలోనున్న ఇండ్లపైన పన్నులు చెల్లించుటకు మనమిప్పుడలవాటుపడియున్నాము. కాని, కొత్తగా కుంపినీవారీ పన్ను విధించినప్పుడు ఇది మన పూర్వులకు విపరీతముగను, అన్యాయముగను కనపడినది. ఎక్కడనైనను భూములపైన పన్ను వేయుట కలదు. ఎగుమతి దిగుమతి సరకుల పైన పన్ను వేయుట కలదు. కాని మా సొమ్ముతో మా స్థలములలో మేము గట్టుకొన్న ఇండ్లపైన పన్నులు వేయుట అక్రమమని మన పూర్వులు వాదించిరి. ఇక మా పిల్లలపైనగూడా పన్ను విధింపబడును కాబోలుననిరి. ఇండ్లపైన కుంపినీవారు విధించు పన్నులిచ్చుటకు నిరాకరించి, సమ్మెలుకట్టి, ధరణా గూర్చుని సాత్విక నిరోధము చేయసాగిరి.
చెన్నపట్టణమున ఆంగ్లేయ కుంపిణీవారి వర్తక స్థానముచుట్టును పెరిగిన నల్లవారిబస్తీలో ఇండ్లపన్ను వేయు ప్రయత్నము జరిగెను. ఈ బస్తీ రక్షణకొరకు చుట్టును ఆవరణగోడ ఫిరంగిదిమ్మలు కట్టవలసియుండెను. అందుకొరకు గావలసిన ఖర్చుక్రిందను నగర సంరక్షణ కొరకు గావలసిన సైన్యము ఖర్పుల క్రిందను కుంపిణీవారు ప్రజలవలన కొంత సొమ్ము వసూలు చేయదలచిరి. అందుకొరకు స్ట్రెయిన్ షాంమాస్టరు అనునతడు మద్రాసులో అధ్యక్షుడుగా నుండగా 1678లో ఇండ్లపన్ను విధింప దలచిరిగాని, ప్రజలలో పలుకుబడిగల వర్తకులు ఆందోళనచేయగా నాప్రయత్నము మానుకొనిరి.
మద్రాసులో
గిఫర్డు మద్రాసులో అధ్యక్షుడుగా నుండగా 1682లో మఱల ఇండ్ల పన్ను విధించుటకు ప్రయత్నించెను. ఈ నగర బందోబస్తు ఖర్పుల క్రింద సాలుకు 500 వరహాలిచ్చెదమని చెన్న పట్టణములో కాపురమున్న వివిధకులములవారి కులపెద్దలు వాగ్దానము చేసియుండిరి. ఆ సొమ్మునిప్పుడు కుంపిణీవారు నిర్బంధముగ వసూలుచేయ నిశ్చయించుటయే కాకుండా, చెన్నపట్టణ కాపురస్థుల నందరినిగూడ ఇంకను గొంత సొమ్ము నివ్వమని కోరిరి. ఇది వసూలు చేయుటకు ఇంటి పరిమాణములను బట్టి చిన్న పెద్ద ఇండ్ల పైన 3 మొదలు 9 ఫణముల వరకు ఇండ్లపన్ను విధించుటకు నిశ్చయించిరి. అంతట చెన్నపట్టణ కాపురస్థులందరును సమ్మెకట్టి అంగళ్ళు తెరవకుండా ఆటంకపరచి పట్టణములోనికి ధాన్యము కూడ రాకుండా నిరోధింపసాగిరి. ఈ కల్లోలము నణచుటకును పట్టణపు దర్వాజాలను కాపలా కాయుటకును కుంపిణీవారు సైనికులను బయటకుదీసికొని రావలసివచ్చెను. వివిధ కులపెద్దలను కుంపిణీ ప్రభుత్వమువారు నయమునను భయమునను లొంగదీయదలచిరి. పన్నులీయనిచో వారియిండ్లను నాశనము చేసెదమనియు, అంగళ్ళను వశపరచుకొనెదమనియు, ఒక్కొక్కరిపైన పదివరహాలు జుల్మానా విధించెదమనియు కుంపిణీవారు బెదిరించిరి. తమ ప్రవర్తనకు కులపెద్దలు క్షమాపణ కోరిరిగాని, పన్ను మాత్రము రద్దుచేయమని గట్టిగా పట్టుపట్టిరి. ఇట్లు కొన్నాళ్ళు గడచెను. తరువాత 1686లో ఇందుక్రింద కొంత రివిన్యూనైనను వసూలుపరచి తీరవలెనని కుంపిణీ వ్యవహారములకు సర్వాధికారి అయిన సర్ జాన్ ఛైల్డుగారు నిశ్చయించెను. తరువాత ఇండ్లపైన పన్ను స్థిరముగా విధింపబడినను అప్పటికి మాత్రము ప్రజల పంతము నెగ్గెను.
కాశీలో
1813లో నిట్లే కాశీనగరమున ఇండ్లపన్నులు విధింపబడగా వేలకొలది గృహస్థులు భోజనములు మాని గంగానదీతీరమునకు బోయి అక్కడ ఘట్టములలో ధరణా కూర్చొని, ప్రాయోపవేశము చేయదలచిరి. ముఖ్యులగు బాహ్మణులు ఈ ఇండ్లపన్ను అక్రమమని తెలుపుచూ, తాము దీనినిగూర్చి చేయదలచిన చర్యను వివరించుచు దేశముపై నభిమానముకలవారందరును తమతో నేకీభవించవలసినదనియు, ఆ కాగితము చూచినవారింకొకరి కందచేయవలసినదనియు, అందుకు విరుద్ధముగా ప్రవర్తించినవారికి తగులు శాపముల నుదాహరించుచు కరపత్రములు వ్రాసి కాశీలోను పరిసర గ్రామములలోనుగూడ పంచిపెట్టిరి. కుంపిణీ ప్రభుత్వమువారీయుద్యమ స్వరూపమును దెలిసికొనులోపలనే మూడులక్షలమంది ప్రజలు తమ యిండ్లను వదిలిపెట్టి, అంగళ్ళను మూసివేసి, భూములను పాడుపెట్టి, యిండ్లలో దీపారాధనలుమాని, చాలమంది భోజనములుకూడ చేయక చేతులు కట్టుకొని దుఃఖసూచకముగా తలలు వంచుకొని కాశీపట్టణము చుట్టునున్న విశాల మైదానములలో ధరణాగా గూర్చుండిరి.
అపజయము
కంపెనీ ప్రభుత్వమువారి స్థానికోద్యోగులకేమి చేయుటకును తోచలేదు. ఈ మూర్ఖులలో కొందరు చనిపోవుదురేమో యనుభయము కూడ కలిగెను. వ్యవసాయ తరుణమున పనులాగినందున క్షామముకూడ సంభవించు ననుభయము కలిగినది. రాకపోకలు, రవాణాలు నిలిచిపోయినందున, కుంపిణీవారి ఆదాయముగూడ తగ్గునని తోచినది. ఈ విచిత్ర ప్రదర్శనముకన్న దీనివలన కలిగిన కలవరమును విషాదమును ప్రజలలోనింకను తీవ్రమైన ఆశాంతిని కలిగించునని తోచినది. అయినను ప్రజల కోర్కెను మన్నించి లొంగినచో ప్రభుత్వ గౌరవమునకు భంగము కలుగునని వారు పన్నును రద్దుచేయుట కంగీకరించలేదు. స్థానికోద్యోగులు తొందరపడక అనవసరమగు చర్యలు దీసికొనక చాల అప్రమత్తతతోను శాంతముతోను మెలగిరి. ఈ సమావేశమును బలవంతముగా చెదరగొట్టినచో ప్రజలయందు విషాదభావము వర్ధిల్లియుండెడిదే! అట్లు చేసినచో తమ కార్యసాఫల్యమగునని బ్రాహ్మణులాశించియుండిరి గాని, ప్రభుత్వోద్యోగులట్లు చేయక ఈ కుట్రదారుల నాయకులతో మెల్లగా బుజ్జగించి మాటలాడుచు ఇటువంటి సందర్భములలో ప్రభుత్వము లొంగుట అసంభవమనియు, వృథాగా ధరణా గూర్చుని ప్రాయోపవేశము చేసినందువల్ల తమకు కష్టము కలుగుటతప్ప వేరు ప్రయోజనముండదనియు నచ్చచెప్పిరి. ఈ నేటివుల చర్యలను తాము గమనించినట్లుగాని వీరేమైన అక్రమములకు దిగుదురేమోయని తామనుకొనినట్లుగాని పైకి కనబరుపకుండగనే ప్రభుత్వమువారు ఘాజీపూరులనుండి ఐరోపా సైనిక దళములను తెచ్చి సిద్ధముగానుంచుకొనిరి. ఎట్టకేలకు ప్రజా సమూహము ఆకటికి మాడసాగెను.
ఇంతలో ఉరుములు మెరుములతో వచ్చిన వర్షము వీరిని తడిపి బాధపెట్టెను. అంతట తమ విధానమునందు కొంత మార్పుచేయుట అవసరమని సాత్విక నిరోధము చేయువారిలో కొందరు పలుకసాగిరి. గవర్నరు జనరలు దగ్గరకు పదివేలమంది ప్రజల రాయబారమొకటి స్వయముగ పోవుట యుక్తమనిరి. ఇది బాగున్నదని చాలమంది పలికిరి. అయితే ప్రయాణములో వీరి నందరిని భరించుటెట్లను సమస్య వచ్చెను. అంతటనొక బ్రాహ్మణ ముఖ్యుడు ఇంటికింతయని మన ఇండ్లపైననే పన్ను వేసికొని భరింతమనెను. మన యిండ్లపైననే పన్ను వేసికొనుటకొప్పుకొన్నచో ప్రభుత్వమువారితో తగవుపెట్టుకొనుటకూడ ఎందుకు? ఈ బాధలుపడుట ఎందులకు? అను విషాద భావము ప్రజాసంఘము నందు చీలిక గలిగించెను. అంతట నీ సాకుతో కొంతమంది లేచిపోయిరి. కొంతమందిమాత్రము ఎవరిఖర్పులు వారు భరించి గవర్నరు జనరలు దగ్గరకు పోవుదమనిరి. ఇట్లు ప్రజలలో అభిప్రాయభేదబీజములు నాటబడి వర్ధిల్లెను. మూడు దినముల తరువాత నీ విషయమై జరిగిన సమావేశమునకు చాలమంది రాలేదు. అయినను తమకు దొరికిన సంబారములను సేకరించికొని 10 వేలమంది మొదలు 20 వేలమందివరకూ సమావేశమై తమ ప్రస్థానమునకు బయలుదేరిరి. దీనికిగూడ మేజస్ట్రేటులు ఆటంకపరుపక దూరదృష్టితోనూరకొనిరి. త్వరలోనే వీరి తినుబండారములు హరించిపోవుననియు ప్రయాణము దుర్ఘటమగుననియు గ్రహించి, గుఱ్ఱపు రౌతులదళములతో వీరిని కనిపెట్టి యుండిరి. ఆకలి వీరిని బాధించునని కొండలు అడవులుగలదారి ఈ జన బాహుళ్యమునకు ఇబ్బందిని కలిగించునని వారెరుగుదురు. అట్లే జరిగినది. కొద్దిరోజులలోనే ఈ జనులలో చాలమంది ప్రయాణము మానివేసి, వెనుకకు మరలిరి. ఇట్లే విషయమున కుంపిణీ ప్రభుత్వము జయమును గాంచెనుగాని, ప్రజల కిష్టములేని యిండ్లపన్ను బలవంతముగా వసూలుపరచుటవలన చాల నష్టములు కష్టములు కలుగునని గవర్నరుజనరలు ప్రభుత్వమువారు గ్రహించి, దీనిని చల్లగా రద్దుచేసిరి. ఈ ప్రజల యుద్యమమును కఠినముగా అణచుటకు ప్రయత్నించి యుండినగాని జాగ్రత్తగను ఒడుపుగను ప్రభుత్వోద్యోగులు ప్రవర్తించి యుండనిచోగాని ఇది భయంకర రూపము దాల్చి భారతదేశమందంతటను నంటుకొనియుండెడిది. ఈ చరిత్ర బిషప్ హెబరుగారు రచియించిన జర్నలులో మొదటి సంపుటమున 432 మొదలు 486 పేజీలలో వర్ణింపబడియున్నది. విల్సన్‌గారు రచియించిన హిందూ దేశ చరిత్ర 1వ సంపుటము 436-469 పుటలలో గూడ ఈ చరిత్ర వర్ణింపబడినది.
ఇట్లే బేరిల్లీ పట్టణమున 1815 సంవత్సరమున ఇండ్లపన్ను విధించుటకు కుంపిణీవారు ప్రయత్నించగా ప్రజలు సాత్విక నిరోధము చేసిరి. ఈ చరిత్ర విల్సన్‌గారి హిందూదేశ చరిత్రలో 8వ సంపుటమున 120-128 పుటలలో వర్ణింపబడినది.
కొన్నేండ్ల క్రిందట దక్షిణ కన్నడ జిల్లాలో ప్రజలకిష్టములేని పన్నొకటి విధింపబడినట్లునూ అంతట ప్రజలు సాత్విక నిరోధము చేసినట్లును ఆ జిల్లాలో కలెక్టరు పనిచేసిన ఆర్ధర్ హాల్ అను నధికారి మద్రాసు గవర్నరగు సర్ ఛార్లెస్ ట్రెవిలియన్‌గారికి 1859లో నివేదించియున్నాడు. ఇట్లు గాంధి మహాత్ముడు స్వరాజ్యోద్యమమున నేడు ప్రయోగించుచున్న సాత్విక నిరోధ విధానము భారతదేశమున అనాది సిద్ధమైనది. ఈ సంగతిని మహాత్ముడిదివరకనేక పర్యాయములు వ్రాసి యున్నాడు.
(సమాప్తం)