విశ్వ మహిళా నవల: 3. ఆఫ్రా బెన్

బ్రిటిష్ రచయిత్రి ఆఫ్రా బెన్ – ఒరూనోకో

వర్జీనియా ఉల్ఫ్ (Virgina Woolf) తన ప్రఖ్యాత రచన ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్‌లో ఒకచోట అంటుంది: ‘ఆడవాళ్ళందరం కలిసికట్టుగా వెళ్ళి ఆఫ్రా బెన్ సమాధిపై పూలు చల్లాలి. ఎందుకంటే ఆడవాళ్ళకు తమ మనసువిప్పి మాట్లాడే హక్కు ఉందని మొట్టమొదటిసారి చేసి చూపించిన మహిళ ఆమె…’

ఆఫ్రా బెన్ (Aphra Behn) 17వ శతాబ్ది బ్రిటిష్ రచయిత్రి (1640-1689). తన రచనల ద్వారానే సంపాదించిన తొలి బ్రిటిష్ మహిళ. ఇంగ్లీషు రచయిత్రులు అపుడపుడూ కవితలు, ఎప్పుడైనా నాటకాలు రాస్తున్న కాలంలో నాటకాలను విస్తృతంగా రచించి, వాటి ప్రదర్శనల ద్వారా ప్రఖ్యాతి గడించిన అరుదైన మహిళ. రెండవ ఛాల్స్ ఇంగ్లండును పరిపాలించిన కాలంలో ఆమె జీవించింది. ఆమెకంటే ముందు ఒకరిద్దరు మహిళలు నాటకాలు రాసినా, 17వ శతాబ్ది బ్రిటిష్ నాటక రచయితల్లో అత్యధిక ఆదరణ పొందిన నాటకాలు రచించింది మాత్రం ఈమే. ఆమె రాసిన 19 నాటకాల్లో చాలావరకు ప్రఖ్యాతి తెచ్చుకున్నాయి, ఆమెకు కొంతవరకు ఆదాయం కూడ తెచ్చిపెట్టాయి. కానీ పేరు ప్రఖ్యాతులు, డబ్బు కొద్దోగొప్పో లభించినా, వాటితోపాటే ఆఫ్రా బెన్ తోటి రచయితల నుంచి తీవ్రవిమర్శలు కూడ ఎదుర్కొంది. దానికి ఆమె రచనలు మాత్రమే కారణం కాదు; జీవితంలోనూ నిర్మొహమాటంగా మాట్లాడడం, తనపై వచ్చిన విమర్శలను పదునుగా తిప్పికొట్టడం కూడ. ఆమె నిర్భీతిని భరించలేని సమాజం ఆమె రచనలు అనైతికమని తిట్టిపోసింది. నిజానికి రెస్టొరేషన్ యుగంనాటి బ్రిటిష్ సాహిత్యంలోని అవకరాలన్నీ ఆమె రచనల్లోనూ ఉండేవే తప్ప అంతకంటే అనైతికంగా ఆమె కొత్తగా రాసిందేమీ లేదు.

రెస్టొరేషన్ సాహిత్యం

ఇంగ్లీష్ సాహిత్యంలో 1660-1700 మధ్య కాలాన్ని రెస్టొరేషన్ సాహిత్యం అంటారు. దీనికి మరోపేరు జాన్ డ్రైడెన్ (John Dryden) యుగం. ఈ యుగంలో సాహిత్యం, ఒక రకంగా విశృంఖలమైన సాహిత్యమని చెప్పవచ్చు. అంతకుముందున్న ప్యూరిటానిజమ్‌ని (Puritanism) ఇది తిరస్కరించింది. 16వ శతాబ్ది చివర్లో, 17వ శతాబ్ది తొలి సగంలో సాహిత్యాన్ని, ప్రజాజీవితాన్ని ప్రభావితం చేసిన ప్యూరిటానిజమ్‌ని తిరస్కరించడానికా అన్నట్టు ఈ యుగంలో కొత్త తరహా రచనలు, రచనాప్రక్రియలు వచ్చాయి. ప్యూరిటన్ యుగంలోని సాహిత్యం కేవలం సందేశాత్మకంగా, బైబుల్ బోధనలకు ప్రచారమాధ్యమంగా ఉండేది. ఎక్కువగా ఉత్తమపురుష కవిత్వం, లేఖాసాహిత్యం, చారిత్రక కథనాలు ఆ యుగంలో వచ్చాయి. దీనికి భిన్నంగా హాస్యం, శృంగారం, అధిక్షేపం, రాజకీయాలు, రాచరిక వ్యవస్థపట్ల విధేయత, హిరోయిక్ కప్లెట్ ప్రక్రియ రెస్టొరేషన్ కాలంలో వచ్చిన సాహిత్యంలో ప్రధాన లక్షణాలయ్యాయి. ఒక సంప్రదాయంపై తిరుగుబాటుగా వచ్చిన సాహిత్యం కొంత ‘అతిగా’ వెళ్ళడం ఆశ్చర్యమేమీ కాదు. అందుకే ఈ యుగంలో అశ్లీలమైన సంభాషణలు, వర్ణనలు సర్వసామాన్య లక్షణాలుగా భావించేవారు. వాటిపై ఎలాటి వ్యతిరేకత, నిషేధం లేవు. అలాంటి రచనలు పురుషులే మొదలుపెట్టినా స్త్రీలు కూడ అదే పోకడలు పోయారు. ఆఫ్రా బెన్ కూడా తన కాలానికి అతీతురాలేమీ కాదు. కానీ ఆమె నవలల్లో, నాటకాల్లో యుగస్వభావాన్ని మించిన ప్రత్యేకత, మౌలికత, సృజనాత్మకత, నిర్భయత్వం ఉన్న రచనలు కొన్నయినా ఉన్నందువల్లే అప్పటి రచయితల్లో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

బ్రిటిష్ రచయిత్రుల్లో బహుశా తొలి తిరుగుబాటు రచయిత్రిగా ఈమెను చెప్పవచ్చు. కవిత్వంలో స్త్రీల లైంగికత్వంను ప్రస్తావించడం, నాటకాల్లో వివాహవ్యవస్థపై విమర్శలు గుప్పించడం ఆమె తోటి మగరచయితల ఆగ్రహానికి కారణమైంది. ఆఫ్రా బెన్ రచనల్ని బహిష్కరించాలన్న నినాదం కూడ మొదలుపెట్టారు వీళ్ళు. కానీ ఆమె తనమీద విమర్శలను తిప్పికొట్టడానికి ఏ మాత్రం సంకోచించలేదు. తన నాటకాన్ని ఎవరైనా జెండర్ కోణం నుంచి విమర్శిస్తే, తర్వాతి నాటకం ముందుమాటలో దానికి తలతిరిగేలా సమాధానం చెప్పేది. దీనితో ఆమె విమర్శకులకు ఇంకాస్త కోపం వచ్చేది. బహుశా అందుకే వర్జీనియా ఉల్ఫ్, ఆఫ్రా బెన్‌కు 20వ శతాబ్ది ఫెమినిస్టు రచయిత్రులు రుణపడివున్నారని వ్యాఖ్యానించింది.

‘ఆడవాళ్ళు తక్కువ రాయడానికి కారణం వారికి ప్రతిభ లేక కాదు; అవసరమైన ప్రోత్సాహం, గుర్తింపు లేక.’ అని పదే పదే చెప్పిన ఆఫ్రా బెన్, తన సమకాలికులైన మగరచయితలు తనవంటివారిని ఎప్పుడూ వెనక్కి నెట్టాలనే ప్రయత్నించారని ఆరోపించేది.

ఆఫ్రా బెన్ జీవితం

ఆఫ్రా బెన్ బాల్యం గురించి, తొలినాళ్ళ జీవితం గురించి, కుటుంబం గురించి తెలిసింది తక్కువే. తండ్రి మంగలి అనీ, తల్లి మంత్రసాని అనీ కొందరు పేర్కొన్నారు. ఆమె జాన్ బెన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని, 1664 తర్వాత వారిద్దరు విడిపోవడం గానీ అతను మరణించడం గానీ జరిగివుండాలనీ చరిత్రకారులు భావిస్తారు. ఎన్నో విషయాలపై ఖచ్చితంగా, విపులంగా మాట్లాడిన ఆఫ్రా తన జీవితం, కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడ్డం గానీ, రాయడం గానీ చెయ్యలేదు. అయితే తన ప్రసిద్ధ నవల రాయల్ ప్రిన్స్ ఒరూనోకోలో తనే కథకురాలిగా కనిపించి, తన తండ్రి సైనికాధికారి అని, అతని విధుల వల్ల తను అనేకప్రాంతాలు చూసిందనీ ఆమె చెప్పుకున్నట్టు ఒక కథనం ఉంది. ఈ నవలను ఆమె ఉత్తమపురుషలో రాసినప్పటికీ, ఆ కథకురాలు కల్పిత కథకురాలా నిజంగా ఆఫ్రా బెన్ అయివుండవచ్చా అనే విషయంలో విమర్శకులు, సాహిత్య చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలున్నాయి. అందువల్ల ఆమె జీవితచరిత్ర రాయడానికి ప్రయత్నించిన ఆధునిక రచయిత్రులు (జానెట్ టాడ్ వంటివారు) కూడ అస్పష్టంగానే ఆమె వ్యక్తిగత వివరాలను సూచించారు. బ్రిటిష్ కవుల్లో అగ్రేసరుడు, ఇంగ్లండు రాజ్యంలో తొలి ఆస్థానకవి పదవిని అలంకరించిన విమర్శకుడు, పండితుడు జాన్ డ్రైడెన్‌కు ఆమె సమకాలికురాలు కావడం మరో విశేషం. రెస్టొరేషన్ యుగంగా చెప్పబడే ఆ శతాబ్దికి డ్రైడెన్ యుగం (ఏజ్ ఆఫ్ డ్రైడెన్) అనే పేరుకూడ ఉందంటే అతని ముందు తక్కిన రచయితలందరూ ఎంత వెలవెలపోయారో అర్థమవుతుంది. అలాంటి సాహిత్యవాతావరణంలోనూ తన ఉనికిని చాటుకుంది ఆఫ్రా బెన్.

ఆఫ్రా గురించి స్పష్టంగా తెలిసిన విషయాల్లో ఒకటి – ఇంగ్లండ్, నెదర్‌లాండ్స్‌ మధ్య జరిగిన వాణిజ్య ఆధారితమైన యుద్ధంలో ఆమె ఇంగ్లండు రాజు రెండవ ఛాల్స్ తరఫున గూఢచారిగా పనిచేసిందన్నది. ఆమె తల్లి తరఫు బంధువులకు రాజాస్థానంలో ఉన్న పరిచయాల వల్ల ఈ అవకాశం వచ్చింది. అక్కడ పార్లమెంటు సభ్యుడైన విలియమ్ స్కాట్‌తో కలిసి ఆమె పనిచేయాల్సివచ్చింది. అయితే స్కాట్ డబుల్ ఏజెంట్‌గా (ఆ మాటకొస్తే ట్రిపుల్ ఏజెంట్‌గా అని కూడ కొందరి అనుమానం) డచ్చివారి డబ్బులు తీసుకుని, ఇంగ్లండు రహస్యాలు వారికి చెప్పి, మళ్ళీ ఇంగ్లండుకు అవి చెప్పి చాలా నిగూఢమైన గూఢచారిగా పనిచేసేవాడు. గూఢచారిగా పెద్దగా అనుభవంలేని ఆఫ్రా బెన్‌కు అతన్ని ఎంత నమ్మాలో నమ్మకూడదో తెలీక అతనితో కలిసి సరిగ్గా పనిచెయ్యలేకపోయింది. అందుకే ఆమె గూఢచారిగా కొంతవరకు విఫలమైందనే ప్రచారం కూడ వచ్చింది. కొన్ని కథనాల ప్రకారం ఆఫ్రా తిరిగి ఇంగ్లండుకు వచ్చాక, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయనందుకో, లేక ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించనందుకో కొంతకాలం జైలు జీవితం కూడ గడిపిందంటారు. మొత్తంమీద, రెండవ ఛాల్స్ ఆమెకు విదేశంలో గూఢచారిగా పనిచేసినందుకు ఇవ్వాల్సిన వేతనం కూడ ఇవ్వలేదు. ఆఫ్రా ఆన్ట్‌వెర్ప్‌ నగరంలో ఉన్నప్పుడు డబ్బుకోసం చాలా ఇబ్బందిపడింది. ఉన్న కొన్ని నగలు అమ్ముకుని బతికింది. అప్పుడు చేసిన అప్పులు తీర్చడానికే గూఢచారి విధులు ముగిశాక, కొద్దో గొప్పో డబ్బులు తెచ్చిపెట్టే నాటకాల రచనకు ఆమె పూనుకుంది. తన నాటకాలను ఆమె స్వంతపేరుతో కాక, ఎట్రియా అన్న పేరుతో రచించింది. పేదరికం ఆమెను జీవితాంతం వెంటాడింది. ఆమె నాటకాలలో రెండవ ఛాల్స్ ఆస్థాన జీవితం ప్రతిబింబించేది. చక్కని హాస్యం, చురుకైన స్త్రీ పాత్రలు, దగుల్బాజీలైన మగపాత్రలతో ఆమె నాటకాలు బాగా రక్తికట్టేవి.

అనంతరకాలంలో నాటకరచన పూర్తిగా నిలిపి, వచన రచనలు మొదలుపెట్టింది. నాలుగు నవలలు, మూడు నవలికలు రచించింది. ఆమె రాసిన మొదటి నవల లవ్ లెటర్స్ బిట్వీన్ ఎ నోబుల్‌మాన్ అండ్ హిస్ సిస్టర్ ‘శృంగారం’ ఎక్కువగా ఉందన్న విమర్శతో సంచలనం సృష్టించింది. ఇది ఆమె రచనేనా కాదా అన్న తర్జనభర్జనలు కూడ జరిగాయి. ఈ నవల సంచలనం సృష్టించడమేకాక, విపరీతంగా అమ్ముడుపోయింది. 16 ఎడిషన్లు ప్రచురింపబడి చాలా ప్రచారాన్ని పొందింది. అందుకే ఇంగ్లీషు నవల వికాసంలో ఆఫ్రా బెన్ నిర్మాణాత్మక పాత్ర వహించిందని ఈ నవలను గురించి ఆధునిక విమర్శకులు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రాసిన రెండు నవలలు–ది నన్ (ది పర్‌జ్యూర్డ్ బ్యూటీ), ది నన్ (ఫెయ్‌ర్-వో బ్రేకర్)–సన్యాసినుల ప్రణయకలాపాలే. ఈ రెండో నవల కథను చూస్తే, ఆ తర్వాత వచ్చిన ఎన్నో నవలలకు, సినిమాలకు కూడ మాతృక ఇదేనేమో అనిపిస్తుంది. కథానాయిక ఒక యువకుణ్ణి ప్రేమించడం, అతను యుద్ధంలో మరణించాడని తెలుసుకుని విచారంలో ఉండగా, మరో యువకుడు ఆమె ప్రేమకోసం తపించి చివరకు ఆమె ప్రేమను పొంది వివాహం చేసుకోవడం, అనుకోకుండా మొదటి యువకుడు బతికి తిరిగి రావడం, దానివల్ల ఆమె జీవితంలో ఏర్పడిన సంక్షోభం–మనకు బాగా తెలిసిన కథలాగానే ఉంటుంది. అయితే ఈ కథ ముగింపు వేరు. హిచ్‌కాక్ సినిమాల తరహాలో ముగుస్తుంది.

నాయిక ఇసబెల్లా తను వివాహం చేసుకున్న హెనౌని గాఢంగా ప్రేమిస్తుంది. అంటే పాత ప్రియుణ్ణి ఆవిడ మరచిపోయింది. కానీ పాత ప్రియుడు విలెన్వా ఆమె తనకే చెందుతుందన్న విశ్వాసంతో ఉన్నాడు. ఆమెను వేధించడం ప్రారంభించాడు. చివరకు ఆమె తన సమస్యకు పరిష్కారం పాత ప్రియుణ్ణి వదిలించుకోవడమే అని నిర్ణయించుకుని, అతను నిద్రలో ఉండగా, దిండుతో నొక్కి శ్వాస ఆడకుండా చేసి చంపేస్తుంది. భర్త హెనౌ బయటినుంచి తిరిగివచ్చినపుడు, అతనితో, విలెన్వా తనను చూసిన షాక్‌లో గుండె ఆగి మరణించాడని, అతని శవాన్ని ఎవరూ చూడకుండా ఎక్కడైనా పడేయాలనీ చెబుతుంది. అది శవంలా కనిపించకూడదని ఒక గోనెసంచీలో శవాన్ని, అతను తెచ్చుకున్న బట్టలతో సహా కుట్టి ఆ సంచీని సముద్రంలో విసిరేయమని భర్తను కోరుతుంది. కుట్టు సరిగ్గా పడలేదనిపించి, భర్త కోటు గుండీల దగ్గర అనుకోకుండా మరో కుట్టు వేస్తుంది. వంతెనపై నించుని, ఆ సంచీ సముద్రం మధ్యలో పడేలా గట్టిగా ఊపి మరీ విసిరేయమని అతనికి చెబుతుంది కూడా. భర్త ఆమె మాటలు కాదనలేక, శవం బయటపడితే జరిగే అనర్థం ఊహించలేక, అలాగే చెయ్యబోతే ఆ శవం భారానికి ఎక్కువ వేగంతో విసిరేయాల్సివస్తుంది. అయితే అతని కోటుకు కుట్టుపడ్డం వల్ల, శవం ఉన్న సంచీతో పాటు అతను కూడ నీళ్ళలో పడిపోయి మరణిస్తాడు. తను చేసిన పాపం తనకు తగిన శిక్షనే విధించిందన్న పశ్చాత్తాపంతో ఇసబెల్లా తనే విలెన్వాని హత్య చేశానని న్యాయస్థానానికి చెప్పి లొంగిపోయి మరణశిక్షను అనుభవిస్తుంది. ప్రేమ, శృంగారం, ఒక స్త్రీ మనసులోని విపరీత భావసంఘర్షణ (నన్‌గా తండ్రిచేత నిర్ణయింపబడి, తన కోరికల్ని చంపుకోలేక ప్రేమకు లొంగిపోవడం దగ్గర్నుంచి చివరకు పూర్వప్రియుణ్ణి హత్యచేసేంతవరకూ ఆమె మనసులో కలిగిన భావోద్వేగాల చిత్రణ గొప్పగా ఉంటుంది) ఒక థ్రిల్లర్‌ని మరపించే కథాకథనం, ముగింపు ఈ నవలను ఒక మంచి నవలగా నిలబెడతాయి.

అయితే ఆమె రచనలన్నిటిలోకీ ప్రసిద్ధి చెందింది, ఈనాటికీ సాహిత్యచరిత్రలో చెప్పుకోదగ్గ రచనగా స్థిరపడిందీ ఒరూనోకో ఆర్ ది రాయల్ స్లేవ్. ఈ నవల రాసిన సంవత్సరానికే అనారోగ్యంతో ఆఫ్రా బెన్ మరణించింది.

ఆమె రాసిన నవలల్ని పరిశీలిస్తే రెండు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. అవి శృంగారం, హింస. ఈ రెండిటినీ ఆమె నవలల్లో సమతూకంగా వర్ణించింది. తొలి నవలల్లో శృంగారం ఎక్కువుంటే, చివరి నవల, ఆమె నవలల్లోకెల్ల ప్రసిద్ధమైన ఒరూనోకోలో ప్రధానకథ ప్రేమే అయినా, హింసను వర్ణించిన వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఈ నవల చరిత్రాత్మకం కావడానికి కారణం ఒక మహిళా రచయిత హింసను ఇంత విపులంగా వర్ణించడం కాదు. నల్లజాతీయుల బానిసత్వాన్ని వర్ణించిన తొలి నవల ఇదే కావడం.

బానిసత్వం గురించి తొలి నవల

ఆఫ్రా బెన్ రచించిన ఒరూనోకో (ది రాయల్ స్లేవ్) 1688లో ప్రచురింపబడింది. ప్రస్తుతం వెస్ట్ ఇండీస్‌గా మనం పిలిచే కెరిబియన్ ద్వీపాల్లో ఒకటైన సురినామ్ ఈ నవలలో కథాస్థలి. ఫ్రెంచి, డచ్చి, ఇంగ్లీషువారు ఈ ప్రాంతాన్ని తమ వలసపాలన కిందికి తీసుకురావాలని 16, 17 శతాబ్దుల్లో పోటీపడుతున్న సమయం అది. ఈ పోటీలో బ్రిటిష్‌వారే నెగ్గి లార్డ్ విల్లోబీ, సురినామ్‌లో కాలనీ ఏర్పరచడానికి సన్నద్ధమయ్యాడు. వాణిజ్యకారణాల వల్ల అక్కడికి వచ్చినప్పటికీ మన దేశం విషయంలోలా అక్కడ కూడా పాలనాధికారం, రాజకీయ వ్యూహం, స్థానిక ప్రజల దోపిడీ బ్రిటిష్‌వారికి మామూలైంది. అక్కడ ప్రధాన పంట చెరకు. చక్కెర ఉత్పత్తి కోసం కావలసిన శ్రామికులు, స్థానికంగా ఉన్న అమెరికా స్వజాతీయులైన ఇండియన్లే. వీరిని క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నాలు యథావిధిగా మొదలుపెట్టారు బ్రిటిష్ అధికారులు. తమకు కావలసిన సంఖ్యలో శ్రామికులు ఇక్కడి ప్రజల్లో లేనందువల్ల, మొట్టమొదటిసారి బ్రిటిష్ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి నల్లజాతీయులను దిగుమతి చేసుకుంది. అంతకుముందు పోర్చుగీసు, స్పానిష్ అధికారులు ఆఫ్రికన్ బానిసలను శ్రామికులుగా వాడుకునేవారు. మొదటిసారి 1630లో బ్రిటిష్ ప్రభుత్వం ‘రాయల్ ఆఫ్రికన్ కంపెనీ’ని ఏర్పాటు చేసి, బానిస వ్యాపారానికి మార్గం ఏర్పరచుకుంది. ఆ క్రమంలో సురినామ్‌లో బ్రిటిష్ వలసపాలన నిమిత్తం కొనుక్కున్న ఆఫ్రికన్ బానిసల గురించి ఆఫ్రా ఈ నవలలో రాసింది. బ్రిటిష్ పాలకుల బానిస వ్యాపారాన్ని సాహిత్యంలో చిత్రించిన మొట్టమొదటి రచయిత ఆఫ్రా బెన్.

అయితే ఆమె ఈ బానిస వ్యాపారాన్ని చూసిన దృష్టి పూర్తిగా ప్రగతిశీలమైనదీ కాదు. అలాగని సమర్థించేదీ కాదు. ఆ వివరాల్లోకి వెళ్ళేముందు స్థూలంగా ఒరూనోకో నవలా కథ తెలుసుకోవాలి. ఈ కథకు తను ప్రత్యక్ష సాక్షినైనట్లుగా ఆఫ్రా బెన్ చెబుతుంది.

ఒరూనోకో తాతగారు ఆ ప్రదేశానికి అధిపతి. అతని కొడుకులందరూ యుద్ధాల్లో మరణిస్తారు. మనమడు ఒరూనోకో మాత్రమే మిగులుతాడు. అంటే తాతగారి వంశం నిలబెట్టడానికి అతనొక్కడే సమర్థుడు. అతన్ని గొప్ప యోధుడిగా తయారుచేస్తాడు తాత. కానీ వందేళ్ళ వయస్సులోనూ తాతగారికి ఆడపిల్లల మోజు తీరదు. కనక అతడి అంతఃపురం నిండా వయసులో ఎంతో చిన్నవాళ్ళైన యువతులే. తన శరీరం లైంగిక చర్యను నిర్వహించలేకపోతున్నా కేవలం స్పర్శమాత్రంగా ఈ యువతులను అనుభవిస్తూ, వారిని బందీలుగా చేసుకున్న దుర్మార్గుడు అతను. అలాంటి తాతగారి తరఫున జరిగిన ఒక యుద్ధంలో ఒరూనోకో శత్రువుబాణం తగిలి మరణించబోతున్న సమయంలో వారి సైన్యాధిపతి అయిన జనరల్, రాజుగారి వంశాంకురం జీవించడం ముఖ్యంకనక తన శరీరాన్ని అతనికి ఆచ్ఛాదనగా చేసి తన ప్రాణాలను పణంగా పెడతాడు. అక్కడినుంచి ఒరూనోకో సైన్యాధిపత్యాన్ని స్వీకరిస్తాడు. ఆ యుద్దం ముగియగానే ఒరూనోకో, తన కోసం ప్రాణాలర్పించిన జనరల్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తాడు. అక్కడ జనరల్ కుమార్తె ఇమొయిండాని చూసీ చూడగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడ అతని సౌందర్యానికి, ప్రవర్తనకు ముగ్ధురాలవుతుంది. అతను ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు.

ఈలోగా రాజుగారికి ఇమొయిండా సౌందర్యం గురించి తెలుస్తుంది. తన మనమడు ఆమెను ప్రేమిస్తున్నాడని, పెళ్ళాడడానికి నిశ్చయించుకున్నాడనీ కూడ తెలుస్తుంది. అయినా ఆమెను తనే స్వంతం చేసుకోవాలని నిర్ణయించుకుని, తన అంతఃపురకాంతల చిహ్నమైన ‘పవిత్రమైన మేలిముసుగు’ను కానుకగా పంపుతాడు. దాని భావం ఇకనుంచి ఆమె అతని సొత్తు అయిందని. అయితే ఒరూనోకో, ఇమొయిండా ఇద్దరు స్నేహితుల సాయంతో ఒక రాత్రి కలుసుకుని దాంపత్యసుఖం అనుభవిస్తారు. మరుసటిరోజు ఈ సంఘటన రాజుగారికి తెలిసి ఇద్దరినీ శిక్షించడానికి నిర్ణయించుకుంటాడు. అయితే తన వంశాన్ని నిలిపే మనమడిని ఏమీ చెయ్యలేక, అతని ప్రియురాలికి మరణశిక్ష అమలుచేయమని ఆదేశిస్తాడు. ఆ ఆదేశం అమలైందని కూడ ఒరూనోకోకు చెప్తాడు. దానితో ఒరూనోకో శోకంలో మునిగిపోతాడు. కానీ పైకి గాంభీర్యం నటిస్తూ, సైన్యాధిపతిగా తన కర్తవ్యం నిర్వహిస్తూంటాడు. అలా మరో యుద్ధంలో (ఈ యుద్ధాలన్నీ వివిధ తెగల మధ్య జరిగేవని రచయిత్రి చెప్తారు) గెలిచిన తర్వాత, ఒక ఇంగ్లీషు నౌకాధిపతి ఆహ్వానం మేరకు వినోదంకోసం బ్రిటిష్ నౌకపైకి తన మిత్రులతో వెళ్తాడు ఒరూనోకో. అయితే అక్కడికి వెళ్ళగానే అతన్ని, మిత్రులను బంధించి, ఇంగ్లీషువారి కాలనీగా ఉన్న సురినామ్‌లో బానిసలుగా వాళ్ళను అమ్మేయడానికి తీసుకువెళ్తాడు ఆ నౌకాధిపతి. తన తాతగారితో స్నేహం నటిస్తూ, వాణిజ్యసంబంధాలు మాత్రమే నిర్వహిస్తున్నానని చెప్పుకున్న ఆ బ్రిటిష్ అధికారి నిజానికి బానిసవ్యాపారం చేస్తూంటాడు. ఆ విషయం పడవ ఎక్కేవరకూ ఒరూనోకోకు తెలీదు. సురినామ్‌లో ఉన్న బ్రిటిష్ పరివారంలో ఈ నవలా కథ చెబుతున్న కథకురాలు కూడ ఒకరు. ఒరూనోకోను ట్రెఫ్రీ అనే బ్రిటిష్ వ్యాపారవేత్త బానిసగా కొనుక్కుంటాడు. కానీ అతని రాచరికరూపం, ఇంగ్లీష్, ఫ్రెంచి భాషల పాండిత్యం చూసి, అతన్ని ఇతర బానిసల్లా కాక, కొంచెం గౌరవంగా చూస్తాడు. ఒరూనోకోతో అపుడపుడూ కబుర్లు చెబుతూంటాడు. ఆ క్రమంలో ఒకసారి తన బానిసల్లో తన మనసు దోచుకున్న ఒక గొప్ప అందగత్తెను ప్రస్తావిస్తాడు ట్రెఫ్రీ. ఆమెను ఒరూనోకోకు చూపిస్తాడు. ఆ అందగత్తే ఇమొయిండా. తన తాత ఆమెను బానిసగా అమ్మేసి, కావాలనే ఆమె చనిపోయిందని తనను నమ్మించాడని గ్రహిస్తాడు ఒరూనోకో. బానిసలందరూ ఒకేచోట ఉన్నందువల్ల అక్కడ మళ్ళీ రహస్య ప్రణయం కొనసాగుతుంది. కొంతకాలానికి ఇమొయిండా గర్భవతి అవుతుంది.

అక్కడ బానిసలు నివసిస్తున్న దారుణ పరిస్థితులను చూసి చలించిపోయిన ఒరూనోకో అందరిలోకీ తనే విద్యావంతుడు కనక, తమ యజమాని తనతో నామమాత్రంగా అయినా స్నేహంగా ఉన్నాడు కనక, వారి తరఫున వకాల్తా పుచ్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. తమని తిరిగి తమ రాజ్యానికి పంపేయాలని డిప్యూటీ గవర్నర్ బయామ్‌కు దరఖాస్తు పెడతాడు. సరేనని అంటూనే దాన్ని అమలుపరిచే ఉద్దేశం లేనట్టు గవర్నర్ స్పష్టం చేస్తాడు. దీనితో ఒరూనోకో తిరుగుబాటును ప్రకటిస్తాడు. అంతవరకూ తిరుగుబాటు అన్న ఆలోచనే లేని ఆ బానిసలు అతనున్నాడన్న ధీమాతో ఎదురుతిరుగుతారు. బ్రిటిష్‌వారికీ నల్లజాతి బానిసలకూ మధ్య ఘోరమైన పోరాటం జరుగుతుంది. బానిసల శక్తి క్రమంగా క్షీణిస్తుంది. చాలామంది ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బ్రిటిష్ డిప్యూటీ గవర్నర్ బయామ్‌కు లొంగిపోతారు. అలా లొంగిపోనివాళ్ళు ముగ్గురే. ఒరూనోకో, అతని మిత్రుడు టస్కన్, భార్య ఇమొయిండా. మగవాళ్ళిద్దరినీ చిత్రహింసలకు గురిచేసి వదిలిపెడతారు గవర్నర్ సైనికులు. దీనికి ప్రతీకారం తీర్చుకుని తీరతానని ప్రతిజ్ఞ చేస్తాడు ఒరూనోకో. అయితే తన ప్రతిజ్ఞ వల్ల తను ప్రాణాలు కోల్పోవడం తథ్యం కనక, తన అనంతరం తన భార్య బ్రిటిష్‌వారి బానిసగా ఎంత దారుణమైన జీవితాన్ని గడపాల్సివస్తుందో ఊహించుకునేసరికి అతనకి తీవ్రమైన వేదన కలుగుతుంది. అందువల్ల, బ్రిటిష్ సైనికులతో తన చివరి యుద్ధానికి ముందు ఇమొయిండాని తనే చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆమెకూడ అదే కోరుకుంటుంది. అలా గర్భవతిగా ఉన్న భార్యను చేజేతులా చంపుకుని, గవర్నర్ పక్షంతో అంతిమపోరాటం చేస్తాడు ఒరూనోకో. ఈ పోరాటంలో క్రమంగా అతను బలహీనపడి, చిత్రవధకు గురై మరణిస్తాడు.

బానిసత్వం పట్ల రచయిత్రి దృక్పథం ఏమిటి?

ఈ నవలలో కథ చిన్నదే. కానీ ఇది రేకెత్తించిన ఆలోచనలు కొత్తవి. అందులో ముఖ్యమైన విషయం నల్లజాతీయుల బానిసత్వం. బ్రిటన్‌లో అప్పటికి ఆఫ్రికన్ కాలనీల్లో బానిసత్వం ముమ్మరంగా ఉన్నప్పటికీ దానిపై తిరుగుబాట్లు, దాని నిషేధానికి పోరాటాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అక్కడక్కడా కొందరు వ్యతిరేకించడం మినహా, సంఘటిత పోరాటాలేవీ అప్పుడు లేవు. మరో శతాబ్ది తర్వాతే, అంటే 18వ శతాబ్ది చివర్లో అలాంటి పోరాటాలు మొదలయ్యాయి. అందుకే ఒరూనోకోని అటువంటి సంఘటిత పోరాటానికి నాయకుడిగా ఈ నవల చిత్రించడం విశేషం. కానీ ఒరూనోకో పాత్రలో కొన్ని వైరుధ్యాలు కనిపిస్తాయి. అతని రూపం తోటి నల్లజాతీయుల్లా ఉండదు. అతని ముక్కు పొడుగ్గా ఉంటుందని, ముఖ సౌందర్యం రోమన్ దేవతల స్వరూపంతో వెలిగిపోతూంటుందనీ రచయిత్రి వర్ణిస్తుంది. ఇక్కడ అతన్ని నల్లజాతీయుడని అంగీకరిస్తూనే వారిలో పైస్థాయికి చెందినవాడిగా వర్ణించడానికి రచయిత్రి తహతహలాడ్డం కనిపిస్తుంది. అంతే కాదు, ఒరూనోకో ఎవరినైనా గౌరవించాలనుకున్నప్పుడు, కొత్తగా స్నేహసంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు, స్వయంగా తనే వందమంది బానిసలని ‘కానుక’గా పంపేవాడని కూడ రచయిత్రి వర్ణిస్తుంది. ఆ రకంగా అతను బానిసత్వాన్ని సమర్థిస్తున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. అంటే అతనిలో మొదట్లో తన ఆభిజాత్యానికి పరిమితమైన ఆలోచనావిధానమే ఉండివుండాలి. ఆ తర్వాత, బానిసల జీవితం ఎలా ఉంటుందో స్వీయానుభవంతో తెలుసుకున్న తర్వాతే అతనిలో మార్పు వచ్చిందేమో అని భావించాల్సివుంటుంది.

ఒరూనోకోలో మార్పు రావడం సహజంగానే జరుగుతుంది. తను బానిసగా సురినామ్‌లో అమ్ముడుపోతున్నప్పుడు అతనికి తొలిసారిగా బానిసత్వం ఒక నికృష్టమైన సంప్రదాయంగా తోస్తుంది. తక్కినవారికంటే తొలుత అతనికి ఎక్కువ గౌరవమే దక్కింది. అతను తిరుగుబాటు ప్రకటించకపోయివుంటే, ఇమొయిండాతో సంబంధం కొనసాగించకుండా ఉండివుంటే గవర్నర్‌గారి ప్రియమైన బానిసగా కొన్ని అదనపు సౌకర్యాలు అనుభవించేవాడేమో కూడ. కానీ అతనిలో వచ్చిన మార్పే కథకు కీలకం. దానివల్లే ఈ నవల ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. తోటి నల్లజాతీయులు పడుతున్న బాధలు చూసినపుడు అతను ఇచ్చే ఉపన్యాసం ఈ నవలను ‘బానిసత్వాన్ని వ్యతిరేకించిన తొలి నవల’గా భావించడానికి కారణమైంది.

“Why, my dear friends and fellow sufferers, should we be slaves to an unknown people? Have they vanquished us nobly in fight? Have they won us in honourable battle? And are we by the chance of war become their slaves? … No, but we are bought and sold like apes or monkeys, to be the sport of women, fools and cowards, and the support of rogues, renegades that have abandoned their own countries for raping, murders theft and villainese.”

యుద్ధంలో గౌరవప్రదంగా గెలుచుకున్నవారిని బానిసలుగా చేసుకున్నా తప్పులేదు కానీ, ‘కోతుల్ని అమ్మినట్టు అమ్మడం ఏమిటి?’ అని ప్రశ్నిస్తాడు ఒరూనోకో. పైగా తమని అమ్మినవాళ్ళు, కొన్నవాళ్ళు ఎవరు? అత్యాచారాలు చేసినవారు, దుర్మార్గులు, హంతకులు, పిరికివెధవలు, దొంగలు. తమ దేశాల్లో నిలవనీడలేక ఇక్కడికి పరిగెత్తుకు వచ్చినవారు.

“Shall we render obedience to such a degenerate race, who have no one human virtue to distinguish them from the vilest creatures? Will you, I say, suffer the lash from such hands?”

అని ఆవేశంగా మాట్లాడి ఆ నౌకలో ఉన్నవారిని ఉత్తేజపరుస్తాడు. ఇంత పతనమైపోయిన జాతికి మనం లొంగిపోదామా? అలాంటివాళ్ళ చేతుల్లో దెబ్బలు తిందామా? అంటూ ప్రజలను రెచ్చగొడతాడు. ఇటువంటి ఉపన్యాసధోరణి, ఈ భావజాలం బ్రిటిష్ సాహిత్యానికి అప్పటికి కొత్తవే. బ్రిటిష్ డిప్యూటీ గవర్నర్, వీరి తిరుగుబాటు తర్వాత అతన్ని భార్యతో సహా లొంగిపొమ్మని, వారికీ వారి పుట్టబోయే బిడ్డకూ రక్షణ కల్పిస్తాననీ అంటాడు. దానికి సమాధానంగా అతను ‘తెల్లవాళ్ళనూ, వారి దేవుళ్ళనూ నేను నమ్మను. వారు నమ్మే సిద్ధాంతాలు ఎలాంటివంటే, నిజాయితీపరులైన వాళ్ళెవ్వరూ వారితో కలిసి బతకలేరు. నేను నిత్యం సాయుధుడిగా ఉంటే తప్ప వారితో కలిసి బతకలేను’ అంటూ తిరస్కరిస్తాడు.

ఒక రకంగా ఆఫ్రా బెన్ నల్లజాతీయుల పట్ల సానుభూతి చూపిస్తూనే తన నాయకుడి విషయంలో మాత్రం కొంత కాల్పనికత జోడించిందని అనిపిస్తుంది. అతని సౌందర్యాన్ని రోమన్ ముఖకవళికలతో పోల్చి వర్ణించేటప్పుడు, అతను యూరోపియన్ విద్యను అభ్యసించినవాడిగా చెప్పినపుడు ఆమె కొంత రొమాంటిసైజ్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ అతను యూరోపియన్ విద్యను నేర్చినా క్రైస్తవమతానుయాయి కాలేదని, యూరోపియన్ సంస్కృతిని సవిమర్శకంగా చూడగలిగాడని ఆమె వర్ణిస్తుంది. ఆఫ్రా బెన్‌కి కొన్ని దశాబ్దుల ముందు నల్లజాతీయుణ్ణి విషాదనాయకుడిగా మలిచిన షేక్స్‌పియర్ ఒథెల్లో (Othello) నాటకం అందరెరిగిందే. కనక ఆ కాలంలో నల్లజాతీయుల్లోని సౌందర్యాన్ని, నాయకత్వ లక్షణాన్ని వర్ణించిన ఘనత ఆమెకంటే ముందే షేక్స్‌పియర్, బెన్ జాన్సన్‌లకు దక్కుతుంది. కానీ నల్ల జాతీయుల బానిసత్వాన్ని ప్రతిఘటించాల్సినదిగా స్పష్టంగా చెప్పిన రచయిత్రి మాత్రం ఆఫ్రా బెన్ అనే చెప్పాలి. ఇంగ్లండులో ఆ యుగంలో శ్వేతజాతీయులు కూడ బానిసలుగా భావింపబడే సన్నివేశాలుండేవి. కాథలిక్కులు ప్రభువులైతే ప్రొటెస్టెంట్లు, ప్రొటెస్టెంట్లు ప్రభువులైతే కాథలిక్కులు బానిసలయ్యే సంప్రదాయం ఉండేది. అయితే అవి భావజాలాలకు సంబంధించిన వైరుధ్యాలు. ఎవరి భావజాలం ఆధిపత్య స్థానంలో ఉంటే వారు రెండోవారిని బానిసలుగా చూడడం. కానీ ఇది జాతి పరమైన వివక్ష. కేవలం, వర్ణం (రంగు) కారణంగా అనుభవించిన బానిసత్వం. దాన్ని చిత్రీకరించడం ఆఫ్రా ప్రత్యేకత.

ఆఫ్రా బెన్ కవితలు, నాటకాలు, నవలల్ని చూసినపుడు ఆమెను రాజకీయ దృక్పథం ప్రకటించిన తొలి రచయిత్రిగా కూడా గుర్తించడానికి అవకాశం ఉంది. పొలిటికల్ టోన్ ఆమె రచనలన్నిటిలోనూ కనిపిస్తుంది.

ఒరూనోకో ప్రతిస్పందనలు

ఈ నవల చదివిన తొలి తరం పాఠకులు లేవనెత్తిన ప్రశ్న– అంతకుముందువరకూ మంచి నాటక రచయితగా పేరు తెచ్చుకున్న ఆఫ్రా, ఇంత నాటకీయత ఉన్న నవలని నాటకంగా ఎందుకు రాయలేదన్నది. దీన్ని నవలగా రాయడానికి కారణమేమిటన్నది. బహుశా ఈ నవలలో కేవలం ఒరూనోకో, ఇమొయిండాల పాత్రలకు ప్రాధాన్యమివ్వడం, దీన్ని ఒక విషాద ప్రణయగాథగా రాయడం ఆమె ఉద్దేశమైతే నాటకంగా రాసివుండేదేమో. కానీ ఇక్కడ ఒక కథకురాలిగా, ఇంగ్లీష్ పెత్తందారీ మీద, వలస విధానాలమీద, బానిసత్వం మీద గోప్యంగానైనా విమర్శ, విశ్లేషణ చేయదలుచుకుందన్నది స్పష్టం. అందుకే ఒక ప్రత్యక్ష సాక్షిని కథకురాలిగా చేసి ఈ నవల రాసింది. నాటకంలో అటువంటి ధ్వనిగర్భితమైన విశ్లేషణలు సాధ్యం కావని ఆమె భావించివుండవచ్చు. అయితే ఈ నవలలోని నాటకీయత నటులను విపరీతంగా ఆకర్షించి, 18వ శతాబ్దిలో ఎందరో దీన్ని నాటకీకరించి ప్రదర్శించారు.

బానిసత్వ వ్యతిరేక ఉద్యమానికి ఊతం

ఈ నవలకు వెంటనే వచ్చిన ప్రతిస్పందనలో మరో అంశం- ఆమె స్పష్టంగా రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావించినా, కొందరు విమర్శకులు ఈ నవలను ‘ఒక ప్రగాఢమైన ప్రణయగాథ’గా మాత్రమే గుర్తించడం. 1731-34 మధ్య వచ్చిన ఒక నిఘంటువులో ఆఫ్రా బెన్ రాసిన ఒరూనోకో ‘ప్రేమోద్రిక్తతను సున్నితంగా, నిగూఢంగా చెప్పిన కథ’గా అభివర్ణించారు. అంతే కానీ ఇందులో బానిసత్వానికి సంబంధించిన విశ్లేషణలు ఎవరూ చెయ్యలేదు. 1745లో ఫ్రెంచివారు ఈ నవలను నాటకీకరణ చేసినపుడు, ఒరూనోకో, ఇమొయిండాల విషాదాన్ని చిత్రించక, కథ మార్చి, వాళ్ళిద్దరూ రాజు, రాణిలుగా ఏదో దేశాన్ని ఏలారని సుఖాంతం చేశారు. అంటే బానిసలుగా అమ్ముడుపోవడం వల్ల వారు అనుభవించిన చిత్రవధను పూర్తిగా వదిలేసి, పూర్తిగా రొమాంటిసైజ్ చేసేశారు. అంతే కాదు. 1769లో వచ్చిన ఫ్రెంచి అనువాదంలో ఒరూనోకో, బ్రిటిష్ డిప్యూటీ గవర్నర్‌కు మూడువందలమంది బానిసలనిచ్చి, తన స్వేచ్ఛను కొనుక్కుని తిరిగి స్వరాజ్యానికి వెళ్ళిపోతాడు! ఇలా, అప్పటికే ప్రచురితమైన నవలను వక్రీకరిస్తూ, ఎవరికి తోచిన ముగింపులు వారు రాసుకున్న ఉదంతాలు బహుశా ఒక్క ఆఫ్రా బెన్ జీవితంలోనే జరిగాయేమో.

మరో రెండు దశాబ్దాల తర్వాత బానిస వ్యవస్థ నిర్మూలనకు ఇంగ్లండులో ఉద్యమాలు ప్రారంభమయ్యేవరకు ఆఫ్రా బెన్ నవలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. 1760 తర్వాత, బానిస భావజాలాన్ని తిరస్కరిస్తూ వచ్చిన నాటకాలన్నీ తమ ఉద్యమానికి దీన్ని వాహికగా మలచుకున్నాయి. 19వ శతాబ్దిలో బానిసత్వంపై అమెరికాలో, ఇంగ్లండులో జరిగిన చర్చల్లో ఆఫ్రా బెన్ విధిగా ఒక భాగమైంది. 1856, 1863 సంవత్సరాల్లో డబ్లిన్ యూనివర్సిటీ మేగజైన్‌లోనూ, సెయింట్ జేమ్స్ పత్రికలోనూ అమెరికన్ రచయిత్రి హారియట్ స్టో (Harriet Beecher Stowe) రచించిన అంకుల్ టామ్స్ కేబిన్ నవలా సమీక్షల్లో, ఒరూనోకో నవలతో పోల్చడం కనిపిస్తుంది. ప్రసిద్ధ విమర్శకుడు ఎన్స్ట్ బేకర్ ఇతరత్రా ఆఫ్రా బెన్ నవలల్లోని అశ్లీలాన్ని, మొరటు వర్ణనలను తిరస్కరిస్తూనే, ఒరూనోకో నవల వల్ల ఆమెను ఎంతో గౌరవించవచ్చునని అన్నాడు. ఈ నవలను ‘తొలి బానిసత్వ వ్యతిరేక నవల’గా వర్ణించింది ఈయనే. 20వ శతాబ్దిలో ఈ నవలకు మరో ఘనమైన స్థానం లభించింది. పోస్ట్ కలోనియల్ అధ్యయనాల్లో ఒరూనోకో ప్రాముఖ్యం సంపాదించింది. యూరోపియన్లు ఆఫ్రికన్ల పట్ల చూపే వివక్షను తొలిసారిగా నమోదుచేసిన రచయిత్రిగా ఆఫ్రా బెన్ విమర్శకుల నీరాజనాలు అందుకుంది. కేవలం కొన్ని గంటల్లో, ఏకధాటిగా ఈ నవలను పూర్తి చేసిన ఆఫ్రా బెన్ (ఈ విషయం ఆమె స్వయంగా చెప్పుకుంది. ఇతర రచనలకంటే వేగంగా ఈ నవలను రాశానని), దీనిపై కొన్ని శతాబ్దులపాటు ఇంత చర్చ జరుగుతుందని, ఒక అమానవీయ సంస్కృతిని తొలిసారిగా వర్ణించిన రచయిత్రిగా చరిత్రలో నిలిచిపోతుందనీ ఏ మాత్రం ఊహించి వుండదు.

కొసమెరుపు

బ్రిటిష్ నవలా సాహిత్యంలో తొలి నవలగా ఇప్పటికీ ఎక్కువమంది భావించేది, పేర్కొనేదీ డేనియల్ డెఫో (Daniel Defoe) రచించిన రాబిన్సన్ క్రుసో. సాహిత్య చరిత్రల్లో కూడా ఈ నవల పేరే ప్రస్తావనకు వస్తుంది. ఆ నవల 1719లో వచ్చింది. అయితే, ఆఫ్రా బెన్ నవలలు చర్చకు వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ సాహిత్యంలో కూడ తొలి నవల రాసింది మహిళేనని, అది కూడా కేవలం ఒక ప్రణయగాథ కాక ఒక అసమానతను ప్రశ్నించే ఇతివృత్తంతో వచ్చిన నవల అనీ చెప్పడానికి ఇంకా చరిత్రకారులకు మనసు వస్తున్నట్టు లేదు.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...