రెండు ప్రపంచాలు

పొద్దున్నే చిన్నగా మొదలైన వర్షం అలా పడుతూనే ఉంది. వేసవి కాలం వెళ్ళి చాలారోజులే అయింది. రుతువులు ఆరు అని చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నా, సంవత్సరమంతా ఒకటే రుతువు అనిపిస్తోందిప్పుడు. ఏ టి.వి. వార్తల్లోనో ఎక్కడో పడుతున్న వర్షాన్ని చూస్తే సంబరంగా ఉంటుంది. చాలాకాలం తర్వాత మబ్బు పట్టిన ఆకాశాన్ని, చినుకుల్ని చూస్తున్న నాకు ఆఫీసుకి వెళ్ళాలనిపించలేదు, హాయిగా ఏ పుస్తకమో పుచ్చుకు కూర్చోవాలని ఉంది. కానీ ఎందుకో ఒక అనీజీనెస్!

క్రితం సాయంత్రం ఆఫీసునుంచి వచ్చేసరికి అమ్మ గంభీరంగా కనిపించింది. పనిమీద ఊళ్ళోకొచ్చిన అన్నయ్య స్నేహితుడిని కలిసేందుకు బయటకు వెళ్ళేడని, భోజనానికి వచ్చేస్తాడని చెప్పింది వంటగదిలో హడావుడిపడుతూ. తోడబుట్టినవాడు ఒక్కడే అయినా అన్న వచ్చినప్పుడల్లా ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఇంట్లో ఉంటుంది.

భోజనం దగ్గర మొదలెట్టాడు. “చిన్నికి ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అది పడనిచ్చేలా లేదు” అంటూ. చదువుకుని, ఉద్యోగం చేసుకుంటున్న కూతురు పెళ్ళి గురించి అంత ఆందోళన పడవలసిన పనేం ఉంది?

“క్రితంసారి పండక్కొస్తూ కొలీగ్ అంటూ మహేశ్‌ని తనతో పాటు తీసుకొచ్చింది. రెండు రోజులు ఇంట్లో మనిషిలా తిప్పింది. వాళ్ళ మధ్య తగిన స్నేహం ఉండే ఉంటుందని విమల, నేను అనుకున్నాం. ఈ కాలానికి తగినట్టు ఏ ప్రేమ పెళ్ళో అంటుందని చూశాం. అందుకే అతని కులమతాల గురించి అడగలేదు. ఇప్పుడు పెళ్ళి ప్రస్తావన తెస్తే అప్పుడే చేసుకోవాలని లేదంటుంది. మరి మహేశ్‌ని తీసుకొచ్చి మాకు చూబించావెందుకంటే, ‘అతను నా కొలీగ్, మంచి స్నేహితుడు’ అంటుంది. నువ్వు పాతికేళ్ళ క్రితం ఇలాగే అర్థంలేని కారణాలు చెప్పి కుదిరిన సంబంధాన్ని వదులుకున్నావ్. ఆ తర్వాత నీకు నచ్చిన సంబంధమే దొరకలేదు మరి. ఇప్పుడు దీని వంతు కాబోలు, ఆడపిల్లని ఆడపిల్లగానే పెంచాలి. స్వేచ్ఛ ఇచ్చి చదువులిస్తే ఇదిగో ఇలా పిచ్చిపోకడలు పోతారు.” అన్నయ్య గొంతులో కోపం స్పష్టంగా…

కూతుర్ని స్వేచ్ఛగా పెంచుతున్నానంటూ చెప్పుకునేవాడు కదూ, ఇప్పుడదే నచ్చట్లేదు కాబోలు. ఎక్కడెక్కడి విసుగులూ ఇంట్లో చూపించెయ్యచ్చనుకుంటాడు. జవాబు చెప్పాలనిపించక ఊరుకున్నాను. భోజనం అవుతూనే ప్రయాణమై వెళ్ళిపోయాడు.

ఎప్పటిమాట! చదువు పూర్తిచేసి సరదాగా ఉద్యోగప్రయత్నం చెయ్యటం, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉద్యోగం రావటం జరిగిపోయాయి. పెళ్ళి సంబంధమొకటి ఇంట్లో స్థిరం చెయ్యబోయారు. అయితే పెళ్ళివారి కోరికల చిట్టాలో నేను శాశ్వతంగా ఉద్యోగం చెయ్యాలన్నది నాకు నచ్చలేదు. ఉద్యోగం చెయ్యటమో, మానటమో అన్నది నాదైన విషయమనే నమ్మాను. ఆ స్వతంత్రం మరెవరికో ఉంటుందన్నది ఒప్పుకోలేకపోయాను. నాన్నతో ఉన్న దగ్గరితనంతో ఆయన్ని అదే అడిగాను కూడా. ఆయనకూ సమంజసమనిపించి ఆ సంబంధాన్ని విరమించుకున్నారు. అది ఇప్పటికీ అన్న నాపట్ల నిరసన చూబించే కారణమవుతోంది.

స్కూటీ తియ్యకుండా రోడ్డు చివర ఆటో పట్టుకుందుకు బయలుదేరాను. కాస్త కాస్త తడుస్తూ చినుకుల స్పర్శను ఆస్వాదిస్తూంటే భలేగా అనిపించింది. ఆలోచనలని వర్షపు నీటిలో వదిలేశాను. ఇప్పుడిప్పుడు ‘వర్తమానంలో జీవించటమన్న’ సూత్రాన్ని ఆచరణలో పెట్టమంటున్నారు కదూ. మొన్న పై ఇంట్లో ఉండే నవ్య కూడా చెబుతోంది, మైండ్‌ఫుల్‌నెస్! కొత్తగా స్కూల్లో మెడిటేషన్ మొదలెట్టారని, చదువు మీద ఏకాగ్రత కుదిరేందుకు అది సహాయపడుతుందని ప్రిన్సి మామ్ చెప్పారంది.

నిన్న ఎప్పటిలాగే లెక్కలు చెప్పించుకుందుకొచ్చి స్కూల్లో విషయాలన్నీ చెప్పింది. స్నేహితురాలు రష్మి వాళ్ళన్నయ్య దగ్గర రెండు మొబైల్ ఫోన్లున్నాయని, ఒకటి తనకి ఇస్తానన్నాడని చెప్పింది. ‘మమ్మీకి చెప్పొద్దాంటీ’ అని కూడా అంది.

“ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్ కదా, నీ చదువుకి ఆటంకం అని అమ్మానాన్నా కొనివ్వలేదని చెప్పావుగా?” నామాటకి ముఖం సీరియస్‌గా చేసుకుని కూర్చుంది. ఈ పిల్లలు ఇలాటి మాయల్లో పడకుండా ఎలా వీళ్ళని ఆపేది? అర్థమయేవరకూ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిందే.

రోడ్లన్నీ స్కూలు పిల్లలతో నిండిన ఆటోలు కనిపించాయి. వర్షం పడకుండా చుట్టూ కట్టిన పరదాలు పక్కకి తోసి పిల్లలు తలలు, చేతులు బయటకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల అదిలింపులకి నవ్వుతున్నారు.

ఇలాటి వర్షపురోజులు ఎలా గడిచేవి చిన్నప్పుడు?! స్కూలుకి అప్పటికప్పుడు సెలవు ప్రకటించేసేవారు. ఇప్పటిలా కాదు కనక అమ్మలంతా ఇళ్ళదగ్గరే ఉండేవారు చాలావరకు. తడుచుకుంటూ ఇంటికెళ్ళేసరికి అమ్మ అననే అనేది, ‘వర్షం కాస్త తగ్గేక పిల్లల్ని వదలచ్చుకదా’ అంటూ. నీళ్ళోడుతున్న తల తుడిచి, పొడిబట్టలు మార్పించేది. నేను ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళటం చూసేకే అన్న స్కూల్ బ్యాగ్ గుమ్మంలోంచి లోపలికి విసిరి అమ్మ చేతికి అందకుండా పారిపోయేవాడు. ఆ చిన్ననాటి ప్రేమ ఏమయిపోయింది? నలభైయ్యేళ్ళు దాటి స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటున్న నాతో అన్నయ్య నిష్టూరంగా మాటాడితే నేను మౌనంగా ఎందుకున్నాను? అది గౌరవమా? భయమా? నిర్లిప్తతా? ఈ మౌనం అన్నకి ధైర్యాన్నిస్తున్నట్టుంది.

ఓహ్! మైండ్‌ఫుల్‌నెస్!


ఆఫీసుకి వచ్చేసరికి ఇంకా ఎవరూ వచ్చినట్టు లేదు. వర్షం చిన్నగా పడుతూనే ఉంది. పక్క సెక్షన్‌లో ఉండే శరత్ వస్తూనే విష్ చేసి “ఏమిటి మేడమ్, ఆడవాళ్ళ సెక్షన్‌లో ఆడ అటెండర్, మగవాళ్ళ సెక్షన్‌లో మగ అటెండర్‌ని వేయించారట మీ మేడమ్. అందరం కలిసి పని చేసేచోట ఇలాటివన్నీ అవసరమంటారా?”

“చూద్దాం, ఈ ఏర్పాటు ఎలా ఉంటుందో అని చేసినట్టున్నారు.” తేల్చేశాను.

రెండు రోజుల క్రితం సాయంకాలం ఇంటికి బయలుదేరేముందు ఎస్తేర్ మాట్లాడాలంటూ వచ్చి, మొన్నెప్పుడో దేవానందంగారు తమ ఇంటివైపుగానే వెళ్తున్నానంటూ తనకి బైక్ మీద లిఫ్ట్ ఇచ్చారని, ఆ తర్వాత ఆఫీసులో కొందరు కాస్త వెకిలిగా ప్రవర్తిస్తున్నరంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అప్పటికి ఆమెకి ధైర్యం చెప్పి పంపేశాను. ఇలాటి విషయాలక్కూడా ఇంకా వేధింపులే. పరాయి ఆడవాళ్ళని వేధించేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు గుర్తురారేమో! అయినా ఇంట్లోవాళ్ళని మాత్రం వదులుతారా? ఇంటి బయటికొచ్చిన ఆడవాళ్ళకి గౌరవం, భద్రత లేదనికదూ ఈ పూట స్కూలు, కాలేజీ పిల్లలు పడుతున్న వర్షాన్ని లెక్కచెయ్యకుండా నగరమంతా పెద్ద ప్రదర్శన జరుపుతున్నది?! ఇంటిలోపల సంగతో…?

సాయంత్రం వర్షం తెరిపిచ్చింది. బస్టాప్‌కి వెళ్ళేంతలో “హాయ్ అక్కా!” అంటూ శశి ఎదురొచ్చింది. “ఎన్నాళ్ళకి శశీ!” అన్నాను సంతోషంగా. ఇద్దరం కబుర్ల మధ్య పక్కనే ఉన్న స్వీట్ షాప్ లోకి నడిచాం.

నలుగురమ్మాయిలు చకచకా ఆర్డర్లు తీసుకుంటూ ప్యాక్ చేసి అందిస్తున్నారు. నలుగురూ ఇరవై లోపు వయసున్న పిల్లలే. బహుశా చదువుకుంటూ పార్ట్-టైమ్ పని చేస్తున్నారులా ఉంది. ఆ అమ్మాయిలు ఎంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు! అందుకే ఆ పిల్లలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉన్నారు. మా కబుర్లకి అంతరాయం కలుగకుండా ఉండేలా కూర్చున్నాం.

“అమ్మ ఎలా వున్నారు శశీ, అక్క, పిల్లలు బావున్నారా? మనం కలిసి ఏడాది పైన అయిందేమో కదూ.” ఓపిగ్గా సమాధానాలు చెప్పింది శశి నా ప్రశ్నలన్నిటికీ. ముఖమంతా అలసట.

“నాకో పెళ్ళి సంబంధం వచ్చిందక్కా,” శశి నవ్వుతోంది. నాకు తెలుసు శశికి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి జీవితంపట్ల.

“నేను ఉద్యోగం చెయ్యకూడదట. హాయిగా ఇంటిపట్టున విశ్రాంతిగా ఉండాలట. నన్ను అర్థం చేసుకున్నానని చెప్పే ఈ పెళ్ళికొడుకు మా బంధువుల్లోవాడే. నాకున్న ఆర్థిక స్వాతంత్రమే నా బలం, నా ధైర్యం. ఇది నాలో ఒక భాగం. దీన్ని వదులుకునే ప్రసక్తే లేదు…” ఒక్కక్షణం ఆగి చెప్పింది. “ఇంట్లో మాత్రం అందరూ పెళ్ళిచేసుకోమంటారు.”

“మరి?”

“అతను ఆర్థిక సమస్యలు తెలిసున్నవాడే. అతని తల్లి ఒంటిచేత్తో బాధ్యతల్ని మోసింది. ఆమెలాగా జీవించినన్నాళ్ళూ నేను కష్టపడక్కర్లేదంటాడు. పెళ్ళి చేసుకున్నా ఇప్పడున్న నా బాధ్యతలేవీ నాకు బరువు కావని చెప్పినా అతనికి అర్థంకాలేదు. ఉద్యోగం మానెయ్యటమనే విషయమే నాకు అభ్యంతరం. ఇంటికి ఆసరాగా తమ్ముడు ఉంటానంటాడు. వాడు చదువు నిర్లక్ష్యం చేసుకుని, ఏదో చిన్న ఉద్యోగంలో కుదురుకున్నాడు. అమ్మ నన్ను ఒప్పించేందుకు చూసింది. ఇప్పుడున్న జీవితం నాకు సంతృప్తిని ఇస్తోందక్కా. చూద్దాం, నన్ను అర్థంచేసుకునే వ్యక్తి ఎదురవుతాడేమో…” ప్రశాంతంగా, స్థిరంగా చెబుతున్న శశిని చూస్తుంటే నాకు ఆమెపట్ల మరింత మమకారం కలిగింది. వెళ్ళాలంటూ లేచింది.

చిన్నచిన్న వాననీటి ప్రవాహాలు వీధి అంచుల్లోకి మళ్ళుతున్నాయి. వీధిదీపాలు అప్పుడే వెలిగించారు. ఉక్కపోత తగ్గి ఆ మబ్బుపట్టిన ఆకాశం కింద నడుస్తున్న జనాల ముఖాలు ప్రశాంతతని నింపుకుంటున్నాయి. పక్కనే ఉన్న పూలదుకాణం సుగంధాల్ని బయటకు చిమ్ముతూ రారమ్మంటూ పిలుస్తున్నట్టనిపించింది. అంతలోనే ఎక్కడో దాక్కున్న చిక్కనిమబ్బు ఒకటి తనను నిలువరించుకోలేక ఒక్క పెట్టున జల్లులతో ముంచెత్తింది. ఏదేదో కొనేందుకు వచ్చినవారు వాహనాల్ని ఎడాపెడా పార్క్ చేసి కనిపించిన దుకాణాల్లోకి పరుగెడుతున్నారు.

ఆ పక్కనే ఉన్న కాఫీ డే కఫే దాటుతుంటే ఆ గాజు తలుపుల్లోంచి ఒకటీ రెండు జంటలు కనిపించాయి. క్షణం నిలబడ్డాను. ఏం మాట్లాడుకుంటున్నారో! మొబైల్ ఫోన్లలోంచి బయటపడి పలకరించుకుని, మాట్లాడుకునే తీరిక, వేదిక ఇక్కడ దొరికిందికదా అని సంతోషమేసింది. అంతలోనే కాఫీ డే యజమాని కథ గుర్తుకొచ్చి మనసు బరువెక్కింది.

బస్టాప్ దగ్గర గొడుగు కింద నిలబడిన జీన్స్ ప్యాంట్ అమ్మాయితో మరింత దగ్గరగా జరిగి ఏదో చెబుతున్న అబ్బాయిని చూసి ‘వీడేదో మాయమాటలు చెబుతున్నాడా?’ అని ఆ అమ్మాయి ముఖం పరిశీలనగా చూశాను. చినుకులు ఆగి, ఆగి చిన్నగా పడుతున్నాయి. అమ్మాయి ముఖం కాస్త అనీజీగానే ఉంది. మాటలు కరువవుతున్న సమాజంలో ఉన్న కొన్నిమాటలూ ఇలా మాయ చేసేవి, మంత్రించి, మోహపరిచేవే అయితే ఎలా? ఈ ఆడపిల్లల్ని నేను ఎంతకని కాపాడగలను? అంతలోనే ఆ ఆలోచనకి నవ్వొచ్చింది. అసలు నేను కాపాడటమేమిటీ?!

శశి స్వశక్తిని గురించి కదా చెబుతుంది. ఎప్పుడో పది, పదిహేను సంవత్సరాల క్రితం మా కుటుంబాలు ఒకే వీధిలో ఉండేవి. అప్పటికి శశి పదోక్లాసు చదువుకుంటోంది. కాలేజీ చదువు పూర్తి చేసుకుని స్కూటీ మీద ఉద్యోగానికి వెళ్ళే నేనంటే ఆరాధనాభావంతో ఉండేది. పక్కింట్లో ఒక చిన్న పోర్షన‌లో ఉండే వాళ్ళ కుటుంబ ఆర్థిక సమస్యల గురించి అమ్మ చెబుతూండేది. పెళ్ళిచేసి పంపిన పెద్ద కూతురి జీవితం గొడవల్లో పడిందని, ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలతో ఇక్కడే ఉంటోందని తెలిసింది. నెలకో, రెణ్ణెల్లకో ఒకసారి ఆ అమ్మాయి భర్త రావటం, తన భార్య ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తేనే తీసుకెళ్తానని అల్లరి చేసి వెళ్ళటం, చుట్టుపక్కలందరికీ అర్థమవుతూనే ఉండేది. ఒకరోజు శశి గొంతు గట్టిగా వినిపించింది, “అక్క పదోక్లాసు కూడా చదవలేదని తెలిసే పెళ్ళిచేసుకున్నారు కదా, ఇప్పుడు ఉద్యోగం చెయ్యాలంటే ఎలా చేస్తుంది? మీరు చదివించుకుని, ఉద్యోగం చేయించుకోండి.” అంటూ ఇంటల్లుణ్ణి నిలదీయటం పెద్ద గొడవైపోయింది. శశి ఆరోజు తండ్రి చేతిలో దెబ్బలు తింది.

సాయంత్రం అమ్మ దగ్గరకొచ్చి, “అత్తయ్యగారూ, నాన్న కొట్టేరని నాకు బాధ లేదు. కానీ అక్క, పిల్లల బాధ్యత నాన్న స్థోమతుకి మించిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. అక్క ఊర్కే ఏడుస్తుంది. చదువుకోమంటే వినదు.” అంది ఆరిందాలా. “అక్కకి చదువుకోమని నేను చెబుతాను శశీ.” అంటూ అమ్మ శశిని ఓదార్చింది. అన్నట్టుగానే పదోక్లాసు పరీక్షకి కట్టించింది. అలాగే చిన్న ఉద్యోగం చూసిపెట్టింది. శశి చదువుకుని, ఉద్యోగంలో చేరి తమ్ముడిని, చెల్లెలిని చదివించింది. ఇప్పటికీ తీరని అక్క సమస్యకి తోడుగా నిలిచింది. అక్క పిల్లల్ని చదివిస్తోంది. తండ్రి పోయాక ఇంటిపెద్దగా నిలబడి, తల్లికి సాంత్వననిస్తోంది.

ఎదురుచూస్తున్న బస్సు రావటంతో శశి గురించిన ఆలోచనలు వదిలి, ముందుకు కదిలాను.

కిటకిటలాడుతున్న బస్సులో ఓపక్కగా నిలబడి బస్సంతా పరిశీలనగా చూశాను. ఇలాటి ప్రయాణాలు మనసుకి భలే నచ్చుతాయి. చుట్టూ కమ్ముకున్న జనం, వాళ్ళలో వాళ్ళు కలబోసుకుంటున్న మంచి చెడ్డలు… ఓహ్! పగలంతా అమ్మకాలు చేసుకుని ఖాళీ బుట్టలతో బస్సెక్కి కబుర్లలో అలసట మరుస్తున్న వాళ్ళని చూస్తే బావుంటుంది. ఆ ముఖాల్లో నవ్వులు ఎంత అందాన్నిస్తున్నాయి! బస్సంతా పనులనుంచి, చదువులనుంచి ఇళ్ళకెళ్తున్న ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందరిదీ ఒకటే ఆరాటం. పొద్దున్నే వదిలి వచ్చిన తమతమ ప్రపంచాల్లోకి వెళ్ళాలి. బయట ప్రపంచంలో పోరాటానికి తెరదించి, ఇళ్ళలోకి… ఆడపిల్లలకి ఇల్లు ఒక ప్రపంచమైతే, ఇల్లు దాటి బయటికెళ్తే మరో ప్రపంచం. రెండూ సవాళ్ళను విసిరేవే. రెండుచోట్లా పోరాటాలు తప్పనిసరే.

కండక్టర్ జరగండంటూ అందర్నీ లోపలికి తరుముతున్నాడు. చిన్నపాపాయితో ఎక్కిందామె, చేతిలో బరువైన బ్యాగ్ కూడా ఉంది. పాపని తన చీరకొంగును పట్టుకొమ్మని, కిందకి దింపి లోపలికి సర్దుకునే ప్రయత్నం చేస్తోంది.

“వయ్యారాలు పోతే కుదరదు, సర్దుకోవమ్మా లోపలికి.” విసురుగా అంటున్న కండక్టర్ మాటలకి వెనకనుంచెవరో గట్టిగా అరిచినట్టు సమాధానం చెప్పారు.

“ఇళ్ళకాడ ఆడోళ్ళని అదిలించినట్టు ఇక్కడ కుదరదు కానీ, ముందు నువ్వు నోరు సర్దుకో.” అభినందిస్తున్నట్టు బస్సులోపలి వాళ్ళంతా తలలు తిప్పారు ఆవైపుగా.

నాకు అంత రద్దీలోనూ ఆ మాటలు హాయిగా వినిపించాయి.