గ్రీకు పురాణ గాథలు 1

ముందుమాట

నేను ఈ వ్యాసాలు రాయడానికి ప్రేరణ కారణం ఒక విమాన ప్రయాణం. భారతదేశం వెళుతూ, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉదయం 8గంటలకి బయలుదేరి, నూ యార్క్ చేరుకునేసరికి సాయంత్రం అయిదు అయింది. పరుగుబాట (runway) మీదకి దిగడానికి విమానం సంసిద్ధం అవుతూ ఉండగా, ‘మనం దిగబోయే పరుగుబాట మీద మరొక విమానం ఉంది. కంట్రోలు టవర్లో ప్రజలు నిద్రపోతున్నట్లు ఉన్నారు. మరో చుట్టు తిరిగి వస్తాను. అరగంట సేపు ఓపిక పట్టండి,’ అని చోదకుడు విమానం జోరు పెంచుతూ పైకి లేపేసరికి ఇహ చేసేది ఏమీ లేకపోవడంతో నా కుర్చీకి ఎదురుగా ఉన్న టి.వి. లో ఏదైనా ఇరవై నిమిషాల కార్యక్రమం చూద్దామని వెతకడం ఉపక్రమించేను. ‘అపస్వరం అనే ఏపిల్ పండు కథ. పదిహేను నిముషాలుట. చూడడం మొదలుపెట్టేను.

పురాతన గ్రీసు దేశపు కథ. ఇంతకు పూర్వం నేనెప్పుడూ వినలేదు. ఆసక్తితో చూసేను. గమ్యం చేరుకోగానే గూగుల్‌లో వెతికేను. చాల ప్రాచుర్యం ఉన్న కథ. మా అమ్మాయిని అడిగితే, ‘చిన్నప్పుడు హైస్కూల్‌లో చదివేను’ అని చెప్పింది. పుస్తకాల పురుగుని అయినా ఈ కథ నా కళ్ళపడడానికి ఎనభై ఏళ్ళు పట్టిందంటే ఈ కథని వినని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారో అనిపించింది. ఈ కథ గురించి పరిశోధన చేస్తూ ఉంటే ఆసక్తికరమైన అంశాలు ఎన్నో తెలుసుకున్నాను. వాటన్నిటిని క్రోడీకరించి వ్యాసాలుగా రాసేను. మన పురాణ గాథల గురించి లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇతరుల పురాణ గాథలు కూడా అధ్యయనం చెయ్యాలి.

ఇంగ్లీషులో myth అనే మాటని తెలుగులో పురాణ గాథ అనొచ్చు. పురాణ గాథలకి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం: పిల్లలు కుతూహలంతో అడిగే, ఇబ్బంది పెట్టే, ప్రశ్నలకి తేలికగా సమాధానాలు చెప్పడానికి. ఏమిటా ప్రశ్నలు? ఈ ప్రపంచాన్ని ఎవ్వరు తయారుచేసేరు? ఎప్పుడు తయారుచేసేరు? ఈ ప్రపంచం ఎన్నాళ్ళు ఉంటుంది? మొట్టమొదట ఎవ్వరు పుట్టేరు? చచ్చిపోయిన తరువాత ఎక్కడకి వెళ్తాము? మొదలైనవి. రెండవ ప్రయోజనం: మనం ఉంటున్న సాంఘిక వ్యవస్థని, మన ఆచార వ్యవహారాలని సమర్ధించడం కొరకు. సనాతన కాలపు గ్రీసు దేశపు సమాజంలో దేవుళ్ళ గురించి, దేవతల గురించి, సాహసోపేతమైన ధీరుల గురించి, భయంకరమైన రాక్షసాకారాల గురించి, వికృతమైన చంపూ మానవులు (human-animal hybrids) గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తుఫానులు ఎందుకు వస్తున్నాయి? అగ్నిపర్వతాలు ఎందుకు పేలుతున్నాయి? భూకంపాలకి కారణం ఏమిటి? పూజలు, వ్రతాలు, మొదలైన కర్మకాండలు ఎందుకు చెయ్యాలి? మొదలైన ప్రశ్నలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు. వీటికి సమాధానాలు చెప్పడం కోసం పురాణ గాథలు పుట్టుకొచ్చాయి.

హిందువులకి వేదాల వంటి పురాతన ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి. క్రైస్తవులకి బైబిల్ ఉంది. కంచు యుగం (Bronze age) రోజులలో, గ్రీసు దేశంలో, వారికి ఉన్నవల్లా తరతరాలుగా వస్తున్న మౌఖిక సాహిత్యము, సంప్రదాయాలూ. ఆ కథలు ఈ నోటా ఆ నోటా ప్రయాణం చేసి, కాలక్రమేణా మార్పులు చెంది, చివరికి లిఖిత రూపంలో గ్రంథస్థం అయేయి. ఈ రకంగా గ్రంథస్థం అయిన వాటిల్లో చెప్పుకోదగ్గవి హోమర్ (Homer) సాధారణ శకానికి పూర్వం 8వ శతాబ్దంలో రాసిన ఇలియడ్ (Iliad), ఆడిసీ (Odyssey) అనే రెండు గ్రంథాలు. వీటిల్లో ట్రోయ్ యుద్ధం గురించి కొన్ని వివరాలు కనిపిస్తాయి. ఈ యుద్ధం పైకి చూడడానికి రెండు మానవ సైన్యాల మధ్య యుద్ధంలా కనిపించినా, ఈ యుద్ధానికి ప్రేరణకారకులు దేవతలు, వారి మధ్య ఉండే ఈర్ష్య, అసూయ, మొదలైన వైషమ్యాలు.

హోమర్ తరువాత ఒక శతాబ్దం గడచిన పిమ్మట (ఉరమరగా సా. శ. పూ. 7వ శతాబ్దంలో) హెసియోడ్ (Hesiod) అనే చరిత్రకారుడు రాసిన థియోగనీ (Theogony) అనే గ్రంథంలో ఈ ప్రపంచం ఎలా పుట్టిందని ప్రాచీన గ్రీకులు నమ్మేవారో మొదటిసారి చూస్తాం. ఈ గ్రంథంలోనే ఆదిలో ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి నుండి గయేఅ(Gaea) అనే భూదేవత పుట్టడం, తరువాత ఆమె ప్రాథమిక ప్రకృతి శక్తులకు ఎలా జన్మనిచ్చిందో, తదుపరి వారి నుండి రాక్షసగణాలు, దేవగణాలు ఎలా పుట్టుకొచ్చేయో, ఆయా వంశవృక్షాలతో సహా కూలంకషంగా వర్ణించబడ్డాయి. కాలక్రమేణా ఈ కథలని ఆధారంగా చేసుకుని శిల్పులు శిల్పాలు మలిచేరు, చిత్రకారులు బొమ్మలు గీసేరు, కవులు గ్రంథాలు రచించేరు, నిర్మాతలు సినిమాలు తీసేరు. చిట్టచివరకు అధునాతన కాలంలో వ్యాపార సంస్థలు కూడా ఆ కాలపు పేర్లని, శాల్తీలని వాడుకుంటున్నారు.

నేడు మనం బజారులో కొనుక్కునే అనేక వస్తువుల పేర్లు గ్రీకు పురాణ గాథల నుండి సేకరించినవే! పాదరక్షలని చేసే నైకీ (Nike) సంస్థ పేరు ఎక్కడినుండి వచ్చిందని అనుకుంటున్నారు? చంద్రుడి దగ్గరకు మానవులని మోసుకెళ్ళిన రాకెట్ అపాలో (Apollo) పేరు ఎక్కడిదో తెలుసా? అమెజాన్.కామ్ కంపెనీ పేరులో అమెజాన్ ఎక్కడినుండి వచ్చిందో తెలుసా? అమెరికాలో బట్టలు ఉతుక్కునే ఒక సబ్బు వ్యాపార నామం ఏజాక్స్ (Ajax), అమెరికాలో ఆటలాడే జట్లు పేర్లు టైటన్స్, స్పార్టన్స్, ట్రోజన్స్, వగైరా పేర్లు అన్నీ గ్రీసు దేశపు పురాణాలలో పేర్లే.

గ్రీసు దేశపు (లేదా, గ్రీకు) నాగరికత పతనం అయిన తరువాత, ట్రోయ్ యుద్ధంలో బతికి బయటపడ్డ యోధులు కొందరు ఇటలీ చేరుకుని రోమ్ సామ్రాజ్యపు సంస్థాపనకి కారకులు అయేరు. అప్పుడు గ్రీకు కథలకి సమాంతరంగా రోమ్ పురాణ గాథలు పుట్టుకొచ్చేయి. ఈ కథలలో పాత్రల పేర్లు మారేయి కానీ మౌలికంగా గ్రీకు పాత్రలనే పోలి ఉంటాయి.

ఇక్కడ ఉటంకించిన అంశాలన్నిటినీ కేవలం ఒక నఖచిత్రంలా స్పర్శించినా ఇది పెద్ద గ్రంథం అవుతుంది. అందుకని కొన్ని ముఖ్యమైన అంశాలని మాత్రమే ముచ్చటించేను.

వేమూరి వేంకటేశ్వరరావు
ప్లెజంటన్, కేలిఫోర్నియా
2010


1. పరిచయం

మనకి వేదాలు, అష్టాదశ పురాణాలు, రామాయణ మహాభారతాల వంటి ఇతిహాసాలు ఉండగా, గ్రీకు (గ్రీసు దేశపు) పురాణ గాథలు ఎందుకు చదవడం?

ఆధునిక పాశ్చాత్య నాగరికత యొక్క పునాదులు గ్రీసు దేశంలో కనిపిస్తాయి. పైథాగరోస్, సోక్రటీస్, ప్లూటో, అరిస్టాటిల్ వంటి ఆద్యులకి గ్రీసు దేశం పుట్టినిల్లు. ఆధునిక శాస్త్రాల మీద గ్రీసు దేశపు ప్రభావం అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. అంతే కాదు. పాశ్చాత్య సాహిత్యం మీద, శిల్పాల మీద, తైలవర్ణ చిత్రాల మీద, సినిమాల మీద, ఆటల మీద కూడా గ్రీసు దేశపు పురాణ గాథల ప్రభావం మెండు. కనుక గ్రీసు దేశపు పురాణ గాథలపై అవగాహన మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మౌర్య సామ్రాజ్యపు రోజుల నుండి భారత దేశం మీద గ్రీసు ప్రభావం మెండుగా ఉందనే చెప్పాలి.

గ్రీసు దేశపు పురాణ గాథలు చదువుతూ ఉంటే వాటికీ హిందూ పురాణ గాథలకీ మధ్య పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పోలికలు పేర్లలో కావచ్చు, సంఘటనలలో కావచ్చు, వ్యక్తుల ప్రవర్తనలో కావచ్చు, దేవతల ఆయుధాలలో కావచ్చు, దేవతల వాహనాలలో కావచ్చు, దేవతలకి మానవులకి మధ్య సంబంధబాంధవ్యాల రూపేణా కావచ్చు. ఈ పోలికలకి కారణాలు రకరకాల కోణాలలో వెతకవచ్చు. కానీ హిందూ పురాణ గాథలకి, గ్రీసు పురాణ గాథలకి మధ్య మౌలికమైన తేడాలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతానికి వాటన్నిటిని పక్కన పెట్టి వారి పురాణ గాథలని ఒక నఖచిత్రంలా అర్థం చేసుకుందాం.

మనకే కాదు, చాలా సమాజాలలో పురాణ గాథలు ఉన్నాయి; ఈజిప్షియన్, నోర్స్, గ్రీక్ వగైరా. ఈ కథలు అన్నిటిలోను ఈ ప్రపంచం ఎలా పుట్టుకొచ్చిందో, అందులో మానవుడు ఎలా ఉద్భవించేడో, రకరకాల కోణాలలో ఆవిష్కరణ జరుగుతుంది. అంతే కాకుండా దేవతలు, స్వర్గం, నరకం, మొదలైన విషయాల మీద పరిశీలన జరుగుతుంది. వీటిని సునిశితంగా పరీక్షించి చూస్తే వీటన్నిటిలోను కొన్ని పోలికలు కనిపిస్తాయి. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, విభిన్న ప్రదేశాలలో, విభిన్న కాలాలలో నివసిస్తున్న మానవుల మేధలో, ఈ విశ్వం యొక్క ఆవిర్భావాన్ని గురించి పోలికలు ఉన్న ఆలోచనలు వచ్చి ఉండవచ్చు. రెండు, అనాది కాలంలో ఈ విశ్వం యొక్క ఆవిర్భావం గురించి ఒకచోట వచ్చిన మౌలికమైన ఊహా తరంగాలు నాలుగు దిశలకి వ్యాపించి, కాలక్రమేణా దేశ, కాల, పరిస్థితులకి మార్పులు చెంది, రకరకాల కథలుగా అవతరించి ఉండవచ్చు. స్వర్గం, నరకం, దేవతలు, దానవులు, మంచి, చెడు అనే భావాలకి భౌగోళిక పరిధులు ఉన్నట్లు తోచదు.

పురాతన కాలపు గ్రీసు దేశంలో ప్రజలు బహుదేవతారాధకులు. ప్రకృతిలో మనకి కనిపించే శక్తులు దేవతల ఆధీనంలో ఉంటాయని నమ్మేవారు. ఆయా దేవతలు ప్రసన్నమైతే ఆయా శక్తులు మనకి అనుకూలంగా ఫలితాలని ఇస్తాయని నమ్మేవారు.

గ్రీసు దేవతలలో ఏకోదరుల మధ్య వివాహాలు జరిగితే తప్పుకాదు; అదే విధంగా తల్లికి కొడుకుకి మధ్య వైవాహిక సంబంధం కానీ, తండ్రికి, కూతురుకి మధ్య వైవాహిక సంబంధం కానీ సమ్మతమే. సృష్ట్యాదిలో ఈ రకం సంబంధాలు తప్పనిసరి. ఈ రకం సంబంధాలు మన పురాణాలలోను కనబడతాయి. దేవతలని, అమరులని మానవ లోకంలో ఉన్న విలువల పట్టకం ద్వారా విమర్శించి ప్రయోజనం లేదు. అదే విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు విలువలని, శాస్త్ర పరిజ్ఞానాన్ని గజంబద్దలా వాడి వీరిని విమర్శించి లాభం లేదు.

మన ప్రాచీన పురాణ గాథలు రామాయణ, మహాభారతాలలో ఇమిడి ఉన్నాయి. ఇదే విధంగా గ్రీసు దేశానికి సంబంధించిన ప్రాచీన పురాణ గాథలు హోమర్ (Homer) (సా. శ. పూ. 750) రాసిన ఇలియడ్ (Iliad), ఆడిసీ (Odyssey) అనే గ్రంథాలలోను, హెసియోడ్ (Hesiod) (సా. శ. పూ. 700) రాసిన థియోగనీ (Theogony) లోను, వర్జిల్ (Virgil) (సా. శ. పూ. 20) రాసిన ఎనియడ్ (Aeneid) వగైరా గ్రంథాలలోనూ కనిపిస్తాయి. (ఇక్కడ ఇచ్చిన తేదీలు అన్ని సుమారుగా తీసుకోవాలి; కచ్చితంగా ఎవ్వరికి తెలియదు. సా. శ. పూ. అంటే సాధారణ శకానికి పూర్వం, అనగా పాత పద్ధతిలో, క్రీస్తు పూర్వం అని అర్థం.)

గ్రీకు పురాణ గాథలలో దేవతలే కాదు, శూరులు, వీరులు అయిన మానవులు కూడా ఉన్నారు, ఉదాహరణకి మహా బలవంతుడైన హెర్క్యులిస్ (Herculis) పేరు తెలియనివారు ఉండరు. మొట్టమొదటి మానవ స్త్రీ పేండోరా (Pandora) తెరవకూడని పెట్టె తెరచి మానవ లోకానికి పెద్ద సమస్య తెచ్చి పెడుతుంది. దంతపు విగ్రహల అందాన్ని చూసి, ప్రేమలో పడడం పిగ్మేలియన్ (Pygmalion) కథాంశం. అరాక్ని (Arachne) అనే సాలె వనిత పొగరుబోతు ప్రవర్తనకి శిక్షగా సాలెపురుగుగా మారిపోతుంది. ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవడం వల్ల మైడస్ (Midas) పడ్డ పాట్లు మనకి తెలియనివి కావు. నార్సిసస్ (Narcissus) అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని దాని మీద ప్రేమలో పడడం అనే కథని ఆధారంగా చేసుకునే ఇంగ్లీషులో నార్సిసిజమ్ అనే మాట వచ్చింది. పోతే, గ్రీకు కథలలో వచ్చే రాక్షసాకారాలు, వికృతమైన జంతు-నర సంకరాకారాలు చాలామట్టుకి కథలలో చదివే ఉంటాం. పెగసస్ (Pegasus) అనే గుర్రానికి రెక్కలు ఉంటాయి. సెంటార్ (Centaur) ముందు భాగం మనిషిలా ఉంటే వెనక భాగం గుర్రంలా ఉండే నరతురంగం. ఈ రకం నరతురంగాలనే హిందూ పురాణాలలో కింపురుషులు అన్నారు. మనకి ఉన్నట్లే వారికీ కిన్నరులు (satyrs) ఉన్నారు. స్ఫింక్స్ (Sphynx) అనేది స్త్రీ రూపంలో ఉన్న నరసింహం. ఇంకా విచిత్రమైన శాల్తీలు చాల ఉన్నాయి.

గ్రీకు పురాణాలలో కథలకి, మన పురాణ గాథలకి మధ్య ఎంత గట్టి పోలికలు అంటే ఒకరి నుండి మరొకరు అనుకరించారా? అన్న అనుమానం రాక మానదు. ఎవరి నుండి ఎవరు? అనే ప్రశ్న వేసుకుని అనవసరంగా ఆరాటపడేకంటే ఆ పోలికలు కొన్ని చూద్దాం.

ఉదాహరణకి మేషాది మీన పర్యంతం ఉన్న ద్వాదశ రాసులనే తీసుకుందాం. భూమి నుండి సూర్య చంద్రులని చూసినప్పుడు నేపథ్యంలో కనిపించే నక్షత్ర సమూహాలకి మన పూర్వులు మేషం, వృషభం, …., మీనం అని పేర్లు పెట్టేరు. ఎందుకని ఈ పేర్లు పెట్టేరుట? ఆ నక్షత్ర సమూహాలు ఆయా శాల్తీల ఆకారాలలో ఆనాటి వీక్షకులకి కనిపించి ఉంటాయి. నా కంటికి ఈ ఆకారాలు అలా అనిపించలేదు. ఎక్కడో, ఎవ్వరికో ఒక నక్షత్ర సమూహం మేషం ఆకారం లోనో, వృషభం ఆకారం లోనో కనిపించి ఉండు గాక. కానీ అవే నక్షత్ర సమూహాలు అన్ని దేశాలలో అవే ఆకారాలలో కనిపించేయనడం నమ్మశక్యం కాని ఊహ. ఈ రాసి చక్రం లోని పేర్లు ఇటు నుండి అటు అయినా వెళ్ళి ఉండాలి, లేదా అటు నుండి ఇటు వచ్చి ఉండాలి.

మరొక ఉదాహరణగా మన వారాల పేర్లు చూడండి. ఇంగ్లీషులో మనం వాడే వారాల పేర్లు పాశ్చాత్యుల పురాణాలలోని పాత్రల పేర్లని ఆధారంగా చేసుకుని పెట్టినవి. వాటిని యధాతథంగా సంస్కృతంలోకి అనువాదం చేసి పెట్టిన పేర్లే మనం ఇప్పుడు వాడుతున్నవి అని నా నమ్మకం. ఎందుకంటే గ్రీసు, రోమన్ పురాణ గాథలలో వీటి వెనుక చాల లోతైన కథలు ఉన్నాయి. మన వరాల పేర్లకి, మన పురాణం గాథలకి మధ్య లంకె ఉందేమో కానీ నాకు కనబడలేదు. నెలల పేర్లు వచ్చేసరికి మన చైత్ర వైశాఖాదులకి, జనవరి, ఫిబ్రవరి, వగైరాలకి ఇటువంటి సంబంధం కనిపించదు. గ్రహాల పేర్లు చూసినా, నక్షత్రాల పేర్లు చూసినా కూడా దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపించదు.

మనకి కైలాస పర్వతం ఉంటే వారికి ఒలింపస్ పర్వతం ఉంది. కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడు, ఒలింపస్ పర్వతం మీద వారి దేవతలు అందరూ ఉంటారు. మన దేవతలూ, వారి దేవతలూ అమరులే. మన దేవతలకి అమృతం తాగితే అమరత్వం సిద్ధించింది. వారి దేవతలు అంబ్రోసియా (Ambrosia) తింటారు, నెక్టర్ (Nectar) తాగుతారు. విష్ణుమూర్తి దేవతలకి అమృతం పంచిపెడుతున్న సమయంలో ఒక రాక్షసుడు దేవతల వరసలో చేరి దొంగతనంగా అమృతం తాగినందుకు శిక్షగా విష్ణుమూర్తి అతని తలని తన చక్రంతో నరుకుతాడు. గ్రీసు పురాణాలలో టాన్టలస్ (Tantalus) అంబ్రోసియాను దొంగిలించి తిన్నందుకుగాను ఆకలిదప్పికలతో పాతాళంలో పడి ఉండమని శాపం పొందుతాడు.

తనకి పుట్టిన సంతానమే తన మరణానికి కారణం అవుతుందని తెలుసుకుని రియా (Rhea)కి పుట్టిన ప్రతి బిడ్డని క్రోనస్ (Cronus) మింగేస్తాడు. చిట్టచివరికి కడసారపు బిడ్డ జూస్ (Zeus) ప్రాణం కాపాడడానికి రియా కుట్ర పన్నుతుంది. ఇక్కడ శంతనుడు-గంగ కథ కానీ కంసుడు-కృష్ణ కథ కానీ గుర్తుకి వస్తుంది. ఇలా వెతికితే బహిరంగంగా ఇంకా చాల పోలికలు కనిపించినా ఇలియడ్, ఆడిసీ వగైరాలలో కనిపించే గ్రీసు పురాణ గాథలకి రామాయణ, మహాభారతాలలోను, హిందూ పురాణాలలోను కనిపించే కథలకి మధ్య మౌలికమైన తేడాలు ఉన్నాయి. ఈ కథల ద్వారా ఈ పోలికలు, తేడాలు ఏమిటో వివరంగా ముందు ముందు తెలుసుకుందాం.

(సశేషం)


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...