కవి హృదయం

వ్రాయాలని ఉంది…
కలం ముందుకు పారదు!
కవిత సాగేదెలా?

ఆలోచన ఉంది…
అక్షరంగా మారదు!
ఆశ దాగేదెలా?

చుట్టూ ప్రేరేపించే ప్రకృతి ఉంది…
వ్రాసే దారే కనబడకుంది!
ఝంఝ రేగేదెలా?

మనసు వేచి చూస్తోంది…
జగతి పొంచి వింటోంది!
మౌనం వీగేదెలా?

కలల లోకం కనుల దాగింది…
మగత మనసును మూసి వేస్తోంది!
నిదుర ఆగేదెలా?

తపన దారి తప్పుతోంది…
మనసు నోరు విప్పకుంది!
మధువు త్రాగేదెలా?

కోర్కె పలచబడుతోంది…
కల కరిగిపోతోంది!
రాత్రి వేగేదెలా?

భావం చుట్టుకుపోతోంది…
కవిత కొట్టుకుపోతోంది!
గుండె మ్రోగేదెలా?


నచకి

రచయిత నచకి గురించి:

సాహితీసేద్య ఫలాలు: అంతర్జాల పత్రికలు, అమెరికాలోని కొన్ని తెలుగు పత్రికల్లో వచ్చిన కవితలు, పద్యాలు, కథలు, పాటలు; “చక్రవర్తుల” అన్న తెఱపేరుతో వెలువడిన కొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు, చలనచిత్రేతర గీతాలు; సరస్వతీపుత్రులు శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్, శ్రీ మేడసాని మోహన్ వంటి దిగ్గజ అవధానుల గోష్ఠిలో పృచ్ఛకునిగా న్యస్తాక్షరి నిర్వహణ, పొద్దు వారి అంతర్జాల అవధానాల్లో పాల్గోత.

 ...