నీటి ఊహ

ఒక్కడివి వంతెన మీద
ఎవరూ రాని వెన్నెల వేళ
ఆ చివర అంటూ ఏమీ లేనట్టు అనంతంగా ఇనుప స్తంభాలు
స్తంభాల మీద ఆకాశంలో ఊగుతున్నట్లున్న అర్థ వలయాలు

ఒక ఊహ
నీరై ప్రవహిస్తుంది. జ్ఙాపకాన్ని దాటి ఆవలికి దూకే ప్రయత్నంలో
తన మీంచి తాను పొర్లుతుంది. గోధుమ రంగు కుక్కపిల్లల ఆట.

నీరు కాదు ఊహ
కలల పాపాయి పడిపోకుండా పక్కల్లో అమ్మ సర్దిన పొత్తిలి మడతలు
కొన్ని విరామ చిహ్నాలు; అంతే, ఏమీ లేదు
ఏమీ లేదనడమంటే పూర్తిగా అర్థమయ్యేదేదీ లేదని. ఏం, లేకపోతేనేం,
చెయ్యి ఉంది, కాలు ఉందిది, దూరం ఉంది, భయం ఉంది, కోరికలున్నాయి;
ఆగమని కాదు; అపేసేంత దిగులొద్దని, ఆదమరిచేంత సంతోషం వద్దని

ఒక్కడివే వంతెన మీద
నీ కోసం నువ్వు ఎదురు చూస్తూ
రావలసి వున్న నిన్ను ఆడపిల్లను చేసి అందమైన అమ్మాయి పేరు పెట్టి
ఆమె కాదనడానికి వీల్లేని ప్రేమకు రాయాల్సి వున్న పాటకు రాగం కట్టుకుని
పాడాలనుకుని

ఎప్పటికీ రాని నీ చేతికి పులి నోట్లో విసరాల్సిన ఖడ్గమొకటి సంధించి
నీ నుంచి నీకు తగిన సమాచారం అందాక చివరి యద్ధానికి వ్యూహ రచన
చేద్దామని; ఇది కాకుంటే ఇంకొకటి, లేదా మరొకటి చేద్దామని
స్తంభాలలో, అర్థవలయాలలో, నీళ్ళలో నువ్వొక స్తంభమై, వలయమై, నీరై