కవిత ఒకటి కొత్తది

నవ్వుతూ పలకరించి
హత్తుకునే కవిత ఒకటి చెప్తావా

నీకు చెందని సామాజిక స్పృహల
ఆత్మవంచన లేని కవిత
వర్గ ప్రాతినిధ్యపు
పక్షపాతపు చూపులేని కవిత
పుంఖానుపుంఖాలుగా సాగి
రొడ్డకొట్టుడు ప్రయోగాలతో
సూక్తివాక్యాలతో
నీకు మాత్రమే సందేశమవని
కవిత ఒక్కటి చెప్తావా

రోజూ వినే మాటలైనా
బతుకులా కొత్తగా అనిపింపచేసే కవిత,
కవి అనిపించుకోవడం కోసమే
రాసినలాంటిది కాని కవిత, ఒక్కటి చెప్తావా

అదాటున కురిసే వర్షంలా నిలువునా తడిపి
ఉక్కిరిబిక్కిరి చేసి నవ్వుకుబోయే కవిత
మనిషిదనపు గుర్తుగా
పచ్చితనాన్ని తొణికించే కవిత
మాటలను కవిత్వపు కలకండ చేసే కవిత
ఒక్కటంటే ఒక్కటైనా చెప్తావా

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...