ఇంద్రగీతమ్

కావ్యకంఠ గణపతిమునిగా ప్రసిద్ధుడైన అయల సోమయాజుల గణపతిశాస్త్రి (1878-1936) తెలుగువాడే అయినా, తెలుగువాళ్ళకి ఈయన గురించి పెద్దగా తెలియదు. దానికి కారణాలు అనేకం. ఆయన తన జీవితకాలంలో సింహభాగం తమిళదేశంలోనూ, కన్నడదేశంలోనూ, కొంకణ ప్రాంతాలలోనూ ఎక్కువగా గడిపాడు. ఆయన తెలుగు ప్రాంతాలలో ఉన్నది చాలా తక్కువ. ఆయన రచనలన్నీ సంస్కృతంలోనే ఉండటం, వాటిలో కొన్ని మాత్రమే తెలుగులో రావడం మరో కారణం కావొచ్చు. బొబ్బిలి దగ్గర కలవరాయి అగ్రహారంలో జన్మించిన గణపతిశాస్త్రి చిన్నతనంలోనే సంస్కృత వ్యాకరణం, ఛందస్సులో ప్రావీణ్యం సంపాదించి, పదో ఏటనే ఛందోబద్దమైన కవిత్వం అల్లాడు. 1900 సంవత్సరంలో, నవద్వీపంలో జరిగిన విద్వత్పరీక్షలలో పాల్గొని, అక్కడి వారందరినీ తన కవిత్వంతో, పాండిత్యంతో మెప్పించి కావ్యకంఠ బిరుదు పొందాడు. అటు తర్వాత, 1907లో అరుణాచలంలో, అప్పటింకా మౌనముద్రలో ఉన్న ‘బ్రాహ్మణస్వామి’ అని స్థానికులు పిలిచుకునే ఒక యువకుడి దగ్గర గురూపదేశం పొంది–ఆయనకి రమణ మహర్షి అనే ఆథ్యాత్మిక నామకరణం చేశాడు. రమణుడు ప్రీతితో ఈయన్ని ‘నాయనా’ అని పిలిచేవారు. ఆ పేరే ఆయనకి శిష్యవర్గంలో స్థిరపడిపోయింది. రమణుడి దగ్గర ఉన్నపుడే, తపస్విగా, ఋషిగా కొత్తజీవితాన్ని ప్రారంభించి, ఉమాసహస్రం, రమణగీత, ఇంద్రాణీ సప్తశతి, సద్దర్శనం మొదలైన కావ్యాలని రచించాడు.

అటుపైని, వైదిక ఋషుల భావనా ప్రపంచం (Conceptual Universe) పౌరాణికుల భావనా ప్రపంచం కంటే మౌలికంగా విభిన్నమైనదని, పౌరాణికుల కాలంలో వేదమతం చాలా మార్పులకి గురైందని స్ఫురించి, వేదాన్ని అధ్యయనం చెయ్యడానికి కొంకణ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సుమారుగా ఆరేళ్ళు ఉండి ఋగ్వేదాన్ని క్షుణ్ణంగా, తపోదీక్షతో అధ్యయనం చేశాడు. సాయన భాష్యంలో చాలా తప్పులు ఉన్నాయని గ్రహించి, కొన్ని ఋగ్వేద మంత్రాలకి పదపాఠాలతో కూడిన సరికొత్త భాష్యం, విశ్వమీమాంస, ఛందోదర్శనం, తత్వఘంటాశతకం, ఈశోపనిషత్ భాష్యం, భారతచరిత్ర పరీక్ష మొదలైన తాత్విక, దార్శినిక విమర్శనా రచనలు చేశాడు. ఇవే కాకుండా, దశమహావిద్యాది సూత్రావళీ, లాలిభాషోపదేశం మొదలైన సూత్ర రచనలు కూడా చేశాడు. సూత్ర రచనలల్లో లాలిభాషోపదేశం చెప్పుకోగదగ్గది. పాణినీయం వేదాన్ని అధ్యయనం చెయ్యడానికి, వేదోచ్చారణని సూత్రీకరించడానికి ఉద్దేశించింది; పాణినీయ సూత్రాల సరళిలోనే, లాలిభాషోపదేశం సంస్కృత భాషలో సరళమైన వచనం, ఛందోబద్ధమైన కవిత్వం రాయడానికి ఉద్దేశించిన సూత్ర సాహిత్యం. స్తోత్ర సాహిత్యంలో కూడా గణపతిమునిది కొత్త మార్గమే; సాధారణంగా స్తోత్రాలలో ఒక దేవత స్వరూపాన్నీ, గుణగణాలని వర్ణించడం చూస్తాం, గణపతిముని స్తోత్రాల్లో, ఉపాసనా మార్గాలు, లోతైన తాత్విక చింతన అందుకు సరితూగే కవిత్వ రమణీయత ఉంటాయి. ఛందోదర్శనం వైదిక వాఙ్మయంలో వినూత్నమైన కావ్యం. గణపతిముని శిష్యుడు దైవరాత గజాననం తపోసమాధిలో ఉండగా, ఆయన నోటినుంచి కొన్ని మంత్రాలు అప్రయత్నంగా, మూడు రోజులపాటు వచ్చాయట. అక్కడే ఉన్న గణపతిముని వాటిని విని, ఏకసంథాగ్రాహి కాబట్టి, వాటిని జ్ఞప్తిలో ఉంచుకుని, అవి ప్రాచీన ఋగ్మంత్రాలతో పోలి ఉన్నాయని గ్రహించి, దైవరాతడి వాణిలో పలికినవి వేద మంత్ర దర్శనమే అని నిర్ణయించి, ఆ మంత్రాలకి ఛందోదర్శనం అనే పేరిట భాష్యం రాశాడు. దీనికి ఇంగ్లీషు అనువాదంతో భారతీయ విద్యాభవన్ 1968లో తొలిసారిగా ముద్రించారు.

‘సర్వద జఽనోయమ్ వాన్ఛతి న ముక్తిమ్, దేశకుశలాయ ప్రార్థయతి శక్తిమ్’ అని చెప్పుకున్న గణపతిముని విదేశీయుల పాలనలో కృశించిపోయిన భారతసమాజం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలనే అకుంఠితమైన శ్రద్ధతో, వేదనతో తన తపోజీవితాన్ని గడిపాడు. స్వాతంత్రోద్యమంలో కొన్నాళ్ళు చురుగ్గా పాల్గొని, మద్రాస్ కాంగ్రెస్ సభలలో సభ్యుడిగా పాల్గొన్నాడు. గాంధీజీ హిందీ భాషోద్యమంతోనూ, హరిజనోద్యమంతోనూ ఆయనకి మౌలికమైన విభేదాలు రావడంతో, కాంగ్రెస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. కులాల పేరుతో మనుషులని ఎక్కువ తక్కువగా వ్యవస్థీకరించడాన్ని నిరసించిన గణపతిమునికి హరిజనులంటూ ప్రజలని తక్కువగానే ఉంచడం పడలేదు. ‘ఉపనయనాధికారం అందరికీ ఉంది, బ్రహ్మోపదేశంతో ద్విజత్వం అందరికీ సాధ్యమే’ అని ప్రచారం చేసి, సికింద్రాబాదులో హరిజనసంఘంలో అందరికీ ఉపనయనం చేసి, వాళ్ళకి గోత్రనామాలిచ్చాడు. వాళ్ళే ఆయనకి ‘ముని’ అని బిరుదు ఇచ్చారు. స్త్రీలకి కూడా ఉపనయనాధికారం ఉందని వేద ప్రమాణం చూపించి, తన శిష్యుడు దైవరాత గజాననం కుమార్తెలిద్దరికీ ఉపనయనం చేసి వేదం నేర్పించాడు. స్వత్రంత్ర భారతదేశం కోసం వేదమత సమ్మతమైన రాజ్యాంగాన్ని కూడా సామ్రాజ్య నిబద్ధనమ్ అని రచించాడు. ఇటువంటి విప్లవాత్మక భావాలతో, సంఘసంస్కర్తగా ఆ కాలంలో ఆయన వివాదాస్పదుడు.

గణపతిముని జీవించి ఉండగా ఆయన రచనలేవీ పెద్దగా ప్రచురణకి నోచుకోలేదు. ఆయన రచనలని భద్రపరించిందీ, వాటిని వెలుగులోకి తెచ్చిందీ ఆయన శిష్యులే. అరవిందాశ్రమంలో నివశించిన టి.వి. కపాలిశాస్త్రిగారు మొదట గణపతిముని శిష్యుడే. అరవిందుడు కూడా ఎంతగానో మెచ్చుకున్న ఉమాసహస్రానికి కపాలిశాస్త్రిగారు సంస్కృతంలో అర్థ, తాత్పర్యాలు, వ్యాఖ్యానం రాసి ప్రచురించారు. కపాలిశాస్త్రిగారే గణపతిముని జీవితచరిత్రని సంస్కృతంలో వాసిష్ఠ విజయం పేరిట రాసి ప్రచురించారు. శిరసి దగ్గర కుళువేలో నివశించిన డి.యస్. విశ్వామిత్రగారు గణపతిముని రచనల వ్రాతప్రతులెన్నిటినో సేకరించి భద్రపరిచారు. తిరువణ్ణామలై నివాసస్తుడు, కె. నటేశయ్యరు ముప్పై సంవత్సరాలు శ్రమించి, ఆయన రచనలన్నిటినీ Collected Works of Ganapathi Muni పేరిట పన్నెండు సంపుటాలుగా ఈ మధ్యనే (1997-2011) ప్రచురించారు. ఈ విధంగా, ఇప్పుడిప్పుడే ఈ తపస్వి, తాత్వికుడు, మీమాంసకుడు, కవి తాలుకూ ఆలోచనా విస్త్రుతి బయటపడింది. ఈ రచనల ఆధారంగా, గణపతిముని గురించి ఒక క్రిటికల్ బయోగ్రఫీ రావాల్సి ఉంది.

గణపతిముని రచనలని తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసింది గుంటూరు లక్ష్మీకాంతంగారు. నాయన అనే పేరుతో గణపతిముని జీవిత చరిత్రని ప్రచురించడమే కాకుండా, ఆయన రచనల్లో కొన్నింటికి తెలుగు భావార్థాలతో ప్రచురించారు లక్ష్మీకాంతంగారు. గణపతిముని, తెలుగులో రచనలేవీ పెద్దగా చెయ్యలేదు. సంస్కృతంలో రచించిన పూర్ణ అనే నవలకి, తెలుగు అనువాదం ప్రారంభించారు–అది కొన్నాళ్ళు భారతిలో వచ్చింది. అది పూర్తవ్వకుండానే ఆయన పోవడంతో పూర్ణ అసంపూర్ణంగానే ఆగిపోయింది. ఆయన కుమార్తె వజ్రేశ్వరి కోరిక మీదట, సంస్కృతంలో వైదిక దేవతల మీద రాసిన గీతమాల నుంచీ, ఇంద్రగీతమ్, గణపతిగీతమ్ మాత్రం తెలుగులో ద్విపద స్తోత్రాలుగా రాశారు. వజ్రేశ్వరి దగ్గర రాతప్రతిని సంపాదించి, లక్ష్మీకాంతంగారు ఈ రెండు తెలుగు పద్యాలనీ, గీతమాల పుస్తకంలో అనుబంధంగా ప్రచురించారు. ఆ పుస్తకం ఇప్పుడు అలభ్యం.

ఆషాడ శుద్ధ అష్టమి (25-7-1936) నాయన వర్ధంతి. ఆ సందర్భంగా, ఈమాట పాఠకులకోసం, అరుదైన ఇంద్రగీతాన్ని సమర్పిస్తున్నాను.


ఇంద్రగీతమ్

మొదటి స్తబకము

మంగళనాముని మంగళయశుని
మంగళరూపుని మఘవంతుఁదలతు |1|

మంజుల ద్విపదల మరువదవనీశ
యంజలినింపి నీకర్పింతుఁగొనుము |2|

లలిత సంస్కృత మంత్రలాలిత! యిపుడు
తెలుగున ద్విపదల దేవేంద్ర! వినుము |3|

ఋక్కులోరుచి నిర్జరేంద్రుడా! తెలుఁగు
వాక్కులో విన నీకు నిక్కము తెలియు |4|

పరమాత్మయు – ఇంద్రుడు

భువనము సృజియించి భువనాది పరుడు
భువనాంతరాత్మయై పురుహూతుఁడయ్యె |5|

భువనాదినున్నాఁడు భువనముదాటి
భువనాంతరాత్మ యీభువనమునందు |6|

భువనాంతరాత్మకు భువనాదితోడ
వ్యవహారదశయందె యరయ భేదంబు |7|

ఆత్మయే భువనాల కాదిమూలమగు
నాత్మయే భువనాంతరాత్మయై యెప్పు |8|

అతఁడు తానొక్కఁడే యావలవెలుఁగు
నతఁడుండు నిక్కడ నిఖిలముగూడి |9|

అదిమూడుపాళ్ళఁట యభవురూపాన
నిదియెక పాలఁట ఋషులు గన్గొనిరి |10|

అది నిర్గుణంబగు నవికల్పచిత్తి
యిది సగుణంబగు నింద్రవిభూతి |11|

నిరుపాధి యచ్చట నిర్గుణబ్రహ్మ
కరుణసోపాధియౌ పురుహూతుఁడిచట |12|

అతఁడతీతుండగు నఖిలాండములకు
నితఁడేలు శక్తిచే నీదృశ్యకోటి |13|

ఆత్మయే లోకమౌ నావలఁజూడ
నాత్మకులోకము లంగములిచట |14|

యాధారమాత్రమే యాతఁడన్నిటికి
నాధికారక దేవతాత్మయితండు |15|

విభుని రెండువిధాల విశ్వకారణుని
విభజించి చెప్పిరి విద్వాంసులిట్లు |16|

ఇంద్ర జనన ప్రస్తావము

జనులార! బ్రహ్మము జంబాంతకుఁడును
జనకుడు కొడుకును జతురుల భాష |17|

భువనము సకలము పుట్టించువాని
భువనప్రవేశము పుట్టుకయనిరి |18|

అట్టి చిత్రంబగు పుట్టుకయందు
పట్టికి నీదేవపదవియే తల్లి |19|

అదితి నీతల్లి యీ యాకాశసతియె
సదయ! నీతండ్రి కశ్యపుఁడు బ్రహ్మంబె |20|

ఖండము దితియగు ఖవిశాలవాటి
ఖండ విహీన యాఖండల యదితి |21|

పశ్యకుఁడక్షర వ్యత్యాసరీతిఁ
గశ్యపుఁడయ్యెను గవిసూక్తులందు |22|

కవియు విప్రుఁడునగు కశ్యపుఁడన్యుఁ
డవనిఁబుట్టిన వ్యక్తి యజర! నీబంటు |23|

జనకుని నీకిట్లు జననితోఁ గూడ
ఘనవాహ! సుకవులు కల్పించిరయ్య |24|

శక్తుడు – శక్తి

ఆత్మయే శక్తుఁడౌ నాత్మయే శక్తి
యాత్మశక్తి విభేద మౌపచారికము |25|

ఆత్మమహాబ్దిలో నభిమానియైన
యాత్మాణి మాంశమే యగును శక్తుండు |26|

ఆ పయోరాశిలో ననుభూతియైన
వ్యాపకమహిమయే యాతనిశక్తి |27|

సత్తులోమూలమే శక్తభాగంబు
సత్తులో శాఖలే శక్తిభాగంబు |28|

ధర్మిభూతజ్ఞాన తత్త్వమొకండు
ధర్మభూతజ్ఞాన తత్త్వమింకొకటి |29|

విభజనాశక్యము విబుధోక్తులందు
విభజింపఁబడి యిట్లు ద్వివిధమై తోఁచు |30|

వాక్య నిష్ణాతుల వైఖరివలన
నైక్యాన భాసించె నజ్ఞులకు భిద |31|

పరపురుహూతుల భాగించినట్లు
ఇరువుర శక్తుల నిరుశక్తులనిరి |32|

ఆమె విశ్వాతీత యానందరూప
యీమె విశ్వంబున కీశ్వరురాలు |33|

ఆతఁడే యీతఁడై యఖిలమునేలు
నాతని శక్తియే యీతని శక్తి |34|

శక్తశక్రాఖ్యలు సదృశార్థకములు
శక్తి శచ్యాఖ్యలు సదృశార్థకములు |35|

ఇంద్రుని వేరు విభూతులు

అండాలఁబాలించు నాఖండలుండె
మండలాంతరవర్తి మహనీయుఁడయ్యె |36|

బ్రహ్మాండ జాలంబు పాలించునతఁడు
బ్రహ్మాండ మొక్కటి పాలించునితఁడు |37|

పురుహూత సవితలు పూర్వుల భాష
హరకేశవులు వీరలధునాతనోక్తి |38|

కాలంబు పరిణామ కారణమమిత
లీలంబు వేఱింద్ర లీలావిభూతి |39|

మేఘాలఁగన్పట్టు మింటి తేజస్సు
మోఘేతరము వేఱుముఖ్య విభూతి |40|

రెండవ స్తబకము

జీవతత్వము

ప్రతిబింబరూపానఁబ్రతిదేహియందు
ప్రతిఫలించితివీవు పరమేశయిచట |1|

ఉన్నావు మాలోన యోగులవలన
విన్నాము వినిమేము వెతికిచూచితిమి |2|

వెతికెడు బుద్ధికి వేరౌదువీవు
వెతకఁగ వెతకఁగ విబుధేంద్ర తెలిసె |3|

అహంకార నింద

నీవు నీమదియైన నిఖిలేంద్రుకంటె
నీవుభిన్నుండవు నిజము మానవుడ |4|

ఆక్రమించెడు నప్పుడహమును మనము
శక్రుఁడంతర్యామి సలుపఁడుచర్చ |5|

గుహలోపలకుబోయి గుప్త దేవునకు
నహమును మానస మర్పింపవలయు |6|

అదివాని సొత్తగు నదిగాదు తనది
మదియట్లు సేయుట మహి న్యాయమగును |7|

అతని వస్తువుదెచ్చి యతని కీయకయె
సతతము వాడుట సరిగాదు మదికి |8|

ఆ పాపమే మూల మఘములకెల్ల
నా పాపము భవాన నందఱిఁగట్టె |9|

ఆ పాపమే యుత్తమమాధమవాది
యా పాపము హసించు నద్వైతబోధి |10|

అడుగగ తనసొత్తు నాతండురాడు
విడువదు చిత్తము వెఱ్ఱియైతాను |11|

మనోభవాది వర్ణనము

మనసుచూచినఁదాను మఱిచూడలేడు
మనసుచూడఁగలేదు మఱితానుజూడ |12|

ఇదితాను వీక్షింప నది శయనించు
నదితాను వీక్షింప నిది లయమందు |13|

ఒక్కటి శిరసుననుండి భక్షించు
నొక్కటి హృదయాన నుండి వెలుంగు |14|

భక్షించి భక్షించి పరితృప్తిలేక
శిక్షించి మమ్మిది చేయించుఁబనుల |15|

దీని రాజ్యంబున దీనులౌమమ్ము
దీనావన! మహేంద్ర! దేవ! కాపాడు |16|

మాశక్తిలేకయే మఱిసాగలేదు
మాశక్తిని హరించి మమ్ము బాధించు |17|

మేము భావింతుము మేముందుమయ్య
మా మనస్సు నశించ మాకేమి మేలు |18|

ఈప్రకారంబున నీతి బాధలను
నీప్రతిరూపముల్నిత్యము పడఁగ |19|

శోచించకేమియు సురరాజ! దివిని
చూచుచునుండుట శోభయానీకు |20|

నిన్ను నన్నుఁగజేసినిర్జరనాథ!
మిన్ననగూర్చుండి మేలెంచవేమి |21|

ప్రతిరూపమునఁజిత్తి ప్రసరింపనేల
పతితపావన! దాని బంధింపనేల |22|

తనరూపు బంధింపఁదనకేది యశము
ఘనవాహ! నీవది గమనింపలేదో |23|

కొన్ని యోగమార్గములు

చేదైన విషయాలఁజిత్తము విడిచి
నీదు ప్రక్కకు వంగి నిర్జరేశ్వరుఁడ |24|

యోచింప యోచింప నుదయించు శక్తి
యాచింప యాచింప నలవడు భక్తి |25|

తలనుండి స్వహృదయస్థలము చూచుటయె
బలవైరి ప్రక్కకు వంగుటయగును |26|

తనమూలమును బుద్ధి తర్కించుటొకటి
తనబుద్ధినే తాను దర్శించుటొకటి |27|

నిన్ను భజించుట నిఖిలేంద్రయగును
దన్ను విడిన నేది తపము లోకాన |28|

ఆత్మప్రతీతియే యప్రమాదమగు
నాత్మను మఱచుట యగుఁబ్రమాదంబు |29|

అప్రమాదము యోగ్యమన్నిటికన్న
అప్రమత్తుఁడు నిన్నె హరిహయ! చేరు |30|

నిన్ను జేరుటనంగ నిర్జరనాథ!
తనయందు నిలుచుట తాత్పర్యమండ్రు |31|

తనపట్టు విడుచుచుఁదలచుట భవము
తనపట్టు విడవక తలచుట తపము |32|

తనచోట నుండుట తలఁపులు లేక
ఘనవాహ! నీయందు ఘనమగు నిష్ఠ |33|

చూపునే చూచెడి శుద్ధయోగులకుఁ
బాపహారిపరుండు ప్రత్యక్షమగును |34|

కొండనాలుక బుద్ధి కూర్చుండనిండు
పిండాననిది శుక్రవేశ్మమ్ము సుండు |35|

ఆధారమందలి యణువైన అగ్ని
యాధారముగ దృష్టినతి యుక్తిదింపి |36|

చింతింపు మింద్రుని జిత్తమువంచి
సంతతమిది పంథ సర్వసిద్ధులకు |37|

ప్రాణనిత్యాహార పరిశోధకుఁడగు
ప్రాణికింద్రుని శక్తి ప్రత్యక్షమగును |38|

శిరమును స్థిరముగాఁజింతిచు మునికి
పరమగు లోపలి వస్తువుచిక్కు |39|

శక్తుని విశ్వప్రసారిణి శక్తి
భక్తుని తనువులో బ్రవహించుగాత |40|

(ఇంద్రగీతమ్ సంస్కృత మూలమ్)