గణపతి గీతమ్

భద్రగజాస్యుని పావనతమము
రుద్రకుమారుని రూపము తలతు |1|

ముజ్జగములఱేని ముద్దులపట్టి
బొజ్జవేలుపు మమ్ము బోషించుగాక |2|

దేనియందు సకలదేవతానిష్ఠ
దాని నక్షరమనితత్వజ్ఞులండ్రు |3|

ఆకాశమందలి యవిభక్త నాద
మాకారమైయెప్పు నక్షరమునకు |4|

ఆనాదముగణేశు నాదిమమూర్తి
ధ్యానముచేయుట దానిని వినుట |5|

శర్వుని పట్టిగా సత్యనాదమును
సర్వము తెలిసిన సజ్జనులనిరి |6|

ఆ వేదనాయకు లఖిలాండములకు
మావారు సెప్పిరి మహితశిల్పిగను |7|

బ్రహ్మణస్పతితోడ భారతీపతికి
బ్రహ్మకు భేదము వాక్కులయంద |8|

అతడె గజానను డతడె విధాత
అతడె బృహస్పతి యరయగదెలిసె |9|

భారతియే భక్తపావని సుముఖి
భారతియే సాధుసారిణి తార |10|

దశమహావిద్యల తార రెండవది
వసువులె యామనుబట్టి తిట్టుదురు |11|

ఆమెకు రసనాగ్రమందున గలిగె
నామెకు రసరూప సోమసంశక్త |12|

విబుధపరోక్షోక్తి విభ్రాంతులగుచు
నబుధులు తిట్టిరి యఖిలమాతృకను |13|

శబ్దమే మతినేత సామజముఖుడు
శబ్దశక్తియె సూక్ష్మసారిణి సుముఖి |14|

శబ్దమే విష్టప స్థానమౌ(?) ధాత
శబ్దశక్తియే సూక్ష్మసారిణి వాణి |15|

భువనాల మూలమై పుణ్యనాదంబు
భువన గర్భమునందు పుట్టెను తిరుగ |16|

అప్పుడు నాదాత్మ వ్యక్తుడై తెలిసె
చప్పుడు చేయుచు జనులకందరకు |17|

అవిభక్త నాదమె యతని ముఖంబు
సువిభక్త నాదమె శుభమైన తనువు |18|

అవిభక్త నాదమె యతిమత్తదంతి
సువిభక్త నాదమె సుజ్ఞాన నరుడు |19|

ఈరీతి గణపతి యిభరాజ ముఖుడు
హారి మానవరూపు డతడు కాయమున |20|

కరిరూప తనువుచే కలిగించు నిష్ఠ
నరరూప తనువుచే నడిపించు జగము |21|

అతని యోంకారాస్యమతి పావనముర
అతని వాజ్మయకుక్షి యతి మేదురముర |22|

జ్ఞానము శబ్దమై జన్మించు చోటు
జ్ఞానము సకలము సరిచేరు చోటు |23|

అతడుండు చోటుర యధ్యాత్మమరయ
అతని యంత నతండె యరయ తత్వంబు |24|

ఆ సత్యవాదము నరయక జపము
వేసార్లు లెక్కలుపెట్టిన నేమి |25|

దేహమధ్యమునందు దీపించు చోటు
మాహాత్మ్యములచోటు మాయల చోటు |26|

గణపతి రమణులు గాంచిన చోటు
గణియించువారికి గడవెట్టు చోటు |27|

(గణపతి గీతమ్‌ సంస్కృత మూలమ్‌)


కావ్యకంఠ గణపతిముని

రచయిత కావ్యకంఠ గణపతిముని గురించి:

కావ్యకంఠ గణపతిమునిగా ప్రసిద్ధుడైన అయల సోమయాజుల గణపతిశాస్త్రి (1878-1936) తెలుగువాడే అయినా, తెలుగువాళ్ళకి ఈయన గురించి పెద్దగా తెలియదు. ఆయన తన జీవితకాలంలో సింహభాగం తమిళదేశంలోనూ, కన్నడదేశంలోనూ, కొంకణ ప్రాంతాలలోనూ ఎక్కువగా గడిపాడు. ఆయన రచనలన్నీ సంస్కృతంలోనే జరిగి, వాటిలో కొన్ని మాత్రమే తెలుగులో వచ్చాయి. 1900 సంవత్సరంలో, నవద్వీపంలో జరిగిన విద్వత్పరీక్షలలో పాల్గొని, అక్కడి వారందరినీ తన కవిత్వంతో, పాండిత్యంతో మెప్పించి కావ్యకంఠ బిరుదు పొందాడు. ఉమాసహస్రం, రమణగీత, ఇంద్రాణీ సప్తశతి, సద్దర్శనం మొదలైన కావ్యాలని రచించాడు.

 ...