ఆత్మహత్య కథలు-ఆ

6. పేదరికం

కిందున్న రెండు పంక్తులూ ఈ కథకు తొలి పంక్తులే. నచ్చిన ఒక్కదాన్ని ఎంచుకుని చదువుకోగలరు.

‘షేవ్ మాత్రం చేసుకుంటే చాలదండీ, ఇన్-షర్ట్ కూడా చేసుకోండీ, అప్పుడు కానీ అక్కడ మీ మాటలను నమ్మరు.’ అంది శాంతి.

‘ఈ సారైనా మీరు వెళ్ళేచోట మనకు కావలసిన అప్పు ముడుతుందా అండీ?’ అని దీనంగా అడిగింది శాంతి. అడిగింది అన్నది భూతకాలం కాబట్టి, ఆమె ఈ కథ ప్రారంభం అవుతున్న ఈ నిమిషంలో అడగలేదు ఈ ప్రశ్న, కథ మొదలవ్వక ముందే, అంటే ముందు రోజు రాత్రి, మొగుడు కాండోమ్ వేసుకుంటున్నాడనంగా అడిగింది.

అతను కథ మొదలయ్యేందుకు కొంచం ముందుగా ఆమెకు చెప్పిన జవాబులో చాలా బూతులు, అసలు ఏ మాత్రం సభ్యత లేని జవాబు.

‘లేదు శాంతీ, ఈ సారి అరుణ్, కదీర్, ప్రేమ, రూప, వెల్వెట్, అభిషేక్, ఇలా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గరే అడగబోతున్నాను… చూద్దాం,’ అన్నాడు.

డీటీహెచ్ డ్యూ, ఏసి డ్యూ, బైక్ డ్యూ, చీరల డ్యూ, బ్రాడ్‌బేండ్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్… అని అప్పులోళ్ళందరూ ప్రాణాలు తోడేస్తున్నారు. ‘స్కూల్ ఫీజ్ కూడా కట్టాలి’ అని ఆమె తుదిలేని పట్టిక లాగుతూ ఉంటే ఆ లాగుడుకి అతను ఆమె మీద ఇంకాస్త బలంగా పడి…

అరుణ్‌ని కలవాలి.

హేయ్! ఎలా ఉన్నావ్రా?

ఏంలేదు మామా… ఒక నలభైవేలు కావాలి…

ఇదిగో తీస్కో రా.

కదీర్‌ని కలవాలి.

అరే మామా, ఏమైపోయావు? ఫోన్ కూడా చెయ్యటం లేదు?

లేదు మాఁవా… ఒక నలభైవేలు కావాలి..

ఇదిగో తీస్కో రా.

ప్రేమని కలవాలి…

రూపని కలవాలి…

వెల్వట్‌ని కలవాలి…

అభిషేక్‌ని కలవాలి…

వెళ్ళిన పని ఏమైందండీ?

అందరూ డబ్బులిచ్చారు శాంతీ. మొత్తంగా ఆరు లక్షలు వచ్చాయి.

7. బీచ్ రిసార్ట్ టామ్‌ టామ్

పబ్లిక్ బీచ్ రిసార్ట్ అంటూ ఏదైనా ఉందా?

కారు ప్రైవేట్ బీచ్ రిసార్ట్ లోపలకి వెళ్ళింది.

రిసెప్షన్, పేమెంట్, చెక్-ఇన్, రెస్ట్ రూమ్, డ్రెస్ ఛేంజ్.

అలా బీచ్‌కెళ్ళి కాసేపు వాక్ చేసొద్దామా? అంటూ ఈ కథలో ఎవరూ డయలాగ్ వేయలేదు.

సముద్రం ఒడ్డున వాక్‌కెళ్ళారు. ఇసుక తెల్లగా, పొడిగా ఉన్నచోట కూర్చున్నారు. చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ లేరు.

ఇప్పుడు ఈ చోట కథ క్రైమ్ కథలా మారిపోయేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ కథలో ఆబ్సెంట్ అయిన కమలాకర్ పాత్ర వల్ల కథ మరో దారిలో ప్రయాణించేందుకు మేకప్ అదీ వేసుకుని రెడీ అవుతోంది.

‘ఇదివరకెప్పుడూ ఇలా బీచ్ రిసార్టుకొచ్చింది లేదు’ అంది శాంతి.

ఇద్దరు లేచారు. చేతిలో చేయి వేసుకొని నడవటం మొదలుపెట్టారు. ఒక చోట ఆగారు. ముద్దులు పెట్టుకున్నారు. గట్టిగా గౌగిలించుకున్నారు.

రూమ్, రూమ్ సర్వీస్, హౌస్ కీపింగ్.

వోడ్కా విత్ లెమన్, స్ప్రైట్.

‘నాకొద్దు, అలవాటు లేదు.’

‘బంగారం, కొంచం తాగి చూడు… జస్ట్ టూ రౌండ్స్.’

వోడ్కా, కిసెస్, హగ్స్, డాన్సింగ్, చికెన్, ఫ్రూట్స్, వోడ్కా, డాన్స్…

లవ్ యూ.

లవ్ యూ.

లవ్ యూ సో మచ్.

యూ మేడ్ దిస్ డే… థేంక్యూ…

లవ్ యూ.

డిన్నర్. రాత్రి బీచ్‌లో నడక.

బ్యాక్ టు బెడ్.

‘వోయ్! ఇదంతా టూ మచ్. కిస్ చేశావు, హగ్ చేసుకున్నావు. ఓకే, అక్కడివరకే చాలు. నాకు మొగుడున్నాడు.’

‘బంగారం ప్లీజ్… వాటేసుకుని హత్తుకుంటాను…’

‘వాటేసుకుంటున్నావు.. అక్కడితో ఆగట్లేదే.. ఎక్కడెక్కడో తడిమేస్తున్నావు. అందుకే వద్దు.’

‘అమ్మడూ, నీ అందం నన్ను ఏదేదో చేస్తోందే. యూ ఫర్ మీ. యూ ఆర్ మైన్.’

‘ఒరే… ప్లీజ్… ఏదోలా ఉంది…’

సల్వార్… షిమ్మి… బ్రేసియర్… పేంటీస్.

బెడ్ కాఫీ.

‘తొందరగా బయల్దేరాలి.’

‘ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ. తిని వెళ్దాం.’

‘నాకు మూడ్ బాలేదు, నువ్వు చాలా ఎక్కువ చేశావు.’

‘కూల్ రా… టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం.’

రెస్టారెంట్.

‘అక్కడ చూడు మన ఆఫీస్ కేశవ్.’

కేశవ్ చూసేశాడు.

‘హాయ్ శాంతీ! దీన్ని తగులుకున్నావా? ఇది నిన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేసిందా?’

8. వితంతువు

‘ఏంటో… నువ్వే పసిపిల్లవి అనుకుంటే, నీకు ఇద్దరు పిల్లలు. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏం ఖర్మో పుణ్యాత్ముడు ఇంత తొందరగా పోయాడు. ఒక్కదానివి ఎలా పిల్లల్ని పోషించి పెద్దచేస్తావో! తలచుకుంటేనే చాలా బాధగా ఉంది. కాబట్టి…’

‘కాబట్టి?’ అంటూ… ఫేస్‌బుక్ పేజ్‌ని రిఫ్రెష్ చేసింది శాంతి.

9. వృద్ధులు

తమ పిల్లల్ని విదేశాల్లోను, పట్టణాల్లోనూ స్థిరపరిచామన్న గర్వంతోనూ, సాహిత్యార్హత ఉండాలనుకుంటూ కథల తరహా దుఃఖంతోనూ చిన్న పల్లెటూళ్ళో కాలం గడుపుతున్న ఆ ముసలి దంపతుల గురించి ఆసక్తికరంగా ఏం రాయగలం?

ప్రయత్నం చేద్దాం అనుకుని క్వార్టర్ మందు కొట్టి, శాంతి లేప్‌టాప్ ఆన్ చేసింది. లేప్‌టాప్ ఆన్ అవ్వడం లేదు, కథ ఆన్ అయింది.

ఒక మెయిల్ వచ్చింది. ఏడాదిపాటు ఎవరూ చదవలేదు. 366వ రోజు ఎవరో ఒకరు చదవాల్సిందే అన్నదే ముందు వాక్యంలో దాగున్న లాజిక్.

లాజిక్కులూ అవీ సినిమాలకే కదా? లిటరేచర్, సైన్సు, రాజకీయాల్లో ఎవరు చూస్తారు?

ఉండండి, లేప్‌టాప్ ఆన్ అయింది. ఇంటర్‌నెట్ కనెక్ట్ అయింది. ఇకపైనే కథ.

ఏవండీ, మన పిల్లల్ని చూడాలనుంది.

నాక్కూడా.

నా కళ్ళలోనే మెదులుతున్నారు.

నాక్కూడానే.

నాక్కూడా.

నాక్కూడా.

నాక్కూడా.

నాక్కూడా.

నాక్కూడా.

10. మజా

‘ఏయ్ రూమ్ నెంబర్ 107, సరేనా?’

‘సరేరా, రిసెప్షన్‌లో వచ్చి నిల్చుంటావా?’

‘ఏంటే, రిసెప్షన్‌లో వచ్చి నిల్చునేట్టయితే, తొక్కలోది రూమ్ నెంబరెందుకు చెప్తానే?’

‘ఏయ్, పోరా! నువ్వు ప్రేమించేప్పుడు ఇలా తొక్క, బొక్క అని మాట్లాడేవాడివి కాదు.’

‘అయితే ఇప్పుడు నేను ప్రేమించకుండా ఇంకేం పీకుతున్నానూ?’

టొయ్ంగ్… టింగ్ టింగ్… టింగ్ టింగ్…


రచయిత గురించి: పాండిచ్చేరిలో పుట్టిన ఆర్. శ్రీనివాసన్, తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చదువుకున్నారు. అరాత్తు అన్న పేరుతో 2010 నుండి సోషల్ మీడియాలో నేటితరం జీవితానికి అద్దంపట్టే విషయాలను తీసుకుని ప్రయోగాత్మకమైన మైక్రో కథలు, కవితలు రాయడం ధ్వారా గుర్తింపు పొందారు. ప్రముఖ రచయితలు చారునివేదితా, జయమోహన్, మనుష్య పుత్రన్ వంటివారి మెప్పుపొందారు. ఇప్పటివరకు మూడు నవలలు, మూడు కథల సంపుటాలు, ఒక బాలల కథల సంపుటి, వాహనాలకు సంబంధించిన వ్యాస సంపుటి, ఒక కవితా సంపుటి ప్రచురించారు. క్లుప్తంగా, సటైరికల్‌గా రాయడం ఈయన శైలి. వీరి కథలన్నీ ఆధునిక యువత జీవితవిధానాల చుట్టూనే తిరుగుతాయి.