ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం

ఇస్మాయిల్‌ గారిపై మా ఆసక్తి “అర్థం కాకపోవటం” అనే ప్రాతిపదిక మీద మొదలైంది. పి.ఆర్‌ . కాలేజీ లో ఇంటర్‌ చదివేరోజుల్లో మా మిత్రబృందం కొంతమందికి కవిత్వం మీద విపరీతమైన ఇష్టం ఉండేది. తరచు ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చే ఇస్మాయిల్‌ గారి కవితలు చదివి చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. వేన్‌ గో చెవి ఆకాశానికతికించటమేమిటి, హంపీలో పక్షులెగిరిపోవటమేమిటి, గది గోడమీద సూర్యుని గాయం తెరుచుకోవటమేమిటి, గుప్పెడు నక్షత్రాల్నీ చంద్రుడు ఖర్చు పెట్టేసుకోవటమేమిటి ఈయన ఎందుకిలా రాస్తారు అనుకొనేవాళ్ళం. ఆ తరువాత ఆయన మా కాలేజీలోనే పనిచేస్తారని తెలిసింది. ఇంకేం, వెళ్ళి అడుగుదామా అనుకున్నాంగానీ, అంత సాహసం చెయ్యలేదు. ఇదంతా ఆయన కవితలు విడివిడిగా చదువుతున్నప్పుడు. ఒకసారి అనుకోకుండా “చిలకలు వాలిన చెట్టు” పుస్తకం చేతికొచ్చింది. అందులో “చెట్టు నా ఆదర్శం”, “మృత్యువృక్షం” కూడా కలిసి ఉంటాయి. ఆ మూడు పుస్తకాలు చదివాక ఆయన కవిత్వం గురించే కాదు, అసలు కవిత్వం గురించే నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అప్పుడు అభిమానంతో వెళ్ళి ఆయనను కలవాలనిపించింది. అలా 1980 వ సంవత్సరం డిశంబరు 16 న మొదటిసారిగా ఇస్మాయిల్‌ గారిని కలిసి మాట్లాడాను. చాలా ఆదరంగా మాట్లాడారు. ఎంతో ఆనందం కలిగింది. అభిమానంతో వెళ్ళినా మొదట్లోఉన్న సందేహాన్ని అడక్క మానలేదు కవిత్వంలో అస్పష్టత మీద మీ అభిప్రాయమేమిటి అని. దాని కాయన , “కవిత్వంలో అస్పష్టత ఉండటానికి వీల్లేదు. నాకా విషయంలో పట్టుదల ఎక్కువ. ఒక రకం కవిత్వం మొదట్లో కాస్త కొత్తగా ఉండవచ్చు. కానీ, చదువుతోంటే, అదే అలవాటవుతుంది.” అని చెప్పారు. అది నిజమేగదా. ఇప్పుడు ఇస్మాయిల్‌ గారి పద్యాలు అస్పష్టంగా ఉంటాయని ఎవరూ అనరు. ఒకోసారి తన పద్యాల గురించి అడిగిన ప్రశ్నలకి గడుసుగా కూడా సమాధానం చెప్పేవారు.

“హంపీ పద్యమేమిటి అలాఉంది?”
“నువ్వు హంపీ వెళ్ళావా?”
“లేదు”
“మరి హంపీ చూడకుండా హంపీ మీద పద్యం ఎలా అర్థమౌతుంది!”

ఆయనతో చనువు పెరిగాక, ఆ వయసులో సహజంగా కలిగే ఇతర సందేహాలుకూడా అడిగేసేవాణ్ణి “దేవుడున్నాడా?”, “ఎందుకు బతకాలి?” లాంటివి. ఎందుకు బతకాలన్న దానికాయన చెప్పిన సమాధానం నాకిప్పటికీ గుర్తుంటుంది. స్టాఫ్‌ రూం కిటికీలోంచి బయటకు చూస్తూ, “ఎండ వెచ్చగాఉంది, పచ్చిక పచ్చగాఉంది ఇక్కడింత హాయిగాఉంటే, బతకటానికేమయ్యిందయ్యా నీకు?” అన్నారు. జీవించటంలోఉన్న ఆనందాన్ని గురించిచెప్పిన ఈ వాక్యాలు ఆయన కవిత్వానికి కూడా వర్తిస్తాయి. నిజానికి, ఇస్మాయిల్‌ గారిలోఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఆయన కవిత్వంలో ఏ రకమైన సమాధానాలు, ఊరట, నిశ్శబ్దం దొరుకుతాయో, అవే వ్యక్తిగత సంభాషణలో కూడా మనకు దొరుకుతాయి. కవిగా, వ్యక్తిగా ఆయన ఒకటే, వేరు వేరు కాదు. ఆయన చెప్పిన మరొక ముఖ్యమైన విషయం ప్రశ్నలు శాశ్వతం, కాని సమాధానాలు కాదు. అవే ప్రశ్నల్ని ప్రతి తరం, ప్రతి మనిషి ఎదుర్కొన్నా,ఎవరికి సంబంధించిన సమాధానాలు వారు అన్వేషించి తెలుసుకోవాలి. అందువల్లనే, తాత్వికంగా దేనినైనా పరమ సత్యంగా భావించే ఏ సిద్ధాంతాన్నీ ఆయన ఇష్టపడలేదనుకుంటాను.

ఆయన కవిత్వంలాగే అనేక విషయాలలో మిగతవారి కంటే భిన్నంగా కనిపించేవారు. ఆయన పుస్తకాల అట్టలు చూసి అబ్బుర పడేవాళ్ళం. మరీ ముఖ్యంగా చెట్టు నా ఆదర్శం అట్ట మఖమల్‌ గుడ్డతో చేసినట్టుగా ఉంటుంది. ఆయన ప్రసంగమూ అంతే. మిగతా వారంతా శాఖాచంక్రమణం చేస్తూ మాట్లాడితే, ఆయన మాత్రం తన ప్రసంగాన్ని రాసుకొచ్చి చదివేవారు. రేడియో కవిసమ్మేళనంలో కవులంతా కొత్తసంవత్సరం మీద ఊగిపోతూ పద్యాలు చదివితే, తను మాత్రం తాపీగా పదేళ్ళ క్రితం వచ్చిన పాత పుస్తకంనుంచి కవితలు వినిపించటం లాంటిది కూడా ఆయనకే చెల్లింది. (“ఉగాది మీద పద్యాలు రాయట మేమిటి!”). ఆయన ప్రసంగాలు, వ్యాసాలు కూడా ఒక సంఘటనో మరోటో చెబుతున్నట్టు విభిన్నంగా మొదలౌతాయి. కొన్ని ఉదాహరణలు : “అనంత పురంలో ఓసారి ఓ చురుకైన కుర్రాడు సవాలు చేసాడు :ఎందుకండీ ఈ కవిత్వాలూ, గొడవలూ? ఇవిలేకుండా ప్రపంచం నడవదా?అని” (సాహిత్యం అవసరమా) ; “ఈ మధ్య కాకినాడ ఫిల్మ్‌ సొసైటీవారు ఏకాకిని అనే మళయాళం ఫిల్మ్‌ ప్రదర్శించారు” (చలం); “తుఫాను వచ్చి వెళ్ళాక వంకాయల ధర తాళ ప్రమాణంగా లేచింది” (సాహిత్యపు విలువలు పడిపోతున్నాయా?).

ఆయనపై అభిమానాన్ని రకరకాలుగా వ్యక్తపరిచేవాడిని. ఒక సారి కాలేజీలో “నాకు నాచ్చిన కవి” అనే అంశం మీద వక్తృత్వపు పోటీలు జరిగితే నేను ఇస్మాయిల్‌ గారి గురించి మాట్లాడాను. (దానికి, “మన ఇస్మాయిల్‌ గారే!” అంటూ తెలుగు హెడ్డుగారు ఆశ్చర్యం ప్రకటించారు.) కొన్నాళ్ళు ఆయనలా రాయటానికి ప్రయత్నించాను.ఆయన “వర్షంలో కాలేజీ” లాగా నేను “శెలవల్లో కాలేజీ” అని రాసి కాలేజీ మ్యాగజైన్‌ కిచ్చాను.( ఇప్పుడు నా దగ్గర లేదు గాని, గాడిద మీద కూడా ఒక పద్యం రాసినట్టు గుర్తు.) ఐతే, ఆయన కవిత్వం మీద ఆకర్షణ ఉండేది గాని, అందులోఉన్న గొప్పతనమేమిటన్నది స్పష్టంగా తెలీదు. ఒకసారి ఆర్‌ఎస్‌సుదర్శనం గారు సమకాలీన కవిత్వం గురించి కాలేజీలో గెష్టు లెక్చరిచ్చారు. అందులో అనుభూతి వాదం క్రింద ఇస్మాయిల్‌ గారి పద్యాల గురించి విశేషంగా చెప్పారు. దాహం పద్యంలో అనుభూతి గాఢత గురించి, రాత్రి కారు ప్రయాణం పద్యంలో సెక్సుని గురించి వివరించారు. పొట్టిచేతుల ఆకుపచ్చ చొక్కా ధరించి, ప్రేక్షకులలో కూర్చునిఉన్న ఇస్మాయిల్‌ గారు ఆ ప్రసంగానికి ఎంతో ఆనందించారు. ఒక విషయంలో మాత్రం ఆయనకు పట్టుదల ఉండేది. అది, ఏ రకమైన లేబిల్స్‌ నీ ఆయన ఇష్టపడేవారు కాదు.”చెట్టు కవి”, “చెట్టు ఇస్మాయిల్‌ ” వంటి టైటిల్సు కూడా తనకు చిరాకు కలిగిస్తాయని చెప్పేవారు.

సుదర్శనంగారి ప్రసంగంతో కొంత స్పష్టమైనా, అంతకు మించిన ప్రత్యేకత యేదో ఇస్మాయిల్‌ గారి కవిత్వంలో ఉందని నాకనిపించేది. చాలా సంవత్సరాల తరువాత 1995 లో, “ఇస్మాయిల్‌ కవిత ఒక జీవితోత్సవం” అనే శీర్షికతో విపులమైన వ్యాసం రాసినప్పుడు, ఆయన కవిత్వం మీద నా అభిప్రాయాలు తేట పడ్డాయి. ఆ వ్యాసం చదివి ఆయన చాలా సంతోషంగా ఉత్తరం రాసారు. తన కవిత్వం గురించిన కొన్ని విశేషాలు మొదటిసారిగా ఆ వ్యాసంలో గుర్తింపబడ్డాయని చెబుతూ ” నీకు ఇతరుల్ని అర్థం చేసుకునే empathy ఉంది” అని రాసారు. ఆ వ్యాసంలో పేర్కొన్న అతి ముఖ్యమైన అంశాన్ని మాత్రం వివరించే ఒక చిన్న సంగ్రహాన్ని ఈ వ్యాసం చివర పొందుపరుస్తున్నాను.

చదువుకోసం, ఆ తరువాత ఉద్యోగం కోసం కాకినాడ నుంచి దూరంగా వచ్చేసినా, ఇస్మాయిల్‌ గారితో అనుబంధం కొనసాగుతూనే వచ్చింది. కాకినాడలో దగ్గరివాళ్ళెవరో ఒకరుండటంతో, ఏదో ఒక కారణంతో తరచు కాకినాడ వెళ్ళటం, వెళ్ళిన మధ్యాహ్నమే ఇస్మాయిల్‌ గారి ఇంటికి బయల్దేరటం ఒక పరిపాటి. ఏ కారణం మీద కాకినాడ వెళ్ళినా, అసలు కారణం ఇస్మాయిల్‌ గారేనని మావాళ్ళందరికీ తెలుసు. ఇస్మాయిల్‌ గారు లేని కాకినాడని ఊహించటం కష్టం.

నేను హైదరాబాదులో పనిచేస్తుండగా, ఇస్మాయిల్‌ గారు చాలా కాలం అధికార భాషా సంఘం సభ్యులుగా ఉన్నారు. ఆ సంఘం సమావేశాలకి అప్పుడప్పుడు హైదరాబాదు వచ్చేవారు. ఆయన రావటం కోసం ఎదురుచూడటం, రాత్రి పొద్దుపోయే వరకు ఆయనతో గడపటం, మళ్ళీ ఆయన రైలెక్కేవరకు వెంట ఉండటం ఆనవాయితీగా జరిగిపోయేవి. ఐతే, హైదరాబాదులో ఆయన బాల్య స్నేహితులతో బాటు అనేకమంది వచ్చి చుట్టూ చేరతారు. ఇస్మాయిల్‌ గారిని కాకినాడలో కలుసుకోవటంలో ఉండే సహజత్వం వేరు.

ఇస్మాయిల్‌ గారి షష్ఠి పూర్తి రాజ భవన్‌ లో వైభవంగా జరిగింది. అప్పుడు నేను వరంగల్‌ లో ఉండేవాణ్ణి. వరంగల్‌ నుంచి నేను, వి.ఆర్‌ విద్యార్థి గారు దానికోసం తరలి వెళ్ళాం. సంవత్సరాలు తెలియకుండానే దొర్లాయి. అంతలోనే ఆయనకి డెబ్భై ఐదవ జన్మ దినోత్సవమన్నారు. అదృష్ట వశాత్తు అదే సమయంలో నేను ఇండియాలో ఉండటంతో, దానిలో పాల్గొని నా రెండవ పుస్తకాన్ని ఆయనకి అంకితమిచ్చే అవకాశం కలిగింది.ఇప్పుడాయన యిక లేరంటున్నారు. నిజానికి, ఎంత దూరంలో ఉన్నా, ఎప్పుడూ ఆయనకు మానసికంగా దూరమయ్యిందీ లేదు, జీవితం పట్ల ఆయన ప్రకటించిన ప్రేమని మరచిందీ లేదు.

 సరస్సు ఒడ్డున కూచున్నాను రాత్రి.
కెరటాలు లేచివచ్చి గట్టును తాకి ఆగిపోతున్నాయి.
గట్టు చలించదు
తట్టినా సమాధానమివ్వదు.
ఇది మృత్యువు,
ఇక్కడితో అన్నీ ఆగిపోతాయి.
చలించే నీళ్ళు
చంద్రకాంతిలో మెరుస్తున్నాయి.
ఇంతకుమించి ఏమీ చెయ్యలేవు నువ్వు.
కాంతిమంతం చేసుకో జీవితాన్ని
గట్టును తాకి ఆగిపోయే దాక.
— గట్టు  

మన జీవితాల్ని కాంతిమంతం చేస్తూ ఆయన కవితలు కలకాలం ప్రకాశిస్తూనే ఉంటాయి.


ఇస్మాయిల్‌ గారి కవితాత్మ

ఇస్మాయిల్‌ గారి పదచిత్రాలు అందంగా ఉండటం, భాష నిరాడంబరంగా ఉండటం వంటివి నిజమే అయినా, ఆయన కవిత్వం గొప్పతనాన్ని నిరూపించేవి అవి కావని నాకనిపిస్తుంది. ఇస్మాయిల్‌ గారు చెప్పినలాంటి అందమైన, కళ్ళు మిరిమిట్లుగొలిపే పదచిత్రాలు అనేకమంది చెప్పిఉండవచ్చు. కాని ఆయన పదచిత్రాలకి ప్రత్యేకతనిచ్చే అంశం ఒకటుంది. అది ఆయన దృష్టి. ఆ పదచిత్రం ద్వారా వస్తువుపై ఆయన చూపిస్తున్న అవ్యాజమైన ప్రేమ. సాధారణంగా ఎవరిదైనా మంచి పద్యం చదివినప్పుడు “ఎంత బాగా రాసారు ! ” అని అనిపిస్తుంది. కాని ఇస్మాయిల్‌ గారి పద్యాలు చదివినప్పుడు మాత్రం నాకు ” ఈయన ఇలా ఎలా చూడగలిగారు” అన్నదే గొప్ప ఆశ్చర్యం కలిగించేది.

పోలికలు చెప్పటం తేలిక అనలేం గాని, ప్రాధమికమైన కవిత్వ అంశ ఉన్నవాడు ఆ ఒడుపుని తెలుసుకోవచ్చు. అభ్యాసం ద్వారా మెరుగుపరుచుకోవచ్చు కూడా. అందుకే సన్నకారు, చిన్నకారు కవులం పోలికలు కట్టడం మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. ఇస్మాయిల్‌ గారి కవిత్వంలో పోలికలు తక్కువ. ఆయన చెప్పిన పదచిత్రాలవంటివి చెప్పాలంటే ఒక ఉన్నతమైన మానసిక స్థితికి చేరుకోవటం అవసరమనిపిస్తుంది. అది కవిత్వ సాధనతో వచ్చేది కాదు. పి.ఆర్‌కాలేజి స్టాఫ్‌ రూములో ఆయనదే అయిన పార్టిషన్‌ లో పెద్ద కిటికీ పక్కన ఒక ఆనంద ముద్ర దాల్చి, చిద్విలాసంగా కూర్చునిఉన్న ఇస్మాయిల్‌ గారి రూపం నాకిప్పటికీ కళ్ళముందు కదులుతుంది. ఆయన పద్యాలన్నీ బహుశ అటువంటి స్థితిలోనే రాసిఉంటారు.

“తనకీ, ప్రపంచానికీ మధ్య సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారావమే కవిత్వమంటాడు చెలం”. ఐతే, ఇస్మాయిల్‌ గారి విషయంలో అటువంటి సామరస్యమే ఆయన కవిత్వానికి పునాది అయిందనుకోవచ్చు. తన చుట్టూ ఉన్న చరాచర సృష్టితో ఒక సమతుల్యం సాధించాక వాటితో కలిసి సంస్పదించటమే ఆయన కవిత్వంగా రూపుదిద్దుకుంది. అందుకే ఆయన కవిత్వంలో ఆకులు చప్పట్లు కొడతాయి; మబ్బు చెరువులో తన అందాన్ని చూసుకుని మురిసిపోతుంది; రాయి సూర్యుడి ప్రేమతో వెచ్చబడుతుంది; గేదె చంద్రుణ్ణి నెమరేస్తుంది; గాడిద ధ్యానంలో ములిగి ఉంటుంది; భార్య ఒక పిట్టచేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది; పాప ఒక కాలితో భూగోళాన్ని నక్షత్ర మండలంలోకి తన్నేసి నిద్రపోతుంది … ఇలా ఇన్నిరకాల చరాచరాలను ఇంత ప్రేమతో పలకరించిన కవులెక్కడా కనిపించరు.

ఇస్మాయిల్‌ గారిని ఎన్నోసార్లు కలిసి మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ఆయన సలహాలివ్వటం తక్కువ. టెక్నిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పిన గుర్తులేదు. కాని కవికి తనదే అయిన ఒక ప్రాపంచక దృష్టి ఉండాలని మాత్రం చాలాసార్లు చెప్పేవారు. అందుకే ఆయన కవిత్వంలో దృష్టికి, కవిపొందిన మానసిక స్థితికి ప్రాధాన్యత ఉంది.

చలంగారిలో భాషా వైభవాన్ని మాత్రమే గుర్తించి ఎలా ఊరుకోలేమో, అలాగే ఇస్మాయిల్‌ గారిలో భాష సరళతని గురించి మాత్రమే మాట్లాడి ఊరుకోలేం. అందంగా ఉండటం, నిరాడంబరంగా ఉండటం, సరళంగా ఉండటం ఇవన్నీ ఆయన కవిత్వ శరీరానికి సంబంధించిన విషయాలు .ఆయన కవితాత్మను వర్ణించే గుణాలు మాత్రం ప్రేమ, వాత్సల్యం, కరుణ. ఆయనే అన్నట్టు కరుణ ముఖ్యం.