“సంగీత కళానిధి” శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో ముఖాముఖీ

(కర్ణాటక సంగీతంతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారిని పరిచయం చెయ్యవలసిన పనిలేదు. శాస్త్రీయ సంగీతంలో విశేషకృషి చేసి, గాయకుడిగా, స్వరకర్తగా ఎంతో ప్రఖ్యాతి గడించారు. ముఖ్యంగా వీరు స్వరపరిచిన ఎన్నో అన్నమాచార్య కీర్తనలు ఎన్నో ఏళ్ళుగా అందర్నీ ఆనందపరుస్తున్నాయి ముద్దుగారే యశోద, ఏమొకొ చిగురుటధరమున, నానాటి బతుకు నాటకము, ఇలా.

శ్రీ నేదునూరి గారు ఈమధ్య వారి శిష్యులు శ్రీ కొడుకుల శివరాం గారి వద్దకు ఆస్టిన్‌ వచ్చిన సందర్భంగా “ఈమాట” వారిని కలిసి ముచ్చటించటం జరిగింది. ఎంతో సేపు ఉత్సాహంగా మాతో మాట్లాడి ఎన్నో విషయాలు వివరించిన శ్రీ నేదునూరి గారికి, వారిని కలిసే అవకాశం కలిగించిన శ్రీ శివరాం గారికి మా కృతజ్ఞతలు.)

1. మీరు ఎంతో కాలంగా సంగీతంలో కృషి చేస్తున్నారు. మీ అనుభవంలో కర్ణాటక సంగీత చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటికి ఎలాటి మార్పులొచ్చాయో చెప్తారా?

నేను 1940 నుంచి 45 వరకు సంగీతం నేర్చుకుని 45 సెప్టెంబర్‌ నుంచి సంగీత కచేరీలు చెయ్యటం ప్రారంభించాను. ఈ 55 ఏళ్ళలో ఎంతో మార్పు వచ్చింది. అంటే ఆ రోజుల్లో సంగీత గురువులూ, నేర్చుకునే శిష్యులూ, కచేరీలు చేసే విద్వాంసులూ, వినే శ్రోతలూ అంతా పరిమితమే.

ఆ రోజుల్లో సంగీతం గురుకుల వాసంలోనే నేర్చుకుని ఎన్నో సంవత్సరాలు కృషి చేసి గురువుల అనుమతితో కచేరీలు చేసేవారు. ఇప్పుడు కళాశాలలూ, విశ్వవిద్యాలయాలూ ఇంకా ఎన్నో మార్గాలు వచ్చాయి నేర్చుకోడానికి. ఆ రోజుల్లో పెద్ద విద్వాంసుల సంగీతం వినాలంటే ఒక్క రేడియో మాత్రమే ఆధారం. అదైనా ఒక గంట సేపు. దక్షిణదేశంలో చాలా పెద్ద విద్వాంసులుండే వారు. వాళ్ళని ప్రత్యక్షంగా 3,4 గంటల కాలం కచేరీ వినాలంటే మద్రాసు వెళ్ళాలి. లేదా మన దేశంలో కాకినాడ సరస్వతీగానసభ వారు దసరా నవరాత్రుల్లో వాళ్ళ కచేరీలు ఏర్పాటు చేసినప్పుడు వెళ్ళి వినాలి. మన సరస్వతీగానసభని దక్షిణాది మహావిద్వాంసులు చాలా గౌరవించేవాళ్ళు. వీళ్ళు పిలవగానే వచ్చి కచేరీలు చేసేవారు.

ఇప్పుడు ప్రచార సాధనాలూ, సంగీత కళాశాలలూ, నేర్పే విధానాలూ, వినే అవకాశాలూ, అన్నీ చాల పెరిగాయి. అందుచేత సంగీతం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైంది. అంతేకాదు ముఖ్యంగా యువతకి ఈ సంగీతం మీద చాలా ఆసక్తి వచ్చింది. ఇది మెచ్చుకోదగిన విషయం.

జీవనశైలి మార్పుతో ప్రతీ రంగంలోనూ ముఖ్యంగా విద్యారంగంలో విలువలు సన్నగిల్లాయని అనుకోవడం జరుగుతున్నది. అలాగే సంగీతవిద్య కూడా పూర్వమంత ఘనంగా, అంటే డెప్త్‌తో లేకపోయినా ఈ కాలాన్ననుసరించి వెరైటీ పెరిగి ప్రజల్ని ఆకర్షిస్తున్నది.

ప్రయాణ సౌకర్యాలు కూడా చాలా అభివృద్ధి అయ్యాయిప్పుడు. అందుచేత ఏ దేశ ప్రజలైనా వాళ్ళక్కావల్సిన సంగీతాన్ని ప్రత్యక్షంగా విని ఆనందించ గలుగుతున్నారు.

2. మన కర్ణాటక సంగీత మూర్తిత్రయం చాలా వరకు తెలుగులోనే తమ రచనలు చేసారు. అయినా తెలుగువాళ్ళు ఎక్కువమంది సంగీతం నేర్చుకోకపోవటానికి కారణం ఏమిటి?

తెలుగుదేశంలో ఈ కళకి ఆదరణ లేకపోవటమే. ఇక్కడ కొంత దేశచరిత్రని పరిశీలించాలి. దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న కాలంలో తంజావూరు మహారాజులు సంగీతసాహిత్యాలని విశేషంగా ఆదరించేవారు. అలా మన తెలుగుదేశం నుంచి రాజాశ్రయం కోసం తంజావూరుకి వలస వెళ్ళిన కవుల్లో త్యాగరాజస్వామి తాతగారు గిరిరాజకవిగారొకరు. ఆయన కుమారుడు రామబ్రహ్మం. ఆయన కుమారుడు త్యాగరాజు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వీరు ముగ్గురూ సంగీత త్రిమూర్తులు. ఒకే కాలంలో 18వ శతాబ్దంలో తిరువయ్యూరు గ్రామంలో జన్మించారు. అది మొదలు సంగీత సరస్వతి ఆ ప్రాంతంలో మహోజ్వలంగా ప్రకాశించింది.

అలాగే మేలట్టూరు భాగవతులు ఆ ప్రాంతంలో నృత్యనాటికలు ప్రదర్శించేవాళ్ళు. సంగీతత్రిమూర్తుల శిష్యపరంపర ద్వారా అరవదేశం సంగీతానికి కేంద్రమైంది. అంటే సంగీతం, నృత్యం అక్కడ పుట్టి పోషింపబడ్డయ్‌.

ఇక మన తెలుగునాట మహాకవులు అష్టదిగ్గజాలూ, పోతన, శ్రీనాథుడు, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, తిరుపతి వెంకటకవులు, విశ్వనాథ మొదలైన వారు ఇక్కడ వచ్చారు.

నాటకకళలో బళ్ళారి రాఘవాచారి, స్థానం నరసింహారావు మొదలైన నటరత్నాలూ, సురభి గొబ్బి కంపెనీలు ఇలా నాటక కళ అభివృద్ధి చెంది రాజుల చేత ప్రజల చేత పోషింపబడ్డయ్‌. దీన్ని బట్టి సంగీతం, నాట్యం అరవదేశంవీ కవిత్వం, నాటకం మన కళలనీ చెప్పాలి.

సంగీతంలో గొప్ప రచనలు చేసిన పదకవితాపితామహుడు అన్నమాచార్యులూ, క్షేత్రయ్యా, రామదాసూ ఇక్కడివాళ్ళే. మరి తెలుగుదేశంలో వాళ్ళ సంగీత సంప్రదాయం సంగీత త్రిమూర్తుల సంప్రదాయం లాగా ఎందుకు ప్రసిద్ధి కాలేదో మనకు తెలీదు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి చూస్తే సంగీతం, నాట్యం తమిళదేశంలో విశేషాదరణ పొందుతున్నయ్‌. తెలుగునాట కవిత్వానికీ నాటకకళకీ ఆదరణ కరువై అవి రెండూ సినిమాని ఆశ్రయించినయ్‌. ఇప్పుడు మనకి మిగిలింది ఒక్క సినిమా కళే. కూచిపూడి సంప్రదాయాన్ని కూడా అక్కడే (తమిళదేశంలోనే) ఎక్కువ ఆదరిస్తున్నారు.

3. సినిమాల వల్ల శాస్త్రీయ సంగీతానికి నష్టం కలిగిందా?

మన సినిమా వారు లలితసంగీతాన్నే ప్రధానంగా తీసుకున్నారు. ప్రజలు దానికే అలవాటు పడ్డారు. అందుచేత శాస్త్రీయసంగీతం తెలుగుభాషలో ఉన్నా మనవాళ్ళ కంటే భాష తెలియకపోయినా సంగీత మాధుర్యానికి ఇతర రాష్ట్రాల వాళ్ళే ముగ్ధులౌతున్నారు.

4. సంగీతత్రయం తర్వాత ఆ స్థాయిలో సంగీతాన్ని సృష్టించిన వాళ్ళు గాని వ్యాప్తి చేసిన వాళ్ళు గాని ఇంకా ఉన్నారా?

సంగీతత్రిమూర్తులు సంగీతాన్ని హిమాలయశిఖరాల కంటె ఎత్తుకి తీసుకెళ్ళిపోయారు. దాన్ని మించి ఎవరూ చెయ్యలేని స్థాయి అది. ఏమైనా తమ తృప్తి కోసం కొన్ని రచనలు చెయ్యాలనుకుంటే త్రిమూర్తుల సంగీతాన్ని అనుసరించడమే అవుతుంది.

ఆయన శిష్యపరంపర వాళ్ళూ ఇతరులూ కూడా కొన్ని రచనలు చేసారు. అవి కూడా కొంత ప్రచారంలో ఉన్నాయి.

5. సాహిత్యంలో కాళిదాసు లాంటి ఉద్దండులున్నా ఆ తర్వాత కూడా చాలామంది కవులు గొప్ప స్థితినే పొందారు. మరి సంగీతంలో అలా ఎందుకు జరగలేదు?

ఇంతకుముందే ఈ ప్రశ్నకి కూడా జవాబు వచ్చింది. త్రిమూర్తుల తర్వాత పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్‌, మైసూరు వాసుదేవాచారి, ముత్తయి భాగవతార్‌ వీళ్ళంతా తెలుగులోనే రచనలు చేసారు. ఇవిగాక స్వాతితిరునాళ్‌ మహారాజు సంస్కృతంలో, పాపనాశం శివన్‌ అరవంలో రచనలు చేసారు. కాళిదాసు పౌర్ణమి నాటి పరిపూర్ణచంద్రుడైతే మిగిలిన వారు పాడ్యమి, విదియ, తదియ వంటి ప్రకాశవంతులే. అలాగే సంగీతత్రిమూర్తులు షోడశకళాపూర్ణుడైన చంద్రుడి వంటి వాళ్ళైతే మిగిలిన వాళ్ళు అందుకు కాస్త తక్కువ.

6. శాస్త్రీయసంగీతం అంటే తెలియనివాళ్ళకి అదంటే భయం, ఇది మనకి అర్థం కాదులే అనే అభిప్రాయం ఉంటయ్‌. అలాటి అభిప్రాయాలు మారాలంటే ఏం చెయ్యాలి?

“సంగీతజ్ఞానమను బ్రహ్మానంద సాగర మీదని దేహము భూభారము” అంటారు త్యాగయ్య గారు. ఆమాటల్లోని నిజం ఆ కళతో పరిచయం ఏర్పరుచుకుంటే తెలుస్తుంది. ఉదాహరణకి సముద్రం దగ్గరికెళ్ళి దాని అలలు చూసి భయపడితే దాన్లో ఈదే ఆనందం కలుగుతుందా? మరొకడు ఆభయం లేకుండా వెళ్ళి ఈదితే సముద్రంలోనే ఈదాలి, ఆ ఆనందం చెప్పనలివి కాదంటాడు. మనకి పుట్టుకతోనే అన్నీ వచ్చాయా? చిన్నప్పుడు నడక నేర్చుకునేప్పుడు ఎన్నోసార్లు పడతాం. సైకిల్‌ నేర్చుకునేప్పుడు ఎన్నో దెబ్బలు తింటాం. అలవాటయిన తర్వాత ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే శాస్త్రీయసంగీతం కూడా ముందు వినటం అలవాటు చేసుకోవాలి. వినగా వినగా దాన్లోని మాధుర్యం తెలుస్తుంది. ఒకసారి రుచి మరిగితే ఇక వదల్లేం. జీవితాంతం దాని ఆనందానుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది. ఈరోజు నుంచే వినటం ప్రారంభించండి.

7. వినటం అలవాటు చేసుకున్న తర్వాత నాలాంటి వాళ్ళు శాస్త్రీయసంగీతం పాడటానికి ఏంచెయ్యాలి? ఓ గురువు తప్పకుండా ఉండి తీరాలా?

“గురువులేక ఎట్టి గుణికి తెలియకబోదు” అంటారు త్యాగయ్య గారు. ఏ విద్యకైనా గురువు అవసరం. సంగీతవిద్యలో శాస్త్రమూ, కళ కలిసివుంటయ్‌. ఇదొక మహావిద్య. గురువు ఉండితీరాలి.

8. ప్రస్తుతకాలంలో శాస్త్రీయసంగీతంలో ఘనం తగ్గిందన్నారు; అంటే ఏమిటో చెప్తారా?

ఇందాక చెప్పాను కదా! శాస్త్రీయసంగీతం అఖండమైన శాస్త్రమూ అనంతమైన కళ సమన్వితమైన నాదవిద్య. ఇది సద్గురువు దగ్గర సన్మార్గంలో నేర్చుకుని కొన్ని సంవత్సరాల పాటు కృషిచేసి సంగీతానుభవం, నాదానుభవం పొందితే ఆ ఘనమనే మాటకి అర్థం తెలుస్తుంది. మహాకవి కాళిదాసు కావ్యాలకీ ఈనాటి కవిత్వానికీ రచనానుభవంలో తేడా లేదూ?

9. కర్ణాటకసంగీతం భక్తిరస ప్రధానమైనదనీ హిందుస్తానీ సంగీతం శృంగారరస ప్రధానమైనదనీ అంటారు. ఈ భక్తి ప్రాధాన్యత వల్ల కర్ణాటక సంగీతానికి ఏమైనా లోపం కలిగిందంటారా?

మన భారతీయ సంగీత కల్పవృక్షంలో ఇవి రెండూ అతి విశాలమైన, విలువైన శాఖలు. ఒకదానితో రెండో దానికి పోటీ లేదు, నష్టమూ లేదు. దక్షిణదేశప్రాంతంలో ఒక బాణీ పెరిగిపెద్దదైంది. అలాగే ఉత్తరాదిన ఇంకోటి.

హిందుస్తానీలో కూడా ఎంతోమంది భక్తిరచనలు చేసారు. అయితే శాస్త్రీయసంగీతాన్ని రాజదర్బారుల్లోనూ ప్రజలకోసమూ ఎక్కువ ఉపయోగించారు. వాళ్ళకి, మనకున్నంత విలక్షణమైన రచనాసంపద లేదు. సంగీతం యొక్క ప్రయోజనం ప్రజల్లో నైతిక విలువల్నీ విశాలదృక్పథాన్ని పెంచి జీవితగమనానికి దారి చూపటమే. భారతీయసంగీతం మొత్తంలోనూ ఉన్న గొప్పతనం అదే.

10. మీరు అన్నమాచార్యుల సంకీర్తనా ప్రచారం మీద చాలా కృషి చేసారు, చేస్తున్నారు. అసలు మీకు ఆ పాటల మీద ఎలా అభిరుచి కలిగిందో కొంత వివరంగా చెప్తారా?

మంచిప్రశ్న. నేను సికిందరాబాద్‌లో గవర్న్‌మెంట్‌ మ్యూజిక్‌ కాలేజి ప్రిన్సిపాల్‌గా ఉండగా 1973లో తిరుపతి దేవస్థానం వారు నన్ను డెప్యుటేషన్‌ మీద తీసుకెళ్ళారు. అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేసాను. ఆ సమయంలో ఒకనాడు నా మిత్రుడు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులుశెట్టి గారు వచ్చి అన్నమయ్య సంకీర్తన ఒకటి నాకిచ్చి దానికి మ్యూజిక్‌ కంపోజ్‌ చేసి పాడమని అడిగారు. కొన్నాళ్ళు అశ్రద్ధ చేసాను. ఒకరోజు ఆయన వచ్చి ఆ సాహిత్యం చాలా విశేషమైంది, మీరు తప్పకుండా స్వరరచన చెయ్యాలంటే దాన్ని తీసి చూసాను. నిజంగా అద్భుతమైన సాహిత్యం. వెంటనే తిలంగ్‌ రాగం మనసుకి వచ్చి పాడి చూసాను. బాగుందనిపించింది. ఆయనకి వినిపించాను. అద్భుతంగా ఉంది మాస్టారూ, అన్నాడు. అది మొదలు, అన్నమయ్య సారస్వతం మీద ఎంతో మమకారం ఏర్పడింది. ఆ పాట విన్న ప్రతి ఒక్కరు చాలా మెచ్చుకున్నారు.

11. ఆ పాట ఏదో గుర్తుందా? కొంచెం పాడి వినిపిస్తారా?

“ఏమొకొ చిగురుటధరమున ఎడనెడ కస్తురి నిండెను”. ఇది శృంగార సంకీర్తన. ఏపాటి సాహిత్యజ్ఞానమూ, రసజ్ఞతా ఉన్నా విని ముగ్ధులవని వాళ్ళుండరు. అది మొదలు ఇప్పటికి 108 సంకీర్తనలకి స్వరరచన చేసాను. (అంటూ ఎంతో మధురంగా ఆ పాట తొలిచరణం వరకు పాడి వినిపించారు. ఇలా మేం అడగటం, ఆయన కాదనకుండా పాడటం జరుగుతాయని ముందుగా ఊహించనందువల్ల రికార్డ్‌ చేసి మీకు వినిపించలేకపోతున్నాం.)

అన్నమయ్య పాటలు మన జాతిసంస్కృతికి ప్రతిబింబాలు. వాటిల్లో శృంగారభావాలూ, వేదాంతసారం, అలమేల్మంగా శ్రీనివాసుల లీలావినోదాలూ చదివి అర్థం చేసుకుంటూ ఆ పాటల్లోని సంగీతమాధుర్యం అనుభవించగలగటం వారి వారి అదృష్టమే! ఆ పాటలకి స్వరరచన చెయ్యగలగటం స్వామివారి అనుగ్రహం. నా పూర్వజన్మ సుకృతం.

12. మీరు చేసిన 108 పాటలూ బాగా ప్రచారంలోకి వచ్చాయా?

అన్నీ ప్రచారంలోకి రావటానికి టైం పడుతుందండీ. 108 పాటలూ పూర్తి నొటేషన్‌తో ప్రింట్‌ చెయ్యటం జరిగింది. పాటలు చెయ్యటమే నా వంతు. వాటి ప్రచారం సంగతి స్వామివారే చూసుకుంటారు.

13. మీ గురువుగారి గురించి ఏమైనా చెప్తారా?

మా గురువుగారు సంగీత కళానిధి, పద్మభూషణ్‌, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి గారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన “సద్గురువు”. ఆయన మేధస్సు సంగీతవిజ్ఞానసర్వస్వం. నేనున్న ప్రస్తుతస్థితికి వారి సహృదయత, సద్బోధన, ఆశీస్సులే కారణం. ఇలా ఎంత చెప్పినా చాలదు. వారిలాంటి గురువు దొరకటం మహద్భాగ్యం.

14. వారింకా పాడుతున్నారా?

పెద్దవారయారు. ఆయన సంగీతవిజ్ఞానాన్ని పుస్తకరూపంలో లోకానికి అందించారు. ఆయన సంగీతసౌరభంలో వెయ్యి రచనలున్నయ్‌. మనోధర్మసంగీతం, పల్లవిగానసుధ ఈ గ్రంథాలు చాలా విలువైనవి. ఆయన కృతుల్లోని నొటేషన్‌ విద్యార్థులకీ విద్వాంసులకీ ఎంతో విలువైంది.

త్రిమూర్తుల సంగీతసంప్రదాయాన్ని తాను అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చి మాబోటి వాళ్ళకి అందించిన కల్పతరువు ఆయన.

15. మీరు ఎన్నోచోట్ల కచ్చేరీలు చేసారు కదా! వాటిలో మీరు మరచిపోలేని  సంఘటనలు ఏమైనా ఉన్నాయాండీ?

(కొంత సందేహిస్తూ) ఉన్నాయండి. ఒక సారి కృష్ణ గాన సభలో కచ్చేరీ చేస్తూ “కాఫీ” రాగం పాడాను. సాధారణంగా ఆ రాగం ఎవరూ విస్తారంగా పాడరు. నేను కొద్దిగా elaborate చేసి పాడుతున్నా! ఆ పక్కన ఉన్న లాల్‌గుడి జయరామన్‌ గారు వయొలిన్‌ వాయిస్తున్నారు. లాల్‌గుడి జయరామన్‌ గారంటే మీకు తెలుసు
కదా! ఆయన చాలా పెద్ద సంగీత నిధి. Vocalist పాడుతున్నప్పుడు, పక్క వాయిద్యాలకి chance ఇస్తాం కదా! ఆయన్ని వాయించమన్నాను. ఆయన “నేను
వాయించను. నువ్వు పాడేసేయి.” అన్నాడు. అంటే, నాకు ఏమీ బోధపడలేదు. Audience కూడా తెల్లబోయి చూస్తున్నారు. “ఆయన వాయించనంటున్నారు. ఏమైనా కోపం వచ్చిందేమో!” అని. మళ్ళీ అడిగాను “వాయించండి. ఫరవాలేదు” అని. “ఆయనికి ఎందుకో కోపం వచ్చేసింది” అన్న భావనలోకి వచ్చేసారు audience. నాకు కూడా ఆయనకి ఏమైనా కష్టం తోచిందా అనిపించింది. ఆయన వాయించలేదు. నన్ను పాడేయమన్నాడు. పాడేసిన తరవాత, కచ్చేరీ అయిపోయింది. ఇవతలికి వచ్చేసిన తరవాత నేను ఆయన్ని అడిగాను. “ఏమిటీ? మిమ్మల్ని వాయించమంటే మీరు వాయించలేదు?” అంటే, ఆయన అన్నాడు. “నేను వాయించటానికి నువ్వు ఏమి అట్టేపెట్టావు నాకు? నువ్వు కాఫీ రాగం exhaust చేసేసావు. అంచేత నాకేమీ మిగల్లేదు. అప్పుడు నేను ఇంక వాయిస్తే బాగుండదు. అందుకనే పాడేయమన్నాను” అది నాకు ఒక పెద్ద compliment ! అప్పుడాయన ఆ కచ్చేరి నిర్వహించిన secretary  ని పిలిచి, “ఈయన చాలా గొప్ప ఆర్టిష్టు” అని చెప్పి వెళ్ళిపోయాడు. అది నేను నా life  లో ఎప్పుడూ మర్చిపోలేను. తరవాత “శ్రుతి” magazine వాళ్ళు ఇదంతా వర్ణిస్తూ ఒక cartoon కూడా వేసారు. కాఫీ అంతా ఫ్లాస్కులో ఉండవలిసింది, ఉండకుండా ఖాళీ అయిపోతుంది. ఇంకేమీ మిగలదన్నమాట.

తరవాత, సుబ్బుడని సంగీతంలో చాలా గొప్ప critic. అతను ఏదైనా ఒక మాట రాసాడంటే, సంగీత లోకం అంతా దానికి చాలా value ఇస్తుంది. అతను
ఒకసారి నా కచ్చేరి విని, “Music has been migrated to Andhra”  అని రాసాడు. ఇంక అక్కడనుండి అందరూ అతనిమీద పడిపోయారు. ప్రతీ వాళ్ళూ, “ఏమిటయ్యా నువ్వు నేదునూరి గురించి అంత అలా రాసావు? మేం ఏమీ పాటగాళ్ళం కాదా ఏమిటీ?” అని. “What I felt I have written”  అన్నాడు సుబ్బుడు. “అలా పాడాడతను. It is my view.” అన్నాడు. అది ఒక పెద్ద గొప్ప విషయం నాకు.

16. ఎప్పుడు జరిగిందండి ఇది?

1970s  లో జరిగిందండి.
తరవాత, పాల్‌ఘాట్‌ మణి అయ్యర్‌ అంటే నందికేశ్వరుని అవతారం. మృదంగంలో చాలా గొప్పవాడు. ఆయన “ఆంధ్రదేశంలో నేదునూరి తోటే వాయిస్తాను” అన్నాడు.
ఆయన ఆ మాట అనటం నాకు చాలా పెద్ద compliment .

ఇంక కచ్చేరీల్లో విన్న బాగా అనుభవం ఉన్నవాళ్ళూ, లేనివాళ్ళూ కూడా critics కింద రాయడం మరిచిపోలేనిది. “నేదునూరిలో great masters’ music greatness, music styles కనపడుతున్నాయి” అని రాసేవారు. ఆ greatness ఉందో లేదో నాకుతెలియదు అనుకోండి. ఒక్కళ్ళలో ఒక్కొక్క గొప్పదనం ఉందంటాం కదా! “ఈయనలో రకరకాలైన వాళ్ళ గొప్పతనాలన్నీ ఉన్నాయి” అనేవారు. నాకు తెలియదు కదా! పాడటం ఒకటే నాకు తెలిసింది. ఇలా critics  రాయడం నాకు సంతోషంగా ఉంది.

“సుబ్బులక్ష్మి మీ అన్నమయ్య పాటలు విని, ఆ tunes  మీ దగ్గర నేర్చుకొని cassettes  ఏవో రిలీజ్‌ చేస్తారట. మీరు ఆవిడకి చెప్పిరావాలి” అని Government  వాళ్ళు చెప్పి నన్ను పంపించారు. అప్పుడు నేను వెళ్ళాను. వెడితే, నా tunes  అవి విని “చాలా బాగున్నాయండి. అన్నీ పాడాలని ఉంది నాకు. Maximum  మీ tunes  నేను పాడతాను.” అని ఆవిడ నా పాటలు రికార్డ్‌ చేసుకొని, నాలుగు పాటలు విని, నేర్చుకొన్నారు! భావములోన, చేరి యశోదకు, నానాటి బ్రతుకూ, ఒకపరికొకపరి. ఇవి ఆ నాలుగు పాటలు. మిగిలిన వాళ్ళవి 1, 2 తీసుకొంది.

తరవాత ఒక గొప్ప event  నా life లో జరిగింది చెప్తాను. ఎవరికీ ఆ అదృష్టం కలగలేదు. Music Academy  కి నేను President చేసిన సంవత్సరం, President  గా నా పేరు propose  చేసింది శమ్మంగూడి శ్రీనివాస అయ్యర్‌ గారు. శమ్మంగూడి అంటే music field  లో veteran  అన్నమాట. Second  చేసింది సుబ్బులక్ష్మి. జీవితంలో ఇలాంటి recognition రావటం నిజంగా నా అదృష్టం. ఆ సంవత్సరం జయలలిత ( Chief Minister ) inaugurate చేసింది. వాళ్ళు చెప్పారు. “ఈ అదృష్టం ఇంకెవరికీ లేదండీ! ఇంత గొప్ప వ్యక్తులొచ్చి, ఒకళ్ళు propose  చెయ్యటం, మరొకరు second  చెయ్యటం. ఎక్కడా మా Music Academy  చరిత్రలోనే లేదు” అని. అప్పుడు నేను చెప్పాను. “ఇది నా అదృష్టం” అని.

18. కొత్తగా సంగీతం నేర్చుకొనే వాళ్ళకు మీరేదైనా సలహాలు చెపుతారా?

సంగీతం ఇప్పుడు తేలిగ్గా cassettes  లోంచి, CD లోంచి వినేసి వాళ్ళు నేర్చుకొని, తొందరగా, అంటే premature standards  తోటి, public appearance  కు వచ్చేయాలనే భావన మాత్రం లేకుండా, ఒక మంచి standard వచ్చే వరకూ నేర్చుకొని, పెద్ద విద్వాంసుల అందరి సంగీతం విని, అలవాటు చేసుకొని, అప్పుడు పాడితే బాగుంటుంది.

19. మామూలుగా, చాలా మంది ఇష్టమైన రాగాలు అని అంటూ ఉంటారు కదా! మీకు ఇష్టమైన రాగం ఏదన్నా ఉందా?

అలాగ ఏమీ లేదండీ. వినే వాళ్ళు, “మీరు ఈ రాగం పాడండి. అది మాకు ఇష్టం.” అనొచ్చుగాని, నాకు అన్నీ ఒకటే!

20. అన్నమాచార్య కీర్తనలు కాక ఇంకా మీరు వేటికైనా tune చెయ్యటం జరిగిందా?

చేసానండి. చేసాను. రామదాసు కీర్తనలు కొన్నిటికి tune  చేసాను.”హరిహర రామా..” అన్న కీర్తన కానడలోనూ, “రావయ్య భద్రాచల రామా..”, “ఏమిటి రామా..” అన్నవి tune చేసాను . ఇంకా 2, 3 కీర్తనలకు కూడా tune చేసాను. నారాయణ తీర్థులు రాసిన తరంగాలు మాత్రం 15, 16 చేసాను.

21. ఈ తరంగాల లక్షణం ఎలా ఉంటుందండి.

అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. అవి కూడా మన కీర్తనల వంటివే! అయితే అవి ఎక్కువగా నాట్యానికి అనుకూలంగా ఉంటాయి. భక్తి రస ప్రధానమైనవి.కృష్ణ పరంగా ఉంటాయి.

22. త్యాగరాజ కీర్తనలు అవి చూస్తే, “బహుశా ముందు ఆయన tune తయారు చేసుకొని తరవాత పాట రాసాడేమో అనిపిస్తుంది”, అన్నదానిపై మీ అభిప్రాయం ఏమిటండీ?

అది చాలా తప్పండి. ఆయన సంగీతము, సాహిత్యము అన్ని కలిసే వచ్చేసేవి. పోతన అన్నట్టు “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట”, త్యాగరాజు పలికింది రామ నామం. ఆయనది నాదయోగం. ఆయన ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో ఒకటి రామ నామం పలికింది, ఇంకోటి నాదోపాసన చేసింది.ఆ రెండూ కలిసి సంగీత
సాహిత్యాలు వచ్చాయి. అంచేత, ఆయన ఒక అవతారం. ఒక కారణజన్ముడు.

23. మీ దృష్టిలో ఇప్పుడు శాస్త్రీయ సంగీతానికి భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు?

అంటే ఒక్కొక్క దేశాన్ని బట్టి ఉంటుందండి. మన ఆంధ్రదేశంలో భవిష్యత్తు మీద నాకు అంత ధైర్యం లేదండి. ఎందుకంటే, T.V. వచ్చేసి చాలా మార్పులు తెచ్చి, చాలా prominent  అయిపోయిందండి. ఆ T.V. లో సినిమాలు, అవి, ఇవి ఎక్కువై పోయాయి. మన ఆంధ్రదేశంలో ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఇదివరకు కన్న మెరుగు అంటారు కానీ, ఎక్కడా సభలేవీ? సభలు లేవు ఏం లేవు. పూర్వం త్యాగరాజ ఉత్సవాలు అవి అక్కడక్కడా జరుగుతుండేవి. ఇప్పుడు ఆంధ్ర దేశంలో talent ఏదైనా ఉంటే, వాళ్ళు వెళ్ళి దక్షిణ దేశంలో వెళ్ళి పాడి పేరు తెచ్చుకోవలసిందే కాని, ఆంధ్ర దేశంలో కచ్చేరీలు పెట్టి, పోషించి, ఆదరించే వాళ్ళు చాలా చాలా అరుదు. అయితే, ప్రభుత్వమే పోషిస్తోంది అక్కడ, కాలేజీల ద్వారా. కాని,దక్షిణ దేశంలో మాత్రం సంగీతం విపరీతంగా అభివృద్ధి పొందుతోంది. గట్టిగా ఆలోచిస్తే, ఇంకా అమెరికాయే better . అక్కడ నుంచి బోలెడు సంగీతం ఇక్కడికే వస్తోంది. అమెరికాలోనే సంగీతం బోలెడు ప్రచారం అవుతోందని చెప్పాలి.

24. ఆంధ్రదేశంలో చెప్పుకోతగ్గ ఆర్టిష్టులు ఇంకా ఉన్నారా?

ఉన్నారు. ఉన్నారు. మన Hyderabad Brothers చక్కగా పాడతారు. ప్రియా సిస్టర్స్‌ కూడా. తరవాత ఇప్పుడు కొత్తగా మల్లాది బ్రదర్స్‌ అని ఇద్దరు కుర్రాళ్ళు పైకొస్తున్నారు. ఏమవుతోందంటే, talent  ఉందనుకోండి. దాన్ని ఎవరన్నా ఆదరిస్తారు, నాలుగు డబ్బులొస్తాయి అంటే వాళ్ళు ఆ talent  ని  improve  చేసుకొని, ఏదో ప్రయత్నిస్తారు. అవకాశం లేకపోతే ఏం చేస్తారు? కాని, ఉద్యోగాల్లో జీవిస్తున్నారు చాలామంది రేడియోల్లోనూ, కాలేజీల్లోను, యూనివర్సిటీల్లోనూ.

25. మీ శిష్యుల్లో మీకు నచ్చిన విధంగా పైకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?

ఇందాకా చెప్పిన మల్లాది బ్రదర్స్‌ నా శిష్యులు. వాళ్ళు దక్షిణాదిలో బాగా కచ్చేరీలు చేసి పైకొస్తున్నారు.

26. మిమ్మల్ని చాలా సేపు మాట్లాడించాం! చివరగా, అమెరికాలో ఉంటున్న వాళ్ళు, మన శాస్త్రీయసంగీతం వృద్ధి చెయ్యటానికి ఏం చేస్తే బాగుంటుంది?

చాలా గొప్ప ప్రశ్న వేసారు. అన్నిటి కంటే మించిన గొప్ప ప్రశ్న వేసారు.ఏమిటో మరి! నేను తెలుగు వాణ్ణి కదండీ? నాకు నా దేశం మీద, నా సంస్కృతి మీదా మమకారం. “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి..” అని శాస్త్రం. మరి నేను సంగీతం వాణ్ణి. తెలుగు దేశంలో ఏదైనా సంగీతం టాలెంటు ఉంటే, ఆ టాలెంటుని encourage  చెయ్యటానికి మన వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని నాకు ఒక కోరిక.

27. అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఊరికే డబ్బు ఇవ్వటమనేది ఒకటి.

అలా కాదు. ఆ talent కి ఒక గురువుని కూడా వెతకాలి! ఆ గురువు దగ్గర ఆ talent పెట్టాలి. పెట్టి, ఇదుగోండి. గురువుకు నెలకి ఇంతిస్తాం. శిష్యుడికి ఇంత స్కాలర్‌షిప్‌ ఇస్తాం. వాళ్ళకి 2, 3 సంవత్సరాలు support  చేసి,వాళ్ళని తయారు చెయ్యాలి. అలా గురువుకీ, శిష్యులకీ, ఇద్దరకీ బాధ్యత పెట్టాలి.అలాంటిది ఏదైనా మన వాళ్ళంతా పూనుకొని, కొంచెం జాగ్రత్తగా చెయ్యగలిగితే, మన దేశంలో సంగీతం అభివృద్ధి చెందుతుంది.