మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు

ఒక సంవత్సరం క్రితం ఎన్. సి. వి. జగన్నాథాచార్యులుగారు పాడిన కొన్ని పాటలు పోస్ట్ చేస్తూ మల్లిక్‌గారి పాటలతో కూడా సంకలనాలు చేయాలనే కోరిక చాలా సంవత్సరాలుగా ఉందన్నాను. కానీ వారి వారసులు అదే ఆలోచనలలో ఉన్నారని వింటున్నాను కాబట్టి ఎప్పుడూ ఆయన పాటలు పెద్ద సంఖ్యలో వినిపించలేదు. ఆ వినిపించిన కొద్ది: ప్రతి కోవెలకు పరుగిడకు (ఆగస్టు-2017), నడచి నడచి (ఎస్. వరలక్షితో, మార్చ్-2010), ఆగుమా జాబిలీ సాగిపోయెదవు ఏలా, ఒదిగిన మనసున పొదిగిన భావమూ, తందనానా భళా తందనానా (మే-2017) అన్న 5 పాటలు.

మల్లిక్‌గారు (పూర్తి పేరు: కందుల మల్లికార్జునరావు) రేడియోలో తొలినాటి తెలుగు సంగీత కార్యక్రమాలలో పాడటమే కాదు, వాటికి రూపురేఖలు దిద్దిన మొదటి తరం వ్యక్తి. బాలాంత్రపు రజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథంగార్లతో పాటు తెలుగు లలిత సంగీతాన్ని రేడియో ద్వారా బాగా ప్రచారంలోనికి తెచ్చినవారిలో మల్లిక్‌గారి పేరు కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి.

ఈ సంచికలో ఆయన పాడిన కొన్ని టి. ఎస్. రికార్డులు (transcriptional services records) విందాం. వైదేహిగారితో పాడిన ‘సాగునదే ధర్మచక్రము’ అన్న పాట (రజని రచన) ఆకాశవాణి విడుదల చేసిన రజని పాటల సి.డి.లో లభ్యమవుతుంది. అలాగే ‘శివుడు తాండవము సేయునమ్మ’ అన్న పాట ఏప్రిల్-2018 ఈమాట సంచికలో వినిపించడం జరిగింది. కానీ ఆయన టి. ఎస్. రికార్డులన్నీ ఒక చోట ఉంటాయన్న ఉద్దేశంతో మరల ఇక్కడ చేరుస్తున్నాను. ముఖ్యంగా ఆయన పాడిన ఘుమ్మనియెడి శ్రుతి గూడగను, ఎందరి వలపించెనో యింటనింట (రెండూ అన్నమయ్య రచనలు) అన్న పాటలంటే నాకు చాలా ఇష్టం.

రెండవ భాగంలో, కొన్ని సంప్రదాయ పాటలు విందాం. వీటిని జానపద పాటలు అని అనటం నాకిష్టం లేదు. ఇవి 1973లో ఆకాశవాణిలో ప్రసారమయినవి. ఈ పాటలు పాడింది ఆరికరేవుల సునందాశాస్త్రి (ముక్కామల సునంద), పి. సరోజిని, బి. రేణుక, మల్లిక్, బృందం.

నందగిరి బంగారుమామ పాట సీత, అనసూయలు పాడినది అందరికీ తెలిసే వుంటుంది. అలాగే టంగుటూరి సూర్యకుమారి పాడినది కూడా. ఆ రెండు వెర్షన్లు ఇక్కడ వినవచ్చు. ఇక్కడ మాత్రం మల్లిక్ పాడినది.

గుమ్మడేడే గోపిదేవీ గుమ్మడేడే కన్నతల్లీ అన్న పాట పూర్తి పాఠం ఇక్కడ చదువుకొనవచ్చు.

కానీ ఈ పాటైనా, తక్కిన కృష్ణమ్మా గోపాలబాలా కృష్ణమ్మా హరి హరి గోవింద బాలా కృష్ణమ్మా, ఓ యశోద ఏమి చేయుదుమే, నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా, పాటలకైనా సాహిత్యాన్ని ఇవ్వటం కష్టమైన పని. సాధ్యంకాని పని అని చెప్పాలేమో! ఈ ఆడియోలో పాడిన పాఠం మీకు పుస్తకాలలో కనపడే పాఠాలకి భిన్నంగా ఉంటే ఆశ్చర్యం లేదు. ఈ పాటల్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా మార్పులు, అదనపు చరణాల చేర్పులతో పాడుకుంటారు.

ఈ సంప్రదాయక, జానపద పాటల్ని, యక్షగానాల్ని ‘సంస్కరించి’ రాశామనీ పాడామనీ 20వ శతాబ్దంలో పేరుపొందిన చాలామంది సాహిత్యకారులు, గాయనీ గాయకులు చెప్పుకున్నారు. అది సరయినదా కాదా అన్నది పెద్ద చర్చ. ఆ వివరాలు మరొకసారి.

  1. ఏమగునో ఇక నా బ్రతుకు – మల్లిక్.

  2. ఎందరి వలపించెనో (అన్నమయ్య) – మల్లిక్.

  3. ఘుమ్మనియెడి శ్రుతి గూడగను (అన్నమయ్య) – మల్లిక్.

  4. ఓ… నందగిరి బంగారుమామా – మల్లిక్.

  5. విపంచికా తపించకే – మల్లిక్.

  6. శివుడు తాండవమూ చేయునమ్మా – మల్లిక్, పి. వి. సుబ్బలక్ష్మి.

  7. సాగునదే సాగునదే ధర్మచక్రమూ – మల్లిక్, వైదేహి.

  8. గుమ్మడేడే గోపిదేవీ గుమ్మడేడే కన్నతల్లీ

  9. కృష్ణమ్మా గోపాలబాల కృష్ణమ్మా

  10. ఓ యశోదా ఏమి చేయుదుమే