“సూరపరాజుగారి ఇల్లెక్కడా?” వాకబు చేశాడు చినరాజు, ఊరి మొగదల్లోనే పనిచేస్తున్న కూలీలని.
‘సూరపరాజుగారా, ఆ పేరున్నోరొకరే మా ఊళ్ళో! అదిగో వస్తన్నారు, సూడండ’ని తప్పుకున్నారు కూలీలు.
“ఏవండో! సూరపరాజుగారు! నవస్కారవండి. ఆయ్! తమకోసమే బయలెల్లేనండి, ఎదకబోయిన తీగ కాలికి సుట్టుకోటం అంటే ఇదేనండి, తవరు ఊరి మొగదలే దర్శనవిచ్చేరు,” అని ఆగి గస పోసుకున్నాడు చినరాజు.
ఎవరూ? అన్నట్టు చూశాడు సూరపరాజుగారు చుట్ట ముట్టిస్తూ.
“ఆయ్! మాది పాణింగిపిల్లండి, మమ్మల్ని సినరాజుగారంటారండి. ఆయ్! మా ఊళ్ళో కందాల రాజుగారని ఉన్నోరండి. ఆయ్! ఆయన కొకతే కొవార్తెండి. పెళ్ళీడు కొచ్చిందండి. సక్కని సుక్కంటారండి. తవకో కొవారుడని తెలిసి, తవతో సుట్టరికం కలుపితే, అని ఆశండి, తవరెక్కడికో దయసేస్తన్నారు, ఈ ఇసయం తవకి ఇంటికాడే ఇన్నవిద్దారకున్నానండి, తవరిక్కడే దర్శనమిచ్చీ తలికి…” అని ఆగాడు చినరాజు.
“సేలోకెల్తన్నాం! దయసేయండి, అలా ఎల్లొద్దాం,” అంటూ ముందుకు దారి తీశాడు సూరపరాజుగారు.
పెళ్ళి సంబంధం ఉందని చెప్పడానికి వచ్చిన మధ్యవర్తికి తమ సాధనసంపత్తుల గురించి చెప్పుకోవడం మగపెళ్ళివారికి వాడుకే! అందుకు సూరపరాజుగారు కొంత దూరం సాగిన తరవాత…
“అల్లదివో సూశారా! అనపడతాంది కాలవ, ఆయ్! అది మాసేలకి నీల్ల కోసం తెల్లోళ్ళు తొవ్వించినదండి. ఇది పంట కాలవండి. పెద్ద కాలవమీద మాకోసమే లాకోటి కట్టిచ్చారండి. రెండు పంటలకి నీటికి కొఱవ లేదండి. ఆయ్! ఇక్కడ మొదలండి, ఇదిగిదిగో! ఇటు సూడండి. అల్లదిగో సింతసెట్టండి, అది దచ్చిన సరద్దండి, అల్లాపడతన్నాది కొబ్బరి సెట్లొరస, అదండి పచ్చిమ సరద్దు, ఆయ్! ఇటు సూడండి తాడిసెట్ల గుంపు, అదండి ఉత్తర సరద్దు. నూటొక్క ఎకరవండి, బంగారం పడుద్దండి, నిజంగానే బంగారం పండుద్దనుకునీరు, ఇత్తనవేస్తే రెప్ రెప్ లాడత వస్తాదండి మొలక. ఆయ్! అల్లదే దూళ్ళ సాలండి పాతిక్కాళ్ళండి.”
చెప్పుకుపోతున్నాడు సూరపరాజుగారు, అతని వాక్ప్రవాహం, అడ్డుకట్టలేని కొత్త గోదావరిలా సాగిపోతూనే ఉంది. వింటున్న చినరాజుకి లంగరందడం లేదు. ‘సూద్దారి’ అని సరిపెట్టుకున్నాడు.
ఇంతలో ఎవరో మనిషి కనపడ్డాడు, విత్తనాల గంపతో. “సూరయ్యా! ఏటి సేత్తన్నారీయాలా?” అని ఆరా తీసిన సూరపరాజుకి, పక్కనున్న కొత్తమనిషిని చూసిన సూరయ్య “పడవటేపు పాతికెకరాల సెక్కలో పెసలు జల్లుతున్నావండి” అన్జెప్పి వెళ్ళిపోయాడు.
సూరపరాజుని చూస్తే ఎండిపోయిన పుగాక్కాడలా, పొగచూరుకుపోయినట్టున్నాడు తప్పించి నూటొక్క ఎకరాల ఆసామీలా ఆనలేదు. మాటల్జూస్తే వామ్మో! ఇక్కడా లంగరందని చినరాజు ‘ఇంతకీ తవదెంత ఎవసాయం’ అడగలేకపోయాడు. ‘సరే, ఇంకా సూద్దారని’ చినరాజు అనుకుంటూ ఉండగా, ఊరి బాట పట్టేరు.
ఎక్కడో పెద్ద బంగళా ముందు తేల్తావనుకున్నాడు చినరాజు, కాని చిన్న సందులోకి దారి తీశాడు సూరపరాజు. రెండు గదులు, వసారా ఉన్న చిన్న ఇంటి ముందు వసారాలో నిలబడి “ఏవండో సత్తిరాజుగారు! తవరోమాట చెయినేసుకోవాలి, పాణింగిపిల్లి నించి అబ్బాయిరాజుగారికి సవందం సెప్పటానికొచ్చేరు. కందాలరాజుగారి కువార్తెంట, సినరాజుగారు దయసేశారు. పట్టిమంచం పంపించండి,” అన్నాడు.
ఉడతలు పీకిన తాటి టెంకలాటి జుట్టుతో, మోకాళ్ళ మీదకి పోతున్న మాసిన చీరతో, అష్టవంకర్లు తిరిగున్న నులక మంచం పట్టుకొచ్చి వేసి ‘సిత్తగించండ’ని లోపలికి సద్దుకుందొకావిడ. ఆ ఇంట్లో మరో ప్రాణి ఉన్నట్టనిపించలేదు చినరాజుకి. ఈ మంచం తెచ్చినావిడెవరూ? అర్థంకాలేదు. నిలువుగుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయాడు.
‘తవరు కూకోండంటే తవరు ముందు కూకోండనుకుంటూ’ ఇద్దరూ నిలబడ్డారు. ఏదో చెబుతున్న సూరపరాజుగారు మర్యాదల్లో లోపమేదో ఉన్నట్టనిపించి, “సత్తిరాజుగారు! కాఫీ, మంచి తీర్థం…” అంటూ ఆగిపోయాడు.
విన్న చినరాజు “అబ్బే! ఉప్పుడేం ఒద్దండి, కతికితే అతకదంటారండీ,” అని మొహమాటపడ్డాడు. “తవరు తోళెం పుచ్చుకోండి,” అని మొహమాటపెడుతుండగా లోపల్నుంచి ఓ రెండు గ్లాసుల్లో కాఫీ లాటి ద్రవాన్ని పట్టుకొచ్చి ఒకటి సూరపరాజుకిచ్చి మరోటి చినరాజు ముందుపెట్టి ‘అన్నయగారు, కూకోండి. తవరు కాఫీ తోళెం పుచ్చుకోండ’ని చెప్పి లోపలికెళిపోయింది, ఇందాకా మంచం తెచ్చినావిడ. అష్ట వంకర్లు తిరిగున్న మంచం మీద కూచుంటే ఏమవుతుందోనని భయపడిన చినరాజు భయంతోనే కుక్కిమంచం దండి మీద బొట్టమోపుగా కూచున్నాడు.
కాఫీ పుచ్చుకుంటున్న చినరాజుకి ఆవిడే సూరపరాజుగారి ధర్మపత్ని అని తెలిసిపోయింది. తనొచ్చిన పని మళ్ళీ చెప్పి “మా రాజుగారికి ఇసయం ఇన్నవిస్తావండి. ఎళ్ళొస్తామండి, దయుంచండి.” అని బయటికొచ్చాడు.
వెళ్ళొస్తానని వీడ్కోలు తీసుకుని బయటికొచ్చాడు గాని, చినరాజుకి మనసు మనసులో లేదు. కాఫీ తెచ్చినావిడ సూరపరాజు భార్యేనని అర్థమయింది. కాని ఆ ఇల్లాలిని చూస్తే ఏబ్రాసిలా కనపడింది. ఇల్లు చూస్తే పూరింటికి ఎక్కువా పెంకుటింటికి తక్కువా అన్నట్టుంది. ఇంతకీ సూరపరాజు వ్యవసాయమెంతో, సిరి సంపదలేంటో సూచనగా తెలుస్తున్నా రూఢిగా తెలీలేదు. వినపడుతున్న మాటకీ కనపడుతున్న నిజానికీ లంగరందక కొట్టుకుంటున్నాడు. విషయం రూఢిగా తెలుసుకుంటే కందాలరాజుగారి కూతురికి కాకపోయినా మరొహరికి చెప్పచ్చనుకుంటూ కాలు సాగించాడు.
“ఎవరూ? సినరాజుగారేనా?” అంటూ ఓ వ్యక్తి అటకాయించాడు.
అడ్డొచ్చిన వ్యక్తిని తేరపారి చూసిన చినరాజు “ఆయ్! మీరంటండీ పులిరాజుగారూ, ఈ ఊళ్ళో ఉంటన్నారా! తెలీదు సుమా!” అన్నాడు. ఇద్దరూ అల్లుకుపోయారు, కుశల ప్రశ్నలనుంచి చిన్నప్పటి ముచ్చట్ల దాకా.
“దయసేయండి! ఇదే మా హవేలీ!” అంటూ ఓ మధ్య తరగతి పెంకుటిట్లోకి దారి తీశాడు పులిరాజు. స్వాగత సత్కారాలు నడుస్తున్నాయి, కబుర్లూ నడుస్తుండగా,
పులిరాజు “సినరాజుగారు! తవరేదో రాసకార్యం మీద దయసేసినట్టుంది,” అన్నాడు లౌక్యంగా.
“తవరి గేమంలో నూటొక్క ఎకరాల కావందు సూరపరాజుగారి కొవారుడికి పెళ్ళి మాటలకోసం వచ్చేము,” అని తాను ఉదయం వచ్చింది మొదలు జరిగినదంతా పులిరాజుకు చెప్పి, “ఏటండీ సూరపరాజుగారి మాటలు కోటలు దాటతన్నాయి, కాళ్ళు గడపలు దాటలేదు. ఆయన చెప్పినదానికి మేము సూసినదానికీ…” అని నాన్చేశాడు.
పులిరాజు సూరపరాజు మాట మధ్యలోనే అందుకుని “తేడా గురిచ్చా తవరి అనుమానం. ఆయ్! తవరు సూసిన నూటొక్క ఎకరాల సెక్కలో వందెకరాలు మా ఊరి పెదరాజుగారిదండి, ఒక్కెకరవూ సూరపరాజుగారిదండి. తవరికో అనుమానం వచ్చుద్ది, ఒక్కెకరవూ సూరపరాజుగారికెలా దఖలు పడిందీ అని, ఇనండి. మా పెదరాజుగారి ముత్తాతగారు కాలం జేసినపుడు, సూరపరాజుగారి తాతగారికీ ఎకరం నేలా దానం జేసేరండి, ఓ మూల. దానం జేసినాగానండి, ఎవసాయం తవరే సేసి అయివేజు సూరపరాజుగారి కుటుంబానికి పంపడం తరాలుగా జరిగిపోతన్నదండి… ‘మాదీ, మా రాజుగారిదీ కలిపి నూటొక్క ఎకరాల ఎవసాయం’ అనే సూరపరాజుగారి మాట, అలా నిలబడిపోయిందండి. అంతేనండి, సూరపరాజుగారికి మరో యాపకం లేదండి, రోజూ ఓపాలి పొలవెల్లి చూసొస్తంటారండి,” అని ముగించాడు పులిరాజు.
“అదాండీ సంగతీ! ఇసయం తెలీక కొట్టేసుకున్నావండి. మా కందాల రాజుగారి కొవార్తెకి కాపోతే మరోరికనుకోండీ, గంతకి తగిన బొంతకి. దయుంచండి, శలవిప్పించండి. ఉంటావండి,” అంటూ బయటకు దారి తీశాడు చినరాజు.