హాబూ నిప్పు

నిప్పు ఆటవస్తువు కాదు. కెలికితే కరిచి గీకేస్తుంది. మాంసాన్ని కాల్చి తినేస్తుంది. నిప్పు ఒక మృగం. వింత ఏంటంటే నిప్పు క్రూరమైనదే కాదు, అద్భుతమైనది కూడా. అది గాలిపటం. కందిరీగ లాగా చిన్నది, పసుపు పచ్చనిది, అది కరిచిన చోట గాయమైపోతుంది.

పదిహేను లక్షల సంవత్సరాల కిందటి మాట ఇది. అప్పట్లో మనుషులు గుహల్లో తండాలుగా ఉండేవారు. అడవిలో మృగాలకి భయపడి చెట్లెక్కి నిద్రపోయేవారు. కలుగుల్లో దాక్కుని జీవించేవారు. మనుషులకీ మృగాలకీ అట్టే తేడా ఉండేది కాదు. మనిషి మృగాలను వేటాడేవాడు. మృగాలేమో మనుషులని వేటాడేవి. ఎవరు ముందు చంపగలిగితే వారిది పైచేయి. మనుషులూ, మృగాలు పెద్దపెద్ద గుంపులుగా అడవుల్లో తిరుగుతూ ఉండేవారు.

అలాంటి రోజుల్లో ఒక తండాలోని ఒక మనిషి ఆలోచించేవాడు, “చీకటెందుకవుతుంది? ఈ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? కొండల వెనుక అతడి ఇల్లుందేమో? కానీ పొద్దున్నే వచ్చేటప్పుడు సముద్రం ఉన్న వైపు నుండి ఎందుకు వస్తాడు?”

ఆ మనిషి పేరు హాబూ. అతడు అనుకునేవాడు, “సూర్యుడు స్నానానికని సముద్రంలోకి వెళ్ళుంటాడు కాబోలు. కానీ ఏ దారిన వెళ్ళుంటాడు? దాక్కొనా? లేక, నగ్నంగా వెళ్తాడేమోలే! అసలు సంగతి తెల్సిన రోజున తప్పక వెళ్ళి కలుస్తాను. అతడు తొడుక్కోడానికి ఒక పచ్చితోలుని కూడా తీసుకెళ్తాను. కొండల్లోనే ఇల్లు కట్టుకోమని చెప్తాను. అప్పుడు మనకి ఎప్పుడూ వెలుగు ఉంటుంది.”

మనిషికి, మృగానికి మధ్య ప్రధానమైన భేదం మనిషి ఆలోచించగలడు. మృగం ఆలోచించలేదు.

రాత్రి తండాలో పడుకొని ఉండగా, హాబూ ఆకాశానికేసి చూస్తుండేవాడు. ఎంతో దూరాన అతడికి నక్షత్రాలు కనిపించేవి. అప్పుడప్పుడూ చంద్రుడు కూడా కనిపించేవాడు. వెన్నెల రాత్రుల్లో అడవిలో కాస్త అయినా వెలుగుండేది.

క్రూరమృగాలనుండి కాపాడుకోవడానికి ఆ మాత్రం వెలుతురు సరిపోయేది.

“చంద్రుడు సూర్యుడి చిన్నతమ్ముడేమో? లేక కొడుకేమో? నక్షత్రాలన్నీ అతడి జాతి అయ్యుండచ్చు, మాలాగా! సూర్యుడు ఆ జాతికి నాయకుడు అయ్యుండచ్చు.” అతడు వాళ్ళ అమ్మకీ విషయాలన్నీ తెలిసుంటాయని అనుకున్నాడు. అమ్మ అంది, “బాఖాను అడుగు. ఆయనకు తెల్సుండచ్చు.”

బాఖా ఆ తండాకు నాయకుడు. అందరి అన్నపానాదుల సంగతి చూసుకునేవాడు. వారి సంరక్షణకై చర్యలు తీసుకునేవాడు.

“వాళ్ళందరూ దేవతలు. ఆకాశంలో ఉంటారు. మనలాగా వాళ్ళకీ తండాలు ఉంటాయి!”

“అక్కడ జంతువులు కూడా ఉంటాయా? ఉండవా?”

“ఉండవు.”

“వాళ్ళేం తింటారు మరి?”

“ఏమీ తినరు.”

“అయ్యో! మరి చనిపోరా?”

“ఊహు.”

హాబూ ఆలోచించీ, అలోచించీ అలిసిపోయేవాడు. ఎన్నో వేల ప్రశ్నలు అతడి మెదడులో మెదులుతుండేవి. అన్నీ గుర్తు కూడా ఉండేవి కావు.

ఒకసారి ఇలా ఆలోచించాడు: “పిల్లలు ఆడవాళ్ళకే ఎందుకు పుడతారు? మగవాళ్ళకి ఎందుకు పుట్టరు?” అతడికీ పిల్లల్ని కనాలని కోరిక. అతడు గాల్లో ఎగరగలిగితే అప్పుడిక మృగాల భయం ఉండదు. కాకిలా ఎగిరి ఏనుగు వీపుపై కూర్చునుండేవాడు, ఎంచక్కా. ఒకరోజు చెట్టెక్కి గాల్లో ఎగరటానికి ప్రయత్నించాడు కానీ కిందపడిపోయాడు. పైగా, ఇలాంటి నిర్వాకం చేసినందుకు బాఖా ఒకటి తగిలించి వెళ్ళాడు. అతడి దెబ్బలు చూసి అందరూ నవ్వేవారు. వాళ్ళమ్మ ఒక్కత్తే మనసు కష్టపెట్టుకునేది.

ఒక రాత్రి హోరున వాన కురిసింది. జుంబీ హాబూని అడిగాడు, “ఇన్ని నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి?”

హాబూ తడుముకోకుండా వెంటనే చెప్పాడు. “ఆకాశంలో దేవతలు తండాలో ఉంటారు. అప్పుడప్పుడూ అందరూ కల్సి మూత్రం పోస్తే వాన కురుస్తుంది.”

జుంబీ ఇంత చక్కటి జవాబు విని ఆశ్చర్యపడిపోయి, అన్నాడు. “హాబూ, ఏదో ఒక రోజు నువ్వు కూడా పెద్దవాడివై బాఖాలాగా తండాకు నాయకుడివి అవుతావు. ఎన్ని విషయాలున్నాయి నీ పొట్టలో?!” అతడి అనదల్చుకుంది ఎంత జ్ఞానం ఉందో హాబూలో అని. మనిషి తెలివంతా పొట్టలోనే ఉంటుందనుకునే రోజులవి.

హాబూ జ్ఞానం అతడితో పాటు పెరిగి పెద్దదయ్యింది. మెదడులోని ప్రశ్నలకు జతగా ఇప్పుడు అతను స్వయంగా వాటికి జవాబులు వెతకటం మొదలుపెట్టాడు. అతడు డాబుగా తన తెలివిని చూపిస్తుంటే అందరూ ఆశ్చర్యపడిపోయేవారు. ఒక్కోసారి బాఖా కూడా. మబ్బులు గర్జించటానికి గల రహస్యం కూడా హాబూనే చెప్పాడు.

“దేవతలు తమలో తాము కొట్టుకునేటప్పుడు, ఒకరినొకరు ఎత్తి కుదేసినప్పుడల్లా వాళ్ళ ఎముకలు విరిగి అట్లాంటి శబ్దాలు వస్తాయి.”

హాబూ ప్రశ్నలని వెతకటానికి బదులు జవాబులు వెతకటం మొదలెట్టాక అతడంటే తండాలో భయభక్తులు ఏర్పడ్డాయి.

హాబూ తరుచుగా ఏనుగు వీపు మీద కాకి ఎగురుతూ ఉండడం చూసేవాడు. ఏనుగు చెవులు కదిపినా కాకి పోయేది కాదు. తొండం ఊపినా, చిన్న తోకాడించినా కూడా ఎగిరిపోయేది కాదు. ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళే ఒక ఏనుగును చూసేవాడు. రోజూ సముద్రతీరం దాకా వెళ్ళి, నీళ్ళల్లో ఆడుకొని, మళ్ళీ వెనక్కి వచ్చేసేదా ఏనుగు. నేలను విడిచి నడవాలని హాబూకు భలే కోరికగా ఉండేది. అందుకని ఒకరోజు ఒక చెట్టు కొమ్మపై ఎక్కి కూర్చున్నాడు. ఏనుగు అటునుంచి వెళ్తుండగా ప్రాణాలకు తెగించి దాని వీపు మీదకు దూకాడు. ఏనుగుకి ఇదో కొత్త అనుభవం. అది తత్తరపడిపోయింది. ముందు గుండ్రంగా తిరిగింది, తొండం ఎత్తి మోరపెట్టింది. తోకాడించింది. ఇక ఏం చేసినా లాభం లేకపోయేసరికి అడవిలోకి పరిగెత్తుకుపోయింది. హాబూ ఆనందపడ్డాడు. ఒకచోట చెట్టుకొమ్మ పట్టుకొని దూకి పారిపోయాడు.

రెండుమూడు రోజుల తర్వాత హాబూ మళ్ళీ అలానే చేశాడు. ఏనుగు హూంకరించి పరిగెత్తేది. హాబూ అదే చోటు దూకి పారిపోయేవాడు. ఒక రోజున, తన స్నేహితులతో కల్సి సముద్రంలో స్నానం చేస్తున్న హాబూని ఆ ఏనుగు పట్టేసుకుంది. తొండం నిండా నీళ్ళు నింపుకొని హాబూ మొహం మీద జల్లింది. తక్కినవారందరూ భయపడి పారిపోయారు. ఏనుగు, తొండంతో అతడిని చుట్టి, పైకెత్తి వీపు మీద కూర్చోబెట్టుకుంది. హాబూకి స్పృహ వచ్చి, దూకేసేలోపు ఏనుగు ఇంకా లోతుగా ఉన్న నీళ్ళల్లోకి దిగింది. హాబూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే, ఏనుగు తొండం నిండా నీళ్ళు నింపుకొని అతడిపై జల్లుతూ ఉంది. ఏనుగుకి ఇదంతా తమాషాగా ఉంది. కొద్దిసేపటికి హాబూ అరవటం మానేశాడు. కాసేపటికి అతడికి అర్థమయ్యింది, ఏనుగు తనతో పోట్లాడడం లేదు, ఆడుకుంటుందని. హాబూ తండాలోని వారంతా సముద్రతీరానికి చేరుకొని హాబూ, ఏనుగు మధ్య సఖ్యతను చూసి విస్తుపోయారు. అంతకు ముందెన్నడూ అలా జరగలేదు. అందరూ భయపడే ఒక అడవి జంతువుని హాబూ మచ్చిక చేసుకున్నాడు. హాబూను అందరూ విస్మయంగా చూశారు. ఇహ, ఏనుగు వీపు మీద సవారీ చేస్తూ హాబూ తండాని చేరుకున్న రోజున ఎవ్వరి నోటా మాటే లేదు. మిగతా వాళ్ళు కూడా ఏనుగుకి బెదిరిపోకుండా దాని దగ్గరకు వెళ్ళారు. దానికి తినడానికి ఏదో పెడితే అది తొండంతో అందిపుచ్చుకొని గుటుక్కుమనిపించింది. ఆ రోజు నుండి ఏనుగు కూడా ఆ తండాలో భాగమైపోయింది. అడవి జంతువులను మచ్చిక చేసుకొని సాకవచ్చునని హాబూ చేసి చూపేంతవరకూ మనిషికి తట్టను కూడా తట్టలేదు. మొట్టమొదటిసారిగా మనిషికి, జంతువుకి మధ్య స్నేహం ఏర్పడింది.

మనిషికి చలి, వేడి అనేవి అనుభవంలో ఉన్నాయి గానీ వేడి ఎందుకనిపిస్తుంది, చలికి ఎందుకు వణికిపోతాడు? అనేది తెలీదు. వాననుండి కాపాడుకోడానికి కలుగులైతే అతడు వెతుక్కొని పెట్టుకున్నాడు కానీ కాలాలు మారుతాయన్న సంగతి గ్రహించలేదింకా. సమయాన్ని కొలవడం కూడా మనిషి అప్పటికి నేర్చుకోలేదు. రాత్రిపగళ్ళ గురించి తెల్సునంతే! నెలలు, సంవత్సరాల గురించి తెలీదు. అందుకని ఒక ఋతువు ఎన్ని నెలలు ఉంటుందో, సంవత్సరంలో ఎప్పుడు ఏ ఋతువు తిరిగి వస్తుందో ఎలా తెలుస్తుంది? ఇంతకు ముందు కూడా ఇలానే చలి వేసింది, ఇలానే మంచు పడింది, వానలో ఇంతక ముందూ తడిశాం అనేవే తెల్సు. పుస్తకాలు లేనే లేవు గనుక జ్ఞానమంతా నోటిమాటన ఒక తరం నుండి ఇంకో తరానికి అందుతుండేది.