ఆతపభీతి నీడలు రయంబున మ్రాకుల క్రిందు దూరెనో
ఆ తరులుం దృషాభిహతులై తమ నీడలు తార త్రాగెనో
భాతి ననంగ నీడ లురు పాదపమూలములం దడంగె గ్రీ
ష్మాతప మధ్యవాసరములందు జలింపకయుండు నెండలన్
-కుమారసంభవము, నన్నెచోడుడు
వేసవి మధ్యాహ్నపు వేళ ఎండకి తట్టుకోలేక, నీడలుకూడా నీడకోసం చెట్ల కింద దాక్కున్నాయో, లేదా చెట్లు దాహంతో తమ నీడలను తామే త్రాగేసాయో అన్నట్టుగా నీడలు మాయమైపోయాయట! కవి ఊహకి మేర ఎక్కడిది!
ఈ మధ్యాహ్నం పూట, నా నీడకూడా నాలోకి పోయి దాగినట్టుంది. నీడ అనేది ఒక ద్రవ్యమా లేక గుణమా? నా ఎడం నేను చెప్పిన వైశేషికుల సత్త్వమీమాంస గురించి ఆలోచిస్తూ నడక మొదలుపెట్టాను. నా నీడకి ఆకారం ఉంది, కదలికా ఉంది. కానీ ఆ రెండూ నిజానికి నావి. అంటే నీడకీ నాకూ ఉన్నది అవినాభావ సంబంధమా? అంటే సమవాయమా? కాదు. నేను లేకుండా నా నీడ లేదు కానీ, నీడ లేకుండా నేనుండగలను. అంచేత అది అవినాభావ సంబంధం కాదు. అసలు నీడ అంటే ఏమిటి? ఒక ప్రదేశమంతటా వెలుగు పరుచుకొని ఉంటే, అందులో కొంత భాగంలో వెలుగు లేకపోవడం. అంటే చీకటి. వెలుగు అనేది పదార్థం. వెలుగు లేకపోవడం చీకటి కాబట్టి, చీకటి అనేది అసలు వేరే పదార్థం అవుతుందా?[1] ఆలోచించే కొద్దీ తల మీదనే కాదు, లోపలకూడా వేడి మొదలయ్యింది. ఈ వైశేషిక సిద్ధాంతంలో ఆత్మసూచనకి ఎక్కడ చోటుందన్న ఎడమ నేను ప్రశ్న గుర్తుకువచ్చి, తల మరింత వేడెక్కింది.
“అసలే ఎండ వేడి. అంతలా ఆలోచిస్తూ నడిస్తే అలసిపోతావు. నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెపుతాను వింటావా?”
గొంతు పరిచయమైనదే కానీ ఎడమవైపు నుంచి కాక కుడివైపు నుంచి వచ్చిందేమిటి? ఎడమ నేను కుడివైపుకి వచ్చిందా!
“చోద్యం కాకపోతే ఎడమ ఎక్కడైనా కుడివైపుకి ఎలా వస్తుంది? నేను నీ వేరే నేనును.”
ఓహో, యిది నా కుడి నేను కాబోలు! నాలో యిన్ని నేనులున్నాయని యింత వరకూ తెలియలేదు.
నేను: ఓహో, నువ్వు నా కుడి నేనా. నువ్వు కూడా భేతాళ ప్రశ్నలు వేయనంటే వింటాను.
కుడి నేను: లేదు లేదు. ప్రశ్నలు వేసి తికమక పెట్టడం ఆ ఎడం నేను పని. నేను మంచి మంచి కథలూ కబుర్లూ మాత్రమే చెప్తాను.
నేను: అలా అయితే సరే, చెప్పు.
కుడి నేను: అనగనగనగా, ఒక అడవిలో ఒక తాబేలూ కుందేలు ఉన్నాయి. ఆ రెండూ ఒకరోజు పరుగుపందెం పెట్టుకున్నాయి.
నేను: ఓయబ్బో, ఇది నా చిన్నప్పటినుంచీ వివి విని అరిగిపోయిన కథ. చెప్తే ఏదైనా కొత్త కథ చెప్పు.
కుడి నేను: అసలు కథ చెప్పనీ. ఇది పాత కథలాగే అనిపించే కొత్త కథ!
నేను: అవునా. సరే చెప్పు.
కుడి నేను: తాబేలు మెల్లగా నడక మొదలుపెట్టింది. కుందేలు ఎప్పటిలాగే సగం దూరం పరుగెత్తిపోయి, తనెలాగూ గెలుస్తానన్న ధైర్యంతో అక్కడున్న చెట్టు నీడన నడుం వాల్చింది. ఒక్క క్షణంలో నిద్రలోకి జారుకుంది.
నేను: అది నిద్రనుంచి లేచేలోపు తాబేలు తన గమ్యం చేరుకొని పోటీ గెలిచింది. అంతేగా!
కుడి నేను: అరే! నన్ను చెప్పనిస్తావా లేదా?
నేను: చెప్పు చెప్పు, కొత్తగా చెప్పకపోతే మాత్రం ఒప్పుకోను.
కుడి నేను: విను మరి. అలా నిద్రపోయిన కుందేలుకి ఒక కల వచ్చింది. ఆ కలలో తానొక తాబేలుతో పరుగు పందెం పెట్టుకుంది.
నేను: ఆ కలలో కుందేలు మళ్ళీ చెట్టుకింద పడుకొని, మళ్ళీ తానొక తాబేలుతో పరుగు పందెం పెట్టుకున్నట్టు కల కనింది. ఆ కలలో మళ్ళీ… యిలా కలలో కల, కలలో కల.. యిదేనా నువ్వు చెప్పే కథ?
కుడి నేను: అబ్బా, నన్నసలు కథ చెప్పమంటావా వద్దా?
నేను: చెప్పు చెప్పు.
కుడి నేను: అయితే మధ్యలో మాట్లాడకుండా విను.
తాబేలుతో పరుగు పందెం పెట్టుకున్నట్టు కల వచ్చింది కదా. కలలో పరుగు పందెం మొదలయ్యింది. కుందేలు పరుగు మొదలుపెట్టబోతోంది. అంతలో ఆ కలలో తాబేలు, కలలో కుందేలుతో యిలా అంది
“ఈ తాబేలు కుందేలు కథ మనం ఎన్నిసార్లు వినలేదూ! ప్రతిసారీ కుందేలు ముందు పరుగెత్తిపోయి, మధ్యలో నిద్రపోవడం. అది నిద్ర లేచే లోపు తాబేలు మెల్లగా గమ్యాన్ని చేరి పందెం గెలవడం, అదే కదా జరిగేది. అంచేత కష్టపడి నువ్వు పరిగెత్తి పోవడం ఎందుకు. నాతో మెల్లిగా నడుస్తూ రా!”
ఆ మాటలు విన్న కుందేలుకి ఉక్రోషం వచ్చింది. “నేనలా నిద్రపోను. ఈసారి గెలిచి తీరుతాను. ఎప్పుడూ తాబేళ్ళే గెలవడానికి ఏమిటట మీ గొప్ప!” అంది.
అప్పుడా తాబేలు, “తాబేలు గొప్పదనం నీకేం తెలుసు. ఈ భూమి మొత్తాన్నీ మోస్తున్నది ఒక తాబేలే, ఆ సంగతి నీకు తెలుసా!” అంది గర్వంగా.
“ఓయబ్బో, ఇది నా చిన్నప్పటినుంచీ వింటున్న కథే! భూమిని ఒక పెద్ద పాము మోస్తున్నదనీ, ఆ పామును ఒక పెద్ద తాబేలు మోస్తున్నాదనీ ఎవడో అన్నాడట. మరి ఆ తాబేలుని ఎవరు మోస్తున్నారని అడిగితే, అంతకన్నా పెద్ద తాబేలు అన్నాడట. మరి ఆ పెద్ద తాబేలుని ఎవరు మోసేది అంటే, మొత్తం చివరకంటా తాబేళ్ళే ఉన్నాయని కసురుకున్నాడట ఆ మతిమాలిన మనిషి! ఈ కథ వినే అంత మిడిసిపడుతున్నావా!” అంది కుందేలు.[2]
దానికా తాబేలు, “ఆ కథ పుట్టించినవాడు నిజంగా మతిలేని వాడే అయ్యుంటాడు. అసలు విషయం తెలీక అలా ఏదో కల్పించాడు. నిజంగానే భూమిని పెద్ద పాము మోస్తున్నది. ఆ పామును పెద్ద తాబేలు మోస్తోంది.” అంది.
“అయితే ఆ తాబేలుని మోస్తున్నదెవరో నువ్వు చెప్పు?” గదమాయించింది కుందేలు.
“తాబేలుని ఒకరు మొయ్యడమేమిటి! దానికదే నిలబడి ఉంది” దబాయించింది తాబేలు.
దానితో కుందేలుకి ఏమనాలో తోచలేదు. కల కదా. వెంటనే తానొక పెద్ద తాబేలు మీద పరిగెడుతున్నట్టు అనిపించింది. తాను ఎంత దూరం పరిగెట్టినా, తన ముందొక తాబేలు కనిపిస్తోంది. ఈ లెక్కన తానెప్పటికీ పరుగు పందెం గెలవలేనేమో అన్న భయం పుట్టింది. ఆ భయంతో కుందేలుకి మెలకువ వచ్చింది.
నేను: ఆ కలలో తాబేలు దబాయింపు చాలా విడ్డూరంగా ఉంది. ఏ సహాయం లేకుండానే తనకు తాను నిలబడుతుందా!
కుడి నేను: భూమిని మోసేంత పెద్ద తాబేలు ఉండగా లేనిది, అది ఏ సహాయం లేకుండా నిలబడడంలో విడ్డూరం ఏముంది! ఇంతకీ అసలు ట్విస్టు విను.
నేను: చెప్పు.
కుడి నేను: మెలకువ వచ్చి లేచిన కుందేలుకి గమ్యం చేరుకున్న తాబేలు కనిపించింది. ఛత్ మళ్ళీ తాబేలే గెలిచింది అనుకుంటూ, తాబేలు దగ్గరకి వెళ్ళింది. అప్పుడు తాబేలు చిన్నగా నవ్వుతూ, “కుందేలు బావా! ఈసారి నిద్రలో ఏం కలగన్నావు” అని అడిగింది. కుందేలు తనకి వచ్చిన కల గురించి చెప్పింది.
అంతా విన్న తాబేలు యిలా అంది, “నీ కలలో తాబేలుకి కూడా అసలు సంగతి తెలియలేదు. నే చెప్తా విను. భూమిని పాము మోస్తోంది. ఆ పామును తాబేలు మోస్తోంది. అంతవరకూ సరే. ఆ తాబేలుని మళ్ళీ ఒక పెద్ద వరాహం, అంటే పంది మోస్తోంది. ఆ పందిని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి” అని, కాస్త ఊపిరితీసుకోడానికి ఆగింది.
“మరి ఆ ఎనిమిది ఏనుగులను ఎవరు మోస్తున్నారు?” అడిగింది కుందేలు.
“వాటిని పర్వతాలు మోస్తున్నాయి”, సమాధానం చెప్పింది తాబేలు.[3]
“మరి ఆ పర్వతాలను ఎవరు మోస్తున్నారు?” అడిగింది కుందేలు. “అదేం ప్రశ్న. పర్వతాలు ఎక్కడుంటాయి? భూమ్మీద. అంటే భూమి ఆ పర్వతాలను మోస్తోంది!” జావాబిచ్చింది తాబేలు.
“ఆఁ!” అని ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టింది కుందేలు. పందెం మొదలుపెట్టిన చోటునే ఈసారి గమ్యంగా చేసుకొని తిరిగి పరుగు పందేనికి సిద్ధపడ్డాయి ఆ తాబేలూ కుందేలూను. అదీ కథ!
నేను: కలలో తాబేలు కన్నా కథలోని తాబేలు మరీ గడుగ్గాయిలా ఉందే!
“కథలు వినడంతోనే కాలక్షేపం చేస్తున్నావా? నిన్న నేనడిగిన ప్రశ్న గురించి ఏమైనా ఆలోచించావా?” ఎడం వైపునుండి వినిపించింది ప్రశ్న. భేతాళుడు ప్రత్యక్షమయ్యాడు!
నేను: వచ్చావా. రా రా. చూడు మనకింకొక తోడు దొరికింది. ఈ కుడి నేను నీలా ప్రశ్నలతో వేధించకుండా చక్కగా కథలూ కబుర్లూ చెబుతోంది.
ఎడమ నేను: అవును. నేనూ వింటున్నాను. ఆ కథలో ఉన్న మెలికని గుర్తుపట్టావా?
నేను: మళ్ళీ నీ మెలికల గోల మొదలుపెట్టావా! కథని కథగా కాస్త ఆస్వాదించనీ.
ఎడమ నేను: అలాగే, నేను కాదన్నానా! సాహిత్యం ఆలోచనామృతం అన్నారు. ఈ కథకి అందం అందులోని మెలికే.
ఎడమ నేను చెపుతున్నది నిజమే. తాబేలుని మోసే పెద్ద తాబేలు, దాన్ని మోసే మరొక పెద్ద తాబేలు – ఇలా చెప్పుకుంటూ పోతే, దానికి అంతం ఉండదు. అది సరికాదు. మరి ఎలా? ఆ సమస్యని కథలోని కలలోని తాబేలు ఒకరకంగా పరిష్కరిస్తే, కథలోని తాబేలు మరోలా పరిష్కరించింది. భూమిని మోసేవాటిని తిరిగి భూమి మోయడం అనే మెలిక రెండో పరిష్కారంలో దాగుంది.
ఎడమ నేను: సరిగ్గానే గుర్తించావు.
నేను: ఇంతకీ ఈ కథ ఎక్కడిది?
కుడి నేను: ఎక్కడిదేంటి, నేను అల్లినదే!
నేను: ఓహో, అయితే మీరిద్దరూ కుమ్మక్కయ్యారన్న మాట!
కుడి నేను: కుమ్మక్కవ్వడం ఏమీ లేదు. నేనుకూడా మీతో పాటు వస్తున్నాను. మీ యిద్దరి సంభాషణా వింటూ ఉంటే నాకీ ఆలోచన వచ్చింది. అయినా ఇలాంటి కథలు ఇంతకు ముందే మన సాహిత్యంలో ఉన్నాయి.
నేను: అలాగా, అయితే మరింకెందుకు ఆలస్యం, చెప్పు చెప్పు!
ఎడమ నేను: వాటిని తర్వాత తీరిగ్గా విందువుగాని లే.
నా ఎడం నేనులో భేతాళుడే కాదు నక్షత్రకుడు కూడా ఉన్నాడు!