నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు

నేను: సరే, యింతకీ ఏమంటావు?

ఎడమ నేను: కుడి నేను చెప్పిన తాబేలు కథలో నేను నిన్నడిగిన ప్రశ్నకు జవాబుంది అంటాను.

నేను: ఆ కథలో నీ ప్రశ్నకు జవాబుందా?

ఎడమ నేను: ఇంతకీ నేనడిగిన ప్రశ్న గుర్తుందా?

నేను: వైశేషికుల సత్త్వ సిద్ధాంతంలో ఆత్మసూచన గురించే కదా. దానికీ ఈ కథకీ ఏమిటి సంబంధం?

ఎడమ నేను: ఆత్మసూచన తెచ్చిపెట్టే తంటాలలో తప్పొప్పుల తిరకాసు ఒకరకం. దాని గురించి నిన్నా మొన్నా వివరంగా మాట్లాడుకున్నాం కదా. అది తెచ్చే మరొక ఇబ్బంది అనవస్థ.

నేను: అనవస్థ? అంటే?

ఎడమ నేను: అనవస్థ అనేది తర్కశాస్త్రంలో ఒకానొక దోషం. ఏదైనా ప్రతిపాదన మరొక ప్రతిపాదనపై ఆధారపడి, ఆ ప్రతిపాదన ఇంకొక దానిపై, అది మరొక దానిపై, ఇలా అనంతంగా ఆధారపడుతూ పోవడాన్ని అనవస్థా దోషం (Infinite Regress) అంటారు. అలాంటి దోషమున్న ప్రతిపాదన తర్కసమ్మతం కాదన్న మాట.

నేను: ఆఁ! అర్థమయింది. కథలో భూమిని మోసే తాబేలు మరొక తాబేలుపైనా, అది మరొక తాబేలుపైనా యిలా అనంతంగా ఆధారపడాల్సి రావడంలాంటిదన్న మాట!

ఎడమ నేను: అవును. వైశేషికుల పదార్థ నిర్వచనంలో అలాంటి అనవస్థ రాకుండా వారు జాగ్రత్త పడవలసి వచ్చింది.

ఒకసారి వైశేషికుల సిద్ధాంతంలో పదార్థాల గురించి ఎడమ నేను చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాను. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం. ఇందులో ద్రవ్యం ఒక్కటే స్వతంత్రమైనది. గుణ కర్మలు ద్రవ్యం మీద ఆధారపడతాయి. అలాగే ద్రవ్యాలలో సమానంగా ఉండే లక్షణం సామాన్యం. ఒక్కొక్క ప్రత్యేకమైన ద్రవ్యం ఒక విశేషం. పదార్థాల మధ్యన ఉండే అవినాభావ సంబంధం సమవాయం. ఈ నిర్వచనాలలో అనవస్థకి దారి తీసేది ఏమిటుందా అని ఆలోచించసాగాను.

ఎడమ నేను: సామాన్యం అనేది ఒక్క ద్రవ్యాలకే కాదు గుణాలకూ వర్తిస్తుంది.

నేను: అంటే?

ఎడమ నేను: సమాన లక్షణం ద్రవ్యాల మధ్యనే కాదు గుణాల మధ్యకూడా ఉండవచ్చును కదా. ఉదాహరణకి తెల్లగులాబీలోని తెలుపు లాగే, సున్నం రాసిన తెల్లగోడ, పాలు, మల్లెపూలు – ఇలా అనేక ద్రవ్యాలలో తెలుపు రంగు కనిపిస్తుంది కదా. ఒకో ద్రవ్యంలోనూ కనిపించేది ఒకో ప్రత్యేకమైన తెలుపు. ఆ అన్నింటిలో సమానంగా ఉన్న లక్షణం తెలుపుదనం. అది సామాన్యం. అంటే తెల్లని వస్తువులన్నిటిలో సమానంగా ఉండేది తెలుపుదనం అనే సామాన్యం అన్నమాట. అలాగే ఏ గుణమైనా ఒక ప్రత్యేక ద్రవ్యంలో కనిపించినప్పుడు, అది విశేష గుణం. వాటన్నిటిలో సమానంగా ఉన్నది సామాన్య గుణం.

నేను: అర్థమయింది. అలాగే నల్లదనం, చక్కదనం, పొట్టిదనం – ఇవన్నీ గుణాలలోని సామాన్యాలన్న మాట.

ఎడమ నేను: అవును. అలాగే కర్మలకి కూడా సామాన్యాలుంటాయి.

నేను: ఓహో. కూర్చోవడం, పరిగెత్తడం, చదవడం – ఇవన్నీ కర్మలలోని సామాన్యాలన్నమాట.

ఎడమ నేను: అవును.

ఈ నిర్వచనాలలో అనవస్థ ఎక్కడనుండి వస్తుందని ఆలోచించడం మొదలుపెట్టాను.

ఎడమ నేను: సామాన్యాన్ని ఒక పదార్థంగా అసలు వైశేషికులు ఎందుకు గుర్తించారో నీకు అర్థమయిందా?

నేను: ఒక ఆవుని చూసినప్పుడు అది ఏదో పదార్థం అని కాకుండా, ఒక ఆవు అని మనం గుర్తిస్తున్నాము కదా. ‘ఆవుదనం’ అనేది ఒకటి ఉంటేనే ఒక ప్రత్యేకమైన ఆవును ఆవుగా గుర్తించగలం. నువ్వు నిన్న చెప్పినదాని బట్టి నాకర్థమైనది ఇదీ!

ఎడమ నేను: సరిగానే అర్థమయింది. ఇప్పుడొక ప్రశ్న వేస్తాను జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పు.

నేను: అలాగే, అడుగు.

ఎడమ నేను: ఆవుదనం అనే సామాన్యాన్ని నువ్వు గుర్తిస్తున్నావా లేదా?

ఎడమ నేను: ఆ గుర్తిస్తున్నాను.

ఎడమ నేను: ఒక ఆవు వేరు, గుర్రం వేరు అని గుర్తించినట్టుగా ఆవుదనం వేరు గుర్రపుదనం వేరు అనికూడా గుర్తిస్తున్నావు కదా?

నేను: అవును.

ఎడమ నేను: మరి…

బల్బు వెలిగింది! ఎడమ నేను చెప్పబోయేది అర్థమయింది.

నేను: ఆఁ, తెలిసింది! ఒక ఆవుని ఆవని గుర్తించడానికి ఆవుదనం ఎలా అవసరమయిందో, ఆవుదనాన్ని ఆవుదనం అని, అది గుర్రపుదనం కాదనీ గుర్తించడానికి ‘ఆవుదనపు’దనం అనేది మరొకటి ఉండాలి కదా?

ఎడమ నేను:భేష్! సరిగ్గా పట్టుకున్నావ్.

నేను: అదే లాజిక్కుతో ‘ఆవుదనపుదనపు’దనం, ‘ఆవుదనపుదనపుదనపు’దనం… ఇలా అనంతమైన సామాన్యాలు ఉండాలన్నమాట! ఇది అనవస్థా దోషం!

ఎడమ నేను: భేష్, భేష్! మరి యీ సమస్యకి ఏమిటి పరిష్కారం?

అవును, ఏమిటి పరిష్కారం? ఒక నాలుగు కాళ్ళ జీవిని ‘ఆవు’గా మనం గుర్తిస్తున్నామంటే, ‘ఆవుదనం’ అనేది ఒకటి ఉండాలని వైశేషికుల ప్రతిపాదన. ఇది సమంజసంగానే ఉంది. అంచేత ‘ఆవుదనం’ అనేది కూడా ఒక పదార్థమేనని, దానికి వారు సామాన్యమని పేరు పెట్టారు. మరి ‘ఆవుదనం’ అనేది ఒక పదార్థమైతే దానిని ‘గుర్రపుదనం’ అనే వేరే పదార్థంతో వేరు చేస్తున్నది ఏమిటి? ‘ఆవుదనం’ అనే పదార్థం ఉందని అనుకున్నా, అది ఒకే ఒక పదార్థం. రెండు ‘ఆవుదనాలు’ ఉండవు. ‘ఆవులు’ అనేకం ఉండవచ్చును కానీ ‘ఆవుదనం’ అనేది ఒకటే. అలాగే గుర్రపుదనమూను. ఉండే పదార్థమే ఒకటైనప్పుడు మళ్ళీ దానికి సామాన్యం, విశేషం అనేవి ఉండవు. అలాంటి పదార్థాలను గుర్తించడానికి మరొక సామాన్యం అవసరం లేదు. కాబట్టి ఒక సామాన్యాన్ని గురించడానికి వేరే సామాన్యం అవసరం లేదన్నమాట!

ఎడమ నేను: సరిగ్గానే ఆలోచించావు. వైశేషికుల సత్త్వసిద్ధాంతం నీకు బాగానే అర్థమయినట్టుంది! ఒక పదార్థాన్ని మరొక పదార్థంతో వేరు చేసి చూసేందుకు సామాన్యం అవసరమైనప్పుడు, అదే అవసరం ఒక సామాన్యాన్ని మరొక సామాన్యంతో వేరుగా గుర్తించేందుకు కూడా ఉంటుంది అనడంలో ఆత్మసూచన దాగుంది. అలా జరిగితే అది అనవస్థకి దారి తీస్తుంది. సామాన్యాన్ని స్వతస్సిద్ధంగానే గుర్తించవచ్చు అనేది దానికి పరిష్కారం. భూమిని మోసే తాబేలు తనంత తానుగా నిలబడగలదు, వేరే మరొక తాబేలు అవసరం లేదని అనడం లాంటిదే ఇది!

నేను: అవునవును!

ఎడమ నేను: సామాన్యం అంటే ఏమిటన్నది నిర్ణయించడానికి వైశేషికులు చాలా పకడ్బందీ నియమాలను ఏర్పరిచారు. అందులో అనవస్థాదోషం ఉండకూడదన్నది ఒక నియమం. [4] సత్త్వసిద్ధాంతంలో మరొక చోటకూడా, ఈ అనవస్థాదోషమనే ప్రమాదాన్ని వైశేషికులు ఎదుర్కొన్నారు. నీకీ సిద్ధాంతం బాగానే అర్థమయినట్టుంది కాబట్టి, అదేమిటో గుర్తించడానికి ప్రయత్నించు.

మరోసారి పదార్థాల నిర్వచనాలను గుర్తుకు తెచ్చుకున్నాను. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం. ఇందులో యిక మిగిలింది సమవాయం. సమవాయం అనేది రెండు పదార్థాల మధ్యనుండే అవినాభావ సంబంధం. ఒక తెల్లగులాబీకీ, దానిలోని తెలుపు అనే గుణానికి మధ్యనున్న సంబంధం సమవాయం. అలాగే ఒక ఆవుకీ, ఆవుదనానికీ మధ్యనున్న సంబంధం మరొక సమవాయం. ఇందులో అనవస్థ వచ్చిపడే ప్రమాదం ఎక్కడుంది? ఒక సమవాయానికి మరొక సమవాయం అవసరమా?

ఎడమ నేను: సరైన తోవలోనే వెళుతున్నావ్. సరే, కొంచెం సాయం చేస్తాను. తెల్లగులాబీ అనేది ఒక పదార్థం. దానిలోని తెలుపు అనే గుణం మరొక పదార్థం. అవునా?

నేను: అవును.

ఎడమ నేను: వాటి మధ్య సమవాయం, అంటే అవినాభావ సంబంధం ఉందా?

నేను: తెల్లదనానికీ గులాబీకీ అవినాభావ సంబంధం ఎక్కడుంది? గులాబీ ఎర్రగా కూడా ఉండవచ్చు కదా? అలాగే తెలుపు రంగు మరెన్నో ద్రవ్యాలకీ ఉంటుంది.

ఎడమ నేను: నువ్వంటున్న ‘తెల్లదనం’, ‘గులాబీ’ అనేవి రెండు జాతులు, అంటే సామాన్యాలు. వాటి మధ్య అవినాభావ సంబంధం లేదు నిజమే. నేను చెపుతున్నది ఒక తెల్లగులాబీ అనే ప్రత్యేకమైన ద్రవ్యం గురించి. దాని గుణం తెలుపు. ఆ గుణానికీ ఆ తెల్లగులాబీకి మధ్యనున్న సంబంధం అవినాభావమే కదా.

నేను: అర్థమయింది. ఒక ప్రత్యేకమైన ద్రవ్యాన్ని తీసుకుంటే, దానికీ దాని గుణానికీ ఉన్నది అవినాభావ సంబంధమే.

ఎడమ నేను: దానినే వైశేషికులు సమవాయం అన్నారు. సరే, ఆ సమవాయానికి ఒక పేరు పెడదాం. దాన్ని ‘తె-తెగు’ సమవాయం అందాం, అంటే తెలుపు-తెల్లగులాబీ మధ్యనున్న సంబంధం. వైశేషికుల ప్రకారం ఈ ‘తె-తెగు’ అనే సమవాయం కూడా ఒక పదార్థమే, అవునా?

నేను: అవును.

ఎడమ నేను: మరి…

మళ్ళీ బల్బు వెలిగింది!

నేను: మరి తెల్లగులాబీ అనే పదార్థానికీ, ‘తె-తెగు’ అనే పదార్థానికీ మధ్యనున్న సంబంధం ఏమిటి? అదికూడా అవినాభావ సంబంధమే కదా! అంటే వాటి మధ్య మరొక సమవాయ సంబంధం ఉండాలన్నమాట. దాన్ని ‘తెగు-తె-తెగు’ అనుకుంటే, అది కూడా ఒక పదార్థమే. అప్పుడు మళ్ళీ తెల్లగులాబికీ దానికీ మధ్య, ‘తెగు-తెగు-తె-తెగు’ అనే మరొక సమవాయ సంబంధం ఉండాలి. ఇలా అనంతమైన సమవాయాలు ఏర్పడతాయి!!

ఎడమ నేను: అదీ లెక్క! ఈ దోషాన్ని ఎత్తిచూపి, సమవాయం అనే ఒక పదార్థం ఉందన్న ప్రతిపాదన తర్క సమ్మతం కాదని అద్వైతులు అభ్యంతరం లేవనెత్తారు. [5] దాన్ని ఎదుర్కోడానికి సామాన్యం విషయంలో ఉపయోగించిన చిట్కానే సమవాయానికి కూడా ఉపయోగించాల్సి వచ్చింది వైశేషికులకు.

నేను: అంటే సమవాయానికి మరొక పదార్థంతో సంబంధం ఉండనక్కర లేదనా?

ఎడమ నేను: అవును. సమవాయ సంబంధం స్వతస్సిద్ధమనీ, దాన్ని గుర్తించడానికి వేరే మరొక సంబంధం అవసరం లేదనీ వారు వాదించారు.[6]

నేను: అయితే వైశేషిక సిద్ధాంతం ప్రకారం సామాన్యం, సమవాయం అనే రెండు పదార్థాలూ స్వతస్సిద్ధాలన్న మాట. అంటే వాటిని గుర్తించడానికి వేరే పదార్థాల అవసరం లేదనే కదా.

ఎడమ నేను: అవును. అనవస్థాదోషం అంటే ఏమిటో, దానికి వైశేషికులు ఎలాంటి పరిష్కారం కనిపెట్టారో బాగా అర్థమయిందా?

నేను: ఆఁ, అర్థమయింది. నువ్వు నన్ను భలే మోసం చేసావ్!

ఎడమ నేను: నేనా! మోసమా!

నేను: అవును. ఆత్మసూచన వల్ల అనవస్థ ఏర్పడుతుందన్నావు. కానీ నిజానికది అనవస్థను తప్పిస్తోంది.

ఎడమ నేను: అదెలా? సామాన్యానికి తిరిగి సామాన్యం, సమవాయ సంబంధానికి తిరిగి మరొక సమవాయ సంబంధం – ఇదొకరకమైన పునరావృతం (Recursion). ఒక విషయాన్ని తిరిగి దానికే వర్తింపజేయడం. అది ఆత్మసూచకమైన ప్రక్రియ. దాని వల్లనే కదూ యిక్కడ అనవస్థా దోషం ఏర్పడుతున్నది?

నేను: అవును. కానీ దానికి పరిష్కారం ఏమిటి చెప్పారు? సామాన్యం, సమవాయం అన్నవి స్వతస్సిద్ధాలని. అంటే అవి తమంత తాముగా గుర్తించబడే పదార్థాలన్నమాట. అంటే అవి ఆత్మసూచకాలే కదా!

ఎడమ నేను: నిజమే, ఈ రకంగా ఆలోచిస్తే, సమస్య సృష్టించిందీ పరిష్కరించిందీ కూడా ఆత్మసూచనే అన్నమాట! ఇప్పటి దాకా నేనలా ఆలోచించనే లేదు సుమీ! నీ బుద్ధి బాగానే పదునెక్కుతోంది! సరే, తమంత తాముగా గుర్తుంచబడుతూ, ఇతర పదార్థాలను గుర్తించేలా చేసే మరికొన్ని పదార్థాలు ఏమైనా ఉన్నాయేమో చెప్పు చూద్దాం.

“విశ్వభ్రాడ్ భ్రాజో …” పొద్దున్న విన్న ఋగ్వేద మంత్రం గుర్తుకువచ్చింది!