[తే. అక్టోబర్ 10, 1977న విజయనగరంలో ‘ఎందుకు పారేస్తాను నాన్నా, కథ ఎలా రాసేవు నాన్నా?’ అని అడిగిన తులసి ప్రశ్నకి చాసో చెప్పగా చాగంటి తులసి రాసినదీ వ్యాసం. ఈ జ్ఞాపిక మార్చ్ 2008 చినుకు పత్రికలో ప్రచురించారు. ఎందుకు పారేస్తాను నాన్నా! కథను గత సంచికలో పరిచయం చేసిన జంపాల చౌదరిగారు తులసిగారి నుండి ఈమాటలో పునఃప్రచురించడానికి అనుమతి తీసుకొన్నారు. వారికి, తులసిగారికి మా కృతజ్ఞతలు. – సం.]
నాకు బాగా నచ్చిన కథల్లో ‘ఎందుకు పారేస్తాను నాన్నా‘ ఒకటి. ఇది రాద్దామన్న భావం నాకు కలిగిన మూడు సంవత్సరాల తర్వాత కథని రూపొందించడం జరిగింది. ఈ మూడు సంవత్సరాల కాలంలోనూ కనీసం ఐదారుసార్లు కొంతదాకా రాస్తూ వచ్చి నేననుకున్న పద్ధతిలో కథ రాలేదన్న అసంతృప్తి చేత రాసిందాన్ని చించివేస్తూ రావడం జరిగింది. ఆ ఐదారుసార్లు రాసిన కథ పూర్తి చేస్తే సర్వసామాన్యంగా మంచి కథ కిందే లెక్కబెట్టడానికి వీలవుతుంది. కాని నేనూహించిన, ఉద్దేశించిన కుర్రవాడి పాత్ర వాటిలో బహిర్గతం కాలేదు. అందుచేత వాటిని చించి పారవేయడం జరిగింది.
నన్నొక కుర్రవాడు ఇబ్బంది పెట్టడం ప్రారంభించేడు. ఆ కుర్రవాణ్ణి నేను ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళోనే చూస్తూ వచ్చేను. మూడో ఫారం పాసయిన తర్వాత తల్లిదండ్రులు చదువు చెప్పించలేక చదువు మానిపించేయడం దేశం పొడుగునా సర్వసాధారణమైన విషయంగా ఉండేది. నాలుగో ఫారం నుంచి నెలకు ఐదుంపావలా జీతం హైస్కూళ్ళలో పుచ్చుకునేవారు. బస్తా బియ్యం 8 రూపాయలకి అమ్మేవాళ్ళు. 30 రూపాయల లోపు జీతాలతో అనేకమంది బతుకుతూ ఉండేవారు. 30 రూపాయలే గుమస్తాకి జీతం. ఎలిమెంటరీ స్కూలు మాస్టర్లకి 20 రూపాయలకి అటూ ఇటూ జీతం. ఇది 1940 సంవత్సరానికి అటూ ఇటూ పరిస్థితి. ఆ చిన్నజీతగాళ్ళు వాళ్ళ పిల్లలకి మూడో ఫారము దాటి చదువు చెప్పించడం చాలా గడ్డుగా ఉండేది. థర్డు ఫారం పాసయ్యేక హయ్యరుగ్రేడు ట్రైనింగు అని ఓ దిక్కుమాలిన ట్రైనింగు ఉండేది. ఎలిమెంటరీ అయ్యవారి కొడుకు ఎలిమెంటరీ అయ్యవారు అయ్యేవాడు. కొంతమంది గడుసువాళ్ళు బి. ఎస్. ఆర్. రైల్వేకి పోయి ఇంజనులోకి బొగ్గు వేయడానికి, వర్క్‌షాపులో సహాయక పనులు చేయడానికి రైల్వేని పట్టుకుపోయేవారు. ఈ బాపతు కుర్రవాళ్ళని నా చిన్నప్పట్నించీ వందలకొద్దీ నేనెరుగుదును. ఈ ఎరిగిన వందలకొద్దీ కుర్రవాళ్ళని మొత్తం చేసి ఓ కుర్రవాడిగా రూపొందించి వాడికి కథలో ప్రాణం పోసి తెలుగు వారందరికీ ఎదురుగుండా చూపెట్టాలని ఎంత కాంక్షించినా కృతకృత్యుణ్ణి కాలేకపోయాను.
నాకు లోకంలో మన కళ్ళ ఎదుట జరిగిన ఏ సంఘటననీ తీసుకుని కథ రాసే పద్ధతి లేదు. అలాగానే లోకంలో మన ఎదురుగుండా కనపడే ఏ మనిషినో దృష్టిలో పెట్టుకుని కథలో పాత్రపోషణ చెయ్యడం కూడా నా పద్ధతిలో లేదు. సామూహికంగా మనకు కనపడే అనేకమందిని పరిశీలించి, ఆ మనుషులందరిని మొత్తం చేసి అందులోంచి ఒక కాల్పనిక వ్యక్తిని సృష్టించి, ఆ వ్యక్తిని కథలో మలచటం నా పద్ధతి. ఆ కథకు కావలసిన సన్నివేశాలో, సంఘటనలో లోకంలో జరిగినవి కాక నాకు నేను సృష్టించుకోవడమే నా పద్ధతి.
తల్లిదండ్రులు చదువు మానిపిస్తే ఆ చిన్న కుర్రవాని మానసిక ప్రవృత్తిని పట్టుకోవడం కోసం ఎన్నిసార్లు ఆలోచించినా నా బుద్ధికి తోచలేదు. ఒక్కొక్క సన్నివేశాన్ని సృష్టించుకొని, గంటల కొలదీ చుట్ట కాలుస్తూ కూర్చుని, ఎంత ఆలోచించినా ఆ పాత్ర నా చేతికి చిక్కలేదు. మూడు సంవత్సరాలు దాటేక ఓ వేసవి కాలంలో నర్సాపురం నేను వెళ్ళడం తటస్థించింది. అక్కడ మా పినమావగారు కీర్తిశేషులు శ్రీ పోడూరి సూర్యనారాయణగారి ఇంట్లో నేను ఉదయాన్నే స్నానం చేసి, సావిట్లోకొచ్చి పడక్కుర్చీలో కూర్చున్నాను వాళ్ళిచ్చిన కాఫీ తాగుతూ. ఉదయం ఏడు గంటలు అయిపోయిన కారణం చేత టైలర్ హైస్కూలుకి విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు రోడ్డు మీంచి పోతూ ఎదురుగా కనపడ్డారు. మావాళ్ళ ఇళ్ళు హైస్కూలు తోవలో ఉండడం, ఆ రోడ్డు ఎదురుగా ఉండడాన్ని నాకు హైస్కూలుకు వెళుతున్న పిల్లల కోలాహలమంతా కనపడగానే నేను రూపకల్పన చేద్దామనుకున్న కుర్రవాని పాత్ర మనసులో మసలడం మళ్ళా మొదలుపెట్టింది. ఆ విధంగా ఆ కుర్రవాడి పాత్ర కోసం ఎన్నిసార్లో ఆలోచించేను కాని ఆ రోజున నా ఆలోచనలో మెరుపులాగ ఒక భావం కలిగింది. అదేమిటంటే ఆ కుర్రవాడు తన తోటి విద్యార్థులకు తన మొహం చూపించలేడని, వాళ్ళెవరు కనపడ్డా చిన్నబోతాడని, హైస్కూలు పరిసర ప్రాంతాలకి వెళ్ళడానికి బాధ పడతాడని ఆలోచన వచ్చింది. ఆ కుర్రవాడు వీధిమొహం చూడకుండా లోపల వంటింట్లోకి పోయి చెల్లిని ఆడించుకుంటూ బడి పెట్టేవేళ నాకంటికి కనపడ్డాడు. వాణ్ణి రోడ్డు మీదకి, స్కూలు పరిసరానికి పంపితే వాడి పాత్ర బహిర్గతమైపోయింది.
వెంటనే కలం కాగితాలు తీసి ఆ కూర్చున్న ఈజీ ఛైర్లోనే కథ రాయడం ప్రారంభిస్తే కథంతా తృటికాలంలో మెదడులో సంపూర్ణమైపోయింది. కథను రాయడానికి చేతికి వేగం లేదు. కథ ముందుకు పర్గెడుతూ వుంటే రాత వెనకబడిపోతూ వచ్చింది. మరొక అవాంతరం వచ్చింది. మా పినమామగారు ప్లీడరుగారు అయిన కారణం చేత ఆయన వాకిట్లోకి కొంతమంది పార్టీలు వచ్చి వాళ్ళ వ్యవహారాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టేరు. ఇది అక్కడ రాసుకోవడం సాధ్యపడదని తిన్నగా గోదావరి గట్టంట మైలు దూరం షైరు వెళ్ళి గోదావరి పక్కన ఉన్న ఒక కొబ్బరి తోటలో నక్కేరు చెట్టు నీడలో కూర్చుని కథ పూర్తి చేశాను. కథ కాగితాల మీద అక్షరం అక్షరం రాయడం గంట పైనయింది కాని కథ మెదడులో మొదటినుంచి చివరి వరకూ క్షణంలో పూర్తి అయిపోయి వుంది.
ఆ కుర్రవాణ్ణి తండ్రి చుట్టలు తెమ్మని హైస్కూలు పక్కనున్న కిళ్ళీ కొట్టుకు పంపించడంతో ఆ కుర్రవాని మానసిక పరిస్థితి అంతా చిత్రీకరించడానికి సావకాశం వచ్చింది. కథ రాస్తున్నప్పుడు ఆ కుర్రవాని ఆవేదన, స్థితి పేరా పేరాకూ వృద్ధి పొందుతూ వచ్చింది. తండ్రి వచ్చిన తర్వాత ఆ కుర్రవాని పరిస్థితి సంభాషణాత్మకంగా రాస్తూ ఉంటే నా కళ్ళు బాగా చెమర్చాయి. కథ రాస్తున్నంత సేపూ నేనే ఆ కుర్రవాడిగా, వాడి దృష్టిలోంచి, వాడి బుద్ధిలోంచి, వాడి బాధలోంచి రాసిన కారణంగా వాడి బాధ నన్ను పట్టుకుని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కథ పూర్తయిన తర్వాత రాస్తున్నప్పుడు లేని ఉద్వేగం మళ్ళా చదువుతూ ఉంటే నాకు అనేకరెట్లు అధికమైపోయింది. కథ నేను కోరుకున్న పద్ధతిలో వచ్చిందనే ఆత్మవిశ్వాసం కలిగింది. పాతిక కథలు రాయడం ఎందుకు? ఇటువంటి కథ ఒకటి రాస్తే చాలు అని నా మనసు నాకు ఆ సమయంలో చెప్పింది.
నేను గొలుసుకట్టుగా రాస్తాను. అది నాకు తప్ప ఇంకొకరికి బోధపడదు. అందుచేత ఏ అక్షరానికా అక్షరం చొప్పున విడదీసి ఫెయిర్ కాపీ చేసేను. ఫెయిర్ కాపీ చేస్తున్నప్పుడు చిన్న చిన్న మార్పులు ఒకటి రెండు వచ్చేయేమో కాని చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. నేనింటి కొచ్చేసరికి దగ్గర దగ్గర పన్నెండు గంటలు అయింది. భోజనం చేసి ఆ కథని బహుశా పది పదిహేను సార్లు నాకు నేను చదువుకుని ఉంటాను. ఎక్కడన్నా ఏ లోట్లన్నా ఉన్నాయేమోనని బహునిశితంగా విమర్శనాదృష్టితో పదం పదం వాక్యం వాక్యం పట్టిపట్టి చదువుకున్నాను.
ఆ సాయంకాలం ఆ కథని పట్టుకుని వీధిలోకి బయల్దేరాను. నర్సాపురంలో సాహిత్యంలో నిష్ణాతులైన కొందరు పూజ్యులు, సాహిత్యాభినివేశనం ఉన్న పెద్దలు, గేయాలు పద్యాలు రాస్తున్న కుర్రవాళ్ళు పది పదిహేనుమంది మిత్రులు నాకు ఉండేవారు. మేమంతా సాయంకాలం రైల్వేస్టేషన్ ప్రాంతానికి షికారుకు వెళ్ళి అక్కడ ఒక పంటకాలువ గట్టు మీద కూర్చుని వ్యాసంగం చేసేవాళ్ళం. వారందరిలో వయస్సు చేత నాకన్నా పెద్దవారు, బహుభాషాకోవిదులు, ముఖ్యంగా సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు సాహిత్యాలు బాగా తరచి చూసినవారు అయిన శ్రీ ఆలమూరు రాజగోపాలరావుగారు ఉండేవారు. ఆయన హైస్కూలు ఉపాధ్యాయుడిగా, కాలేజీ అధ్యాపకుడుగా బహు సమర్ధుడు. సాహిత్యం ఎక్కువైపోయిన కారణం చేత ఆయన కవిత్వం ప్రారంభంలో చెప్పినా, పెద్దయేక దాని మీదనుండి మనస్సు తప్పిపోయి నాలుగు భాషల్లో సాహిత్యాధ్యయనంలో నిమగ్నులైపోయేరు. ఆయన సమక్షంలో ఆ సాయంకాలం పది పన్నెండుగురు సాహితీ మిత్రుల మధ్య ఆ కథని నేను చదవగా ఆ కథలో కరుణరసం అందర్నీ ఉద్విగ్నుల్ని చేసింది.
శ్రీ రాజగోపాలరావుగారిని మేమంతా మాస్టరుగారు అనేవాళ్ళం. మేష్టరుగారు ఆ కుర్రవాని పాత్రలో మునిగిపోయి ఏమాటా ఆడకుండా పావుగంట పైగా ఉండిపోయేరు. మిగతా మిత్రులంతా వారి వారి అభిప్రాయాలు ఎన్ని చెప్తున్నా ఆయన మాట్లాడలేదు. ఆఖరికి ఆయన నోరు విప్పి, “నాకు మాటలు రావడంలేదు. ఆ కుర్రవాడు నాకు కనపడుతున్నాడు. ఆ కుర్రవాడు ఎదురుగుండా వస్తే వాడికి స్కాలర్‌షిప్పు యిస్తాను. మీరు కథలో మీరు ఒకమాట వెయ్యక్కర్లేదు. ఒకమాట తియ్యక్కర్లేదు. నన్ను ఇంత సంతృప్తి పరిచి నా మనసును కలిచివేసిన కథ ఈమధ్య తెలుగులో చదవలేదు” అని నన్ను అభినందించారు.
నాకు ఆయన ఇచ్చిన అభిప్రాయమెప్పుడూ శిరోధార్యంగా ఉండేది. ఆయన ఏదైనా వ్యతిరేకత చెపితే సంతోషంగా మార్చుకునేవాణ్ణి.
ఆ మర్నాడు ఉదయమే పొస్టుకి ఆ కథని భారతి సంపాదకులకి పంపించేను. భారతి ఆ రోజుల్లో ఏడో తారీఖ్ఖో, ఎనిమిదో తారీఖ్ఖో వస్తూ ఉండేది. నేను పదిహేనో తారీఖున పోస్టు చేసినట్టు జ్ఞాపకం. ఆ రాబోయే నెలకాక పై నెలలోనో ఆపై నెలలోనో అది భారతిలో వస్తుందని పంపించేను. ఆ రోజుల్లో భారతికి కీర్తిశేషులు నర్సింహాచార్యులు సంపాదక బాధ్యత నిర్వహిస్తూ ఉండేవారు. నా పేరుతో రాసిన ఆ కథ చూడగానే వెంటనే చదివి కంపోజింగు కిచ్చిన కథల్లో ఓ కథని తీసివేసి ఆ నెలలోనే భారతిలో ప్రచురించేరు. ఆ విషయాన్ని ఆచార్యులవారు తర్వాత నాకు చెప్పగా వయస్సులో చాలా చిన్నవాడనైన కారణం చేత ఆచార్యులవారు అలా వెయ్యడం నాకు చాలా ఉత్సాహాన్నిచ్చి గర్వాన్ని కలిగించింది. భారతి ప్రతి అచ్చు అయి రాగానే సంచికను పట్టుకుని మిత్రులు శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు ఇంటికి వెళ్ళేరు. ఆ రోజుల్లో శ్రీ కుటుంబరావు గారు ఆంధ్రపత్రిక, సచిత్రవారపత్రిక ఉపసంపాదకులుగా ఉండేవారు. రాత్రి భోజనం చేసి చాసోగారి కథ వుంది చదువుకుందామని ఆయన, ఆయన శ్రీమతిగారు వగైరా వారి కుటుంబసభ్యులంతా వచ్చి కూర్చున్నారు. శ్రీ కుటుంబరావుగారే చదివేరట. కథ చివరికి వచ్చేసరికి కళ్ళనిండా నీళ్ళు నిండిపోయి గొంతుక గాద్గదికమైపోయి చాలా ఇబ్బంది పడి చివరభాగం చదివేరుట. ఆ విషయం ఆయన నేను చెన్నపట్నం వెళ్ళినప్పుడు చెపితే చాలా ఆనందం కలిగింది.
ఈ కథ ప్రచురించిన కొద్ది రోజుల్లో కీర్తిశేషుడు శ్రీరంగం నారాయణబాబు ఒక సమావేశంలో ఈ కథను ఉల్లేఖించి శ్లాఘిస్తూ మాట్లాడి కథాంతంలో చుట్టలు మానేస్తానని తండ్రి అనుకున్నట్టు రాయడం తనకి నచ్చలేదని ఖండించేడు. కాని, వెంటనే కీర్తిశేషుడు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి నారాయణబాబుని తీవ్రంగా నిరసించేడు. కథారచనకి నన్ను శ్లాఘిస్తూ ఉత్తరం రాసేడు. ఇదంతా అయ్యేక నేను విజయనగరం రాగా మిత్రుడు శ్రీ రోణంకి అప్పలస్వామి ఈ కథకి నూటికి నూరు మార్కులు ఇచ్చేడు. అతను కాలేజీ అయ్యవారు కదా! ఈ మార్కుల్లోనే తన అభిప్రాయాన్ని చెప్పేడు.
ఈ కథ ప్రచురణ అయిన తర్వాత మమ్మల్ని ఎరిగిన కుటుంబాలలో, ముఖ్యంగా మూడు కుటుంబాలలో ఇదే పద్ధతిని కుర్రవాడి చదువు ఆపివెయ్యడం జరిగిన కారణం చేత నేను వాళ్ళ మీదే ఈ కథ రాసేనని చెప్పుకున్నారు. అయితే వాళ్ళకీ, నేను ఈ కథలో రాసిన వివరాలకీ ఏమాత్రం సంబంధం లేదు. అయినా వాళ్ళు ఆ విధంగా మూడు ఊళ్ళల్లో చెప్పుకున్నారు. వాస్తవానికి నేను ఆ కథ చదువు మానిపించిన పిల్లల్నందరినీ ఉద్దేశించే రాసేను.
కథ సామాన్య పాఠకులని ఉద్దేశించే రాస్తాము. ఈ కథను చదవవలసిన వారు సామాన్యులే. పై వివరాలన్నీ ఎందుకిచ్చేనంటే – సామాన్యుడు మెచ్చుకుంటాడు. ఆ మెప్పు రచయితకి ఘనమైనదే. కాని సామాన్యుడికి శిల్పం అవగతం కాదు. కథ బాగుంటే ఎందుకు బావున్నది సామాన్యుడికి తెలియదు. కథ ఎందుకు బాగులేనిది అలాగ్గానే తెలియదు. సాహిత్యంలో నిష్ణాతులైన విమర్శకులు ఏ అభిప్రాయాన్ని ఇస్తారో ఆ అభిప్రాయమే సరియైనది అవుతుంది. వాళ్ళను మెప్పించేది, సామాన్య పాఠకుణ్ణి మెప్పించేది అయిననాడే రచన ఉత్తమ సాహిత్యమవుతుంది.
నేను పాఠకుల కోసమే రాసినది ప్రచురణ చేసినా నాకు సన్నిహితులైన కొద్దిమంది పండితుల అభిప్రాయం కోసం ఎదురు చూసేవాణ్ణి. ముఖ్యంగా శ్రీ రోణంకి అప్పలస్వామిని మెప్పించి ఏ కథ రాసినా చాలు అనుకునే వాణ్ణి. అప్పట్లో అనగా ప్రారంభంలో ఆయన మెచ్చుకోని కథ నేను ప్రచురించలేదు. ఒకటీ అరా ప్రచురించినా ఆయన మెప్పు కోసం ఎదురు చూసేవాణ్ణి. విశ్లేషించి ఏదీ చెప్పకపోయినా శ్రీ రోణంకి అప్పలస్వామి ఇందులో ఏదో పొరపాటు ఉంది, సరిగ్గా లేదని ఎవరికి చెప్పినా అందులో ఏదో పొరపాటు ఉండడం ఖాయమే.