ఎగురు, నీ రెక్కలు కుట్టను
ఎగురు, నీ కళ్ళు పొడవను
ఎగురు, నీకు అడ్డు పడను
పిట్టలా ఎగురు
దాని మీదికి గద్దలా ఎగురు
గద్ద పదును గోళ్ళలా ఎగురు
గోళ్ళ మధ్య కీచు అరుపులా ఎగురు
నా ప్రాణంలా అభిమానంలా ఎగురు
నీ కాలికి దారం కట్టను
దారం చివర వేలాడను
నిన్ను వెంబడించను
నీ దారుల పటాలు గీయను
పటాలు అమ్ముకు బతకను
నువ్వు ఎగురు నిర్భయంగా
నిస్సంకోచంగా
గగన తలాన ఒక వైపని కాకుండా
సకల దిశలా పరుచుకునే కాంతిలా
నిరాకారమై నిర్గుణమై
గొంతుక దాటని బాధలా
పుస్తకంలో చేరని గాథలా
సముద్రం లేని ఘోషలా
కాఫ్కా చెప్పలేక పోయిన కథలా
ఎండలో పిచ్చి వాని రోదనలా
మునెమ్మను వదిలేసిన కోకలా
ఈ ఒక్క క్షణం లోని నాలా
దయ్యం వంటి
పద్యం పట్టిన హృదయంలా