మంటో కథలు: వంద వాట్‌ల బల్బు

కైసర్ పార్కు బయట, ఆ చౌరస్తాలో టాంగాలన్నీ ఆగుండే చోటు అది. అతను ఒక కరెంటు స్తంభానికి ఆనుకొని నుంచుని తనలోతనే అనుకున్నాడు: ‘ఏమిటీ ఏదో తెలియని ఈ దిగులు, ఈ ఒంటరితనం?’

రెండేళ్ళ కిందటవరకూ కళకళలాడుతూ ఉండే ఈ పార్కు ఇప్పుడు కళాకాంతీ లేకుండా వెలవెలబోయినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇక్కడ ఆడామగా ఫాషన్‌గా రంగురంగుల బట్టల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కనిపించేవారు. ఇప్పుడేమో మాసిపోయి, ముతకబారిన బట్టల్లో వేసారిపోయినట్టు తిరుగుతున్నారు. బజారులో చాలామంది జనం ఉన్నారు, కానీ అప్పట్లోలా జాతర జరుగుతోందా అన్నట్టు అనిపించే హడావిడి లేదు. చుట్టుపక్కల సిమెంటుతో కట్టిన బిల్డింగులు కూడా తమ రూపాన్ని కోల్పోయాయి; తలలు తెగి, మొహాలు వెలిసిపోయి అవి ఒకదాన్ని ఒకటి ఎండిపోయిన కళ్ళతో చూసుకుంటున్నాయి, అక్కడికి అవేవో విధవలు అయినట్టు.

అతడు హైరానాపడ్డాడు. అప్పట్లోలా మొహాలకి పౌడరు లేదేం, సిందూరం ఎక్కడికి ఎగిరిపోయింది, ఆ గొంతులు ఎక్కడికి మాయమైపోయాయి? అతడు చూసినవన్నీ, విన్నవన్నీ? ఇవ్వన్నీ ఎప్పుడో జరిగిన గతంలోనివి కావు. అతడు నిన్నగాక మొన్నేగా… రెండేళ్ళని కూడా గతమంటారా ఎవరైనా?… ఒక ఫర్మ్ మంచి జీతమిస్తూ ఇక్కడకి పిల్చినప్పుడు అతడొచ్చాడు, కలకత్తానుండి. కైసర్ పార్కులో ఒక గది అద్దెకు తీసుకుందామని ఎంతగానో ప్రయత్నించాడు కానీ దొరికించుకోలేకపోయాడు, ఎన్ని సిఫార్సులు పట్టుకొచ్చినా. ఇప్పుడేమో చెప్పులు కుట్టుకునేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు ఆ ఫ్లాటులని, గదులని కబ్జా చేసుకొన్నారని గమనించాడు.

ఎక్కడ ఒక గొప్ప ఫిలిమ్ కంపెనీవాళ్ళ ఆఫీసు ఉండేదో అక్కడ ఇప్పుడు బొగ్గుపొయ్యిలు మండుతున్నాయి. ఒకప్పుడు నగరంలోని పెద్దపెద్దవాళ్ళంతా ఎక్కడ కలిసేవాళ్ళో అక్కడ ఇప్పుడు చాకలివాళ్ళు మురికి బట్టలు ఉతుకుతున్నారు.

రెండేళ్ళల్లో ఇంతటి పెనుమార్పా!

అతడు ఆశ్చర్యపోయాడు. కొంత వార్తాపత్రికల ద్వారా, కొంత ఆ నగరంలో ఉన్న స్నేహితులు చెప్పినదానిని బట్టి, అతడికి ఆ మార్పు తుఫానులా ఎలా వచ్చిందో తెలుసు; ఎలాంటి తుఫాను వచ్చిందో తెలుసు. అది ఏదో విచిత్రమైన తుఫాను అయ్యుండాలని, అది ఆ బిల్డింగుల రంగురూపులను కూడా పీల్చుకొని పట్టుకెళ్ళిపోయిందని అతడు అనుకున్నాడు. మనుషులు మనుషులని చంపారు. ఆడవాళ్ళని చెరిచారు. భవనాల్లోని ఎండిన కట్టెలు, నోరులేని ఇటుకలను కూడా అదే చేశారు. ఆ తుఫానులో ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టారని, వారి రొమ్ములను కోశారని విన్నాడు. అతడు చుట్టుపక్కల చూస్తున్నవన్నీ నగ్నంగా, ప్రాణం లేకుండా తెగి పడున్నాయి.

అతడక్కడ ఆ కరెంటు స్తంభానికి ఆనుకొని తన దోస్తు కోసం ఎదురు చూస్తున్నాడు. అతనొచ్చి తనకో బస బందోబస్తు చేస్తాడు. అతడు తన దోస్తుతో అన్నాడు, “నువ్వు కైసర్ పార్కు దగ్గరకు రా, టాంగాలు ఆగే చోటుకి. నేను అక్కడే ఎదురుచూస్తుంటాను.”

రెండేళ్ళక్రితం ఉద్యోగరీత్యా అతడు వచ్చినప్పుడు టాంగాలుండే ఆ అడ్డా చాలా పేరున్న ప్రదేశం. నగరంలో అన్నింటికన్నా హుందాగా ఉండే, అన్నింటికన్నా బాగుండే టాంగాలు అక్కడ నిలబడి ఉండేవి. జల్సా చేసుకోవడానికి కావలసిన సరంజామా అంతా అక్కడే దొరికేది. దగ్గర్లోనే మంచి మంచి రెస్టారెంట్లు, హోటళ్ళు ఉండేవి. మంచి చాయ్, పసందైన భోజనం, ఇంకా వేరే వేరే సౌకర్యాలన్నీ ఉండేవి. నగరంలోని పెద్ద పెద్ద దళారులు, బ్రోకర్లందరూ అక్కడ చేరేవారు. డబ్బూ మందూ నీళ్ళల్లా పారేవి.

రెండేళ్ళ కిందట అతడు తన దోస్తుతో తెగ జల్సా చేశాడు. ప్రతి రాత్రీ ఎవరో ఒక అందమైన అమ్మాయి వారి కౌగిలిలో ఉండేది. యుద్ధం కారణంగా స్కాచ్ నిషేధించబడినప్పటికీ, డజను బాటిళ్ళు కావాలన్నా ఒక్క నిముషంలో దొరికేవి.

టాంగాలు ఇప్పుడు కూడా ఆగున్నాయి గానీ వాటి మీద అప్పటి చమ్కీలు లేవు, ఆ కుచ్చులు లేవు, పాలిష్ చేసిన రాగి తాపడాల చమక్కులు లేవు. అవన్నీ కూడా మిగతావాటిలానే ఎగిరిపోయాయి.

అతడు గడియారంలో సమయం చూసుకున్నాడు; సాయంకాలం ఏడయ్యింది.

ఫిబ్రవరి నెల. సాయంకాలపు నీడలు చిక్కబడ్డాయి.

అతడు మనసులోనే తన దోస్తుని ఉతికి ఆరేశాడు. కుడిచేతి వైపున్న జనంలేని హోటల్లో, మోరీ నీళ్ళతో చేసే చాయ్ తాగడానికని అతడు వెళ్ళబోతుంటే ఎవరో అతడిని మెల్లిగా పిల్చారు.

అతడు తన దోస్తే వచ్చాడనుకొని వెనక్కి తిరిగిచూస్తే ఒక అపరిచితుడు నిలుచొని ఉన్నాడు. మామూలు మొహం. మామూలు రూపు. గంజిపెట్టిన కొత్త సల్వారు, దానికి ఇంకా ఎక్కువ ముడతలు పడే అవకాశమే లేదు. నీలిరంగు కమీజు వేసుకున్నాడు, అది లాండ్రీకి వెళ్ళాలని తపిస్తున్నట్టుంది.

అతడు అడిగాడు, “క్యా భాయ్, పిలిచావా?”

అతడు మెల్లిగా జవాబు ఇచ్చాడు, “జీ హాఁ.”

అతడు ఎవరో బికారివాడు, బిచ్చం అడుగుతున్నాడని అనుకొన్నాడు. “ఏం కావాలి?”

అతడు అలానే జవాబిచ్చాడు, “జీ… ఏం లేదు.”

ఆపైన కొంచెం దగ్గరగా వచ్చి అన్నాడు, “ఏమన్నా కావాలా మీకు?”

“ఏంటి?”

“ఎవరన్నా ఆడ తోడూ గట్రా?” ఇలా అని వెనక్కి జరిగిపోయాడు.

అతడి గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టయ్యింది. చూడు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇతడు జనాల కోరికలను రెచ్చగొడుతూ తిరుగుతున్నాడు. అతడికి మానవత్వం మీద నమ్మకం పోయేలాంటి ఆలోచనలు కలిగాయి. ఆ ఆలోచన ప్రభావంలోనే అతడు అడిగాడు, “ఎక్కడుంది?”

అతడి ఉద్దేశ్యం ఆ బ్రోకర్‌ని ప్రోత్సహించడం కాదు. బ్రోకర్‌ వెనక్కి అడుగేస్తూ అన్నాడు, “లేదండీ, మీకు అవసరం ఉన్నట్టు అనిపించటం లేదు.”

అతడు బ్రోకర్‌ని ఆపాడు. “అది నీకెలా తెల్సు? మగాడికి ఎప్పుడూ దాని అవసరం ఉంటుంది… ఇప్పుడు నువ్వు సరఫరా చేస్తానంటున్నది. ఉరికంబం మీద కూడా దాని అవసరముంటుంది. కాలుతున్న చితిమంటల్లో కూడా…” అతడు తత్త్వవేత కాబోతూ ఆగాడు, “చూడు, అది దగ్గర్లోనే ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇక్కడ ఒక దోస్తుని కలుస్తానని మాట ఇచ్చాను…”

బ్రోకర్‌ అతని దగ్గరకు వచ్చాడు, “దగ్గరే ఉంది సాబ్, చాలా దగ్గర,”

“ఎక్కడ?”

“ఇదుగో, ఎదురుగా ఉన్న ఈ బిల్డింగులోనే!”

అతడు ఎదురుగా ఉన్న బిల్డింగుని చూశాడు. “ఇందులోనా… ఇంత పెద్ద బిల్డింగులోనా?”

“జీ హాఁ!”

అతడు సన్నగా వణికాడు. “అచ్ఛా, అయితే… నేనూ నీవెంటే రానా?”

“పదండి. కానీ నేను ముందు నడుస్తాను…” బ్రోకర్‌ ఎదురుగా ఉన్న బిల్డింగు వైపుకి నడవడం మొదలుపెట్టాడు.

అతడు ఆ బ్రోకర్‌ వెనుక నడిచాడు, మనసులో సవాలక్ష ప్రశ్నలు ముళ్ళలా గుచ్చుతున్నప్పటికీ.

పట్టుమని పది అడుగుల దూరం లేదు. మరుక్షణంలో ఇద్దరూ ఆ బిల్డింగు లోపల ఉన్నారు.

లోపలినుండి ఆ బిల్డింగు మరింత దీనావస్థలో ఉంది. అక్కడక్కడా సిమెంట్ రాలిపోయిన ఇటుకలతో గోడలు బోడిగా ఉన్నాయి. విరిగిపోయిన నీళ్ళ కుళాయిలు గోడలలోంచి పొడుచుకొచ్చి ఉన్నాయి. చుట్టూ చెత్తాచెదారం గుట్టలుగా పడుంది.

సాయంత్రం ఎప్పుడో చిక్కబడింది. గడపదాటి వాళ్ళు ముందుకెళ్ళేసరికి మొత్తం చీకటి.

వెడల్పాటి గుమ్మం దాటుకుంటూ బ్రోకర్‌ ఒకవైపుకి తిరిగాడు. అక్కడ సగం కట్టి ఆపేసిన భాగం ఉంది. ఇటుకలు నగ్నంగా ఉన్నాయి. సున్నమూ, సిమెంటు కలిసిన గట్టి గుట్టలు పడున్నాయి; అక్కడంతా కంకర పరచుకొని ఉంది.

బ్రోకర్‌ ఎక్కడానికి కష్టంగా ఉన్న మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఆగి, వెనక్కి తిరిగి అతడితో అన్నాడు, “ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.”

అతడు ఆగిపోయాడు. మెట్లు ఎక్కుతున్న బ్రోకర్‌ వైపు మెడ చాచి చూస్తే తెల్లగా వెలుతురు కనిపించింది.

క్షణాలు నిమిషాలుగా మారడంతో అతడు చప్పుడు చేయకుండా మెట్లు ఎక్కాడు. అతడు ఆఖరి మెట్టు చేరుకునేసరికి బ్రోకర్‌ గట్టిగా అరుస్తున్న అరుపు వినిపించింది, “లేస్తావా లేదా?”

ఎవరో ఆడమనిషి అంది, “చెప్పానుగా, నన్ను పడుకోనీ.” ఆడమనిషి గొంతు ఊపిరి బిగబెట్టినట్టు మెల్లిగా వినిపించింది.

బ్రోకర్‌ మళ్ళీ అరిచాడు, “నేను చెప్తున్నానుగా, లే! నా మాట వినకపోయేవంటే చూడు…”

ఆడమనిషి గొంతు వినిపించింది, “నువ్వు నన్ను చంపేయ్, కానీ నేను మాత్రం లేవను. ఖుదా కే లియె, నా మీద కాస్త దయ చూపించు.”

బ్రోకర్‌ లాలించాడు, “లే, మేరీ జాన్! మొండి చేయకు. ఇలా అయితే పూటెలా గడుస్తుంది?”

ఆడమనిషి: “నీ పూటగడవడం తగలపడిపోనీ. నేను ఆకలితో చావనైనా చస్తా. ఖుదా కే లియె, విసిగించకు… నాకు నిద్రొస్తుంది,”

బ్రోకర్‌ గొంతు మళ్ళీ కరుకుగా మారింది, “నువ్వు లేవవే… దొంగముండా, పందిముండా…”

ఆడమనిషి అరవడం మొదలెట్టింది: “నేను లేవను. లేవను. లేవను…”

బ్రోకర్‌ గొంతు తగ్గిపోయింది, “మెల్లిగా మాట్లాడు, మెల్లిగా మాట్లాడు. ఎవరన్నా వింటే… లే, లే, ముప్ఫై నలభై రూపాయలు వస్తాయి,”

“చూడూ, నీకు చేతులు జోడిస్తాను. నేను ఎన్ని రోజులనుండి మెలకువగా ఉన్నానూ… దయ చూపించు, ఖుదా కే లియె, నాపై దయుంచు…” ఇప్పుడు ఆమె గొంతులో అభ్యర్థన ఉంది.

“ఒకట్రెండు గంటలంతే, తర్వాత నిద్రపో. లేదంటే చూడు, నేను బలవంతపెట్టాల్సి వస్తుంది…” బ్రోకర్‌ గొంతు వినిపించింది.

ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. కొద్ది క్షణాలు అతడు ఊపిరి బిగబెట్టుకొని ఆఖరి మెట్టు మీద నుంచునే ఉన్నాడు; తర్వాత మెల్లిగా చప్పుడు చేయకుండా ముందుకెళ్ళి ఏ గదిలోంచి అయితే అంత వెలుగు వస్తుందో ఆ గదిలోకి తొంగి చూశాడు.

గది చిన్నగా బోడిగా ఉండి, బల్బు వెలుతురులో వెలిగిపోతోంది. నేల మీద ఒక ఆడమనిషి పడుకుని ఉంది. గదిలో రెండుమూడు గిన్నెలు ఉన్నాయి. అంతే. ఇంకేం లేవు. బ్రోకర్‌ తలుపుకి వీపు చూపిస్తూ, ఆమె దగ్గర కూర్చొని ఆమె కాళ్ళు ఒత్తుతున్నాడు.

కొంచెం సేపయ్యాక బ్రోకర్‌ ఆడమనిషితో అన్నాడు, “లే… ఇంక లే… ఖుదా మీద ఒట్టు, నువ్వు ఒకట్రెండు గంటల్లో వచ్చేస్తావు. వచ్చి నిద్రపోదువుగానీ…”

ఆమె ఒక్కసారిగా తోక తొక్కిన పామల్లే లేచింది, “సరే లేస్తాను.”

అతడు వెనక్కి జరిగిపోయాడు. ఆ క్షణంలో అతడు భయపడిపోయాడు. మెల్లిగా మెట్లు దిగిపోయాడు. పారిపోదామనుకున్నాడు. ఈ నగరంనుండే పారిపోదామనుకున్నాడు. ఈ లోకం నుండే పారిపోదామనుకున్నాడు. కానీ ఎక్కడికి?

మళ్ళీ వెంటనే, ఆమె ఎవరు? ఆమె మీద ఎందుకింత జులుం? అని ఆలోచించాడు. ఆ బ్రోకర్‌ ఎవరు? ఆ ఆడమనిషికి ఏమవుతాడు? వాళ్ళు అంత చిన్న గదిలో వంద వాట్ల కన్నా తక్కువ ఉండే ప్రసక్తే లేని అంత పెద్ద బల్బు వేసుకొని ఎందుకు ఉంటున్నారు? ఎప్పటినుంచి ఉంటున్నారు? అతడి మెదడులో ఇలాంటి ఆలోచనలూ, అతడి కళ్ళల్లో ఆ జిగేలుమంటున్న బల్బు వెలుతురూ దూరిపోయాయి.

అంత వెలుతురులో ఎవరు నిద్రపోతారు? అంత పెద్ద బల్బా!

అతడు తన ఆలోచనల్లో మునిగుండగా ఏదో అలికిడి అయ్యింది. రెండు నీడలు తన పక్కనే చేరాయని చూశాడు.

“చూసుకోండి…” బ్రోకర్‌ నీడతో అన్నాడు.

అతడన్నాడు, “చూసుకున్నా…”

“సరిగ్గా ఉందా?”

“సరిగ్గానే ఉంది.”

“నలభై రూపాయలు అవుతాయి.”

“సరే.”

“ఇవ్వండయితే.”

అతడు ఆలోచించుకొని, అర్థం చేసుకొనే పరిస్థితిలో లేడు. జేబులో చేయి వేసి, కొన్ని నోట్లు తీసి బ్రోకర్‌కి ఇచ్చాడు, “చూసుకో ఎంతుందో…”

ముందు నోట్లు ఫెళఫెళమన్నాయి. తర్వాత బ్రోకర్‌ అన్నాడు, “యాభై ఉన్నాయి.”

అతడన్నాడు, “యాభయ్యే, ఉంచుకో…” అతడికి ఒక పెద్ద రాయి ఎత్తి ఆ బ్రోకర్‌ నెత్తినేసి కొట్టాలనిపించింది.

బ్రోకర్‌ అన్నాడు, “అయితే, తీసుకెళ్ళండి. కానీ చూడండి, దీన్ని విసిగించకండి. ఒకట్రెండు గంటల తర్వాత ఇక్కడే వదిలిపెట్టండి.”

అతడు ఆ పెద్ద బిల్డింగు నుండి బయటకు వచ్చేశాడు.

బయట ఒక టాంగా నిలబడి ఉంది. అతడు ముందు కూర్చున్నాడు. ఆమె వెనుక కూర్చుంది.

బ్రోకర్‌ సలాము చేశాడు. అతడికి ఒక పెద్ద రాయి ఎత్తి ఆ బ్రోకర్ నెత్తినేయాలని మళ్ళీ అనిపించింది.

అతడు దగ్గర్లోనే, జనం ఎక్కువగా లేని ఒక హోటల్‌కు ఆమెను తీసుకెళ్ళాడు.

అతడు తన ఆలోచనలను సాఫు చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఆమె వైపు చూశాడు. ఆమె తలనుండి పాదాల వరకూ పాడైపోయి ఉంది. కనురెప్పలు వాచిపోయి ఉన్నాయి. కళ్ళు వాలి ఉన్నాయి. భుజాలనుండి నడుము పైభాగం మొత్తం వంగిపోయి ఉంది. ఆమె శిథిలావస్థలో ఉన్న భవనంలా, ఏ క్షణాన్నైనా కుప్పకూలిపోయేలా ఉంది.

అతడు అన్నాడు, “కొంచెం తల పైకెత్తండి.”

ఆమె గట్టిగా అంది, “ఏంటీ?”

“ఏం లేదు… నేను మిమ్మల్ని ఏమైనా మాట్లాడమని అడిగానంతే.”

ఆమె కళ్ళు ఎర్రటి మాంసంముద్దల్లా ఉన్నాయి. ఆమె ఏమీ మాట్లాడలేదు.

“మీ పేరు?” అతడు అడిగాడు.

“ఏం లేదు…” ఆమె మాటల్లో ఆసిడ్‌ లాంటి మంట ఉంది.

“మీరు ఎక్కడివారు?”

“నువ్వు ఎక్కడనుకుంటే అక్కడ.”

“మీరింత పొడిగా ఎందుకు మాట్లాడుతున్నారు?”

ఆమెకు ఒక్కసారిగా మెలుకువ వచ్చినట్టైంది. అతడిని ఎర్రని కళ్ళతో చూస్తూ అంది, “నువ్వు నీ పని చేసుకో… నేను వెళ్ళాలి.”

అతడడిగాడు, “ఎక్కడికి వెళ్ళాలి?”

ఆమె చాలా పొడిగా, పట్టనట్టుగా జవాబిచ్చింది, “నువ్వు నన్ను పట్టుకొచ్చిన చోటుకి.”

“మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు,”

“నువ్వు నీ పనిచేసుకోరాదూ… ఎందుకు నన్ను విసిగిస్తావ్?”

అతడు తన మాటల్లో ఎక్కడలేని జాలిని కలుపుతూ అన్నాడు, “నేను నిన్ను విసిగించటం లేదు. నీ మీద జాలి నాకు…”

ఆమె నిప్పు మీద ఉప్పయ్యింది. “నాకేం అక్కర్లేదు జాలి…” అని దాదాపుగా అరిచినంత పనిచేసింది. “నువ్వు నీ పని పూర్తి చేసుకొని, నన్ను వెళ్ళనివ్వు.”

అతడు దగ్గరకొచ్చి ఆమె తల మీద చేయి వేసి నిమరబోతే, అతడి చేతిని ఒకవైపుకి విసిరికొట్టింది. “చెప్తున్నాను, నన్ను విసిగించకు… నేను చాలా రోజులనుండి మెలకువగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి మెలకువగానే ఉన్నాను…”

అతడు తల నుండి కాళ్ళ వరకూ జాలిగా మారిపోయాడు. “నిద్రపో ఇక్కడే.”

ఆమె కళ్ళు ఇంకా ఎర్రబడ్డాయి. ఆమె పదునైన గొంతులో అంది, “నేను ఇక్కడ నిద్రపోడానికి రాలేదు. ఇది నా ఇల్లు కాదు…”

“నువ్వు వచ్చినదా నీ ఇల్లు?”

“ఉఫ్… బక్వాస్ ఆపు. నాకు ఇల్లు లేదు… నువ్వు నీ పని చేసుకో, లేదా నన్ను వదిలిపెట్టిరా… నీ రూపాయలు నువ్వు తీసేసుకో వాడి… వాడి…” ఆమె తిట్టబోతూ ఆగిపోయింది.

ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెతో మాట్లాడ్డం గానీ, ఆమెపై జాలి చూపడంగానీ వ్యర్థమని అతడు అనుకున్నాడు. అతడు అన్నాడు, “చలో… నిన్ను వదిలేసి వస్తా.”

అలా అతడు ఆమెను ఆ బిల్డింగులో వదిలేసి వచ్చాడు.


మర్నాడు అతడు కైసర్ పార్కులో ఖాళీగా ఉన్న ఒక హోటల్‌లో ఆ ఆడమనిషి కథనంతా తన దోస్తుకి చెప్పుకొచ్చాడు. అతడి దోస్తు అంతా విని ఏడ్చినంత పనిచేశాడు. అయ్యో అంటూ అడిగాడు, “ఆమె వయసులో ఉందా?”

అతడు బదులిచ్చాడు, “ఏమో… నాకు తెలీదు. నేను ఆమెను సరిగ్గా చూడలేకపోయాను… ఎంతసేపూ ఆ బ్రోకర్ తల ఎందుకు బండతో చితక్కొట్టలేదా అనే ఆలోచిస్తూ ఉన్నాను.”

దోస్తు అన్నాడు, “చేసుంటే మంచి పనే అనిపించుకునేది.”

అతడు చాలాసేపటి వరకూ హోటలులో తన దోస్తుతో పాటు కూర్చోలేకపోయాడు, అతడి మనసులోను, మెదడులోను నిన్న జరిగిన సంఘటన బరువు ఉంది. అందుకని చాయ్ ఖతం అవ్వగానే అక్కడి నుండి బయలుదేరి టాంగాల అడ్డాకు వచ్చాడు. అతడి కళ్ళు ఆ బ్రోకర్‌ని వెతికాయి చాలాసేపటి వరకూ. కానీ అతడు కనిపించలేదు.

ఏడు గంటలయ్యింది. అక్కడే, కొంచెం దూరంలోనే, ఆ పెద్ద బిల్డింగు ఉంది. అతడు బిల్డింగు లోపలకి ప్రవేశించాడు. గడపను దాటుకొని ముందుకు వెళ్ళాడు. అక్కడంతా చాలా చీకటిగా ఉంది. గుమ్మం దాటి, తడుముకుంటూ మెట్ల దగ్గరికి చేరేసరికి పైనుండి వెలుతురు కనిపించింది. అతడు మెల్లిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. కొంచెంసేపు ఆఖరి మెట్టు మీద నుంచున్నాడు. గదిలోంచి వంద వాట్‌ల అదే తెల్లటి వెలుతురు జిగేలుమంటూ వస్తూ ఉంది. కానీ చడీ చప్పుడూ లేదు. అతడు మెల్లిగా ముందుకు అడుగులు వేశాడు.

గోడను ఆసరాగా చేసుకొని అతడు గదిలోకి తొంగి చూశాడు. అన్నింటికన్నా ముందు బల్బు కనిపించింది అతడికి. ఆ వంద వాట్‌ల బల్బు వెలుతురు కళ్ళల్లోకి సూటిగా పడింది. అతడు వెంటనే మొహం తిప్పుకొని చీకటిగా ఉన్న వైపుకి కాసేపు చూస్తేగానీ అతడి బైర్లు కమ్మిన కళ్ళకు మళ్ళీ చూపు రాలేదు. తర్వాత మెడ వంచుకొని బల్బు వెలుతురు మళ్ళీ కళ్ళల్లో నేరుగా పడకుండా గది లోకి చూశాడు. అతడికి మొదట కనిపించినది నేల మీద ఒక చింకిచాప, దానిమీద పడి ఉన్న ఒక ఆడమనిషి. అతడు మరింత సూటిగా చూశాడు. ఆ ఆడమనిషి పడుకొని ఉంది. ఆమె మొహం మీద దుపట్టా పడుంది. ఆమె ఎద ఊపిరి తీసుకోవడం వల్ల పైకీ కిందకీ ఎగసిపడుతుంది. అతడు కొంచెం ముందుకు వంగి చూశాడు. గొంతులోంచి తన్నుకొని రాబోయిన అరుపును అతికష్టం మీద ఆపుకోగలిగాడు. ఆ ఆడమనిషికి కొంచెం దూరంలో నేల మీద ఒక మగవాడు పడున్నాడు. ఆ మగవాడి తల నుజ్జయిపోయివుంది. దగ్గర్లోనే రక్తంతో తడిసిన ఇటుక పడివుంది. అవన్నీ చూసి అతడు ఒక్కదాటున మెట్ల వైపుకి దూకాడు. ఆ చీకటిలో కాలు జారి పడి క్షణంలో కిందకు చేరాడు. కాని, తన దెబ్బలను పట్టించుకోలేదు. తనను తాను నిమ్మళించుకోవడానికి ప్రయత్నిస్తూ ఎలానో ఇల్లు చేరుకున్నాడు. ఆ రాత్రంతా పీడకలలు కంటూనే ఉన్నాడు.

రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...