కొన్ని దూరాలంతే!

కొన్నిసార్లు కొన్ని దూరాలంతే
పలకరింపులకూ అందకుండా

దగ్గరగానే వున్నామనుకుంటామా-
వెతుక్కున్నా తగిన మాట దొరకదు
ఏమీ తెలియని చూపులే భారంగా మిగిలిపోతాయి
పోనీ దూరాలన్నీ మాటలతో కుట్టేద్దామనుకుంటామా-
గాలిలోనే మాటలు కరిగి మబ్బుల్లా తేలి పోతాయి
అసహనపు కాలమూ
అలజడి చేస్తూ
మనసులను కలవనీదు

గుండెలో వెలితొకటి
ముల్లులా తొలుస్తూనే వుంటుంది
నిస్సహాయంగా శూన్యమేదో
దారికాచి పరిహసిస్తూనే వుంటుంది

అవతలి కొసను తాకాల్సిన
ప్రాణమొకటి
నీళ్ళబయటి చేపై
కొట్టుకుంటూనే వుంటుంది
లోపలి ఆశ మాత్రం
అదే దారికేసే చూస్తూంటుంది.

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...