అడ్డగాడిద

వారం మొత్తం సోమవారం నుంచి శనివారం దాకా ఆఫీసులో మేనేజర్ బుర్ర తినేశాక, ఇంక ఏమాత్రం కరచరణాలు ఆడలేని స్థితిలో మనఃశాంతి కోసం ఆశ్రమంలో అడుగుపెట్టాను. ఈ స్థితిలో ఇంటికెళ్తే హోమ్ మినిస్టరుగారు పెట్టే చివాట్లకంటే ఇక్కడ ఆశ్రమంలో స్వామిగారు మాట్లాడేది వినడమే బెటర్ కదా?

వెళ్ళిన పావుగంటకి ఉపన్యాసం మొదలైంది. బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందీ, అది సాధించడం ఎంత కష్టం, అది రావడానికి ముందు మనిషి తనంతట తాను ఎలా మారాలీ అనేవి విశదంగా చెప్తున్నారు. అహంకారం వదిలించుకోవాలి. నిమిత్తమాత్రుడిలా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. నిందాపనిందలు పట్టించుకోకూడదు. శీతోష్ణ, సుఖదుఃఖాలకి సమానంగా స్పందించాలి. పేరు కోసమో, ప్రతిష్ట కోసమో ఉబలాటం కూడదు. తిండియావ పనికిరాదు. దొరికినదానితో సంతృప్తిగా ఉండాలి, వగైరా, వగైరా. దీనిగురించి మళ్ళీ భగవద్గీతలో భక్తి యోగం శ్లోకం. ఈ విషయాలు అతి చిన్నవిగా కనిపించినా ఎంతో శ్రమచేసి అతి కష్టమైన సాధన చేస్తేగానీ వంటబట్టవు. వంటబట్టినా త్యాగరాజస్వామి పంచరత్న కృతిలో ‘మానస వనచర వర సంచారము నిలిపి’ అన్నట్టూ చేస్తేగానీ వంటబట్టినవి నిలుపుకోలేం. మళ్ళీ చివర్లో ఎవర్ని వారే ఉద్ధరించుకోవాలిగానీ ఎవరూ మరొకర్ని ఉద్ధరించలేరని కథ. స్వామిగారి ఉపన్యాసంలో ఆయన చెప్పే ప్రతీ విషయాన్నీ నాకు అన్వయించి చూసుకుంటే నేను ఆయన చెప్పినదాంట్లో ఏదీ చేయలేకపోతున్నాననేది సుస్పష్టం.

నాలాంటి గాడిదలందరికీ బ్రహ్మజ్ఞానం వచ్చేస్తే ఇంకేం? ప్రతీ అడ్డగాడిదా స్వామిగారు చెప్పినట్టు చేయవద్దూ? వినడానికి బానే ఉంది కానీ ఆశ్రమం గేటు దాటి బయటకి రాగానే అన్నీ బలాదూర్ బుర్రలోంచి. నన్ను ప్రతీరోజూ ఏడిపించే ఈ మేనేజర్‌గాణ్ణి మళ్ళీ ఎలా తిడదామా, నన్ను తిట్టినందుకు వీడి ప్రాజెక్టుని వచ్చేవారం నుంచి ఎంత ఆలస్యం చేద్దామా, ఎలా తగలబెడదామా అనే ఆలోచనలు, ఎత్తులూ జిత్తులూ పై ఎత్తులూనూ.

ఇలా ఆలోచిస్తూంటే అప్పుడొచ్చింది అసలు అనుమానం. అసలు గాడిదకీ అడ్డగాడిదకీ ఏవిటి తేడా? అడ్డగాడిద మనిషికి సంబంధించిన విషయం! పాపం ఈ మూగజంతువు పేరు ఎందుకు వాడుకున్నారో? దీని గురించి తెలుసుకోవాలంటే నిఘంటువు చూడాలి. గాడిదంటే ఏవిటని చూడబోతే రెండు ఆంగ్ల పదాలు కనిపించాయి–యాస్ అనీ, డాంకీ అనీను. యాస్ అంటే శరీరంలో పృష్ఠభాగం అనే అర్థం కూడా స్ఫురిస్తోంది కనక దాన్ని వదిలేసి డాంకీ అనేది చూస్తే గాడిద అనేది అసలు సిసలు జంతువని తేలింది. మరి గాడిద అనేదాన్ని కూడా మనిషికి వాడుతున్నారే? నన్ను మేనేజర్–వీడింట్లో కోడి కాల్చా–చాలాసార్లు ‘గాడిదా’ అంటాడు కదా? పాపం ఈ జంతువు చేసిన తప్పేమిటో?

ఏది ఏమైనా దీనిమీద మరి కొంచెం పరిశోధన చేయాలని తేలింది. శెలవులొచ్చినప్పుడు ఊళ్ళో తిరిగి అసలు గాడిద ఎలా బతుకుతుందీ, ఎవరు పెంచుకుంటారీ జంతువుల్నీ అనేవి చూడ్డానికి సాహసం చేసేను. వెతగ్గా వెతగ్గా ఊరి బయట ఓ గాడిద కనిపించింది ఓ చెట్టుకింద నుంచుని. దగ్గిరగా వెళ్ళాను కాని అది అసలు నన్ను పట్టించుకున్నట్టే లేదు. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అన్నట్టూ అలా ఎక్కడో శూన్యంలోకి చూస్తోంది. ఎంతసేపు చూసినా అసలు నా ఉనికిని పట్టించుకున్నది లేదు. కాసేపు చూసి విసుగొచ్చాక తిరిగొచ్చేను. మర్నాడు మరోసారి చూడ్డానికి వెళ్ళేసరికి ఈ గాడిదా మరో గాడిదా పక్కపక్కనే నించునున్నాయి. అయితే ఒకదాని మొహం రెండో దాని వెనక కాళ్ళ వైపు పెట్టి ఉంది. అంటే ఈ గాడిదలు ఒకదానికేసి ఒకటి కాదు కదా ఒక దాని మొహం ఒకటి కూడా చూసుకోవు. ఎందుకోమరి? ఈలోపునే వర్షం మొదలైతే నేను ఓ వారకెళ్ళి నిలుచున్నా. ఎంత వర్షం వచ్చినా, మీద ఎన్ని నీళ్ళుపడ్డా ఒక్క అడుగు ముందుగ్గానీ వెనక్కిగానీ వేయకుండా అలాగే ఉన్నై గాడిదలు రెండూను. పట్టించుకోవడం మాట అటుంచి అసలు వర్షం మీద పడుతోందన్న ధ్యాసే లేదు ఈ గాడిదలకి.

నేనున్నది ఊరి బయట కనక వర్షం తగ్గేదాకా అక్కడే ఉన్నాను. ఈ లోపుల ఓ శవయాత్ర అటువైపు వెళ్ళడం చూసి గాడిదలకేసి చూసేను. అదే నిమిత్తమాత్రం చూపు వాటికి. బతికున్న నేను వాటి దగ్గిరకెళ్ళినప్పుడూ, శవయాత్రలో ఎవరో పోతున్నప్పుడూ కూడా ఈ గాడిదలు పైకి కాని, కిందకి కాని, పక్కకి కానీ చూసింది లేదు. అరుపులనీ తిట్లనీ అసలు మనిషనే వాణ్ణీ పట్టించుకోవు కాబోలు. ఎండా వానా అనే ధ్యాసే లేదు. వీటికెవరు నేర్పారో ఇవన్నీ. నేర్పకుండా ఎవరికీ ఏమీ రాదని చిన్నప్పుడు స్కూల్లో మేష్టారు చెప్పారు కదా? వీటిక్కూడా ఈ సంగతులు అన్నీ నేర్పడానికి ఎవరో ఒక యజమాని ఉండి ఉండడా?

గాడిద యజమాని కోసం గాలిస్తే మా చాకలి దగ్గిరో గాడిద ఉందని తెలిసింది. అతనితో మాట్లాడ్డానికి వెళ్ళాను. మొదటిగా అడిగినది గాడిదకి ఎటువంటి తిండి పెడుతున్నాడనేది.

“పొద్దున్న చాకిరేవుకి బట్టల మూట మీదకి ఎక్కించాక రేవు దగ్గిర అలా వదిలేస్తాం. కనబడిన గడ్డీగాదం తింటూ ఉంటుంది మా గాడిద.”

“అంటే రాలిన ఆకులా లేకపోతే నువ్వు వేసే పచ్చగడ్డా?”

“పచ్చగడ్డా! మీరిచ్చే డబ్బులకి పచ్చగడ్డి ఎక్కడ కొంటాం? భలేవారే, గడ్డి ఎంత ఖరీదో మీకు తెలిస్తే అలా అడుగుతారా?” దెప్పిపొడిచేడు చాకలి సందు చూసుకుని నేనిచ్చే డబ్బులు సరిపోటం లేదంటూ.

“మరి సాయంత్రం ఇంటికెళ్ళాక మంచి తిండి పెడతావు కాబోలు.”

“అబ్బే, పలుపుతాడు వదిలేయడమే. బయట ఊరుమీద పడి తిరుగుతూ అక్కడే ఏదో తింటుంది. అసలు దీనికి తిండికి మాకు వేరే ఖర్చేమీ లేదు.”

“అదేవిటి, దానికి ఆకలేస్తే అరవదా?”

“అబ్బే. తిండి విషయంలో దాని దారి దానిదే. అది అడగదూ, మేము పెట్టమూ.”

నా ఆశ్చర్యానికి అంతు లేదు. అంటే ఊళ్ళో ఏ తిండీ దొరక్కపోతే ఇది వాయుభక్షకి అయి ఉండాలి! రోడ్డు పక్కన దొరికిన గడ్డీ కాయితాలూ తిని, ఎక్కడైనా దొరికిన నీళ్ళతో గొంతు తడి ఆర్పుకుంటుందా? ఒకప్పుడైతే న్యూస్ పేపర్లు రోడ్డుమీద దొరికేవేమో మరి ఇప్పుడు వాట్ని రీసైకిల్ అంటున్నారు కదా? భలే విచిత్రం! గాడిదకి అసలు తిండి యావే ఉండదా?

నేను నోరు విప్పబోయేంతలో మా చాకలే చెప్పేడు మళ్ళీ, “నేనే కాదు మా చాకలిపేటలో ఉండే మిగతా చాకలి వాళ్ళందరం అంతే. మూటలు మోసే పని అయిపోగానే ఊరి మీదకి తోలేయడమే వాటిని.”

“వార్నీ! మరి మర్నాడు ఈ గాడిదలన్నీ ఓ చోట కూర్చున్నప్పుడో మరోసారి ఒక గాడిద రెండో దానితో నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అన్నట్టు నిల్చున్నప్పుడో నీ గాడిద ఏదో ఎలా తెలుస్తుంది? పేరు పెట్టి పిలుస్తావా?”

నేనేసిన అమాయకపు ప్రశ్నకి మా చాకలి పగలబడి నవ్వేడు, “పెంచుకునే కుక్కకీ, పిల్లికీ, రామచిలక్కీ పేర్లు పెడతారు కానీ గాడిదకి పేరేవిటండీ?”

“మరి గుంపులో నీ గాడిదేదో నీకు ఎలా తెలుస్తుంది? అన్నీ ఒకేలా ఉంటాయి కదా?”

దీనికి చాకలి చెప్పేడు క్లుప్తంగా, “మా గాడిదలు మాకు తెలుస్తాయ్, వాటికి యజమాని ఎవరో తెలుస్తుంది.”

ఇంకా సందేహం వదలని నేను అడిగేను మా చాకల్ని, “నువ్వు తిండి పెట్టవు, పేరు పిట్టి పిలవ్వు, అయినా అది నీకెందుకు సేవ చేయాలి బట్టల మూటలు మోస్తూ?”

“అది దాని విశ్వాసం. మా గాడిద మమ్మల్ని వదిలి మరోచోటికి వెళ్ళదు. కుక్కకీ, పిల్లికీ తిండి పెట్టకపోతే వెళ్ళిపోతాయేమో కానీ గాడిదలు మాత్రం ఎక్కడకీ వెళ్ళవ్! కుక్కకి అయితే, ‘ధోభీకా కుత్తా, న ఘర్ కా, న ఘాట్ కా’ అంటారు కానీ గాడిదకి అది వర్తించదు,” దృఢంగా చెప్పేడు చాకలి.

చాకలి మూటలు కట్టుకొని చెరువు వైపు వెళ్ళిపోతుంటే అడిగేను, “ఈ గాడిదల్ని నేను ఊరి బయట చూశాను. పక్కన ఏం జరుగుతున్నా ఏమీ పట్టించుకోనట్టూ ఎలా ఉంటాయంటావు?”

“అంతేనండీ అవి. ఆ మధ్య మా ఇంటికి దగ్గిర్లో ఓ విమానం కూలిపోయింది. పెద్ద చప్పుడూ అదీను. ఈ గాడిదలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టూ ఒక్కసారి తలపైకెత్తి గూడా చూళ్ళేదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా అవి అలా నిర్లిప్తంగా ఉండగలవ్.”

మర్నాడు ఆఫీసుకొచ్చానన్నమాటే గానీ గాడిదల గురించి సేకరించిన పరిజ్ఞానం వదల్లేదు. పనిచేస్తూ మధ్యలో పరాగ్గా ఉంటే గాడిదల గురించి ఆలోచనలు ముసుర్తున్నయ్. వీటికి తిండి యావలేదు, దొరికినది తిని బతుకుతాయి. పక్కన ఎవరున్నా పోయినా వాటికి అక్కర్లేదు. వానా గాలీ ఎండా చలీ ఏవీ పట్టించుకోవు. ఎవరేనా తిట్టినా కొట్టినా నోరుమూసుకు భరిస్తాయ్. గాడిద తంతే గట్టి దెబ్బ తగుల్తుందంటారు. ఎవరూ కూడా ‘నన్ను గాడిద తన్నింది’ అని చెప్పడం ఎక్కడా వినలేదు. చూడబోతే గ్రామసింహాలు కరుస్తాయ్, పిల్లి గీరుతుంది, ఆఖరికి కోళ్ళు కూడా పొడుస్తాయ్, పందులైతే వాటి పిల్లల జోలికొస్తే వళ్ళు చీరేస్తాయి. కానీ గాడిద మాత్రం ఎవరినీ తన్నినట్టు దాఖలాలు లేవు. వాటికి కోపం కూడా రాదా? అన్నింటికన్నా ఆశ్చర్యం గాడిదకి పేరే లేదు మా చాకలి అనడం ప్రకారం. స్వంత పేరేలేని వాటికి ఇంకెక్కడి పేరూ ప్రతిష్టా, పాకులాటా? ఆశ్రమంలో స్వామిగారు బ్రహ్మజ్ఞానం గురించి చెప్తూ ఉదహరించినదానికి గాడిద బాగానే సరిపొతున్నట్టుందే?

ఒక్కసారి బుర్రలో బల్బు వెలిగినట్టయింది, అప్రయత్నంగా అనేసినట్టున్నాను పైకి “మనిషి గాడిదలా మారడమే సుఖసంతోషాలకి నాంది.”

ఎప్పుడొచ్చాడో మా మేనేజర్ నా డెస్కు దగ్గిరకి. నేను అన్న మాట విన్నట్టున్నాడు, నన్ను చేత్తో తడుతూ చెప్పేడు, “మారడానికింకేం మిగిలింది? నువ్వు ఇప్పటికే ఏ పనీ రాని అడ్డగాడిదవి!”

వీడి మొహం మండా! నోటికెంతొస్తే అంత మాటా అనేయడమే, ముందూ వెనకా చూసుకోవద్దూ?

(ఆర్. కె. నారాయణ్ డాంకీ వ్యాసానికి మార్పులు చేర్పులతో)