పరిచయము
మనిషికి తన ప్రతిబింబాన్ని అద్దములో చూచుకోవాలనే ఆశ ఉంటుంది. ఆ అద్దము నిజమైన అద్దముగా (true mirror) ఉండవచ్చు, లేకపోతే ఊహాదర్పణముగా (imaginary mirror) నుండవచ్చు. ఈ కాల్పనిక స్వీయదర్శనానికి కథలు, నవలలు కూడ సహకారాన్ని అందిస్తాయి. అందుకే ఇవి కల్పనాకృతులు, అనగా కల్పించిన రచనలు, లేకపోతే కల్పనకు ప్రతిరూపాలు. కథ జీవితములోని ఒక క్షణానికి ఛాయాచిత్రమయితే, నవల పరిధి విస్తారము. ఈ విస్తీర్ణత దేశకాల పరిస్థితులకు వర్తిస్తుంది. అందుకే కథలు, నవలలు అంటే జనబాహుళ్యానికి అంత ఇష్టము! ఈ యథార్థ-కాల్పనిక ఘటనల మిశ్రణపు నిష్పత్తి చాల ముఖ్యమైనది. కల్పన ఎక్కువైతే ఇది ఎవరిదో కథ అనిపిస్తుంది. వాస్తవికత ఎక్కువైతే ఇందులో ఏముంది కొత్తగా అనిపిస్తుంది. నిజానికి తగ్గట్లు కల్పన, కల్పనకు తగినట్లు వాస్తవికత – ఇది ఒక మంచి కథకుగాని నవలకుగాని ముఖ్యమైన లక్షణము. ఇటీవల ప్రచురితమైన సాయి బ్రహ్మానందం గొర్తి నవల నేహల పాఠకులను ఈ విషయములో చక్కగా ఆకట్టుకొంటుంది.
కథ నేపథ్యము
ఈమాట పాఠకులకు గొర్తి సుపరిచితులు. వారి కథలు ఎన్నో ఈ పత్రిక పుటలను అలంకరించాయి, ముఖ్యముగా కోనసీమ కథలు. వారు ఇంతకుముందు రచించిన అంతర్జ్వలనం నవల పురస్కారములను అందుకొంది. నేహల ఒక చారిత్రాత్మక నవల. దీని కథ 15వ శతాబ్దపు ప్రారంభ కాలము నాటిది. అప్పటి విజయనగర సామ్రాజ్యము దీనికి కేంద్రము. దాని పరిపాలకుడు సంగమవశమునకు చెందిన మొదటి దేవరాయలు (1406-1419). ఈ కథయొక్క రూపు రేఖలు సువేల్ (Robert Sewell) రచించిన ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్ (A Forgotten Empire)లో ప్రచురితమైయున్నది. ఈ నవలలో కొన్ని పాత్రలు నిజమైనవి, వాటికి చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి: దేవరాయలు, నేహల, ఆమె తలిదండ్రులు, ఆమె గురువు వేదరాయ శర్మ, దేవరాయల భార్య ఉమాదేవి, కూతురు మంజరి, గుల్బర్గా పాలకుడు బహ్మనీ సుల్తాన్ తజ్ ఉదీన్ ఫిరోజ్ షా (పాలనా కాలము 1397-1422), అతని తమ్ముడు అహ్మద్ షా వాలి (బీదర్ పాలన 1422-1436), సూఫీ సాధువు హజరత్ ఖ్వాజా బంద నవాజ్ గైసు దరాజ్ (1321-1422), ఫిరోజ్ షా కొడుకు హసన్ ఖాన్.
ఆ కాలములో నేహలను అతి సౌందర్యవతి అని పేర్కొన్నారు. సూవెల్ పుస్తకములో ఆమె అందము ఇలా వర్ణించబడినది: “ముద్గల్‌లో ఒక రైతు కుమార్తె అత్యంత సౌందర్యవతిగా పుట్టినది, ఆమెను రూపొందించడములో సృష్టికర్త తన అన్ని శక్తులను వినియోగించి ఒక పరిపూర్ణతను సాధించాడు.” ఆమె రైతు వృత్తి చేసే ఒక కంసాలి కూతురు. ఆమె కంసాలి రైతు కూతురైనా, ఒక బ్రాహ్మణ గురువువద్ద సంగీతము, నాట్యము నేర్చుకొన్నది. అంటే ఆ కాలములో బ్రాహ్మణేతరులకు, అందులో స్త్రీలకు కూడ విద్యావంతులవడము సాధ్యమని తెలుస్తుంది. ఈ విద్యాభ్యాసమునకు ముందు నేహలకు చిన్నతనములోనే వాళ్ళ జాతిలోని ఒక కుఱ్ఱవాడితో పెండ్లి నిశ్చయమైనట్లు కూడ వేరొక కథ ఉన్నది.
నేహలను దేవరాయలకు ఇచ్చి పెళ్ళి చేద్దామని గురువుగారి ఊహ. దేవరాయలతో మాట్లాడి అతనికి ఆమెపైన ఆసక్తిని కలిగిస్తాడు. అప్పటికే వివాహానికి సిద్ధముగా ఉండే ఒక కూతురికి తండ్రిగా ఉండే దేవరాయలు నేహలను పెండ్లాడడానికి ఒప్పుకొంటాడు. కానుకలతో తన అనుచరులను ముద్గల్‌కు పంపుతాడు. నేహల తల్లిదండ్రులు తమ కూతురు రాణి అవుతుందనే ఆశతో అంగీకరిస్తారు. కాని నేహలకు రాణివాసపు కట్టుదిట్టాలు బాగా తెలుసు, అక్కడికి వెళ్ళితే తాను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులను ఇక జన్మలో చూడడానికి వీలుండదని. అందుకే సిరిరా మోకాలడ్డినది! బహుశా ఈ కథ మల్లీశ్వరి సినిమాకథకు కూడ ఒక స్ఫూర్తియేమో! దేవరాయల అహం దెబ్బ తిన్నది. సైన్యాన్ని పంపుతాడు, వారి రాక తెలుసుకొన్న నేహల తన తల్లిదండ్రులతో పారిపోతుంది. సైనికులు నేహలలేని ఆ ఊరిని లూటి చేసి నేలమట్టము చేసి బీభత్సము చేస్తారు.
ఈ నవలలోని సన్నివేశాలు ముఖ్యముగా విజయనగరము (హంపి), ముద్గల్, గుల్బర్గా, రాయచూరు ప్రాంతాలలో జరుగుతుంది. నేడు ఇవన్నీ చెన్నై-ముంబై రైల్వే రహదారిలో స్టేషనులు, కాని ఆ కాలములో చరిత్రను కళ్ళార దర్శించిన ప్రాంతాలు ఇవి! పాఠకుల అవగాహన కోసము పుస్తకములో ఒక దేశపటము ఉన్నది. ఆ కాలములో రాయచూరు, ముద్గల్ వంటి ప్రదేశాలు ఎవరికీ చెందని ప్రాంతముల క్రిందికి లెక్క.
ముద్గల్‌లో జరిగిన హింసాకాండను విన్న ఫిరోజ్ షా విజయనగరముపైన దండయాత్ర చేస్తాడు. అందులో తాను గాయపడతాడు, ఐనా దేవరాయలను ఓడించి, సంధి షరతుగా దేవరాయల కూతురిని వివాహము చేసికొంటాడు, అంతే కాక బంకపురమనే ఒక కోటను, ధన కనక వస్తు వాహనాలను కూడ దేవరాయలచే కప్పముగా పొందుతాడు. తానంటే ఇష్టము లేని ఒక అమ్మాయిని పెళ్ళి చేసికోవాలనుకొన్న దేవరాయలు తన కుమార్తె ఇష్టాయిష్టాలను పరిగణించక తన శత్రువుకు ఇచ్చి పెళ్ళి చేస్తాడు. వివాహ సమయములో సకల మర్యాదలు చేసినా, తనను సరిగా సాగనంపలేదని ఫిరోజ్ షాకు దేవరాయలపైన కోపము. ఈ సమయములో నేహల గుల్బర్గా చేరుకొంటుంది. నేహలను చూసిన ఫిరోజ్ షా ఆమెకు తన అప్రయోజకుడైన కుమారుడు హసన్ ఖాన్‌తో పెళ్ళి చేస్తాడు.
ఇది సూవెల్ చెప్పిన అసలు కథ, రెండు మూడు పుటలలో ఇమిడ్చిన కథ. విజయనగర రాజుల కాలములో వారి కొలువులో చరిత్రకారులు లేరు, అందువలన మనకు దొరికిన ఈ చరిత్రంతా మహమ్మదీయులు వ్రాసినవాటిపై ఆధారపడినది. దీనికి కొన్ని ఉపాఖ్యానాలను, పాత్రలను రచయిత జోడించి 373 పుటల నేహల నవలను సృష్టించారు. నవలలో నేహల రేవన్న అనే యువకుడిని ప్రేమించినది. తన తలిదండ్రులను, ప్రేమికుడిని విడవడానికి మనసు రాక దేవరాయలతో పెండ్లికి నిరాకరణ తెలిపినది. ఈ రేవన్న చేసిన సహాయము, వానితో గడపిన మరపురాని మధుర క్షణాలు, నవలలో అది ఎలా పతాక సన్నివేశానికి దోహదము అవుతుంది అనే విషయాలను తెలిసికోవాలంటే నవలను తప్పక చదవాలి. శృంగారము, వీర రసములు ఈ నవలలో ముఖ్యమైన రసములు అయినా, మిగిలిన రసాలకు కూడ ఇందులో చోటు ఉన్నది. శంభు అనే చిత్రకారుడు, మోసము చేయు వేగులవాడు మసూమ్, ప్రేమకోసము ఏమైనా చేయడానికి సిద్ధపడే మెహజబీన్, తన మతము ననుసరించి, తన భాషను మాట్లాడే తన యీడు పిల్లను ఒక సుల్తాను భార్య స్థానములో కోడలిగా పొందిన మంజరి వంటి ఇతర పాత్రలు నవల ముగిసేటప్పటికి మన మనస్సులో నిలిచిపోతాయి.
చారిత్రాత్మక నేపథ్యము
చారిత్రాత్మక నవలలో చరిత్ర కూడ ఉండాలి, లేకపోతే అది పూర్తిగా ఊహాగానము అవుతుంది. దేవరాయలు స్త్రీలోలుడైనా, అతని పరిపాలనా దక్షత, అతని కాలములోని విజయనగరపు వైభవము ఇందులో చక్కగా చిత్రించబడినది. ఇది ఫెరోజ్ షాకు కూడ వర్తిస్తుంది. అతడు కూడ స్త్రీలోలుడు, కాని అతడు కూడ పరిపాలనా దక్షుడే. బహుశా రచయిత ఆ కాలపు చరిత్ర పుస్తకాలను క్షుణ్ణముగా చదివి ఉండాలి. విజయనగరానికి నీటి సరఫరా, ఆ కాలములోని ఆర్థిక పరిస్థితి, వ్యవసాయము, పన్నులు, ఇట్టివి ఇందులో వివరించబడినవి. పన్నులు ఎక్కువైనా అందువలన ప్రజలకు లాభములు కూడ కలిగాయి. అదే విధముగా ఫిరోజ్ షా బహ్మనీ రాజ్యాన్ని ఎలా విస్తరించాలి, ఎలా విజయనగరపు రాజును ఓడించాలి అనే విషయాలపై చర్చ సమగ్రముగా ఉన్నది. అంతే కాక సుల్తాను, అతని తమ్ముడు సూఫీ సాధువు గిసుదరాజ్ మాటలను ఎలా శిరసావహిస్తారో, ఈ గిసుదరాజ్‌ను ముసల్మానులు మాత్రమే కాక హిందువులు కూడ ఎలా గౌరవిస్తారో అనే విషయాలు ఆసక్తికరముగా ఉన్నాయి.
సమాజములో స్త్రీ స్థానాన్ని గురించి ఇప్పుడు కూడ వాదాలు, వివాదాలు తగ్గకుండా ఉన్నాయి. కాని నియంతలైన రాజులు, సుల్తానులు పరిపాలించే కాలములో తన జననీ జనకులకోసము, తాను ప్రేమించిన తన ఊరు, అక్కడి గుడి, జీవనశైలి వీటికోసము రాణీవాసాన్ని ఒక్క చిరునవ్వుతో తిరస్కరించి తన ఇష్టాయిష్టాలకు మాత్రమే విలువనిచ్చిన యువతి ఒకామె జీవించి ఉన్నదనడము, ఆ విషయము చరిత్ర పుటలలో దాఖలు కావడము నిజముగా స్త్రీజనానికి గర్వ కారణమే. కాని ఆమెకు కూడ విధివంచన తప్పలేదు. అదే తల్లిదండ్రుల క్షేమానికోసము పరమతస్థుడిని పెండ్లాడము విధియొక్క వక్రోక్తియే కదా? నేహల సౌందర్యములో మాత్రమే కాదు, గుణగణాలలో కూడ ఒక మాణిక్యమే. మట్టిలో మాణిక్యం పుట్టడము అంటే ఇదేనేమో? ఆమె చివరి వరకు తాను ఉన్న ఊరిని, మన్న ప్రజలను మరువలేదు.
నచ్చినవి: నాకు ఈ నవలలో నచ్చిన కొన్ని అంశాలు: (1) కూర్పు. అందమైన ముఖచిత్రము, మంచి ఖరీదైన కాగితము, చక్కని ముద్రణ (అక్కడక్కడ తప్పులున్నా), సొగసైన బుక్‌మార్క్. (2) ప్రకరణాలను సంఖ్యలతో (1,2,3, అలా) కాక ఆ సంఘటనలు ఎక్కడ జరిగాయో ఆ ఊరి పేరులను వ్రాయడము (ఉదా. విజయనగరము, ముద్గల్, గుల్బర్గా, మున్నగునవి). దీనివలన పఠితలకు ఒక కుతూహలము కలుగుతుంది, పాత్రలను ఆయా ప్రదేశాలతో ముడి పెట్టడము జరుగుతుంది. (3) నవల ప్రారంభమునకు ముందే నవలలోని పాత్రలను పరిచయము చేయడము. ఈ సౌలభ్యము వలన ఎవరు ఎవరో అని మరువడానికి ఆస్కారము లేదు. (4) ప్రకరణముల అంతములో తరువాత ఏమి జరుగుతుందో అనే తహతహ కలుగుటకై వ్రాయబడిన ఒకటి రెండు వాక్యాలు, ఉదా: ‘మనుషుల్ని నమ్మాలి, విశ్వసించాలి. కాని గుడ్డి నమ్మకము, గుడ్డి ప్రేమా ఎవరికైనా అనర్థదాయకమే.’ అలాటిదే మరొకటి, ‘మార్పు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. విజయనగర రాజ్యంలో అది ఆనాడే మొదలయ్యింది. అదీ ఒక పంతొమ్మిదేళ్ళ అమ్మాయి ద్వారా.’ (5) కథ మాత్రమే కాక ఆ కాలములోని సాంఘిక, ఆర్థిక పరిస్థితులను (విజయనగరము, గుల్బర్గా రెండు ప్రాంతాలలో) కథా ప్రవాహానికి అడ్డు రాకుండా వివరించడము. (6) అన్నిటికన్న మిన్నగా కథను చెప్పిన తీరు, సులభమైన, ఆకర్షణీయమైన శైలి ఈ నవల ప్రత్యేకత. ఇది లేకపోతే పొడవైన నవలను చదవడము కొద్దిగా కష్టమే.
నచ్చనివి నాకు నచ్చనివి కొన్ని: (1) రచయితకు ఇష్టమైన సా విరహే తవ దీనా అనే అష్టపది నవలలో ఒక అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అందులోని శీతల వెన్నెల నాకు నచ్చలేదు, చల్లని వెన్నెల లేక శీతల కౌముది అంటే బాగుంటుంది. (2) ముగింపు నవలకు, చలన చిత్రానికి బాగుంటుంది, కాని వాస్తవానికి కొద్ది దూరమనిపిస్తుంది. (3) స్థలాల వివరణకై పటము ఒకటి ఉన్నా అది స్పష్టముగా లేదు. ఎందుకంటే ఊరుల పేరులు, వాటి ఉనికి అందరికి పరిచితము కావు. అలాటి ఊరులు ముద్గల్, గంగావతి, లింగసుగూరు ఇత్యాదులు. వాటిని దేశ పటములో చూస్తే తప్ప మనకు తెలియవు. తుంగభద్రా, కృష్ణా నదులు, వాటికి ఇటువైపు అటువైపు ఉండే పట్టణాలు, అవి ఎవరి చేతులనుండి ఎవరికి ఎప్పుడు మారుతాయి ఇత్యాదులకు ఒక రంగుల దేశ పటము అవసరమే. (4) అక్కడక్కడ కనబడే కొన్ని ముద్రారాక్షసాలు!
ఇది ఒక మంచి నవల, అందమైన కూర్పు. చదవడానికి పాఠకులను ఆహ్వానిస్తున్నది. నేహలను ఒకసారి పరికించమని మనవి చేస్తున్నాను.
నవల వివరాలు: – నేహల – చారిత్రక నవల, రచయిత – సాయి బ్రహ్మానందం గొర్తి, ముఖ చిత్రము – అన్వర్; మొదటి ముద్రణ – చరిత ఇంప్రెషన్స్, హైదరాబాదు, 2018. పుటలు – 373, దొరకు చోటులు – విశాలాంధ్ర, నవచేతన, నవోదయ, ప్రజాశక్తి , gorthib@yahoo.com ధర – 250 రూపాయలు లేక 10 డాలరులు.