రెక్కలు: కథ నచ్చిన కారణం

కథ: రెక్కలు
రచయిత: కేతు విశ్వనాధ రెడ్డి
కథ రాసిన కాలం: 1991

నా వరకూ కథలు మూడు రకాలు. మర్చిపోయే కథలూ, మామూలు కథలూ, మంచి కథలూ. మొదటి రెంటి సంగతీ పక్కనబెట్టి, మూడో రకం కథ గురించి చూద్దాం.

ఏ కథైనా ఎప్పుడు మంచిదంటాం? మొదటిసారి చదవడం పూర్తికాగానే జబ్బ పట్టుకు లాక్కొచ్చి మరలా చదివించాలి. చెప్పదల్చుకున్న విషయం మనల్ని కొన్ని నిమిషాలు కట్టి పడేయ్యాలి. కథలోని పాత్రలు జీవితానికి దగ్గరగా ఉండాలి. ఆలోచింపచేసేలా వుండాలి. లేదూ ఆ కథ చాలకాలం మనల్ని అంటిబెట్టుకునుండాలి. ఇలా రకరకాల కొలమానాలు పెట్టుకుంటాం. ఇలా ఎవరి పరిధీ, అవగాహనా బట్టీ అటూ ఇటూగా మారుతూ వుంటాయీ కొలమానాలు.

నా వరకూ మంచి కథ అనడానికి కొన్ని ప్రమాణాలున్నాయి. పైన వుటంకించిన ప్రమాణాలు నేను పైకి చూసుకునేవి. ఇంతేకాదు. నేనూ ఒక కథకుణ్ణే కాబట్టి కథా నిర్మాణ ప్రక్రియకి సంబంధించిన అంశాలు ఈ కథలో ఎలా చొప్పించబడ్డాయీ అన్నవి కూడా చూస్తాను. ఎన్నుకున్న వస్తువుని కథగా మలచిన తీరూ, పాత్రల చిత్రణా, కథనం ఇవన్నీ చూసుకుంటాను. ముగింపు ఊహించినదైనా పరవాలేదు. కానీ చివర్లో ఉపన్యాసాలూ, ఉద్బోధలూ ఉండకూడదు. ముగింపులో పరిష్కారం అస్సలు చూపించకూడదు. చివరగా ఎన్ని సార్లు చదివినా ఆ కథ విసుగు పుట్టించకూడదు. తెలుసున్నదయినా తరచి తరచి చదవాలి. అది కొంత నన్ను కాలం వెంటాడాలి. ఇవీ నా దృష్టిలో మంచి కథవ్వడానికి లక్షణాలు.

మనిషి జీవితంలో మంచి, చెడులెంత సాపేక్షమో కథలూ అంతే! చెడుకానిదల్లా మంచెలా కాదో, చదివించే ప్రతీకథా మంచిదవ్వదు. ఒకరికి నచ్చింది మరొకరి పెదవి విరుపులకి గురి కావచ్చు. ఇదలా వుంచి, నాకు బాగా నచ్చిన కథల్లో ఒక కథ గురించి చెబుతాను. అదెందుకు నన్నిన్నాళ్ళూ అంటిపెట్టుకుందో వివరిస్తాను.

సుమారు 1991 ప్రాంతంలో లండన్ నుండి తిరిగొస్తూ హైద్రాబాదు ఎయిర్‌పోర్టులో ఇండియా టుడే తెలుగు పత్రిక కొన్నాను. అప్పుడే తెలుగు వెర్షన్ కొత్తగా మార్కెట్లో ప్రవేశ పెట్టారు. సాధారణంగా వార్తా కథనాలే ఉండే పత్రికలో ఒక కథ! ఆ కథ పేరు ‘రెక్కలు‘. రచయిత కేతు విశ్వనాథ రెడ్డి. అంతకు ముందు ఆయన రాసిన కథలు చదివాను కానీ ఈ కథ మాత్రం మర్చిపోనివ్వకుండా చేసింది. సాధారణంగా నచ్చినవి దాచుకునే అలవాటుంది నాకు. ఎందుకో ఈ కథున్న పత్రిక ఎక్కడో పోయింది. విశ్వనాధ రెడ్డిగారు పరిచయం అయ్యాక ఆయన్నడిగిన మొదటి ప్రశ్న ఈ కథా, ఇచ్ఛాగ్ని అనే ఇంకో కథా గురించే! ఇన్నాళ్ళయినా ఆ కథ గుర్తుందా అంటూ ఆశ్చర్యపోయారాయన. ఆయన దగ్గరే ఈ కథని మరలా సంపాదించాను. ఇదిక్కడాపి అసలు ‘రెక్కలు‘ కథా విశేషాల గురించి చెబుతాను.

మొదటిది, కథా నేపథ్యం ఎన్నికల నిర్వహణ. ఇండియాలో మనకి ప్రభుత్వ ఎన్నికల గురించి తెలియని వారుండరు. ఎలక్షన్ కమీషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియయినా దీని వెనుక ఎంతో మంది ప్రభుత్వాధికారులూ, ఉపాధ్యాయులూ, పోలీసులూ, ఇలా చాలా మంది సహకారం ఉంటుంది. ఈ ఎన్నికలు జరిపించడానికి వలంటీర్లుగా పనిచేసే వారి కష్ట సుఖాలూ, పడే శ్రమా ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు ఎంతో సహజంగా ఈ నేపథ్యంలో చెప్పడంతో కథకి సహజత్వమూ, కొత్త కళా వచ్చాయి. పాత్రలకీ ఒకరకమైన నిండుతనం వచ్చేసింది.

ఇహ రెండోది. పాత్రల చిత్రీకరణా, తద్వారా కథాకథనం. ప్రధాన పాత్ర అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు స్వగతంలో కథ నడుస్తుంది. ఇతనితో పాటు ప్రెసైడింగ్ ఆఫీసరూ (నాగేశ్వర్రావు), హోం గార్డుగా ఉన్న ఒకమ్మాయి (పంకజం) మిగతా పాత్రలు. వీళ్ళ ముగ్గురికీ ఏరువపాళానికి ఎన్నికల డ్యూటీ వేస్తారు. ఏరువపాళెం డ్యూటీకి వెళ్ళే లారీలోనే హోంగార్డులుగా ఉన్న ముగ్గురమ్మాయిలు, తతిమ్మావారు ప్రయాణం చేస్తారు. ఆ ముగ్గురమ్మాయిల్నీ చూడగానే తన కూతుళ్ళు గుర్తుకొస్తారు ఎ.పి.ఓ. కి. హోంగార్డులుగా ఆ అమ్మాయిల ధైర్యం చూసి ముచ్చటపడతాడు. నాగేశ్వర్రావూ, ఎ.పి.ఓ, పంకజం, ఆ రాత్రికి ఏరువపాళం చేరుకుంటారు. నాగేశ్వరరావు పంకజం పై కన్నేస్తాడు. వీళ్ళకి బస చేయడానికి ఒక స్కూలు ఇస్తారు. ఆ వూరికి కరెంటు సౌకర్యం అంతగా ఉండదు. చిన్న బుడ్డి దీపం పెట్టుకొని ఆ గదిలో ఉంటారు.

కథ ఇక్కడితో ఆపేస్తాను. ఆ రాత్రి ఏమయ్యిందీ అన్నది మీరు కథ చదివి తెలుసుకోండి.

ఏకబిగిన చదివించే ఈ కథలో పాత్రల చిత్రీకరణ ఎంతో సహజంగా కనిపిస్తుంది. సరిగ్గా పరికిస్తే మనకి నిత్యజీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురుపడేవే. పాత్రల సంభాషణల్లో, ప్రవర్తనలో ఆయా మనస్తత్వాలు గోచరిస్తాయి. జీవితం పట్ల వాళ్ళకున్న అవగాహనా, దృక్పథమూ కనిపిస్తుంది. నాగేశ్వర్రావు పాత్ర తీరుని కథలో ఒక చోట ఎంతో నర్మగర్బంగా చెప్పిస్తాడు రచయిత. పంకజం కూడా వాళ్ళతోనే ఏరువపాళెం వస్తోందని చెప్పే చోట సంభాషణలు ఇలా సాగుతాయి.

“నాకు డ్యూటీ వేసింది కూడా అక్కడే సార్!” అంది ఆ అమ్మాయి.

“మీ…నీకా?” నాగేశ్వర రావు ఆశ్చర్యపోయాడు.

మీరు అనబోయి ఏకవచన సంబోధనలో ఆ పాత్ర తీరూ, ఉద్దేశ్యమూ ఎటువంటి అనవసర వ్యాఖ్యానం లేకుండా చెప్పించడంలో రచయితకున్న పట్టు తెలుస్తుంది.

మనిషి చదువొక్కటే చాలదు. సంస్కారం కూడా కావాలి. అది మనుషుల మధ్య జీవితం ఇస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈ కథలో చాలా కనిపిస్తాయి. పోలింగ్ బూత్ ఇక మూసేయండని నాగేశ్వర్రావు అంటే “ఇంకా మూడు నిమిషాలుంది కదా సార్! కూలికి వెళ్ళేవాళ్ళు. మనలాగా తీరికుండద్దూ. చీట్లిచ్చి అయిదు దాటినా పోలింగ్ జరపండి సార్!” అని పంకజం అనడం దానికొక ఉదాహరణ. ఇలా ప్రతీ చిన్న అంశాన్నీ ఎంతో పకడ్బందీగా చెప్పిన కథిది. చదివే కొద్దీ కథ కనిపించదు. మనుషులు కనిపిస్తారు. మనలో చాలామందికి ఏమాత్రమూ పరిచయం లేని జీవితం కనిపిస్తుంది.

చిన్న కథలో పాత్రల చిత్రీకరణలో ఒక చిక్కుంది. ఏ పాత్రనయినా ఎన్నుకున్న కథవస్తువూ, ఇతివృత్తం మేరకే చెప్పడం సాధ్యపడుతుంది. నవల్లోలాగా విస్తృత చిత్రీకరణ కుదర్దు. ఒకటికి మించి రెండు మూడు విభిన్న పాత్రలుంటే అది మరీ కష్టం. కానీ ఈ కథలో నాగేశ్వర్రావూ, పంకజమూ, ఏ.పి.ఓ ముగ్గురూ స్పష్టంగా కనిపిస్తారు. వాళ్ళ మనస్తత్వాలూ ప్రస్ఫుటంగా తెలుస్తాయి.

ఇహ ఆఖరిది ముగింపు. ఇదే ఈ కథకి ఆయువుపట్టు. అంతవరకూ సాఫీగా సాగిన కథ చివరికొచ్చే సరికి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆలోచింపచేస్తుంది. ఇది కథ చదివితే మీకే తెలుస్తుంది. అంతకు మించి చెప్పను. రెక్కలు కథ చాలా సార్లు చదివాను. చదువుతాను. ఈ కథ చదివాక ఎందుకో మీకే తెలుస్తుంది. అది మాత్రం నిజం.

[ఈ కథ కథ-91 లోనూ, రెండు దశాబ్దాల కథలోనూ పునర్ముద్రించబడింది. ఈ శీర్షిక అవసరార్థం రెక్కలు పి. డి. ఎఫ్ పంపించిన కథ సంపాదకుడు వాసిరెడ్డి నవీన్‌గారికి మా కృతజ్ఞతలు – సం.]