తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

రంగస్థల ఆహార్యం

నాటకానికి అతి ముఖ్యమైన మరో మూలస్థంభం ఈ రంగస్థల ఆహార్యం. కథా వస్తు పరంగా నటీనటుల అలంకారం, స్థల, కాల, గుణ విశ్లేషణ చూపే వేదికాలంకరణ, సన్నివేశాల్లో వాడబడే వస్తు ప్రకరణ, ఇంకా దృశ్యస్పురణ కలిగించే వాయిద్య సహకారం (దాన్నే సంగీతం అని అంటాం) ఇవన్నీ కలిపి ఆహార్యం (మేకప్, స్టేజి డెకరేషన్, ప్రోపర్టీసు, మ్యూజిక్‌) అంటారు. ఒక నాటకం రక్తి కట్టాలంటే మంచి నటీనటులూ, కథా వస్తువు మాత్రమే కాదు, దానికి తగ్గ ఆహార్యం కూడా ఉండి తీరాలి.

ఆహార్యం నాటకంలో పాత్ర తీరుతెన్నుల్నీ, స్వభావాన్నీ చూపడమే కాదు, మన కళ్ళకి అగుపించని కొన్ని గత కాలపు వ్యక్తుల వ్యవహారిక జీవితాల్ని మనకు స్ఫురణ కొచ్చేలా చేస్తుంది. ఉదాహరణకి జాలరి పాత్ర ఉందనుకోండి, ఆ నటుడి వేషాన్ని బట్టీ, వాళ్ళు ఉపయోగించే వస్తువులను బట్టీ (ఇక్కడ చేపల్ని పట్టే వల, వస్తువు) మనం జాలరి అని సులభంగా ఊహించగలం. అలాగే ప్రతీ పాత్రకీ పాత్ర పరంగా తగిన ఆహార్యం ఉండి తీరాలి. ముసలి పాత్ర వేసే నటుణ్ణి, యవ్వనంలో ఉన్న వ్యక్తిలా అలంకరణ (మేకప్) చేస్తే చూడ్డానికి అపహాస్యం అవుతుంది. అంతే కాదు, పాత్రల దుస్తుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే గానీ ఫలానా పాత్ర ఫలానా కాలానికి చెందిందీ అని చెప్పడం కష్టం. రచయితకే కాదు, దర్శకుడికీ ప్రత్యేక అవగాహన ఉండాలి.

కొన్ని పాత్రల్ని రచయిత చూడకపోయినా ఆనాటి కాల పరిస్థితుల కనుగుణంగా పాత్రల్ని సృష్టిస్తే, వాటికి తగ్గ అలంకరణ చేయడం ద్వారా ఫలానా పాత్ర అని అతి సులభంగా ప్రేక్షకుడు గుర్తించగలుగుతాడు. పాత్రల ఆహార్యం సహజంగా నిజ జీవితాలకి దగ్గరగా ఉంటేనే ఏ పాత్రయినా మనసుకి హత్తుకుంటుంది. దీనికి దర్శకుడి భాద్యత ఎంతైనా ఉంటుంది. ఏ పాత్ర కెటువంటి అలంకరణ చేయాలీ, ఏ సన్నివేశానికి తగ్గ అలంకరణ మార్పులు చేసుకోవాలీ అన్న విషయం దర్శకుడికి సరైన అవగాహన లేకపోతే నాటకంలో పాత్రలు తేలిపోతాయి. ఇక్కడ రచయిత సూచన ప్రాయంగా పాత్రని చెబుతాడే తప్ప, అవసరం అయితే కానీ విశేషంగా వివరించడు. ఆయా పాత్రల్ని బట్టి ఏ మేకప్ లేదా అలంకరణ నప్పుతుందో ముందే ఊహించుకొని దాని కనుగుణంగా ఒక ప్రణాళిక చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పని సరిగా దర్శకుడిదే !

ఒక్కోసారి సన్నివేశ పరంగా పాత్రల మేకప్ మార్చవలసి వస్తుంది. ఒక సన్నివేశంలో ఒక యుక్తవయసు అమ్మాయిని తరువాత సన్నివేశంలో గృహిణిగా చూపించాల్సివస్తే దాని కనుగుణంగా దుస్తులు లేదా అలంకరణ మార్పులు చేసి తీరాలి. లేకపోతే, చూసేవాళ్ళకి శ్రద్ధ లోపిస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు అతి తక్కువ కాలంలో అలంకరణ మార్పులు చేసుకునేలా దర్శకుడు ఏర్పాటు చేసుకోవాలి. లేదా మొదటి సన్నివేశంలో వచ్చిన పాత్రని రెండో సన్నివేశంలో రానీయకుండా జాగ్రత్తపడి, మూడో సన్నివేశంలో అలంకరణ మార్పులతో చూపించాలి. ఇక్కడే దర్శకుడి చాకచక్యం అంతా బయటపడేది. రచయిత రాసిన నాటకాన్ని ప్రదర్శనా యోగ్యంగా మలచడంలోనే దర్శకుడి ప్రతిభ కొట్టచ్చినట్లు కనిపిస్తుంది.

పూర్వం ముఖాలకి పసుపూ, కుంకుమా, విభూతీ, పారాణి (సున్నం, కుంకుమ నీళ్ళతో కలిపిన మిశ్రమం) వాడేవారు. కొన్ని సందర్భాలలో స్త్రీల చేతులకు గోరింటాకు పెట్టే వారు. కాలక్రమేణా, సాంకేతిక ప్రగతిలో ముఖానికి వేసుకొనే రంగులు వచ్చాయి. దాంతో నటులకి రంగులతో మేకప్ చేసే విధానం అలవాటులోకి వచ్చింది. సుమారు 1800 సంవత్సర కాలంలో ముఖానికి రంగులు పూసుకోవడం అనేది మొదలయ్యింది. 1800 కాలం ముందే ఈ రంగుల (కాస్మెటిక్స్) వాడకం ప్రజల్లోకి వచ్చినా, నాటకాలలో వాడడం మాత్రం ఇంగ్లీషు వారే మొదలు పెట్టారు. ముఖ్యంగా షేక్స్పియర్ నాటకాలతో రంగుల ప్రాభవం మరింత పెరిగింది. దాంతో వివిధ రకాల పాత్రల్నీ ప్రస్ఫుటంగా స్టేజి మీద కనిపించేలా చేయడానికి ఈ రంగులు చాలా వరకూ దోహదం చేసేవి. ఇప్పుడు మేకప్ లేకుండా ఒక్క నాటకం కూడా వేయబడదు.

ఈ రంగుల వాడకం మాత్రం మనకి పాశ్చ్యాత్య దేశాల, ముఖ్యంగా బ్రిటీషు వారి పాలనా సమయంలోనే వచ్చింది. ఇంగ్లీషు వారికి అప్పటికే షేక్స్పియరు నాటకాలు ప్రాచుర్యంలో ఉండేవి. వివిధ రంగుల వాడకం ద్వారా ప్రతీ పాత్రకీ తగ్గ మేకప్ అనే ప్రక్రియ వెలుగు చూసింది. దాని ముందుగా బెంగాలీలు నాటకాల్లో వాడడం మొదలు పెట్టేక అది మెల్ల మెల్లగా మిగతా ప్రాంతాలవారూ వాడడం మొదలు పెట్టేరు.

అలాగే కేశాలంకరణ, విగ్గుల వాడకం కూడా మనకి పాశ్చాత్యుల వల్లే తెలిసింది. ఇవన్నీ మెల్ల మెల్లగా ప్రతీ ప్రాంతానికీ పాకి నాటకాలలో విగ్గులు వాడడం అనేది ఒక అలవాటుగా మారింది. ఇవన్నీ ఆహార్యం క్రిందకే వస్తాయి. ఏ పాత్రకి ఏ ఆహార్యం ఉండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఏ రకమైంది ఉండాలీ ఇవన్నీ నిర్ణయించుకునేది దర్శకుడే !