సంక్రాంతి అంటే- ఎలాంటి నిర్వచనాలు తెలీని రోజులవి.
ఒకటే తెలుసు. సంబరం. ఏ పండగలోను ఇన్నేసి సరదాలు వుండవని సంబరం.
ఇల్లిల్లూ పచ్చని తోరణమై, వీధులన్ని జన సందోహమై, హృదయాలన్ని ఒక చోట చేరి సంతోషాల్ని కలబోసుకునే ఒకే ఒక్క ఉత్సవం. ఒకే ఒక్క పండగ వైభవం.
సంక్రాంతి అంటే-
సందళ్ళ పుట్ట.
సరదాల గుట్ట.
జ్ఞాపకాల తుట్టె.
పుష్యం చలి పక్కదుప్పటి తీయనీదు. నిద్ర బద్ధకం కళ్ళు తెరవనీదు. బడికెళ్ళాలి కానీ లేవబుధ్ధి కాదు. అలాంటి లేత బాల్యం, ఎలా లేచి కూర్చునేదో తెల్లారుఝామునే! ఎంతగా మెలకువొచ్చేదంటే చెవి దగ్గర అలారం పెట్టినట్టే, ఠంచనుగా.
అడుగులో అడుగేసుకుంటూ అమ్మ వెనకే చిన్న బిందో గుండు చెంబో, ముగ్గుబుట్టో పిండిడబ్బానో ఏదో ఒకటి చేతిలో పట్టుకుని బయటకొస్తే నిశ్శబ్దంగా ఆకాశం నన్ను చూసి నవ్వినట్టుండేది. ఊరు కొత్తగా తోచేది.
ముగ్గు చూసి వెళ్ళడం కోసం మునివేళ్ళ మీద నిలబడ్డ చిరు చీకటి. కదలని గాలి. అరుగుమీద వెలుగుతూ లాంతరు.
కళ్ళాపి జల్లి అలికిన మట్టి నేల గట్టిబడి నున్నటి రాయిలా మారేది. అమ్మ కళ్ళతోనే నేల వైశాల్యాన్ని కొలుచుకొని, అంతమేర చోటుని కేంద్రంగా చేసుకుంటూ పెట్టిన మొదటి చుక్క భూదేవికి ప్రథమ పూజ అయ్యేది. పెళ్ళికూతురి బొట్టయ్యేది. వేళ్ళకొసలు తాకిన మొదటి ముద్దయ్యేది. చకచకా చుక్కలు పెట్టేస్తూ, అంతే వేగంగా వాటిని కలిపేస్తూ చిత్రకారులైతున్న విచిత్రానికి నేల తల్లి ఎంత మురిసిపోయేదో.
చేతివేళ్ళ మధ్యలోంచి వెన్నెల పోగులు జారుతూ వంకీలొంకీలుగా చుట్టుకుంటూ వయ్యారాల హొయలు పోతూ, ముగ్గు వన్నె తేరేది. మల్లె విచ్చుకున్నట్టు సన్నజాజి సాగినట్టు తెల్ల కలువ వొళ్ళిరుచుకున్నట్టు సంపెంగి కొసలుతేరినట్టు, ముగ్గు తేలి మేలిముత్యంలా మెరిసేది. దేవుడినే అబ్బుర పెట్టే ముగ్గులవి.
అమ్మ ఎప్పుడెళ్ళిపోయేదో లోపలకి, మాకు మాత్రం కదలబుధ్ధి అయ్యేది కాదు!
ప్రాంగణాన పెద్ద ముగ్గు. ప్రహరీ గోడ బయట వీధిలో మరో ముగ్గు. గేట్ తీసుకుని బయటకు తొంగి చూస్తే ఇంటింటికీ ముగ్గులు. తెల్లగా నక్షత్రధూళి దారంతా పరుచుకున్నట్టు తోచేది. వీధిదారులన్నీ ఆకాశ రహదారులైపోయేవి.
వీధి కొస కనిపించకుండా మంచు దారాలు వ్రేలాడుతుండేవి. దూరంగా చలిమంట పైకెగసి, ఎర్రగా కదిలేది. చలి కాచుకుంటూ మగవాళ్ళ మాటలు, పాటలు లీలగా వినిపిస్తూండేవి. వాళ్ళెవరో తెలీకున్నా భయం వుండేది కాదు! అప్పటికే, వెంకటేశ్వరాలయంలో సందడి మొదలయ్యేది. ప్రసాదం పులిహోర తిరగమోతతో వీధి వీధంతా ఘుమాయింపులే. ఇంకాసేపట్లోనే రేడియోలో తిరుప్పావై వస్తుంది. శ్రీరంగ గోపాలరత్నం గొంతు ధనుర్మాసాన్ని మరింత మనోహరంగా మార్చేది.
“అమ్ములూ.. గొబ్బెమ్మలూ” అమ్మ పిలిచేది. పెరట్లోకి దూకి చూస్తే మంచుకి తడిసి మందారలు మొగ్గలయ్యేవి. రెక్కలు ముడుచుకు బజ్జున్న గులాబీలు, పసుపైన ముళ్ళగోరింటలు, వంగరంగు డిసెంబరాలు. ఉహు! ఇవి కాదుగా నాక్కావల్సినవి. చారడంత చామంతులు, అరచేయంత గుమ్మడి పూలు. పక్క మొగ్గలు తుణగకుండా, చిగురుటాకులు తుంచకుండా కోయాలని అమ్మ చెప్పేది. బంతి మడి దగ్గర ఆగిన అడుగులు కదిలేవా ఒక పట్టాన!? కళ్ళు తిప్పుకోనీయని రంగులుండేవి. ఎన్ని రంగులనీ…
గడపచ్చని ముద్ద బంతి,
కనకాంబరపు రెక్క బంతి
కాషాయంలొ పెద్ద బంతి
నిమ్మ పండులా మెరుస్తూ మరో బంతి
బొడిపె బంతి కారం బంతి కాగడా బంతి
ఏ పూలకు వుండని సొంపైన పరిమళాలు బంతివి. సంక్రాతి సువాసనల సుమాలవి. గుప్పుమనేవి పూలే కాదు, ఆకులు కూడా – ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు. అందుకే బంతికి సంక్రాంతి పువ్వని పేరు పెట్టుకున్నాను. వాటినెప్పుడు చూసినా నాకు సంక్రాంతే గుర్తొస్తుంది.
తల్లి గొబ్బెమ్మకి గుమ్మడి పువ్వు
పిల్ల గొబ్బిళ్ళకి చేమంతి పువ్వు
చెలియలకి చిట్టి మందారాలు… ఇలా ఎంపిక చేసేదాన్ని.
అప్పటికే తెల్ల గీతల చీరలు కట్టుకుని, పసుపు రాసుకుని, కుంకుమద్దుకుని, చెంగు కప్పుక్కూర్చున్న సింగారిగొబ్బెమ్మలు నే సిగ తురిమిన పూలెట్టుకుని శ్రీలక్ష్మిలయ్యేవి. సిరులు గుమ్మరించినట్టే, ఎంత కళగా నవ్వేవనీ!
పవిత్రంగా అర్చించి, అగరుబత్తి వెలిగించి, ధూపమద్ది, బెల్లం ముక్క నైవేద్యం చేసి భక్తితొ – ఒక్కో గొబ్బెమ్మని ముగ్గులోకి నిలిపితే ఒక్కో దేవత వొచ్చి వరసగా నా ముంగిట్లో కుర్చునట్టుండేది. మనసు పొంగేది. అమ్మ కళ్ళు నిండేవి.
భాస్కరుని లేత కిరణమొచ్చి వెచ్చవెచ్చగా తాకేది. దీవెనలా…
సంక్రాంతి మూడు రోజుల పండగ కాదు. ఒక మాసం పాటు హడావిడి చేసే పండగ. డిసెంబర్ నుంచే సన్నాహాలు మొదలైపోయేవి. గోడలకి సున్నాలు తలుపులకి రంగులు గడపలకు లక్కలు నల్ల నాప రాళ్ళ మీద వార్నిష్ ముగ్గులు అటక మీద వంట సామన్లు దింపడాలు కొత్త దుస్తుల ఎంపికలు రోజూ దేవునికి ప్రసాదాలు తులసి కోటకి పూజలు మధ్యాన్నాలు పెద్ద పెద్ద పిండి వంటలు ఇంటి ఆడపడచులకు వుత్తరాలు వారానికి ముందే ఇంటికొచ్చిన చుట్టాలు మేనత్త పరిహాసాలు బాబాయి చేదోడు వాదోడు పనులు…
సాయం కాలాలు సందె గొబ్బెమ్మలుంచి ఆటలు పాటలు.
‘పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట?
రాజ వారి తోటలో మల్లె పూవు పూసిందంట’
‘గొబ్బీయల్లో గొబ్బీయల్లో
సుబ్బి గొబ్బెమ్మ సిరులనీయవె
చేమంతి పూవంటి చెల్లెలి నీయవే
తామర పూవంటి తమ్ముణ్నీయవే
మొగలి పూవంటి మొగుణ్నీయవే’
ఇప్పటికీ గుర్తున్న ఎన్ని పాటలో. ఎంత కళ అయిన పండగని! పెళ్ళిలా ఉండేది.
గంగిరెద్దులాటలు, వాడు వాయించే సన్నాయిలు, బుడబుక్కలోడి వొంటి మీద మచ్చలు, అర్థం కాని హరిదాసు కీర్తనలు, చేతిలో చిడతల చప్పుళ్ళూ – అన్నీ ప్రపంచపు వింతలే. పండగ ప్రతి సవ్వడి ఒక కొత్త స్వరంలా వినిపించేది. భోగిపళ్ళ పేరంటాలు, గలగల రాలి పడుతూ రాగి నాణేలు, బొమ్మలకొలువులు, పన్నీటి సువాసనలు, వెలుగుతూ దీపాలు, పుణ్యస్త్రీలు పట్టే హారతులు, గుళ్ళో గోదాదేవి కల్యాణాలు, ఇంట్లోకి వినిపిస్తూ మేళతాళాలు, వూరంతా శుభకార్యం జరుగుతున్నట్టు, ఇల్లొక పెళ్ళి వారి విడిదైనట్టుండేది.
పండగ హడావుడి సద్దుమణిగాక –
అలసిపోయిన లేత శరీరం ఇక నిలవలేనని మొరాయించేది. పేరంటాళ్ళు అటు వెళ్ళగానే, పట్టు పరికిణితోనే పరుపుని కరుచుకుని పడుకున్నప్పటి నిద్ర కూడా పండగనిద్రలా హాయిగా వుండేది. ‘దేవుని పెళ్ళి పనులు’ పూర్తి చేసిన అలసట అది మరి.
మర్నాడు బధ్ధకంగా లేచి చూస్తే, వాకిట్లో రథం ముగ్గేస్తూ కనిపించేది అమ్మ.
“వొచ్చే సంక్రాంతికి నువు ముగ్గేద్దువు గానీలే. ఏం?” అంటూ నవ్వేది.
కొత్త ఆశలు రేపి సరికొత్త ముగ్గులో దించి, మనసు ముంగిట్లొ హేమంతం కొత్త సంతకం చేసి పోయేది.
వెన్నెలైన పండగ.
కనుల పండగైన పండగ.
బ్రతుకంతా భానుమంతమైన పండగ.
అదిగో రథంలో వూరేగుతూ మబ్బుల దారెంట మళ్ళీ వస్తానంటూ మాటిస్తూ…